ఎప్పుడైతే బ్రిటన్ లో ఆవిరి యంత్రం కనిపెట్టబడి, అది పారిశ్రామిక విప్లవానికి దారి తీసిందో, అప్పుడే కార్మిక వర్గం పురుడుపోసుకుంది భూస్వామ్యంలో కార్మికులు లేరు. వ్యవసాయానికి అనుబంధంగా వృత్తి. పనివారలు ఉండేవారు అంతే! కాని పెద్దపెద్ద పరిశ్రమలు స్థాపించబడి, నిరంతరాయంగా ఉత్పత్తి జరిగిన క్రమంలో కార్మికులు అదే స్థాయిలో పెరిగారు కాని విపరీతమైన పనిగంటలు , దుర్భరమైన పరిస్థితులు మళ్ళీ వారిలో స్పార్టకస్ ని మేల్కొలిపాయి.
బానిసతిరుగుబాట్లు జరిగినట్టుగానే , అమెరికాలో జరిగిన కార్మికవర్గ తిరుగుబాటు నుంచే ‘మే డే’ ఆవిర్భవించింది. 8 గంటలు పనిదినం, 8 గంట నిద్ర , 8 విశ్రాంతి కావాలంటూ అటు యూరప్ లోను, ఇటు అమెరికాలోని కార్మికులు ఉద్యమించారు. ఆ పోరాటం నుంచే ప్రపంచ కార్మిక వర్గం యొక్క భూమికను కర్తవ్యాల్ని ప్రకటిస్తూ ‘మేడే ‘ఇప్పటికీ తన వునికిని చాటుకుంటూనే వుంది.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి ! పోరాడితే పోయేదేమి లేదు, బానిససంకెళ్ళు తప్ప అదే విప్లవ స్ఫూర్తిని రగిలిస్తూ, మేడే దోపిడీలేని సమసమాజ నిర్మాణం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కార్మికవర్గానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంది. 1886 లో మే నెలలో అమెరికాలోని చికాగో హేగ్ మార్కెట్ లో ప్రజ్వరిల్లిన కార్మిక పోరాటోల్లోంచి పుట్టిన ‘మే డే’ ప్రపంచకార్మిక వర్గాన్ని ఇప్పటికి ఒక్కతాటిపై నిలబెట్టి వుంచింది. పెట్టుబడిదారుల కుట్రలను విచ్ఛిన్నం చేస్తూ తన అంతర్జాతీయ సమైక్య భావాల్ని విస్తరిస్తూనే వుంది. మేడే స్ఫూర్తితో కార్మికవర్గం తన పోరాటాలని పదును పెట్టుకుంటూ మరో ప్రపంచ నిర్మాణం కోసం అలుపెరగని పరిశ్రమిస్తూ నే వుంది.తొల్లినాళ్ళలో , అమెరికాలో కార్మికోద్యమం అనేక సమ్మెలు నిర్వహించింది. అప్పుడున్న పరిస్థితులపై కార్మికులు పెద్దయెత్తున కదిలారు అది చివరికి 8 గంటల పనిదినం అనే రాజకీయ డిమాండు గా రూపుదిద్దుకుంది పని గంటల తగ్గింపు అనేది మొత్తం కార్మికులను ఒక్కటి చేసింది.1806 లోనే కార్మికనాయకులపై కుట్రకేసులు మొపారు. చివరికి మేడే కి మూలకారణమైన 1886 లో జరిగిన హేగ్ మార్కేట్ (చికాగో) సంఘటనతో పోలీసుల మృతికి బాధ్యులను చేస్తూ కార్మికనాయకులను వారికున్న రాజకీయ భావజాలాల వల్లే కుట్ర కేసులో ఇరికించారు. అన్నిటిని ఎదుర్కొంటూ కార్మికులు ‘మే డే’ సాధించుకున్నారు. నేడు ప్రపంచంలో చాలాదేశాలు ‘మే డే’ను అధికార సెలవుదినంగా గుర్తించారు. సోషలిస్టు భావాలు కల అన్ని రాజకీయ పార్టీలు ‘మే డే’ ను అంతర్జాతీయ కార్మికుల పోరాట దినంగా జరుపుకుంటున్నాయి.
సమస్త సంపదలకు సృష్టికర్తలైన కార్మికులకు ‘మే డే ‘ అనేది వారి శక్తిని చాటి చెప్పే దినం. అందువల్లనే పెట్టుబడిదారులు రాజ్యం ‘మే డే’ యొక్క రాజకీయ లక్ష్యాన్ని తీసివేసి దాన్నొక వొఠ్ఠి అధికార సెలవుదినంగా మార్చే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.కార్మికులను మొత్తంగా సోషలిస్టు కమ్యూనిస్టు భావాల నుండి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. కార్మికుల్లో మతం మరియి అగ్రవర్ణ భావజాలాన్ని ( లంపెన్, విచ్చలవిడి భావాల్ని) ఎక్కువగా ప్రచారం చేస్తూ , వారిని ఒక మత్తులో ముంచుతున్నారు.1917 లో రష్యన్ విప్లవం తర్వాత ఎప్పుడైతే సోవియట్ యూనియన్ , మేడేను అధికార సెలవుదినంగా ప్రకటించారో అప్పటి నుండి మేడే స్ఫూర్తిని సమూలంగా పెకిలించి వేయటానికి అమెరికా నేతృత్వంలో , పెట్టుబడిదారీ దేశాలు చేయని ప్రయత్నం లేదు 1920 లో ఫ్రెంచ్ ప్రభుత్వం ‘మే డే’ను కార్మిక సంఘీభావ దినంగా కాకుండా జాతీయ ఐక్యతాదినంగా జరుపుకోవాలని ప్రతిపాదించింది . ఫాసిస్ట్ ఇటలీ 1923 లొ మేడే ఉత్సవాలను రద్దుచేసి, ఏప్రిల్ 21 ని రోమన్ సామ్రాజ్యదినంగా ప్రకటించింది.ఒక శతాబ్దం తర్వాత నాజీ జర్మనీ మేడేను అధికార జాతీయ కార్మికదినంగా ప్రకటించి తర్వాత రోజే కార్మిక సంఘాలను చట్టవిరుద్ధమని ప్రకటించి కార్మికనాయకులను అరెస్టూ చేసారు. దీన్ని బట్టి’ మేడే’ కున్న అంతర్జాతీయ స్వభావం , స్ఫూర్తి ఇప్పటికే పెట్టుబడి కోటల్లో ప్రకంపనల సృష్టిస్తూనే వుంది.
ఎలాంటి అవలక్షణాలు లేని ఒక ఆరోగ్యవంతమైన కార్మికోద్యమం ‘మే డే’ను చరిత్రాత్మకం చేసింది. అప్పటికింకా సంస్కరణ వాదం , పెట్టుబడి దారుల కనుసన్నల్లో నడిచే కార్మికనాయకులు తయారు కాలేదు. దానితో ఎక్కువ పనిగంటలకు ఎక్కువ వేతనం అని కాకుండా , పనిగంటలు తగ్గించమనే ఒక మానవీయమైన నినాదంతో పెట్టుబడిదారుల మెడలు వంచారు. ప్రపంచకార్మికవర్గాన్ని ఐక్యం చేశారు. ప్రపంచకార్మికులందరూ ఒక్కటే అని చాటారు. రెక్కలు తప్ప ఆస్తూలు లేని కార్మికవర్గం ప్రపంచప్రజల విముక్తికి నాయకత్వం నాయకత్వం వహించే దిశగా ఎదిగేందుకు’ మేడే’ ఒక భూమిక అయింది.
అనేక దేశాలలో సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తుల అధికారంలో లేకపోవచ్చును గాని సమాజంలో వాటి స్థానం బలంగానే వుంది. పెట్టుబడి దారీ వ్యవస్థల సంక్షోభాలను ఎదుర్కొంటూ ప్రపంచాన్ని ఒక యుద్ధ రంగంగా మార్చివేసాయి ఫాసిస్టు యుద్ధాలను ఎదుర్కొంటూ కార్మిక వర్గం అగ్ర భాగాన నడుస్తూనే వుంది.
కార్మికులను దేశభక్తి , జాతులు పేరు మీద విడగొట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అదే సమయంలో పెట్టుబడీ సామ్రాజ్యవాద దశనుంది గ్లోబలైజేషన్ కు చేరుకుంది ఈ ప్రపంచీకరణం తో విపరీతపోకడలు పోతుంది. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను ఒక్కటొక్కటిగా తీసివేస్తున్నరు.కొత్తగా సాధించడం కాకుండా వున్న హక్కులను కాపాడుకోవడం కోసమే కార్మికవర్గం అష్టకష్టాలు పడవలసివస్తుంది. సరళీకరణ ప్రవేటీకరణ విధానాల్తో కార్మికులను మళ్ళీ ‘బానిసల’ స్థాయికి తీసికెళుతున్నారు.పెట్టుబడికి మూల స్థంభాలైన ప్రపంచబ్యాంకు ఐ.యం.ఎఫ్ లు తమకున్న విస్తృత ఆర్థిక రాజకీయాధికారాల్తో మొత్తంగా ప్రపంచ దేశాల సంక్షేమ విధానలను, కార్మిక హక్కులను హరించే విధంగా పథకాలు రూపొందించాయి. దాంతో అది ఏ దేశమైనా తన స్వయం సమృద్ధిని కోల్పోయి అమెరికా లాంటి అగ్రదేశాల వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి ఆ అభివృద్ధి యఙ్ఞనం లో కార్మికులకు , అట్టడుగు వర్గాల ప్రజలు సమిధులు అవుతున్నారు . కొన్ని చోట్ల కొన్ని జాతుల్ని మతాల ప్రజలనే మొత్తంగా తుడిచి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలస్థీనా ప్రజలను ముస్లిం మతానికి చెందిన ప్రజలను తీవ్రవాదులుగా ముద్ర వేశారు. మన దేశానికి వస్తే. బహుళ జాతి కంపెనీలపై పోరాడుతున్న ఆదివాసీ ప్రజలను , వారికి మద్దతుగా నిలుస్తున్న మావోయిస్టులను దేశద్రోహులుగా పేర్కొంటూ వారిపై యుద్ధానే ప్రకటించారు.
అయితే పెట్టుబడీదారీ విధానమే మాంద్యం లో కొట్టుమిట్టాడుతోంది.పెద్ద పెద్ద కంపెనీలే మూతపడుతున్నాయి . ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. మార్కెట్ల నిండా కుప్పలు తెప్పలు సరుకులు . ప్రజల కొనుగోలు శక్తి పోయి. అవి అలానే మురిగిపోతున్నాయి. మళ్ళీ మార్కెట్ రాక్షసికి జీవం పోసేందుకు బెయిల్ అవుట్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఆ విధంగా వారి నష్టాలను ప్రజలపై రుద్దుతున్నారు . వారి లాభాలు మాత్రం చెక్కుచెదరకుండా బొక్కసాల్లో భద్రంగా వుంటున్నాయి. దీనివల్ల ప్రజల సంక్షేమ పధకాలకు గండి వేతనాల్లో కొరత వెరసి మళ్ళీ పెద్ద ఎత్తున నిరుద్యోగం ఇదొక విషవలయం.
ఈ ప్రపంచ సంక్షోభం ప్రాంతీయ అసమానతలను మరింత తీవ్రం చేసి ప్రాంతాల మధ్య యుద్ధాలను దారి తీస్తుంది తెలంగాణ ఉద్యమాన్ని అలాగే అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఏ ప్రాంత ప్రజలైనా అణచివేతకు అన్యాయానికి వ్యతిరేకంగా దోపిడీశక్తులపై చేసే పోరాటాన్ని సమర్థిస్తూ కార్మికవర్గం వారికి అండగా వుంది అగ్ర భాగాన నిలబడి నడిపించాలి అదే మేడే స్ఫూర్తి,.
గోంతు లోతు సంక్షోభంలో కూరుకుపోయి వున్న పెట్టుబడిదారీ సంక్షోభం సమయంలో కార్మికవర్గం మరింత చొరవతో , మేడే స్ఫూర్తితో సమ సమాజ నిర్మాణానికై రాజీలేని పోరాటం చేయడమే మేడే కోసం అసువులు బాసిన ఎందరో అమరవీరులకు మనం ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి.