29, జులై 2021, గురువారం

వాన నుయ్యి

  నేల బావి 

      ~ 

అబ్బో .. 

నా కిటికీలను , తలుపుల్ని 

దబా దబా బాదుతూ

ఒక్కటే గాలి..


నురగలు కక్కుతూ 

ఉరుముల మేఘాల దండు..


నిజంగానే 

కుంభవృష్టికి  ఒక్క అడుగు దూరం - అనే 

అల్లకల్లోలాన్ని

తట్టుకొని నిలబడటం 

కష్టమే !

ఈ  హడావిడి అందాలకే

మనసు కరిగి కవితయ్యేది

నీటి చుక్క కోసం 

నింగి నిండు మనసు నిట్టూర్చేది 


గాలివాటు  గమనం మేఘానిది 



మబ్బుల్ల వాన కంటే 

నా కాళ్ళ కింద భూమి లోంచి

ఉబికి వచ్చే నీటితోనే 

కాళ్లు కడుక్కోవడం 

 ఒక ఒబ్బిడి అలవాటు 


నా గొయ్యి నేనే  తవ్వుకున్నట్టే

ఉండేది    ఒకోసారి

ఒక నుయ్యి తవ్వుకోవడం

చెంబెడు నీళ్లకోసం 


పోనీ , భళ్ళున కురిసినా 

వరదలయ్యే వాన కన్నా 


 తరిగినా ,పెరిగినా 

 నేల బావి   నీటి మట్టం

నన్ను ఊరించే 

నిండు చందమామ  ... 

28, జులై 2021, బుధవారం

 ఆత్మీయ ప్రయాణం 


ప్రయాణం ఎప్పుడూ ఒంటరి కాదు

ప్రకృతి తో ప్రణయం - అది

కదలిక ఏదైనా ప్రారంభమే !

రెప్పపాటు చలనమే కదా

చీకటి వెలుగుల ప్రయాణం 


ప్రయాణం ఎప్పుడూ ఒంటరి కాదు

ప్రణయం లో పరవశం -అది


నీలో ఒంటరితనం
 
గూడు కట్టుకోవడం

  - వేరు


నిన్ను ఏకాకివనే ఫత్వాలకు

అస్సహయంగా తల వంచండం 

 - వేరు


ఒక్కడివే సాగి పొమ్మనే తత్వాలకు

నిస్సహాయంగా ఫిదా కావడం 

- వేరు


ప్రయాణం ఎప్పుడూ ఒంటరి కాదు

పరవశంతో ప్రవహించటమే  - అది


ఒక భావన జత కడితే

ఆ ప్రయాణం అద్బుతం


మనిషి నీడైనా తోడుంటేనే

అది మమతలెరిగిన జీవితం..


మనసు ఖాళీలను పూరించేదే 

ఆత్మీయ ప్రయాణం..





19, జులై 2021, సోమవారం

ముద్దు నిద్ర

 ముద్దు నిద్ర 

ఎప్పుడూ  నిద్రే 

నిద్ర బోతు ! 

అస్సలు చెప్పను వాళ్లకు 

ఇది కలత నిద్ర కాదు 

 కమ్మటి కలల నిద్ర అని .. 

కవితా

 కవితా .. 

తెలిసీ తెలిసి 

దాని మాయలోనే 

పడతావ్ !

అది నిన్ను వదలదు 

దాన్ని  నువ్వూ .. 

అవునూ ..నువ్వూ

 అవునూ ..నువ్వూ  


అవునూ. 

ఎలా వంట బట్టిందో ఈ మాట  ?

అవును 

ఏంటో మరి ఈ పద బంధ  వ్యామోహం !

అంతా  కాలమహిమ  

కాలం మీద  పెద్ద పట్టింపు ఉండేది కాదు 

 దాని వెనకే ఎప్పుడూ   పరిగెత్తింది లేదు 

కాని - 

ఎక్కడో దాని 'కొస' దొరకపుచ్చుకొని 

ఉయ్యాలలూగినట్టు గుర్తు

అవునూ .. 

అప్పుడెప్పుడో నువ్వు ఎదురైనప్పుడే 

ఆ కాస్త తోక కూడా  తెగిపోయింది 

అవునూ .. 

చివరికి మిగిలింది అదేనేమో  నాకు 

దాన్నే  ఒక కానుకగా  

నీకే ఇచ్చేశా తెలియక ..  

అది  మొదలు  కాలంతో 

పెద్దగా అవసరం  పడిందీ  లేదు 

అవునూ .. 

నడుస్తున్న తీరం దారి ఒక్కటే తెలిసేది  

మహాసముద్రం ఎప్పుడూ భయపెట్టేది

అందుకే నాకు తెలియని విషయాలే  నీకు 

పెద్దగా తెలిసినట్టు చెప్పేవాడిని  


నాకు ఎప్పటికీ తీరని దా హం - ప్రయాణం 

దాన్నే నీ కాళ్ళ కింద తివాచీలా  పరిచాను 

అవునూ .. 

నాకు తెలుసుగా నీ భూభ్రమణ కాంక్ష 


అవునూ .. నీకు గుర్తుందా ?

నువ్వు ప్రశ్నల వర్షం కురిపించేదానివి  

ఊరికే వూ  కొట్టకుండా 

అన్ని తెలిసినట్టు అవు.. నూ .. అనేవాడిని 

దీర్ఘం ఒక  ప్రేమరూపం  నాకు 


అయినా నాకు జవాబు తెలిసిన 

ఒకే ఒక ప్రశ్న నువ్వే గా !

అందుకే నాకు ప్రశ్న ,జవాబుల సమస్య లేదు 

అప్పటి నుండే అవునూ .. 

నాకు ఒక అలవాటుగా మారిపోయింది 

దానితో కొత్గగా ఏ సమస్యా రాలేదు 

పేరుకుపోయిన వేమీ  పారిపోలేదు 

అవునూ ..  మరి 

అది ఒక  'ఆక్ట్ అఫ్ బాలన్స్ 'నీ మాదిరి 

అయినా ప్రశ్నలు అనేకం 

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేవి  

అఖండాలుగా విస్తరించేవి

ఎదో ఒక అర్థం  మాట తో  

సమాధానపడనీ మనసు 

అవునూ .. పాపం అంటుంది 

అవునూ .. 

ఈ పదమొక్కటే 

మన ఇద్దరి చేతులు పట్టుకుని 

ఆడుకుంటుంది 

తనకి తోచినట్టూ .. 



 










14, జులై 2021, బుధవారం

 తడిసిన కవితలు రెండు .. 

1

కుండపోత కాదోయ్ 

నేనిక్కడే వుండి  పోతా  నంటూ 

కురుస్తోంది వాన 


అందరూ  ముసుగు తన్ని పడుకున్నారు 

నేను ఒక్కడ్నే 

గొడుగు విప్పుకొని 

బయలు దేరాను 

చినుకుల్ల డప్పులతో .. 

దారిపొడుగునా ఒక్కటే 

వాన ఊరేగింపు .. 

2


నేలకేసి చినుకులతో 

వాన దబ  దబా బాదుతుంది 

మన్ను తిన్న పాము అది 

తడిసి తడిసి 

మరింత ముద్ద ఐపోతుందే  కానీ 

లేచి చావదే 1

నేను వాన బాధ ని గమనిస్తుంటాను 

దాన్ని అక్షరాల్లోకి దింపుతుంటాను 


దానికి  ఎలా తెలిసి పోతుందో !

కిటికీ పక్కన కూర్చున్న 

నా ఒడిలోకి  చల్లగాలిలా 

దూరిపోతుంది 

దాన్ని ముద్దు చెయ్యకుండా 

ఎలా ఉంటాను 

ఆ ముచ్చట 

నీకు  చెప్పకుండా 

ఎలా ఉండగలను 


 కాలం కన్నతల్లి లా .. 


పొద్దుటి నుంచే నా మీద పెట్టబోయే రాజద్రోహ కేసుల గురుంచి చర్చ జరిగింది . గత రాత్రి ఒక ప్రయత్నం జరిగింది . నాలో మొండి తనమో ,ఒక అమాయక ఆదర్శవాదమో కానీ వాళ్ళని భలే ఇబ్బంది పెట్టింది . ఏ కారణం చేతో కానీ వాళ్ళు నన్ను మరీ బలవంత పెట్టలేదు .  

కానీ ఉదయం నుంచి చాలా తెలివిగా నన్ను అంటిపెట్టుకొని ,నా నుంచి ఎదో రాబట్టాలని ట్రై చేసి ,ట్రై చేసి  అయినా అలిసిపోని NIA పోలీస్ 

(DSP  రాంక్ అని చెప్పుకొన్నాడు)నేను ప్రెస్ ముందుకు వెళ్లే ముందు చాలా సేపు మాట్లాడాడు . 

అంతా ఢిల్లీ నుంచి వాళ్ళ బాస్ చెబుతున్నట్టే జరుగుతుంది . నా మీద పెట్ట బోయే కాసేలా గురుంచి చెప్పాడు .  అతని నోటి నుంచే మొదట విన్నాను .. అర్బన్ నక్సల్ నేషనల్ కోఆర్డినేటర్ ..నన్ను వేటాడటానికి భారత్ ప్రభుత్వం నాకు తగిలించిన పేరు .. ఆ హోదా కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మొదట .. ఆ తర్వాత ఎప్పటి లాగే నవ్వే వచ్చింది .. దాంతో పాటు మహానుభావుడు  మహా కవి శ్రీశ్రీ మాట ఒకటి గుర్తొచ్చింది . విరసం అధ్యక్షపదవి రాష్ట్ర పతి పదవి కంటే గొప్పదని .. 

అతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు .. ఏవో మెసేజెస్  వస్తున్నాయి . కాసేపాగి నాతో మాట్లాడాడు . 

ఇంకా మీకు అవకాశం ఉంది .. మా బాస్ ఒక ఆఫర్ ఇస్తున్నారు .. మీ మీద ఈ కేసులన్నీ ఎత్తేస్తారు .. మీ ఉద్యోగం మీకు ఉంటుంది .. మీరు మాకోసం పని చెయ్యండి .. 

అయితే నేను ఒక్కటే మాట  అన్నాను .. మీ కోసం పని చెయ్యగలిగే .. అంత  పెద్ద మనిషిని కాను ..

 

అతను విడిచి పెట్టలేదు . కూల్ గ ఆలోచించమని చెప్పాడు .. 

ఆలోచించడానికి నాదగ్గర అలాంటి మనుసు లేదు .. అలా నేను బహుశా ఎప్పటికి చెయ్యలేను .. అంత తెలివి తేటలు నాదగ్గర లేవు .. 

అన్నిటికి మనం సమాధానం చెప్పి తీరాలని లేదు .. 

కాలం .. కష్టాల పాలు చేసినట్టే కన్నతల్లి లా కాపాడుతుంది . 

కాలం ఎవ్వరి కోసం ఆగదు  గా .. 

ప్రెస్ ముందుకు , ఆ తర్వాత పోలీస్ కస్టడీ కి వెళ్ళిపోయాను 






9, జులై 2021, శుక్రవారం

హలో ! కల్లోలం

హలో ! కల్లోలం 


 చెప్పినట్టు చెయ్యవు ..అని 

నువ్వు మనుసు కష్ట పెట్టుకుంటావు 

నీ కష్టాన్ని నేనూ  చూడలేను .. 

మరి, పరిష్కారం ?


చేతబడి మాదిరి 

నీ మాటకి కట్టుబడి పోవడమే .. 


బుర్రలోంచి నానా చెత్తనంతా తీసేసి 

నీ మాట  ఒక్కటే ఎంచక్కా ఆచరణ లో పెట్టేసి 

 చూసా ఈ రోజు ..


ఆశ్చర్యం ! మరి    మాములుగా లేదు 

నేను మాయం అయిపోయి 

అచ్చంగా నువ్వే మిగిలావంటే 

నీకే నమ్మకం కలగదు 


మరి..  ఇన్నాళ్లు -

దీనికింత గుంజాటన ఎందుకు ? అంటే 

నేను ,నేనుగా మిగలనప్పటి  

కాల మహిమ -అది కాబోలు! 


ఒక గుంపు లోంచి ,

గొర్రెల  మంద లోంచి 

ఒక చివరి లోకి 

ఏదైనా ముగింపు లోకి

చేరుకుంటే  అది .. అదే  నువ్వేమో ! 


నువ్వంటూ మిగిలితే నే కదా 

ఎవరైనా నిన్ను గుర్తు పట్టేది 

నీకొక ముద్దు..  పేరు పెట్టేది 

హలో ! కల్లోలం .. 




 అచ్చంగా 

నాకేమిటి కావాలో 

వెదుకుకుంటూ పోవడమే 

జీవితం కాబోలు !


కాలికేదో  'గొప్పు' తగులుతుంది 

అయినా ఆగకుండా 

సాగడమే జీవితమేమో !


ప్రయాణ బడలిక 

విశ్రాంతి కోరుతూ 

'రాస్తా రోకో ' చేస్తుంది 

దాని పై 'లాఠీ ఛార్జ్ 'కి దిగకుండా 

'సరెండర్'  కావడమే జీవిత సూత్రమేమో !

 

పెట్టుబడి  మానవత్వం 

విరిగిపోయిన పాచి బద్ద 

ఎవడిక్కావాలి అది ?

వాడికీ  పనికి రాదనుకున్నప్పుడే 

ఆ  "అమానవత్వాన్ని" 

నా మొఖాన విసిరి కొట్టి 

కాస్త పుణ్యం మూట కట్టుకొంటాడు 


 నీ మతమూ , మానవత్వం 

84 ఏండ్ల  ఫాదర్ స్టాన్ కి 

మాత్రమే కాదు 

మంచినీళ్లు తాగే అతడి సిప్పర్కి  కూడా 

ఎంతో దయ తో - మరణాన్ని ప్రసాదించింది 

బహు పరాక్ !

గాంధీనే  కాల్చి చంపిన గాడ్సేలు 

గోముఖ వ్యాఘ్రాలు..  


 క్షణాలను పొదువు కుంటూ 

నేను పొదిగేది నీ ప్రేమ నే .. 

7, జులై 2021, బుధవారం

అది వొట్టి బొమ్మే అయితే 

ఎన్ని రంగులేసి అయినా మెప్పించ వొచ్చు 

అది ఊసు పోని కవితే  అయితే 

కొట్టివేతలతోనూ  సరిపెట్టుకోవచ్చు 

కానీ - పట్టించుకోవటం లేదు అని 

పూట పూట కి మంకు పట్టు పట్టే 

పాపం - పిచ్చిమనుసు ను 

ఎలా ఏమార్చను 

116 వ ఎక్కం 


అయితే గియితే 

జీవితమొక లెక్కల పుస్తకం మాత్రమే 

ఎక్కాల పేజీ మొట్టమొదటిది 

అందులో 116 వ  ఎక్కం ముఖ్యం 

చదివింపులు ,పెట్టిపోతలు 

అన్నీ నూట పదహార్లే గా 

ఎంత చదివిస్తామో 

అంతకు మించి రాబట్టుకోవాలి 

అదీ చదువుల సారం 

బ్రతుక్కి అర్థం  పరమార్థం 

ఇటుది అటైనా 

అటుది ఇటైనా 

లెక్కలు సరిపోవాలి 

116 వ ఎక్కం 

వెయ్యు నూట పదహార్లుగా 

ఎదిగిపోవాలి .. 

 మన కలల్ని  మనమే 

పనిగట్టుకుని 

ప్రతిరోజూ 

గానం చెయ్యక పోతే 

కలతలే రాజ్యమేలుతాయి


 నిషేధాల నడుమ 

విప్లవమూ ,ప్రేమా 

విషాదాల బరువు

 నువ్వూ ,నేనూ 

ప్రేమ కాలం

ప్రేమ కాలం 


 కాలం -

ఒక్కటే నీ సొత్తు 

దానితో 

కూసింత పొత్తు నాది 

అదేగా - నువ్వు 


గల గలా ప్రవహిస్తావు నువ్వు 

కల కంటూ- నేనూ పరుగెడతాను  నీ వెనక 

బహుశా  ప్రేమ అంటే 

అదేనేమో 

గుడ్డి వెలుతురు

గుడ్డి వెలుతురు 


 మనసు కుదురు కోని 

కంచు కోటలో -


కటిక చీకటి ఒక్కటైనా 

భయమే 


కళ్ళు మిరుమిట్లుగొలిపే 

ఎన్ని వెలుగులున్నా

ఎదో  తెలియని  బెరుకే  


అందుకే నేమో 

నా మటుకు  నేను 

కళ్ళు మూసుకుని 

చల్లని వెన్నెలని 

ఆవిష్కరిస్తాను 



తడిసిన కల నువ్వు

తడిసిన  కల  నువ్వు  


 ప్రియా !

విరహంలో దిగబడి పోయాననే  ఏమో 

ఆకాశ నావ లో  వాన పరవళ్లు 


ముక్క వాసన వేసే పదాలతో ఇక 

ఈ వాన గురుంచి రాయలేను 

కొత్త భాష ఒకటి కాలువలై 

నా కళ్లెదుట పారుతుంటే .. 


గొడుగు పుట్టినప్పుడే నా సంబంధం 

చినుకుతో   ముడిపడిపోయింది 

మేమిద్దరమే ఊరూవాడని 

ఏకం చేసే వాళ్ళం 

కాగితం పడవలు వేసుకొని 

నా కలలు చినుకుల్లో ఊరేగివి 

ఊరేగింపుగా వెళ్లి వరద 

చెరువు నిండి పోయేది 


నా కన్నుల పండుగ - వాన 

చినుకు సవ్వడి వింటూ 

కునుకు సంగతే మరిచాను 

ఎదో అలికిడి విని - చూస్తే 

తడిచి ముద్దైన   వాన వణుకు మల్లే నీవు 

అప్రయత్నంగానే 

ఒక దేవతా వస్త్రం తో  

తల తుడుచుకున్నాను 

వానా  వెలిచిపోయింది 


4, జులై 2021, ఆదివారం

జులై 2,2021. 

పుట్టిన రోజు అని ఫేస్బుక్ చేసే హడావిడి .. నా మనసు లో ఏమీ లేదా అంటే- ఏముంటుంది ?ఎలాగుంటుంది అనే ప్రశ్నలు తోసుకు వస్తాయి. 

కొంచెం లోతుల్లోకి వెళితే -నాకేమి కాని నా బాల్యం ,ప్రత్యేకం గా చెప్పుకోవటానికి  ఏమి మిగల్చని చీకటి అనుభవాలే ఎక్కువ .. 

తొందరగా ఎదిగి పోయి ,పెద్దయి ఎదో నాకు నేనే అన్నీ చేసేసుకోవాలని ఉబలాటం ఉండేది . అప్పట్లోనే రేడియో లో బాపు గారి అందాల రాముడు సినిమా లో పాట ఒకటి మరి భలే తికమక పెట్టేది . "ఎదగడానికెందుకురా తొందర .. ఎదర బతుకంతా చిందరవందర .. "అయినా సరే నా పట్టుదల లో మార్పు రాలేదు .. 

అప్పటికే చిందరవందర బాల్యం మనది .. 

అమ్మ నాన్నకి పురుడు ,పుట్టు వెంటుకలు దేవుడికి ఇయ్యటం తప్ప పుట్టిన రోజు లు జరుపుకునే 

కాన్సెప్ట్ లేదు . అయినా మా నాన్న చాలా తెలివిగా ఉండేవాడు . మా ముగ్గురి పుట్టిన తేదీలు ఎవరితోనో భద్రంగా ఒక పుస్తకం లో రాయించి పెట్టాడు . మేము ముగ్గురం మొగ మహారాజులం .