23, జులై 2015, గురువారం

మిత్రుడా

మిత్రుడా 

మిత్రుడా 
నడుస్తూ  నడుస్తూ
ఆకాశాన్ని చుట్టబెట్టే వాళ్ళం 
కాలం  తెలిసేది కాదు 

చీకటి నీ కంటి పాప లో 
పసిపాప లా నిదురపోయేది 

చుక్కల వెలుగుల్లో
కవిత్వం
వెన్నల చాపలు పరిచేది

ఒన్ బై టు చాయ్ లా
సగం సగం పూర్తిగా  నిండిపోయేవాడివి  


వీడ్కోలు కన్నీటి  తడి 
ఆరక  మునుపే
నువ్వే నాలో కవిత గా రూపు కట్టేవాడివి

వెలుగు..  వెన్నెలనే కాదు
చిమ్మ చీకట్లను
నీ కొంటె నవ్వు తో ముట్టించిన వాడా

విప్లవం వర్దిల్లాలి!
విప్లవం వర్దిల్లాలి!

నినాదాల హోరు లో
నువ్వేరా 
నీ నవ్వే రా .. 


ఆచరణ

ఆచరణ

నా ఆచరణ .. మొదట
నా చిటికెన వేలు పట్టుకొని
బుడిబుడి అడుగులేస్తుంది

నా నుంచే నడక నేర్చుకుంటుంది
పడుతూ ,లేస్తూ

జ్ఞానాన్ని పెంచుకుంటూ .. పేర్చుకుంటూ
నాతో నడిచే నేస్తమవుతుంది
నాకు వివరిస్తుంది ,విషద పరుస్తుంది

ఆచరణ మరింతగా విస్తరిస్తుంది
అప్పుడు ..
అది నాలో వలపవుతుంది
ఇక ..
ఒకరి కోసం ఒకరం   జీవిస్తుంటాము
ఒకరిని విడిచి ఒకరం ఉండలేని
అద్బుతమైన ప్రేమ అవుతుంది ఆచరణ

ఆచరణ ..
ఆకాశమంత విశాలం  అవుతుంది
ఆచరణ ..
నా జీవన   నౌకను నడిపే చుక్కాని అవుతుంది
నా ఆచరణే .. నాకు తిరుగు లేని గురువు అవుతుంది 

ప్రవాహం

ప్రవాహం 

చిగురాకులాంటి వాన చినుకు
ఎండుటాకులా రాలిపోతూ .. తూలిపోతూ
వరద నీటిలో కొట్టుకుపోతూ
వాగుల్ని ,వంకల్ని దరి చేర్చుకుంటూ
దారిపొడుగునా నదీమ తల్లి అయి
నవ్విస్తూ, నడిపిస్తూ
ఆరాం గా ..
అనంత సాగరమై నిలుస్తుంది .   

ఆమె చిరిగిన నల్లని బురఖా
ఆతడి మాసిన గళ్ళ లుంగీ ..
వారిని పేదవాల్లు గా కంటే
ముస్లిం తీవ్రవాదులు గానే
చూపించి భయ పెడుతుంది

 కురిసిన వాన నీ వలపంత .. వెలిసిన వాన నీ నవ్వంత ..
 వాన ముసురు ,వలపు విసురు ఒకటే .. విడిచి పెట్టె తలపే కరువు..  

కంప్యూటర్ తెర

     కంప్యూటర్ తెర 


కాస్త పక్కనుంచి చూస్తే 
అదో అద్దం  లా కనిపిస్తుంది 

ప్రపంచాన్నంతా అద్దం లో 
చూపించినట్లుగా నా ముందు 
అనేక లోకాలను 'పరేడ్ ' చేయిస్తుంది 
రంగుల ప్రపంచం తో పాటు 
ఆకలి చావుల ఆక్రందనల్ని కూడా .. 

అయితే ఈ కంప్యూటర్ తెర 
నాకు తెలియని విషయాల్ని 
వివరిస్తుందని భ్రమ పడతాను కాని 
అది నన్నే వివిధ కోణాల్లో ఆవిష్కరిస్తూ 
వొట్టి అద్దం లానే పనిచేస్తుంది 

అందుకేనేమో .. దాని ముందు 
కూలబడితే .. 
నాలో నేనే మాట్లాడు కుంటూ 
గంటలు నిముషాల్లా గడిపేస్తాను 

ఒకోసారి గమ్మత్తు గా అది 
మాయా దర్పణం లా 
నన్నే మింగేస్తుంది 
బింబ ప్రతిబింబాల  సమస్య 
నన్ను పట్టి పీడిస్తుంది 

కొండ అద్దం లోన కొంచమై కనిపించు 
అనే రీతిలో ఈ కంప్యూటర్ ప్రపంచం లో 
నేనొక నలుసు నై పోతాను 
ఎవరికీ కనిపించని 
నల్ల పూస నై  పోతాను .