9, జూన్ 2020, మంగళవారం

ఎం చేయాలి 


ఏం చేద్దామంటావ్ మరి 

గాలి లోకి ఒక్కటే  

పిడికిలెత్తి నిలబడదాం 

శత్రువుని మాత్రం రెండు కళ్ళతో గమనిస్తూనే 

ఓ కంట కనిపెడదాం 

పిడికెడు గాలి చాలు 

పిడికిలి ప్రాణం పోసుకుంటుంది 

నీ కన్నెర్ర చాలు 
వాడి వెన్నులో చలి పుట్టడానికి

ఉలి చెక్కిన శిల్పం లా ఆకాశమూ 
పిడుగుల వర్షం కురిపిస్తుంది 

కవి భావనలో ఉలికి పడ్డ భూమి కూడా 
నీ పాదాలను పునాదిగా మొలిపిస్తుంది 
 


2, జూన్ 2020, మంగళవారం

పుస్త'కబేళా '

పుస్త'కబేళా '
(పుస్తక మేళా )

పాపం పుస్తకాలన్నీ 
బేలగా పడివున్నాయి 

మేళా  మరి ..కబేళా మరీ 
కాస్త కండ  బట్టి 
మిలమిలా మెరిసే 
కొత్త పుస్తకాలకో ధర 
పాత పుస్తకాలకొక ధర 
చవక చవక 
చచ్చిన శవాలను 
వేలం వేసినట్టు

కరుణశ్రీ ఎప్పుడో పోయాడు పాపం 
ఇప్పుడు ఎవరు 
ఆలపిస్తారు 
ఈ పుస్తక విలాపాన్ని 

ఎన్కౌంటర్ చేసేసి 
మాటల్ని 
నాలుగు మూటలుగా గట్టి 
ఎంత బాగా అమ్మకానికి పెట్టారు 

చిట్టిపొట్టి మాటల్ని 
ఎంత క్రూరంగా 
హింస పెట్టారో కదా 
దయలేని వారు ఈ రచయితలు 

ఏ పుస్తకం లో దొరుకుతాయి 
నిజమైన ప్రేమ ,దయ,కరుణ 
నీలో నాలో తప్ప 

జ్ఞానమెవ్వడి సొత్తురా 
అమ్మకానికి పెట్టారు 

నీ అరమోడ్పు కన్నుల్లోంచి 
జాలువారే భావాలను 
ఏరుకునే టైం లేదు ఎవ్వరికి 
ఈ పుస్తకాలను చదవరు  
చివరికి 
మళ్ళీ అవి గోడ ల్లోకి
అద్దా ల గ్లాసుల్లోకి 
భద్రంగా పాతిపెడతాం 
చచ్చిన శవాల్లా 
భద్రంగా  చుట్టిపెడతాం 
ఈజిప్టు మమ్మీల్లా 




గ్రీన్ టీ

గ్రీన్ టీ 


ఈ రోజుని మొదలెట్టడానికి 
గొంతు సవరించుకుంటాను 
మనసూ సరిచేసుకుంటాను 

డిసెంబర్ చలి 
వల వేసినట్టు 
కాళ్ళ చుట్టూ పెన వేసుకొని  వుంది 

బైట ఎదో విజిల్ శబ్దం 
శ్రమ శకటం ఎదో 
అప్పుడే బయలు దేరింది 
జ్యూయ్యు జ్యూయ్యు మని 
బండ్ల శబ్దం దూరంగా 
పక్షుల చిక్ చిక్ రావాలు 
చెవుల్లోనే 

పచ్చని చెట్లు అలా 
నిలబడిపోయి చూస్తున్నాయి 
కొబ్బరి చెట్టు ఏమో 
కళ్ళు అన్నీ తెరుచుకుని 
ఆకుల సందుల్లోంచి 
అన్నీ గమనిస్తోంది 

అలవాటే లే ఈ కలానికి 
కనిపించిన ప్రతిదాన్ని 
ఏరి భద్రపరుచుకోవడం 
ఎక్కడ పారేసుకున్నామో  
అక్కడే వెదుక్కోవడం

గ్రీన్ టీ 
వేడివేడిగా గొంతును 
శృతి చేస్తోంది 
ఇక మొదలవుతుంది 
ఆత్మారాముడి గోల 

ఇంక అంతా కల కల 
కల చెదిరిపోయినట్టు 
కాలం వల వేసి 
గిల గిలా బిగించినట్టు 

గాలి అలల లెక్క తేలేసరికి 
వెలుతురు పిట్ట ఎగిరిపోతుంది 

ముక్కు దిబ్బెడ

ముక్కు దిబ్బెడ

నీ ఆలోచనల్లో 
కూరుకుపోతానేమో 
మనసంతా అదోలా ఐపోతుంది 

డిసెంబర్ చలి రాత్రులేమో 
ముక్కు దిబ్బేడ  వేస్తుంది
పొద్దున్నే చల్లగాలికి 
వరుస పెట్టి తుమ్ములొస్తాయి 
దేన్నీ ఆపలేను 
ఆస్వాదించడం తప్ప 
ప్రతి తుమ్ము 
కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది 
కనులు మూసినా 
నువ్వేగా .. 
సవాలక్ష అవలక్షణాలున్నా 
ఈ జలుబు బాగుంది 
నీ స్మరణ లానే 
ఇంతకంటే గొప్ప హృదయమేదైనా
నడిచే కాలికి  "గొప్పు "లాగ తగిలితే
నొప్పి ఎలా తెలియకుండా ఉంటుంది

ఏ గాలి దిశను తిప్పగలిగానని
నిన్ను మన్నించమని అడగడం

ఏ నీటికి నడకలు  నేర్పానని
నీ పరుగులకు వెరవడం

రెండు ప్రవాహాలు
ఒక సంగమం
అది సాగర ఘోష అయింది 

నో కంప్లైంట్

నో కంప్లైంట్ 

జ్ఞాపకాలు గుర్తొస్తే చాలు

ఎప్పుడూ

చిన్న నవ్వు ఒకటి

సిగ్గు మొగ్గలా తొలుచుకొస్తుంది

అప్పుడప్పుడూ

చటుక్కున కన్నీళ్లు

వరదలై

చాటుమాటుగా తుడుచుకొనే 

విశ్వ ప్రయత్నం చేస్తాయి


ఎందుకు అంటే

కంప్లైంట్ అయితే ఏమీ లేదు మరి .. 

వాహ్ కవి


వాహ్ కవి

నిజంగా ఎవరో కవే అన్నట్టు
మనం 
కాలం కడుపున పుట్టిన పాపలం

కలల కోసమే ఏడుస్తాము

ప్రేమ కోసం పరితపిస్తాం

కవిత్వం కోసమే జీవిస్తాము

కన్నీటి ప్రవాహానికి ఎదురీదుతాం 

తలాష్

తలాష్ 

నన్ను నేను 
వెదుక్కుంటూ వెదుక్కుంటూ 
రాత్రి లోకి  పగలును 
బలవంతంగానే దొర్లించేసి 
నిజంగానే అలిసిపోతాను  

నేను జైలుగాడి 
కనుసన్నల్లోనే ఉంటాను 
అయినా వాడికి 
వాడిమీదే అనుమానం 

పొద్దుపొద్దున్నే 
తలాష్ తలాష్ అంటూ 
నా రెండు దుప్పట్లను 
చిందర వందర చేస్తాడు 
 పాపం వాడికేమి దొరకదు
ఉద్యోగ ధర్మం తప్పా 

నా రాత్రి వెన్నెల స్వప్నాల మీద  
వాడి మొరటు దాడే  .. తలాష్ 
(జనవరి,2019 నుండి మూడు నెలలు జైలు కాలం .. బిలాస్పూర్ (ఛత్తీస్ ఘడ్ )

జైలు

జైలు 

జైలు గోడలు 
ఈ నే ల మీదే 
ఆకాశమంతా  నేనే 

రివ్వున ఎగిరి విహరించే పావురాల 
స్వేచ్ఛా రవళి నాదే 

ఆశ   
అలజడి 
జమిలిగా 
ఆడిపాడేది ఇక్కడే 

ఎక్కడికి పో తావీ రాత్రి 
అంటూ 
చుక్కల్లో చిక్కుపడ్డ ఆకాశం 
అడిగే చిక్కు ప్రశ్న 

నన్ను వదిలి నువ్వు పోలేవులే 
అంటూ 
ఆలోచన ల చిక్కుముడుల్ని 
విప్పుతూ 
నా చైతన్యం పాడే 
జోలపాట .. 



శూన్యం

శూన్యం 

ఎప్పుడూ ఒక ఖాళీ కోసం
కలయ దిరిగే కాలం
నువ్వు..  చొరబడ్డాక
నీ కోసం వెతుకులాట
ఒక ఆట అయిపోయింది

అవునూ ..నీది
దాగుడు మూతల  ఆట
తల వంచుకొని
గుండె నిండి పోతావ్
జూలు విదుల్చుకొని
కాలాన్ని నీ వెంట తిప్పుకొంటావు
ఈ లోగా ..
వెన్నెల పాట ఎదో
చుక్కల పైటేసి
ఆకాశాన్ని ముంచెత్తిందంటే
నువ్వేమంటావో .. 

వలపు కొలిమి

వలపు కొలిమి 

నా కంటే బాగా నా హృదయాన్ని విడదీసి ,విడమరిచి ..నీ మూగ భాషల్లో ..నీ ఉహ్ .ఉహు అల్లకల్లోంచి దూరి పోయి ..నీకు ఎవ్వరు చెప్పగలరు .. మౌనంగానే అయినా నీ భుజాలు పట్టి ఊపి ఊపి ...నీ నుదుటి మీద ,నీ కనురెప్పల మీద ,నీ పెదవుల మీద ఎన్ని ముద్దులు పెట్టైనా నా మనసుని నీ ఎద మీద పరిచేవాడిని కదా ..

ఎన్ని పచ్చని గడ్డి మైదానాలు బోసిపోయాయో నీ అలకల్లో ... తుంచిన  గడ్డిపరకలు ఎన్ని మోపులయ్యాయో .. ఎప్పుడు ఏ భావం  ఏ భాషకి పూర్తిగా అందిందని ..అన్నీ అర్థ భావాలే ..

కన్నీటి తెర చాపలేసుకుని మౌన ఓడల ప్రయాణం .. ఎప్పుడు ఏ తీరం చేరిందని..
గుల్జార్ పాటల్లో తేలుతూ, తూలుతూ సాగుతూనే ఉంది ఇప్పుడూ
ప్రేమ కి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి
ప్రేమకి ఇంతకంటే పునాది ఏమి కావాలి

మనిషి కంటి చూపు లో పుట్టే ప్రేమ
ఎందుకో కన్నీటి తోనే చెలిమి చేస్తుంది
వలపు కొలిమిలో కాగి పోతుంది 
పల్లె సుద్దులు 

కన్నీటి కి గట్లు కట్టి
గుడ్డి  దీపాల వెలుగులో 
కలలను  ఊరేగించుకోవడమే జీవితం

గుండె మంటల్లో ఆత్మ కాలిపోయినా
అద్బుతమైన జీవితాన్ని బ్రతికించుకోవటం ఒక  అవసరం

పగులు దేరిన పాదాలకు
విడిపోయిన మన దారులెక్కడ కలుస్తాయో
వివరించడం  వృథా ప్రయాస 

ఎత్తిన పిడికిళ్ళలో ఎర్రజెండా మాయమవడం
ఎవడి కుట్రో విప్పిచెప్పుకోగలిగితే   
అదే నేడు మహా  విప్లవం 

పిచ్చి భావనా

పిచ్చి భావనా 

నిన్ను చూసినప్పుడు
మొదట కలిగిన భావం వెంటనే
తోసుకొచ్చిన భయ్యం
నీకు అప్ప చెప్పిన మొదటి మాట
పంచుకున్న మంచి పాట

"ది బెస్ట్ " అవే ఇప్పటికీ
ఇదెలా సాధ్యమయుంది
మార్పు తప్ప ఏది శాశ్వతం కానీ
ఈ సుదీర్ఘ ప్రయాణం లో..

ఇది నీ వల్లే అని చెప్పటానికి
వెయ్యు దాఖలాలు ఉన్నాయి
ఇందులో నా తప్పు ఏమీ లేదు
అని చెప్పటానికి
బోల్డు  అవకాశాలు ఉన్నాయి

ఇలా చాలా సరదాగా ఉండేది
దేన్నీ పట్టుబట్టి అర్థం చేసుకోవాల్సిన
అవసరం ఏర్పడేది కాదు
అలాగని అర్థం కాకుండా మిగిలింది
ఏవిటో తెలిసేది కాదు

కాని ఇప్పుడు ఈ తెరిపి లో
ఆలోచిస్తే
ఒక మాయ ఎదో జరిగిపోయింది
అప్పటిదాకా తలకిందులుగా
ఉన్న దాన్నేదో
సరి చేసినట్టున్నావు
అందుకేనేమో
వెనక్కి ముందుకు వెళుతున్నట్టు
పిచ్చి భావనా ..  నువ్వు ..