A K 47జర్నలిస్ట్
బొగ్గు పెల్ల కే నోరుంటే .. అది తప్పకుండా మునీర్ గొంతుకే !
ప్రజల గొంతుకను నినదించేందుకే పత్రికా రంగాన్ని ఎంచుకున్నాను ..
తన జర్నలిస్టు నేపధ్యం గురుంచి చెప్పాడు . అతని మాటల్లోనే ..
"ఆ సమయం లో నేను అనేక విషయాలతో ఘర్షణ పడాల్సి వచ్చింది . నా జైలు జీవితం తర్వాత నా కంటూ ఒక కుటుంబం ఏర్పడింది. సింగరేణి ఉద్యోగం ఉంది . అయినా మనసులో ఎదో ఒక అసంతృప్తి .
ఇన్నేళ్ళుగా నేను ఏ పార్టీ (భారత కమ్యూనిస్ట్ పార్టీ ) లోనైతే తిరిగానో ,ఎవరితో కలిసి పని చేసానో .. వారి పట్ల ,వారి నడవడిక పట్ల ఒక అసంతృప్తి . వాళ్ళ రాజీ ధోరణి ,అవకాశవాద లంచగొండి విధానాలు నాకు అస్సలు నచ్చేవి కావు .
సిద్ధాంతాలు ఏమి చెబుతున్నాయి ? మన నడవడిక ఎట్లా వుంది ? ఇట్లా అయితే కార్మికవర్గానికి మనం ఏమి మేలు చేస్తాం ? - ఇలా ఘర్షణ పడేవాణ్ణి .
కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల అపారమైన విశ్వాసం వుంది . కాని , ఆచరణే అందుకు భిన్నంగా ఉందనిపించేది .
నా విమర్శలేవి అగ్ర నాయకత్వం పట్టించుకోలేదు . పైగా నన్ను శత్రువులా చూడటం మొదలు పెట్టారు . మరోవైపు అప్పుడే మొగ్గ తొడుగుతున్న విప్లవోద్యమం నన్నెంతగానో ఆకర్షించింది . అదే సమయం లో విప్లవం పేరు మీద జరుగుతున్న దుందుడుకు చర్యలు నన్ను ఇబ్బంది పెట్టాయి .
ఇటువంటి సందిగ్ధ సందర్భం లో నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాలో ఒక అన్వేషణ మొదలైంది .
అమ్మ ఎప్పుడూ చెబుతూ వుం డేది ..
"బిడ్డా ! లోకం లో మంచివాళ్ళకే కష్టాలు ఎదురైతయి. కష్టాలు ఎదురైనవని మంచిని వదులుకుంటే మనిషి బ్రతికి వుండి సచ్చినట్టు లెక్క !"
పత్రికలు ;పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు -మహాకవి శ్రీ శ్రీ
ఈ స్పృహ వుండింది తనకు . కాని , ఎదో ఒక మేరకు ప్రజల గొంతును వినిపించటానికి ఇంతకు మించిన మార్గం కూడా లేదనుకున్నాడు .
అప్పుడు పత్రికల్లో సింగరేణి కాల్ బెల్ట్ వార్తలు 'సింగిల్ కాలమ్ "(single column )కే పరిమితమయ్యేవి .
వాటికి నడక నేర్పి పరుగు పెట్టించాలి .
ఆ సంకల్పం తో మొదట ' స్ట్రింగర్ '(stringer ) గా "ఈనాడు "దిన పత్రిక లో చేరాడు . కాని , అక్కడ సరిపడక "ఆంధ్రజ్యోతి " కి మారాడు . మధ్యలో కొన్నిరోజులు ఆ పత్రిక ఆగిపోయినా ఆ తర్వాత అందులోనే కొనసాగాడు .
అవి .. విప్లవ కార్మికోద్యమం మంచి ఊపు మీదున్న రోజులు . సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య )ఎర్రటి అక్షరాల గోడ పోస్టర్ చూస్తే చాలు కార్మికులు కదనరంగం లోకి దూకే వాళ్ళు . అప్పటి ఆదిలాబాద్ ,కరీంనగర్ (ఇప్పుడు మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలు )ప్రాంతాల లోనే కాదు కొత్తగూడెం వంటి దూర ప్రాంతాలకు కూడా సికాస కార్య కలాపాలు విస్తరించాయి .
దాని వెంట ప్రభుత్వ అణిచివేత మొదలయ్యుంది .
అప్పటికింకా తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాలేదు . 1983 లో ఆ పార్టీ అధినేత ఎన్ .టి రామారావు " నక్సలైట్లే దేశభక్తులు " అని ప్రకటించి , ముఖ్య మంత్రి అయ్యాక 1985 ఏప్రిల్ నెలలో కొండాపూర్ ఎన్కౌంటర్ తో తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు . ఆ తర్వాత పోలీసుల దమన కాండ పెరిగింది .
ఊడ్లకు ఊళ్లు తగలబెట్టడం ,కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేయడం ,విప్లవ కారులు కనిపిస్తే కాల్చివేయడం లాంటి యుద్దవాతావరణం లో తెలాంగాణ గ్రామాలు రక్తసిక్తం అయ్యాయి . 'భారతి' ,'పియర్ వికాస్' వంటి పేర్లతో నల్లదండు ప్రభుత్వ ముఠాలు పుట్టుకొచ్చాయి .
ప్రత్యేక పోలీసు బలగాల వేట లో గ్రామాలు తల్లడిల్లాయి .చివరికి ప్రజాస్వామిక వాదులు కూడా ఈ దాడులకు గురికాక తప్ప లేదు .
నిర్బంధ ప్రభావం బొగ్గుగనుల్లోకి విస్తరించింది . కాలరీ ప్రాంతం మొత్తం రక రకాల సాయుధ బలగాలతో నిండిపోయింది .
ముఖాలకు నల్లటిగుడ్డలు కప్పుకుని కార్మిక వాడల్లో ఊరేగింపు జరిపే ఇండో టిబెట్ సైనికుల పద ఘట్టనలతో నల్ల నేల తల్లడిల్లింది.
ఎప్పుడు , ఎవరిని ..ఏ అర్దరాత్రి పట్టుకు పోతారో తెలియని పరిస్థితి . అరెస్టులు , చిత్రహింసలు కాలరీ ప్రాంతం లో నిత్య కృత్యం గా మారిపోయాయి .
మిస్సింగ్ కేసులు
లాటి అమెరికా దేశాలలో మాదిరిగా మనుషులని మాయం చేయడం .
మునీర్ పనిచేసే మందమర్రి కే కే 5 ఇంక్లైన్ లో కార్మికుడు సమ్మయ్య ను ,అతనితో పాటు మరో ఇద్దరినీ ఎత్తుకుపోయి పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా మాయం చేశారు .
బాధితుని భార్య మునీర్ తో తన గోడు వెళ్లబోసుకుంది .
ఎన్కౌంటర్ గురుంచి వాస్తవాలు రాయటం .. అంటే పెద్ద సాహసమే !
పోలీసుల 'అట్రాసిటీ' గురించి ఏమి రాసినా అప్పట్లో "కొరివి తో తల గోక్కున్నట్టే !"
సమ్మయ్యను మాయం చేసిన కథనం ఫోటో తో సహా తెల్లారి పత్రికలో వివరంగా వచ్చింది.
తనకు పరిచయం ఉన్న కానిస్టేబుల్ మిత్రులు కొందరు "అన్న .. అతిగా పోతున్నవ్ .. మా సర్కిల్ చాలా కోపం మీద ఉన్నాడు . జాగ్రత్త !"అని హెచ్చరించేవారు .
అప్పుడప్పుడు ఎన్కౌంటర్ విచారణకు బాలగోపాల్ వంటి పౌర హక్కుల నాయకులు వచ్చే వాళ్ళు .
పౌర హక్కుల సంఘం కు సహకరించడం అంటే కూడా అంతే !
"హక్కుల సంఘం వాళ్లంటే .. అన్నింటికీ తెగించిన వాళ్ళు .. మనం అట్లా కాదు కదా .. వాళ్ళు వస్తరు .. పోతరు .. తెల్ల వారిన తరువాత .. పోలీసు వేధింపులు .. ఎందుకొచ్చిన తంటా .. "అని ఇతర జర్నలిస్ట్ మిత్రులు భయ పెట్టేవారు .
అవేవి లక్ష్య పెట్టేవాడు కాదు .. ఇంట్లో అమ్మ కానీ ,తన భార్య రిజ్వానా కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నావని కూడా అడిగే వాళ్ళు కాదు . అయినా వాళ్ళ ముఖాల్లో ఎప్పుడూ ఎదో భయం తొంగి చూసేది .
"పంధై పదేళ్లు బ్రతకటం కంటే నందై నాలుగు ఏండ్లు బ్రతికినా చాలు " అని అమ్మ చెప్పే సామెత ను గుర్తు పెట్టుకొని , పౌర హక్కుల నాయకులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లచేయడమే కాకుండా వారితో పాటు వెళ్లి బాధిత కుటుంబాలను కలిసేవాడు .
1987 ఆగష్టు 14, తెల్ల వారితే స్వాతంత్ర దినోత్సవం , కొత్తగూడెం ప్రాంతం లో సికాస నాయకులైన మోట శంకర్ ,షంషేర్ ఖాన్ ,రవీందర్ రెడ్డి , వీరయ్య లను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు .
అలా సింగరేణిలో ఎన్కౌంటర్ ల పరంపర మొదలైంది ..
ఎత్తుకు పోయి ,మాయం చెయ్యడం లాంటి దుర్మార్గాలకు కూడా పోలీసులు తెగబడ్డారు .
సమ్మయ్య , పాల్గుణ ,సారయ్య మరియు కుమార్ అనే సికాస కార్యకర్తలను మొదట మాయం చేసి అటు తర్వాత కాల్చి చంపి ,ఆ విషయాన్ని తొక్కి పెట్టారు .
ఇటువంటి ప్రభుత్వ హత్యలు .. మిస్సింగ్ కేసులుగా నమోదు అయ్యేవి .
మందమర్రి కి పది కిలోమీటర్ల దూరం లోని బెల్లంపల్లి కాలరీకి చెందిన కుమార్ ను అక్కడి నుండి మరో పది కిలోమీటర్ల దూరం లో మాదారం కాలరీ లో ఉండే అతని అక్క ఇంటి నుంచి ఎత్తుకెళ్ళి ,మాయం చేశారు .
ఈ కిడ్నాప్ కథనాన్ని మునీర్ ఆంధ్రజ్యోతి కి పంపించాడు .అయితే బెల్లం పల్లి వార్తను మందమర్రి డేట్ లైన్ లో పనిచేసే మునీర్ వ్రాయటం ;ఇద్దరి విలేకరుల మధ్య ఘర్షణకు దారి తీసింది .
అప్పట్లో పోలీసులకు భయపడి మిస్సింగ్ వార్తలు రాయటానికి ఎక్కువ మంది ముందుకు వచ్చే వాళ్ళు కాదు . ఇది.. మునీర్ చొరవ !
ఈ మిస్సింగ్ వార్తా కథనం కోల్ బెల్ట్ లో పెద్ద సంచలనం అయింది .
కుమార్ అప్పటికే 'సిపిఐ ' అనుబంధకార్మిక సంఘం 'ఏఐటీయూసీ' లో చురుకైన కార్యకర్త కావడం తో విషయం కాస్త 'సీరియస్' అయింది .
కుమార్ ను వెంటనే విడుదల చేయాలని , బెల్లంపల్లి బావులు బందు పెట్టి సమ్మెకు దిగారు . ప్రభుత్వం దిగి వచ్చి , విచారణకు ఆదేశించింది .
మధుకర్ అనే పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు .
ఈ మొత్తం వ్యవహారానికి మునీర్ ని భాద్యుణ్ని చేస్తూ పోలీసులు బెదిరింపులకు పూనుకున్నారు .
ఈ మిస్సింగ్ కేసు విచారణకు పౌరహక్కుల సంఘం తరుపున బాలగోపాల్ నేరుగా మునీర్ ఇంటికే వచ్చారు .
పోలీసు పహారాల మధ్యే మునీర్ సహకారం తో బాలగోపాల్ కేసు విచారణను విజయవంతంగా ముగించేవాడు .
మిస్సింగ్ కేసు లపై ప్రజల ఆందోళన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం టి .లక్ష్మి నారాయణను కమీషనర్ గా నియమించింది .
మునీర్ 'కోల్ బెల్ట్' లో పన్నెండు మిస్సింగ్ కేసుల కుటుంబాలను కలిసి , సాక్ష్యాలను నమోదు చేసి కమిషన్ ముందుకు తీసుకు పోయారు .
ఈ కుటుంబాలను వెంటబెట్టుకుని అనేక మార్లు కమీషన్ ముందుకు తీసుకు వెళ్లాల్సి వచ్చేది . ఇదంతా పోలీస్ అధికారులకు కోపకారణం అయ్యేది . మునీర్ ని రకరకాలుగా వేధించేవారు .
అర్థరాత్రప్పుడు పెద్ద సంఖ్యలో పోలీసు వాహనం తో వచ్చి ఇంటిని చుట్టుముట్టేవారు . సోదాలు చేసేవారు . నక్సలైట్లు వచ్చారని సమాచారం ఉందని దబాయించే వాళ్ళు .
కొన్నిసార్లయితే "వాణ్ని ఎన్కౌంటర్ చేస్తాం .. అప్పుడు ఎవడు వచ్చి నిజనిర్ధారణ చేస్తాడో చూద్దాం .. అంటూ పోలీస్ అధికారులు తమ కోపాన్ని బహిరంగం గానే వెళ్లగక్కేవాళ్ళు .