19, జులై 2021, సోమవారం

అవునూ ..నువ్వూ

 అవునూ ..నువ్వూ  


అవునూ. 

ఎలా వంట బట్టిందో ఈ మాట  ?

అవును 

ఏంటో మరి ఈ పద బంధ  వ్యామోహం !

మాయదారి కాలం 

దాని  మీదే పెద్ద పట్టింపు ఉండేది కాదు 

ఎప్పుడూ దాని వెనక  పరిగెత్తింది లేదు 

అవునూ .. 

ఎక్కడో దాని 'కొస' దొరకపుచ్చుకొని 

ఉయ్యాలలూగినట్టు గుర్తు

అవునూ .. 

అప్పుడెప్పుడో నువ్వు ఎదురైనప్పుడే 

ఆ కాస్త తోక కూడా  తెగిపోయింది 

అవునూ .. 

చివరికి మిగిలింది అదేనేమో  నాకు 

దాన్నే  ఒక కానుకగా  

నీకే ఇచ్చేశా తెలియక ..  

అది  మొదలు  కాలంతో 

పెద్దగా అవసరం  పడిందీ  లేదు 

అవునూ .. 

నడుస్తున్న తీరం దారి ఒక్కటే తెలిసేది  

తెలియని మహాసముద్రం ఎప్పుడూ భయపెట్టేది

అందుకే నాకు తెలియని విషయాలే 

నీకు తెలిసినట్టు చెప్పేవాడిని  తెలివిగా 


నాకు ఎప్పటికీ తీరని దా హం - ప్రయాణం 

దాన్నే నీ కాళ్ళ కింద తివాచీలా  పరిచాను 

అవునూ .. 

నాకు తెలుసుగా నీ భూభ్రమణ కాంక్ష 


అవునూ .. నీకు గుర్తుందా ?

నువ్వు ప్రశ్నల వర్షం కురిపించేదానివి  

ఊరికే వూ  కొట్టకుండా 

అన్ని తెలిసినట్టు అవు.. నూ .. అనేవాడిని 

దీర్ఘం ఒక  ప్రేమరూపం  నాకు 


అయినా నాకు జవాబు తెలిసిన 

ఒకే ఒక ప్రశ్న నువ్వే గా !

అందుకే నాకు ప్రశ్న ,జవాబుల సమస్య లేదు 

అప్పటి నుండే అవునూ .. 

నాకు ఒక అలవాటుగా మారిపోయింది 

దానితో కొత్గగా ఏ సమస్యా రాలేదు 

పేరుకుపోయిన వేమీ  పారిపోలేదు 

అవునూ ..  మరి 

అది ఒక  'ఆక్ట్ అఫ్ బాలన్స్ 'నీ మాదిరి 

అయినా ప్రశ్నలు అనేకం 

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేవి  

అఖండాలుగా విస్తరించేవి

ఎదో ఒక అర్థం  మాట తో  

సమాధానపడనీ మనసు 

అవునూ .. పాపం అంటుంది 

అవునూ .. 

ఈ పదమొక్కటే 

మన ఇద్దరి చేతులు పట్టుకుని 

ఆడుకుంటుంది 

తనకి తోచినట్టూ ..  


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి