13, ఏప్రిల్ 2022, బుధవారం

అర్బన్ నక్సల్

 అర్బన్ నక్సల్


1

వడివడిగా అంగలే వేసానో

ఒక వేడి సెగ లో  దూరం ఎగిరిపడ్డానో

చాలా ముందుకే వెళ్ళిపోయాను

ఇప్పుడు నీకోసమే వెనక్కి రాలేను



నా వెనక వెనకే అయినా నువ్వే

కదిలి రావాలి కాని..

నీ చెయ్యు పట్టి  నేను నడవలేను

వెలుగు వెంట సాగే నా నీడ దారినైనా

నువ్వే నడిచి రావాలి కాని..


ఎద(ర) పరుచుకున్న రక్త తర్పణ దారి తప్ప

నీ కళాత్మక లోకం కానరాదు నాకు

అవును..

నా దృష్టిలో స్పష్టమైన తేడా

కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది


దప్పిక ఎరగని ఒంటెద్దు  పోకడ 

ఏకాకి ఎడారి ఓడ ప్రయాణం


ఇప్పుడు నీతో సమానంగా నేను నడవలేను


2


నా కలల ప్రపంచం మీదికి రాయి వేయకుండా

వాడికి .. అవును ..వాడికే ..రోజు గడవదు

వసంతాన్ని వాగ్దానం చేసిన ప్రతి పువ్వును

తెంపకుంటే వాడికి  అస్సలు నిద్ర పట్టదు 


తెగిపడ్డ పువ్వుల రక్తం  అత్తరు 

వాడికి .. వాడి  పాడుబడ్డ లోకానికి...


కుళ్ళి కంపుకొట్టే ఈ  వాసన 

అలవాటు లేక నాలాగే 

నువ్వూ ముక్కు మూసుకుంటావ్

అప్పుడే  దొరికిపోతావ్ నువ్వు..

అర్బన్ నక్సల్ .. 





7, ఏప్రిల్ 2022, గురువారం

కవి బాధ


కవి బాధ 


 ఒక బాధ లో నుంచి 

 కాలు కదప లేని  మరో   బరువు లోకి 

కూరుకు పోతాను నిరంతరాయంగా 


పాపం  బరువు ! సిగ్గు విడిచి 

సాయం కోసం దిక్కులు చూస్తుంది 

అయితే దిక్కుమాలిన  ఆ దిక్కుల 

చూపుల్ని భరించడం కష్టమై పోతుంది 


ఎప్పటిలాగే కాలం .. గట్టు మీద కూర్చుండి తమాషా చూస్తుంది 


 గట్టిగా కళ్ళు మూసుకొని బాధ 

 అంతటి  బరువు తోనే  కవిత్వం లోకి దూకేస్తోంది

కవిత్వం ఒక సముద్రం 

అది మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది  

అందుకే ఇప్పటికీ ఏ  కవి బాధా  తీరినట్టు  దాఖలా లేదు  




వాన విల్లు

వాన విల్లు 


అంతా కన్నీటి పర్యంతమే .. 

అయినప్పటికీ 

గాలిలో ఒక్క  నీటి బిందువై 

నేను ఒక్కడినే వేలాడుతుంటాను 

నువ్వేగా ఒక వెలుగు రేఖ లా వచ్చి 

నన్ను రంగు  రంగుల ఆకాశం చేస్తావు 


రాజా రాణి

 రాజా రాణి 


కాలు మీద కాలు వేసుకొని 

నేను రాజా లా కూలబడిపోతాను 

కాలుగాలిన పిల్లిలా తిరిగే కాలం 

నన్ను చూసి కుళ్ళుకుంటుంది 


గట్టిగా కళ్ళు మూసుకొని కాలం 

గమ్మున వచ్చి నా ఎద  మీద  వాలిపోతుంది 

రాణిలా .. 

నిద్రానిద్రల మధ్య


నిద్రానిద్రల మధ్య 

1

 అప్పటి దాకా నిద్ర పట్టకే 

కవిత్వాన్ని పక్కలో వేసుకుంటాను 


కొంచెం సేపు విరామం .. అని 

కాలం చెవిలో చెప్తాను 

కాలం తల ఆడిస్తుంది 

హమ్మయ్య .. అని కళ్ళు మూసుకుంటాను 

అప్పుడే  కుట్ర జరిగిపోతుంది 


నేను నిద్రలోకి జారిపోకుండా .. 

మొదట  కొన్ని బుజ్జగింపులు 

మెల్ల మెల్లగా చీవాట్లు లోకి 

దిగుతుంది వ్యవహారం

అప్పటికే ..  

నా చేతి వేళ్ళు అప్రయత్నంగా 

చేయు తిరిగిన కవిలా మారిపోతాయి 


2

నిద్రకి కవిత్వానికి పోటీయేమో ! 

కనురెప్పలు మూతపడుతున్నప్పుడల్లా 

కాలు అడ్డం పెట్టి 

కవితా పాదాలు ముందుకు  తోసుకు వస్తాయి 


బ్రెయిలీ లిపిలా చేతి చివర్లతోనే  

భావ చిత్రాలు  రూపు  దిద్దుకుంటాయి 

మధ్యమధ్యలో నా మనసింకా 

జోగుతూ కునికిపాట్ల తో  కుస్తీ  పడ్తూనే ఉంటుంది 


4, ఏప్రిల్ 2022, సోమవారం

ఆశయమే దారి

  ఆశయమే దారి 


1


మనిషి రోడ్డున పడ్డాడు..

 తన కాళ్ళ మధ్య  మనిషిని కోడిపిల్లలా ఇరికించుకుని

 గద్దలా  రోడ్డు ఎగిరిపోతుంది

కసుక్కున దిగిపోయే

 కాలి గోర్ల మధ్య ప్రయాణం

బలి పశువు అలంకారం


2


ఏ దారి  ఎక్కడ ముగిసి పోతుందో

ఎప్పటికి తెలిసే అవకాశం లేదు

వలయాలు వలయాలుగా

విస్తరించే మార్గాలు

ఎక్కడా కలిసిపోవు

ఎన్నడూ ఆగిపోవు

జీవితమొక ప్రయాణము.. అంతే!


3


అయినా  ఈ రోడ్డు కెంత భయమో!

దారి పొడుగునా నన్ను

వెంటాడుతూనే ఉంటుంది

నా ముందు వెనకా ఎక్కడా తరగని

అనంతమైన రహదారి

మనిషి ప్రయాణం ఒక దారి

కానీ,

జీవితమే రోడ్డు కావడం విషాదం


4


ఎప్పటికప్పుడు 

అల్లంత దూరాన ఆకాశం లో కి

ఎగబాకే  కలల దారి కొసని

ఎవరు కనిపెట్టారు చెప్పు?


5


తిరగలిలా మన జీవితం

బండ బారక పోతే చాలు..

కొండంత ఆశయం ఎప్పుడూ

దారి చూపుతూనే ఉంటుంది


6


జీవిత చక్రం లో పడి కొట్టుకుపోయే

ప్రతి మనిషి  ఏదో విధంగా

రోడ్డున పడిపోతాడు

జీవన గమ్యాన్ని  గుర్తెరిగిన మానవుడే

తన మార్గాన్ని సుగమమం చేసుకుంటాడు.

[6:40 pm, 04/04/2022] Venkatrao Nakka: నల్లముఖం నగరానిది..

1

నగరం మీద ప్రేమగీతం

అది నవయవ్వన మోహం


నగరం మీద గరంగరం

"నీ రోడ్ల మీద మన్ను బొయ్య

బతుకు తెరువు  తెర్లాయే


2

కాంక్రీట్ జంగల్ లో

 కాసే ఎండల్ని మోసుకుంటూ

వాలే నీడల్ని వెతుక్కుంటూ

గుక్కెడు మంచి నీళ్ళనూ  కొనుక్కుంటూ

 నగరారణ్యం నేడు

దప్పిక దారుల కూడలి


3

పొట్ట చేత పట్టుకొని

పల్లె వలస నగరానికి  

ఆకలి తీరని కడుపు చించుకొని

పేగులు మెడలో వేసుకున్నట్టు

విశాలమైన రింగు రోడ్లకు వేలాడుతూ

 ఇసుక వేస్తే రాలని ఇరుకు  గల్లీ బతుకులు


4

నగరం ఒక తెల్ల ఏనుగు

 ఖర్చులు  మరి తడిసి మోపెడు

అంతా తల్ల కిందులు వ్యవహారం

వెల్లకిల్లా పడ్డ కాళ్ళు చేతుల్లా 

గాలిలో ఎగిరే రోడ్లు ..ఫ్లయ్ ఓవర్లు


5


బాటసారి కి

నీడ నిచ్చే వట వృక్షాలు పెరికి

కుండీల్లో నిలబెట్టబడ్డ  హైబ్రిడ్ మొక్కలు

నీరెండకే  సొమ్మసిల్లిపోతాయి


కాలుష్యాలను దగ్గుకుంటూ

వెళ్లే వాహనాల ధాటికి

చచ్చిన పాములా 

రోడ్డు పారి పోతుంది


7


నల్ల ముఖం నగరానిది

వేసిన రోడ్డు మీదే రోడ్డు

ఆ చీకటి నీడల్లో

తెల్లవారే యవ్వనాలు

మోడుబారే బాల్యాలు


అబద్దాలను మోసుకుంటూ

గాలిలో మేడలు కట్టే

 హొయలు పోయే హోర్డింగులు


అన్నిటిని

అడ్డంగా నరుక్కుంటూ పోతే 

నగరం కడుపు నిండా 

 అన్నీ   అరిగిపోయిన

బక్క పలుచని పల్లె బొక్కలే!

 బాల్యమే నేను .. 

నాకు నేనుగా ఉన్నానంటే అది ఆ వయసులోనే .. శ్రీ శ్రీ అన్నట్టు ఏదైనా నాకోసమే అనుకొనే ఆనంద అమాయకత్వం .. 

సాయం కాలం వేళ  నాన్న సైకిల్ మీద ఊరి అవతల కాలి బాటల మీద కొండల చాటుకు వెళ్లే సూరీడ్ని చూస్తూ ,  చీకటి  పడే వరకు వెళ్లి ,ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడిని . 

వాటి అన్నిటిని ఎలా వివరించి చెప్పాలో ఇంకా నేర్వని రోజులు  అవి. . ఇప్పుడైనా వాటికి కొత్త అర్థాలు ఎం చెపుతాం కానీ అన్వేషణ  తాలూకు బుడి బుడి అడుగులు గుర్తుకొస్తే అదో  ఆనందం . మీ అందరితో పంచుకోగలగడం దానికి పరాకాష్ట . 

ఇలా చెప్పుకుంటూ పోతే అసలు విషయం   కంటే ఈ కొసరు కబుర్లే ఎక్కువవుతాయి . 

అందుకే కథ లోకి వెళ్లిపోదాము 



దయ్యం సాయం 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


అప్పటికింకా నిక్కర్లలోనే తిరుగుతున్నం .. అంటే అయిదో  ,ఆరో క్లాస్ అనుకుంటా నేను మేము ముగ్గురం  మొగ పోరగాళ్ళమే . నేనే పెద్ద . 

మా నాన్నది సింగరేణి బాయ్  పని . మా అమ్మకి ఇంట్ల పనితోనే సరిపోయేది . టీవీలు ఇంకా రానికాలం . రేడియో మాత్రమే  ఉండేది . కరెంటు స్తంభాలు ఇంకా  కార్మిక వాడల్లోకి రాలేదు . 

రైతాంగం నుండి వచ్చిన కార్మికులు నిత్యం పనిలో వున్నట్టే ఉండేవారు. ఆడవాళ్ళకు మగోళ్ల సేవలు,పిల్లల పెంపకం తోనే సరిపోయేది . ఇక చిన్నపిల్లలం .. మాకేం పని ఉంటుంది ?బడికి పోవాలే .. బడి నుంచి రాగానే ఆటకు ఉరుకాలే ..