అపరిచితం
----------------
ఒక వేట నిరంతరాయం గా కొనసాగుతుంటుంది ..
విషయాన్ని మాములుగా చెప్పాలనే మనసు రాయి చేసుకుంటాను
అయితే ..
ఆ రాయినే ఎవరో చేతిలోకి తీసుకొని నా ఆలోచనల తుట్టె మీదికి విసురుతారు
అంతే ..
నా భాష మారిపోతుంది
పరిసరాలు రక్తం పులుముకుంటాయి
నా భావాలు నన్నే ప్రశ్నలతో తూట్లు పొడుస్తుంటాయి
నేను వేటాడబడుతుంటాను
కాలు కింద పెట్టకుండా పరుగెడుతుంటాను
దాక్కోడానికి చాటు కోసం వెదుక్కుంటాను
అక్షరాలే నన్ను తమలో పొదువుకుంటాయి
అలసిపోయి కొంత .. అలవాటుగా కొంత
వాటి గుండెలపై ఒదిగిపోతాను
.. ఇది అసలు విషయానికి గొంతు సవరింపు మాత్రమే ..
అలాగని విషయం పెద్దగా ఏమీ ఉండదు ..
ఇలా అటు ఇటుగా పదాలు తిరగేసి
చివరికి పెదవి విరవటమే ..
అబ్బే .. ఏమీ లేదండి ..
కానీ విషయం చిన్నదే .. ఒక్క మాట పెట్టు !
వివరించే తాపత్రయం హడావిడి మాములుగా ఉండదు
భరించాలి .. కవిత్వం అంటే అంతేనేమో !
...
దినమంతా మిత్రుడి వెంట
ఒక ప్రాణ సమానమైన రాజకీయ చర్చ చేస్తాను
దాని చుట్టు అనేక విషయాలు వచ్చి చేరుతుంటాయి
విచిత్రంగా నువ్వు అక్కడా
లీలగా కదలాడుతుంటావు
అలసిపోయి నిద్రగది కి చేరుకుంటే
తలుపు తోసుకుని మరీ నీ తలపే ..
నీ స్మరణకు పరిపూర్ణమైనది ఒక్కటే ..
దానికోసం వెతుక్కుంటాను
కళ్ళుమూసుకొని గజల్ గీతాన్ని
ఆవాహన చేస్తాను
జగజిత్ సింగ్ తసల్లీ స్వరం ..
ఈ ప్రపంచం లో ..
నా జీవితానికి నేనే అపరిచితుడ్ని
ఒక్క .. నీకు తప్ప ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి