నేల బావి
~
అబ్బో ..
నా కిటికీలను , తలుపుల్ని
దబా దబా బాదుతూ
ఒక్కటే గాలి..
నురగలు కక్కుతూ
ఉరుముల మేఘాల దండు..
నిజంగానే
కుంభవృష్టికి ఒక్క అడుగు దూరం - అనే
అల్లకల్లోలాన్ని
తట్టుకొని నిలబడటం
కష్టమే !
ఈ హడావిడి అందాలకే
మనసు కరిగి కవితయ్యేది
నీటి చుక్క కోసం
నింగి నిండు మనసు నిట్టూర్చేది
గాలివాటు గమనం మేఘానిది
మబ్బుల్ల వాన కంటే
నా కాళ్ళ కింద భూమి లోంచి
ఉబికి వచ్చే నీటితోనే
కాళ్లు కడుక్కోవడం
ఒక ఒబ్బిడి అలవాటు
నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టే
ఉండేది ఒకోసారి
ఒక నుయ్యి తవ్వుకోవడం
చెంబెడు నీళ్లకోసం
పోనీ , భళ్ళున కురిసినా
వరదలయ్యే వాన కన్నా
తరిగినా ,పెరిగినా
నేల బావి నీటి మట్టం
నన్ను ఊరించే
నిండు చందమామ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి