ఒకానొక నువ్వు
తెరిచి పెట్టిన గుండె తలుపు కిటికీ
బాండ బారిన సమాజానికి వెలుపల
కవిత్వానికి అదే దొడ్డిదారి
కటకటాల కిటికీది పోరుదారి
ఇప్పుడు .
వీధి గుమ్మం బార్లా తెరిచి వుంచాను
నువ్వు.. నాలోకి ..
నేను.. నీ లోకి
గదిలోకే అయినా
జలపాతం లా దూకేందుకు వీలుగా ..
ఎండ దుప్పటి పరుచుకొని నిన్న
నీకోసం చూసాను
మనుసు దుమ్ము దులుపుకొని ఈ రోజు
మళ్లీ ఎదురు చూసా ..
ఆశ కి చావు లేదు
రేపటి ఘన స్వాగతం గురుంచి
పగటి కలలు కంటూనే ఉన్నాను
ఖచ్చితత్వాన్ని కాల గర్భం లో కలిపిన కాలాన్ని
గోడ గడియారం లో బంధించాను
గంట గంటకు అది ఒకటే కొట్టుకోవడం నా గుండె లాగ..
తలుపంత కళ్ళేసుకుని అవే ఎదురు చూపులు
పాదాలు రెండు దీప స్థంభాలు ..
చేతి వేళ్ళు ఎప్పుడో పది వింజామరలై గాలిలో ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి