27, సెప్టెంబర్ 2021, సోమవారం

 అపవిత్ర  ఆపద్ధర్మమ్


రిపబ్లిక్ అఫ్ హిందుత్వ .. ఇంగ్లీష్ పుస్తకమే ..రచయిత బద్రి నారాయణ . పెంగ్విన్ ప్రచురణ . ప్రధమ ముద్రణ 2021 . 

మొత్తంగా బీజేపీ ని ఇప్పుడు నడిపిస్తున్న RSS  గురుంచి లోతైన అవగాహన  కల్పించే  రచన ఇది 

అయితే రచయిత ముగింపులో ఒక చివరిమాట రాశాడు . అది కరోనా సమయంలో లొక్డౌన్ వల్ల వలస కార్మికులు గురుంచి . కంపెనీలు మూసివేయటం వల్ల కాలినడకన వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్కచేయకుండా పుట్టిన గడ్డకు చేరుకోవాలనే ఎన్నో విషాద యాత్రలు జరిగాయి 

అప్పటివరకు వెర్రితలలు వేసిన హిందుత్వం మౌన ముద్రలోకి జారిపోయింది . సర్వ సత్తాక రాజ్యం చేతులు ఎత్తివేసింది . 

కష్టజీవులు అందరూ  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కులేని చావుకి బలి కాకుండా తమ కుటుంబ సభ్యుల మధ్య కు చేరుకోవాలని విశ్వప్రయత్నమే చేశారు . 

మరి భారతదేశ సమాజానికి వెన్నెముక లాంటి కులం .. బ్రతికి బట్ట కట్టడమే ప్రధాన మైన కరోనా కాలంలో ఎలాంటి పాత్ర నిర్వహించింది -అనే విషయం పై రచయిత కొంత పరిశోధన చేసాడు . 

కులమతాలకు అతీతంగా ప్రజలు మానవత్వానికి పెద్ద పీట  వెయ్యడం గురుంచి మనం అందరం మీడియాలో చూసాం . 

కానీ కులం అంత ఈజీ గా రూపు మాసిపోయే వ్యవహారం కాదని మనకందరికీ తెలిసిన వ్యవహారమే కదా !

ఆపద్ధర్మమ్ గా వచ్చే మార్పులు మామూలు పరిస్థితులు నెలకొన్నాక కొనసాగవు .  

దాని గురుంచి ఉపనిషత్ ల్లోంచి ఒక కథ ని పట్టుకొస్తాడు రచయిత . 

 ఛాందోగ్య ఉపనిషత్తు లో చక్రాయన ఉసష్టి అనే వ్యక్తి .. ఈయన ఉండే ఊరిలో కరువు విలయ తాండవం చేస్తుంటుంది . వరుసగా రెండురోజులు అతడు ఆకలితో అలమటిస్తూ  ఉంటాడు  . దాంతో ఇంకో  ఊరికి వెళదామని నిర్ణయిచుకుంటాడు . అయితే ఆ ఊరిలో కూడా అదే పరిస్థితి  ఉంటుంది . అక్కడి నుండి ముందుకు సాగిపోతాడు . దారిలో ఒక చెట్టు కింద ఒక మనిషిని చూస్తాడు . ఆ మనిషి  దేన్నో నాకుతూ తింటూ ఉంటాడు . 

ఉసష్టి అతని దగ్గరికి వెళ్లి ఏమి తింటున్నావని అడుగుతాడు . 

నేను పప్పు తింటున్నాను --అని   సమాధానం చెబుతాడు 

గత రెండు రోజులుగా ఆకలి తో అల్లాడిపోతున్న ఉసష్టి  తనకు కొంచెం పెట్టమని అడుగుతాడు . 

అయ్యో !నీకు తప్పక ఇచ్చే వాడినే  . కాని ఇప్పుడు అది అపవిత్రం అయిపోయింది . 

అపవిత్రం అయితే అయ్యిందిలే .. నాక్కొంచెం ఇమ్మని  పాపం ఉసష్టి  ప్రాధేయ పడతాడు . 

అతడు  ఉసష్టి కి తను తింటున్న పప్పులోంచి కొంచెం తీసి పెడతాడు.   

అతడి దగ్గర మట్టి కుండ నిండా మంచినీళ్లు కూడా ఉంటాయి . 

అతడు కుండకి మూతి పెట్టి కొన్ని నీళ్లు తాగి ,ఉసష్టి  కోసం కొన్ని మిగుల్చుతాడు . 

పప్పు తినేసి ఉసష్టి వెళ్లి పోవటానికి  సిద్దమవుతాడు . 

కొన్ని నీళ్లు తాగి వెళ్ళు  ! అంటాడు అతను .

దానికి సమాధానంగా -

నేను అపవిత్రమైన నీళ్లు తాగను -  అంటాడు  ఉసష్టి . 

నువ్వు  అపవిత్రమైన పప్పు తినగలిగావు .  అపవిత్రమైన నీళ్లు ఎందుకు తాగలేవు ? అని అడుగుతాడు  అతను . 

ఉసష్టి భలే సమాధానం ఇస్తాడు 

నేను  ఆ అపవిత్రమైన పప్పు తిని ఉండక పోతే  ఈ  పాటికి చచ్చి ఉండేవాడిని. 

ఇప్పుడు నాకు కొంచెం శక్తి వచ్చింది . నడవగలుగుతాను . దగ్గర్లోని ఏదైనా జలపాతం వద్ద నీళ్లు తాగుతాను  *


25, సెప్టెంబర్ 2021, శనివారం

 జర్నలిస్టుల మిత్రులకు ,


నా పేరు కాసవేన  సరోజ . వయస్సు 33. మందమర్రి నివాసం . నా జీవిత సమస్య ను మీ అందరితో పంచుకోవటానికి ఈ వివరణ ఇస్తున్నాను . 

నేను మరియు పుట్టపాక మల్లికార్జున (వయస్సు 38) గత రెండు సంవత్సరాలుగా ప్రేమ సంబధం లో ఉన్నాము . అతను మందమర్రి సింగరేణి స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు. అతనికి తల్లి తండ్రి లేరు . ఒక్కడే కంపెనీ క్వార్టర్ లో నివాసం ఉంటాడు  . ఎక్కువ  కాలం మా ఇంటి దగ్గరే ఉండేవాడు . మా కుటుంబం లో ఒక సభ్యునిగా కలిసిపోయాడు . మా నాన్న గారితో  ,మా తమ్ముడితో కూడా ఎంతో స్నేహంగా మెలిగే వాడు . మల్లికార్జున్ ఒంటరి వాడు కావడం వల్ల  అతని మంచి చెడ్డలు ,భోజనవసతి  అన్నీ  మేమే  దగ్గరుండి చూసుకునేవాళ్ళం . అందరం ఒక కుటుంబం లా కలిసిమెలసి ఉండేవాళ్ళం . పండగలు ,పబ్బాలు ,జాతరలు అన్నీ  మాతోనే కలిసి జరుపు కునేవాడు.

నా గత జీవితం లో అప్పటికే నేను ఒక పెళ్లి ఐన వ్యక్తి  మోసానికి గురై  ఉన్నాను  ఒక బాబుకి తల్లిని కూడా . ఇదంతా ఎనిమిది ఏండ్ల కిందటి మాట .  నా కొడుకు భవిష్యత్తు కోసం ఆ మోసగాడిపై అన్నివిధాలా పోరాడాను .కాని , ఎక్కడా  న్యాయం జరగలేదు . అప్పుడు నా కుటుంబమే నన్ను ఆదుకుంది . ఇక అన్నీ మరిచి పోయి నా కొడుకు కోసం నా కుటుంబం  తో కలిసి బ్రతకాలని నిర్ణయుంచుకున్నాను . 

నేను అప్పటికే బికాం చదువు కొని వున్నాను .నా కుంటుంబానికి భారం కాకుండా నా కాళ్ళ మీద నేను నిలబడడానికి పెళ్ళిసంబంధాలు కుదురుస్తూ వున్నాను . మల్లికార్జున్ కూడా ఈ విషయం లో నాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు .. ఈ క్రమము లో  నవంబర్ 14  ,2020 న  రెబ్బెన దగ్గ ర గంగాపూర్ వెంకటేశ్వరా స్వామి  గుడి లో దేవుని సాక్షిగా మల్లికార్జున్ నా మెడలో తాళి కట్టాడు. నా కొడుకు కు, నాకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసాడు  . 

ఇంత కాలం బాగానే ఉన్నాడు . ఇటీవల ఎవరి మాటలో విని వరకట్నంకు  ఆశ పడి ఇంకో పెళ్ళికి సిద్దమయ్యాడు . నేను వ్యతిరేకించడం తో నాపై కోపం పెంచుకొని  విపరీతంగా ,విచిత్రంగా ప్రవర్తించ సాగాడు . 

తర్వాత ఇంటి నుంచి కూడా  వెళ్ళిపోయాడు . ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొన్నాడు . అతని సమాచారం లేక నేను చాలా కంగారు పడ్డాను . గత అనుభవాల దృష్ట్యా నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు . ఏ క్కడ న్యాయం  దొరుకుతుందో తెలియలేదు . 

మల్లికార్జున మంచితనం తెలిసిన నేను నా కుటుంబం అతనిపై పోలీస్ కేసు పెట్టడానికి ఇష్టపడ లేదు . ఏదైనా మహిళా సంఘం ద్వారా  ఈ  సమస్యను  పరిష్కరించుకోవాలని అనుకున్నాం .అప్పుడు స్త్రీల సమస్యలను పట్టించుకొనే భూమిక హెల్ప్లైన్ నెంబర్ 1800 425 2908 తెలిసింది. 

వెంటనే వారికి ఫోన్ చేసాను . ఆ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుంది .  నా కంప్లైంట్ భూమిక సంస్థ ద్వారా డిప్యూటీ కమీషనీర్ అఫ్ పోలీస్ (డిసిపి )వద్ద రిజిస్టర్ అయింది . నా కంప్లైంట్  రిజిస్టర్ నెంబర్  ID  20210004083691 . 

ఆ తర్వాత హైదరాబాద్ డీసీపీ కార్యాలయం నుండి నా కంప్లైంట్ మందమర్రి పోలీస్ స్టేషన్ కి చేరింది . అప్పుడు నన్ను పోలీసులు స్టేషన్  కి పిలిపించారు . నా నుంచి  ఒక  వ్రాత పూర్వక ఫిర్యాదును తీసుకున్నారు . నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు 

ఈ మధ్యలో విషయం  తెలుసుకొన్న మల్లికార్జున్  ఎవరెవరితోనో  ఫోన్లు చేయిస్తూ  బెదిరిస్తున్నాడు .  డబ్బులు  ఇచ్చి వదిలించుకుంటానని దుర్మార్గం గా  ప్రవర్తిస్తున్నాడు . 

ఇలాంటి దుర్మార్గులకు తగిన బుద్ధి  చెప్పాలని , నాకు న్యాయం జరగాలని .. దానికి మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను 

 ఇట్లు 

కసవేన సరోజ 

కాంటాక్టు నెంబర్ . 8142368069

మందమర్రి ,మంచిర్యాల జిల్లా 

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

  ప్రొఫెసర్ అభిముల్ గుంజమాన్ కి మరణం లేదని ప్రకటిద్దాం !


 రాజ్యం గెలిచింది .. లేదు .. సామ్రాజ్యవాద రాజ్యం గెలిచే సమస్య లేదు . అది మరణ శయ్య పైన వుంది ..

 తన బిడ్డల్ని తనే తినేసే రాజ్యం . .. జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి వెలిగిపోయే  ప్రజాసామ్య దేశాలు

 తన  మేధావులను తానే దుర్మార్గంగా చంపేసే అభివృద్ధిని ఎలా అర్థం చేసుకుందాం ?

నూరు ప్రశ్నలు ,వేయు  సమాధానాలు కావాలి . 

పెరూ  దేశం గొప్ప పేరున్న దేశం . దక్షిణ అమెరికా లో  వుంది .  

1988 సంవత్సరం లోనే వార్తా పత్రికల్లో షైనింగ్ పాత్  గెరిల్లాల గురుంచి ,వారి నాయకుడు 

అభిముల్ గుంజమాన్ గురుంచి చదివినప్పుడు మన కలలు నిజమయ్యే రోజు  దగ్గర లోనే

 ఉందనే  ఉత్సాహం పెరిగేది .

 షైనింగ్ పాత్  ..అనే పేరు అయితే నన్ను వెంటాడేది . 

సముద్రుడి తో నిరంతరం సంభాషణలో ఉండిన రోజులు అవి .. అతడి కవిత్వాన్ని వన్ బై టు

 చాయి

 లా ఆస్వాదిస్తున్న కవి సమయాలు .. మరో వైపు రాజ్యం విప్లవ కారుల తలలకు వెలలు 

 ప్రకటిస్తున్న పిదప కాలం .. 

ఆ కాలానికి సమాధానం గా సముద్రుడి కవిత్వాన్ని ప్రచురించాలని అనుకున్నాం 

ఆ బాధ్యత మొత్తంగా నేనే తల కెత్తుకున్నాను . 

చిన్న పుస్తకం  పేరు  'భూమి నా తల .. వెల నిర్ణయుంచు . .. అయితే అసలు విషయం

 ఏమిటంటే దానిని  "షైనింగ్ పాత్ ప్రచురణలు"  పేర  ప్రచురించాము .అదొక ఉద్విగ్న

 సమయం .. అలా తెలుగు నేల  మీద షైనింగ్ పాత్ వెలుగులు చూసి మురిసిపోయాం . 

అప్పటినుండి  పెరూ  దేశపు పోరాటాల్ని చదవడం అలవాటు అయింది 

నల్లని చారల డ్రెస్ తో ప్రొఫెసర్ అభిముల్ గుంజమాన్ అరెస్ట్ చిత్రాల్ని చూసినప్పుడు 

బాధేసేది . మేధావుల్నిఇలా  గౌరవించడం  చూసి రాజ్యం వికృత రూపాల పట్ల అప్పటినుండి

 అసహ్యం వేసేది 

పేరూ  దేశపు సన్నివేశం  ఇక్కడ మన దేశం లోను పునరావృతం అయినప్పుడు అంతే

 భయపడ్డాను ..

సరిగ్గా నడవను  కూడా నడవ లేని  ప్రొఫెసర్ సాయిబాబాను జైలు లోనే బందీ గా ఉంచిన

 అమానుషం  ఒక వైపు నడుస్తుండగానే భీమాకో రేగావ్  కేసు లో ఓ 16 మంది మేధావుల్ని 

జైలు లో బంధించడం చూస్తూనే వున్నాం . 

ఇటీవల ఫాదర్ స్టాన్ స్వామి మరణం  మన న్యాయ వ్యవస్థను కూడా కదిలించిన విషయం 

మనకు తెలుసు . 

ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోననే ఊపిరి బిగపట్టుకునే బతుకుతున్నాం . 

సుదీర్ఘ కాలం అంటే దాదాపు 29 ఏండ్లు అభిముల్ గుంజమాన్  జైలులోనే వుండి ,జైలు లోనే

 మరణించడం గురుంచి మానవ హక్కుల సంస్థలైనా గొంతు విప్పడం ఒక అవసరం నేడు . 

సమసమాజం  కోసం కలలు కన్న ఒక నూతన మానవుడిని రాజ్య నిర్బంధం లో కోల్పోవడం 

మనందరికి తీరని లోటు . 


5, సెప్టెంబర్ 2021, ఆదివారం

భలే వాన ..


భలే వాన .. 


పగ బట్టినట్టే దబ్బున  కురిసి వెళ్ళింది వాన 

పడగ విప్పినట్టు వరద నడక సాగింది 

అంత వానకి కొసరులా తుంపర్ల వెంపర్లాట 

అయినా కురిసి కురిసీ  వెలిసిన వాన అందం 

 అబ్బో ! వేరేనబ్బా !


అంతా శుభ్రంగా కడిగి బోర్లేసినట్టు 

వరద కాలువ బోసినవ్వులు మెలికలు తిరిగి పోతుంటాయి 

#

అప్పటిదాకా నేలను అంటిపెట్టుకున్న రోడ్డు 

జల వాహనం గా  మారి పోతుంది 

అసలు ఉందొ లేదో తెలియని గాలి 

వాన చినుకుల చెవి రంగులతో 

కాసేపు హడావిడి చేస్తుంది 

#

చిన్న వాన కైనా 

గొడుగు పెద్దగుండాలి 

సొల్లువాన కి దొరక్కుండా .. 


#


తమాషాకి నేను

 గొడుగు ను తిరగేసి పట్టుకుంటా 

రాజా వారి కిరీట మల్లే .. 

అప్పుడు నా నడక మారిపోతుంది 

నా పాదాలు నీళ్ళల్లో చేప పిల్లల్లా 

ఈదుకుంటూ వెళతాయి 

నీల్లేమో  నా కాళ్ళ చుట్టూ చేరి 

మహా ప్రభో ! అని మొరపెట్టుకుంటాయి 

#

వానలో పూర్తిగా తడిచి చూస్తే తెలుస్తుంది 

అది  ప్రత్యేకముగా చిన్నపిల్లల పండగ  అని .. 


యధావిధిగా ఈ పెద్దలు ఉన్నారు చూసారూ !

వాళ్ళు హాయిగా ఆడుకోరు 

మమ్మల్ని  వదిలి  పెట్టరు 

ఈ వానా గొడుగు ఆటలో 

ఎప్పటిలాగే నేనే ఓడిపోతాను 

కాసేపటికి ఏమీ ఎరగనట్టు 

నీళ్లూ  జారుకుంటాయి .. 



 



 





 మనువాద బాహువులు 


ఏడవకు బిడ్డా !

కులం నిన్ను కాపాడుతుంది 

రాజ్యం నిన్ను భయపెడుతుంది 


ఏ ఉద్యమానికైనా  ఒక నినాదం అవసరమే మరి 

అది వెన్నెముకని నిలబెట్టేదిగా ఉండడం తప్పనిసరి 


కులం నాకు ఎప్పుడూ కిరీటం కాదు 

పైగా  రిజర్వేషన్ గాళ్లు  అనే  వెటకారం 


కులం నా అస్థిత్వమూ  కాదు 

వాడి  అణిచివేత కరవాలం 


కులం తోకలు  నా పేరు చివర 

ఎప్పుడూ లేవు 

అరే ,ఒరే .. అనే ముందు పేర్లు తప్ప ! 


మంత్రాలకు చింతకాయలు రాలనట్లే 

నా కులం పేరుకు ఏ ఆకాశం వంగి 

నమస్కారం చేయదు 

అలాగని పరాయికరణ 

నా అభిమతమూ  కాదు 

అయినా అది నన్ను కొండచిలువలా 

నమిలి మింగేసేది 

నాకో మతం రంగు పులిమేది 

ఎందుకో , ఏ మతమైనా నన్నొక తీవ్రవాదినే   చేసేది 

అప్పుడు నిజంగానే రాజ్యం 

నన్ను భయపెట్టేది 

పాపం శమించు  గాక !

కులం ఒక్కటే నన్ను కాపాడేది 

తన మనువాద బాహువుల్లో ఇరికించుకుని .. 





1, సెప్టెంబర్ 2021, బుధవారం

 కన్నతల్లి లాంటి ప్రకృతి కి ఎన్నో భావనలు.. 

కొన్ని అర్థమయ్యేవి.. 

కొన్ని భయపెట్టేవి.. 

అర్థమయి నంత మేరా ఏ గొడవా లేదు.. 

భయం దగ్గరే పెద్ద తగవు.. 

తను నోరు విప్పదు.. 

నాదేమో మట్టి బుర్ర..

 అంతా నువ్వే చేశావు.. 

అని అనుకున్నప్పుడల్లా ఎంతో దిగులు వేసేది.. 

కాదూ ..అంతా నా వల్లే అని గుండె రాయి చేసుకున్నప్పుడు 

 నీ గుండె చప్పుడు తెలిసేది..

 మౌనం లోనూ నీ మాటల ప్రవాహ సవ్వడి వినిపించేది..

 నువ్వు నా కన్న తల్లి వి కాదు.. 

నేను కని పెంచిన కన్నబిడ్డవని తెలిసి ఎంత మురిసిపోతానో!