8, నవంబర్ 2020, ఆదివారం

వర్గ సంబంధం /రక్త సంబంధం

 వర్గ సంబంధం /రక్త సంబంధం 


కామ్రేడ్  కొండపల్లి సీతారామయ్యని విడుదల  చేయాలి  .. అని గోడల మీద తాటికాయంత అక్షరాలతో రాడికల్స్ వాల్ రైటింగ్ చేస్తున్న రోజులు అవి. బహుశా అది 1985 కావచ్చు .. 

యువతరం శిరమెత్తితే ..  చదువు కొన్న వారు ,చదువు లేని వారు..అందరూ  సముద్రపు అలల్లా ఊగిపోతున్న కాలం అది .. 

నక్సలైట్ ,రాడికల్ ..  పదాలు విప్లవ ప్రవాహం లో పడి ఎంతగా  నలిగిపోయాయి అంటే .. అవి తెలుగు పదాలేనోయి ..అనేంతగా 

ఎటు చూసినా  "అలజడి మా జీవితం ..ఆందోళన మా ఊపిరి "అంటూ ఊరేగింపులా ఉరకలు వేస్తున్న తరం .. 

ఏ పిలుపిచ్చినా జాతరలా కదులుతున్న జనం .. 

నూనూగు మీసాల పిల్లలు భగత్ సింగ్ లాగా అన్యాయాలపై అగ్గిపిడుగుల్లాగా విరుచుకు పడుతున్న విప్లవాల వెల్లువ .. 

అది బొగ్గు గనుల కాలేరు ..రష్యన్  చలికాలం ..అంటే డిసెంబర్ మాసం .. మందమర్రి పోలీస్ స్టేషన్ కి  కొంచెం దూరంలో సందులో .. ఒక తండ్రి (ఒక తల్లి కథ  ..అనే విప్లవ నవల వచ్చింది. అది సినిమా కూడా తీశారు.ఒక తండ్రి కథ కూడా తీయాలి )..నా మిత్రుడు ఒకరు చాలా సీరియస్ గా మాట్లాడు కుంటున్నారు.. నేను దగ్గరగా వెళ్ళాను. 

ఆ తండ్రి  దాదాపు ఏడుస్తున్నట్టే చెపుతున్నాడు. 

"మావోడు ఏండ్ల లేడే "

మావోడు అమాయకుడే ... 

ఎవరైనా సరే  తను  చెప్పింది నమ్మి తీరాయాల్సిందే  .. ఇందులో ఇక అబద్దాన్ని కి ఎంతమాత్రం తావు లేదు. కావాలంటే మీరు ఏ పరీక్షలైనా చేసుకొండి.  బస్తీ  మే సవాల్.. కొడుకు ప్రాణాల్ని తన కండ్లల్ల పెట్టుకొని దీనంగాను  మాట్లాడుతున్నాడు. అయ్యో అనిపించింది నాకు.నా మిత్రుడు అంతే ఇదిగా ఉన్నాడు . వాతావరణం వేదనా భరితంగానే ఉంది 

మళ్ళీ  ఆ తండ్రే కళ్ళల్లో నీళ్లు తీసుకొని .. 

నిజంగనే మావోడు ఏండ్ల లేడే..   

ఎవ్వని సోపతి లేదే ... 
మళ్ళీ అంతే నమ్మకంగా ఏడుస్తూ వున్నాడు. 
నాకైతే ఆ తండ్రి భాధ చూస్తే  కండ్లలోకి నీళ్లు  వచ్చేశాయి 

నా మిత్రుడు బాధ లోంచి కాస్త కోపం లోకి దిగిపోయాడు 
ఒక చేత్తో ఆ తండ్రి భుజం పట్టుకొని మరో చేతిని మడిచి నుదిటి మీద పెట్టుకొని .. అయ్యో !ఏండ్ల 
లేడని అనద్దే .. ఏండ్ల లేడని అంటే అండ్ల ఉన్నట్టేనే  ... 

ఈ మాటలు గత ముప్పై ఐదు ఏండ్లుగా నా మనసుకు కి దగ్గరగా అలానే ఉండి  పోయాయి . అప్పుడప్పుడు అవే  గుర్తొచ్చి ప్రజల తాత్వికత పట్ల మరింత గౌరవం పెరిగేది . 
ఎందుకో ఎప్పుడు రాద్దామని కూడా అనిపించలేదు. ఐనా అది రాతలో ఒదుగుతుంతా అనే అనుమానం కూడా ఉండేది. అందుకే  ఎందరో మిత్రులకి ఎన్ని సార్లు చెప్పానో .. చెప్పి ఎంత ఆనందం పొందానో!అదొక నోస్తాల్జిక్ .. 
మరి ఇప్పుడు ఎందుకు ఈ సొద..అంటే  
కొన్నిటికి ఎలా సంబంధం కుదురుతుందో చెప్పలేం 
నిన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ .. రక్త సంభందం ఎంతైనా ఉంటుంది .. అన్నాడు 
అదే ప్రాబ్లెమ్ కదా అన్నాను నేను .. బంధాల అనుబంధాల ఆధిపత్యాలే అసలు సమస్య .. 

ఇలా అన్నాక వెంటనే "ఏండ్ల లేడు అంటే అండ్ల ఉన్నట్టే నే .. అనే మాటలు గుర్తొచ్చాయి . 
మళ్ళీ అదే నవ్వు .. నా ముఖం వెలిగిపోయింది 



9, జూన్ 2020, మంగళవారం

ఎం చేయాలి 


ఏం చేద్దామంటావ్ మరి 

గాలి లోకి ఒక్కటే  

పిడికిలెత్తి నిలబడదాం 

శత్రువుని మాత్రం రెండు కళ్ళతో గమనిస్తూనే 

ఓ కంట కనిపెడదాం 

పిడికెడు గాలి చాలు 

పిడికిలి ప్రాణం పోసుకుంటుంది 

నీ కన్నెర్ర చాలు 
వాడి వెన్నులో చలి పుట్టడానికి

ఉలి చెక్కిన శిల్పం లా ఆకాశమూ 
పిడుగుల వర్షం కురిపిస్తుంది 

కవి భావనలో ఉలికి పడ్డ భూమి కూడా 
నీ పాదాలను పునాదిగా మొలిపిస్తుంది 
 


2, జూన్ 2020, మంగళవారం

పుస్త'కబేళా '

పుస్త'కబేళా '
(పుస్తక మేళా )

పాపం పుస్తకాలన్నీ 
బేలగా పడివున్నాయి 

మేళా  మరి ..కబేళా మరీ 
కాస్త కండ  బట్టి 
మిలమిలా మెరిసే 
కొత్త పుస్తకాలకో ధర 
పాత పుస్తకాలకొక ధర 
చవక చవక 
చచ్చిన శవాలను 
వేలం వేసినట్టు

కరుణశ్రీ ఎప్పుడో పోయాడు పాపం 
ఇప్పుడు ఎవరు 
ఆలపిస్తారు 
ఈ పుస్తక విలాపాన్ని 

ఎన్కౌంటర్ చేసేసి 
మాటల్ని 
నాలుగు మూటలుగా గట్టి 
ఎంత బాగా అమ్మకానికి పెట్టారు 

చిట్టిపొట్టి మాటల్ని 
ఎంత క్రూరంగా 
హింస పెట్టారో కదా 
దయలేని వారు ఈ రచయితలు 

ఏ పుస్తకం లో దొరుకుతాయి 
నిజమైన ప్రేమ ,దయ,కరుణ 
నీలో నాలో తప్ప 

జ్ఞానమెవ్వడి సొత్తురా 
అమ్మకానికి పెట్టారు 

నీ అరమోడ్పు కన్నుల్లోంచి 
జాలువారే భావాలను 
ఏరుకునే టైం లేదు ఎవ్వరికి 
ఈ పుస్తకాలను చదవరు  
చివరికి 
మళ్ళీ అవి గోడ ల్లోకి
అద్దా ల గ్లాసుల్లోకి 
భద్రంగా పాతిపెడతాం 
చచ్చిన శవాల్లా 
భద్రంగా  చుట్టిపెడతాం 
ఈజిప్టు మమ్మీల్లా 




గ్రీన్ టీ

గ్రీన్ టీ 


ఈ రోజుని మొదలెట్టడానికి 
గొంతు సవరించుకుంటాను 
మనసూ సరిచేసుకుంటాను 

డిసెంబర్ చలి 
వల వేసినట్టు 
కాళ్ళ చుట్టూ పెన వేసుకొని  వుంది 

బైట ఎదో విజిల్ శబ్దం 
శ్రమ శకటం ఎదో 
అప్పుడే బయలు దేరింది 
జ్యూయ్యు జ్యూయ్యు మని 
బండ్ల శబ్దం దూరంగా 
పక్షుల చిక్ చిక్ రావాలు 
చెవుల్లోనే 

పచ్చని చెట్లు అలా 
నిలబడిపోయి చూస్తున్నాయి 
కొబ్బరి చెట్టు ఏమో 
కళ్ళు అన్నీ తెరుచుకుని 
ఆకుల సందుల్లోంచి 
అన్నీ గమనిస్తోంది 

అలవాటే లే ఈ కలానికి 
కనిపించిన ప్రతిదాన్ని 
ఏరి భద్రపరుచుకోవడం 
ఎక్కడ పారేసుకున్నామో  
అక్కడే వెదుక్కోవడం

గ్రీన్ టీ 
వేడివేడిగా గొంతును 
శృతి చేస్తోంది 
ఇక మొదలవుతుంది 
ఆత్మారాముడి గోల 

ఇంక అంతా కల కల 
కల చెదిరిపోయినట్టు 
కాలం వల వేసి 
గిల గిలా బిగించినట్టు 

గాలి అలల లెక్క తేలేసరికి 
వెలుతురు పిట్ట ఎగిరిపోతుంది 

ముక్కు దిబ్బెడ

ముక్కు దిబ్బెడ

నీ ఆలోచనల్లో 
కూరుకుపోతానేమో 
మనసంతా అదోలా ఐపోతుంది 

డిసెంబర్ చలి రాత్రులేమో 
ముక్కు దిబ్బేడ  వేస్తుంది
పొద్దున్నే చల్లగాలికి 
వరుస పెట్టి తుమ్ములొస్తాయి 
దేన్నీ ఆపలేను 
ఆస్వాదించడం తప్ప 
ప్రతి తుమ్ము 
కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది 
కనులు మూసినా 
నువ్వేగా .. 
సవాలక్ష అవలక్షణాలున్నా 
ఈ జలుబు బాగుంది 
నీ స్మరణ లానే 
ఇంతకంటే గొప్ప హృదయమేదైనా
నడిచే కాలికి  "గొప్పు "లాగ తగిలితే
నొప్పి ఎలా తెలియకుండా ఉంటుంది

ఏ గాలి దిశను తిప్పగలిగానని
నిన్ను మన్నించమని అడగడం

ఏ నీటికి నడకలు  నేర్పానని
నీ పరుగులకు వెరవడం

రెండు ప్రవాహాలు
ఒక సంగమం
అది సాగర ఘోష అయింది 

నో కంప్లైంట్

నో కంప్లైంట్ 

జ్ఞాపకాలు గుర్తొస్తే చాలు

ఎప్పుడూ

చిన్న నవ్వు ఒకటి

సిగ్గు మొగ్గలా తొలుచుకొస్తుంది

అప్పుడప్పుడూ

చటుక్కున కన్నీళ్లు

వరదలై

చాటుమాటుగా తుడుచుకొనే 

విశ్వ ప్రయత్నం చేస్తాయి


ఎందుకు అంటే

కంప్లైంట్ అయితే ఏమీ లేదు మరి .. 

వాహ్ కవి


వాహ్ కవి

నిజంగా ఎవరో కవే అన్నట్టు
మనం 
కాలం కడుపున పుట్టిన పాపలం

కలల కోసమే ఏడుస్తాము

ప్రేమ కోసం పరితపిస్తాం

కవిత్వం కోసమే జీవిస్తాము

కన్నీటి ప్రవాహానికి ఎదురీదుతాం 

తలాష్

తలాష్ 

నన్ను నేను 
వెదుక్కుంటూ వెదుక్కుంటూ 
రాత్రి లోకి  పగలును 
బలవంతంగానే దొర్లించేసి 
నిజంగానే అలిసిపోతాను  

నేను జైలుగాడి 
కనుసన్నల్లోనే ఉంటాను 
అయినా వాడికి 
వాడిమీదే అనుమానం 

పొద్దుపొద్దున్నే 
తలాష్ తలాష్ అంటూ 
నా రెండు దుప్పట్లను 
చిందర వందర చేస్తాడు 
 పాపం వాడికేమి దొరకదు
ఉద్యోగ ధర్మం తప్పా 

నా రాత్రి వెన్నెల స్వప్నాల మీద  
వాడి మొరటు దాడే  .. తలాష్ 
(జనవరి,2019 నుండి మూడు నెలలు జైలు కాలం .. బిలాస్పూర్ (ఛత్తీస్ ఘడ్ )

జైలు

జైలు 

జైలు గోడలు 
ఈ నే ల మీదే 
ఆకాశమంతా  నేనే 

రివ్వున ఎగిరి విహరించే పావురాల 
స్వేచ్ఛా రవళి నాదే 

ఆశ   
అలజడి 
జమిలిగా 
ఆడిపాడేది ఇక్కడే 

ఎక్కడికి పో తావీ రాత్రి 
అంటూ 
చుక్కల్లో చిక్కుపడ్డ ఆకాశం 
అడిగే చిక్కు ప్రశ్న 

నన్ను వదిలి నువ్వు పోలేవులే 
అంటూ 
ఆలోచన ల చిక్కుముడుల్ని 
విప్పుతూ 
నా చైతన్యం పాడే 
జోలపాట .. 



శూన్యం

శూన్యం 

ఎప్పుడూ ఒక ఖాళీ కోసం
కలయ దిరిగే కాలం
నువ్వు..  చొరబడ్డాక
నీ కోసం వెతుకులాట
ఒక ఆట అయిపోయింది

అవునూ ..నీది
దాగుడు మూతల  ఆట
తల వంచుకొని
గుండె నిండి పోతావ్
జూలు విదుల్చుకొని
కాలాన్ని నీ వెంట తిప్పుకొంటావు
ఈ లోగా ..
వెన్నెల పాట ఎదో
చుక్కల పైటేసి
ఆకాశాన్ని ముంచెత్తిందంటే
నువ్వేమంటావో .. 

వలపు కొలిమి

వలపు కొలిమి 

నా కంటే బాగా నా హృదయాన్ని విడదీసి ,విడమరిచి ..నీ మూగ భాషల్లో ..నీ ఉహ్ .ఉహు అల్లకల్లోంచి దూరి పోయి ..నీకు ఎవ్వరు చెప్పగలరు .. మౌనంగానే అయినా నీ భుజాలు పట్టి ఊపి ఊపి ...నీ నుదుటి మీద ,నీ కనురెప్పల మీద ,నీ పెదవుల మీద ఎన్ని ముద్దులు పెట్టైనా నా మనసుని నీ ఎద మీద పరిచేవాడిని కదా ..

ఎన్ని పచ్చని గడ్డి మైదానాలు బోసిపోయాయో నీ అలకల్లో ... తుంచిన  గడ్డిపరకలు ఎన్ని మోపులయ్యాయో .. ఎప్పుడు ఏ భావం  ఏ భాషకి పూర్తిగా అందిందని ..అన్నీ అర్థ భావాలే ..

కన్నీటి తెర చాపలేసుకుని మౌన ఓడల ప్రయాణం .. ఎప్పుడు ఏ తీరం చేరిందని..
గుల్జార్ పాటల్లో తేలుతూ, తూలుతూ సాగుతూనే ఉంది ఇప్పుడూ
ప్రేమ కి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి
ప్రేమకి ఇంతకంటే పునాది ఏమి కావాలి

మనిషి కంటి చూపు లో పుట్టే ప్రేమ
ఎందుకో కన్నీటి తోనే చెలిమి చేస్తుంది
వలపు కొలిమిలో కాగి పోతుంది 
పల్లె సుద్దులు 

కన్నీటి కి గట్లు కట్టి
గుడ్డి  దీపాల వెలుగులో 
కలలను  ఊరేగించుకోవడమే జీవితం

గుండె మంటల్లో ఆత్మ కాలిపోయినా
అద్బుతమైన జీవితాన్ని బ్రతికించుకోవటం ఒక  అవసరం

పగులు దేరిన పాదాలకు
విడిపోయిన మన దారులెక్కడ కలుస్తాయో
వివరించడం  వృథా ప్రయాస 

ఎత్తిన పిడికిళ్ళలో ఎర్రజెండా మాయమవడం
ఎవడి కుట్రో విప్పిచెప్పుకోగలిగితే   
అదే నేడు మహా  విప్లవం 

పిచ్చి భావనా

పిచ్చి భావనా 

నిన్ను చూసినప్పుడు
మొదట కలిగిన భావం వెంటనే
తోసుకొచ్చిన భయ్యం
నీకు అప్ప చెప్పిన మొదటి మాట
పంచుకున్న మంచి పాట

"ది బెస్ట్ " అవే ఇప్పటికీ
ఇదెలా సాధ్యమయుంది
మార్పు తప్ప ఏది శాశ్వతం కానీ
ఈ సుదీర్ఘ ప్రయాణం లో..

ఇది నీ వల్లే అని చెప్పటానికి
వెయ్యు దాఖలాలు ఉన్నాయి
ఇందులో నా తప్పు ఏమీ లేదు
అని చెప్పటానికి
బోల్డు  అవకాశాలు ఉన్నాయి

ఇలా చాలా సరదాగా ఉండేది
దేన్నీ పట్టుబట్టి అర్థం చేసుకోవాల్సిన
అవసరం ఏర్పడేది కాదు
అలాగని అర్థం కాకుండా మిగిలింది
ఏవిటో తెలిసేది కాదు

కాని ఇప్పుడు ఈ తెరిపి లో
ఆలోచిస్తే
ఒక మాయ ఎదో జరిగిపోయింది
అప్పటిదాకా తలకిందులుగా
ఉన్న దాన్నేదో
సరి చేసినట్టున్నావు
అందుకేనేమో
వెనక్కి ముందుకు వెళుతున్నట్టు
పిచ్చి భావనా ..  నువ్వు ..

26, మే 2020, మంగళవారం

నక్సల్బరీ 

నన్ను ఎక్కడో  కోల్పోయునట్లు 

నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను 

నీ హృదయం విశాలం 

నన్ను ఉద్యమ నెలబాలుడ్ని  చేసి 

నీ చిటికన వేలుతో నడిపించావు 

నడిచినంతమేరా నీ వెలుగులే 
 
నువ్వలా వెనుదిరుగకుండా సాగిపోతూనే వున్నావు 

నేను ఒక ఏడురంగుల వాన విల్లును   చూస్తూ అలా  నిలబడిపోయాను 

ఆ తర్వాత  నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు .

అదే స్ఫూర్తి 

ఈ రోజు నీ మీద దిగులుతో కూడా నడుస్తున్నాను  

అయితే నీలా    చందమామయ్య  కబుర్లు చెబుతూ 

గోర్కీ అమ్మలా ప్రయాణ బడలిక పోగెట్టే వారేరి ?

ఎప్పటికీ  ఇలానే  నీ వెంటే నడవాలనే 

ఒక ఎడతెగని కల ఒకటి నావెనక వెనకే .... 





 

నnnekkado కోల్పోయునట్లు 

నీ గుండెల్లో ముఖం దాచుకున్నాను 

నీ హృదయం విశాలం 

నన్ను పసిపాప ను చేసి 

నీ చిటికన వేలుతో నడిపించావు 

నడిచినంతమేరా నీ వెలుగులే 
 
నువ్వలా వెనుదిరుగకుండా సాగి పోతూ నే వున్నావు 

నేను ఒక ఇంద్రధనస్సు చూస్తూ అలా  నిలబడిపోయాను 

ఆ తర్వాత  నడక తప్ప నాకు ఇంకేమి గుర్తు లేదు .

 అదే స్ఫూర్తి 

ఈ రోజు నీ మీద దిగులుతో కూడా నడుస్తున్నాను  

అయితే నీలా    చందమామ కబుర్లు చెబుతూ 

అమ్మలా ప్రయాణ బడలిక పోగెట్టే వారేరి ?

ఎప్పటికీ  బుద్దు లానే  నీ వెంటే నడవాలనే 

ఒక ఎడతెగని కల ఒకటి నావెనక వెనకే .... 






జనాంతర్గామి .. మంద మర్రి

 

జనాంతర్గామి .. మంద మర్రి 

  మందమర్రి ..

ఊడలు దిగిన జ్ఞాపకాల  ఆశల  ఊయల

ఆశయాల పాలపందిరి 

నీడ నిచ్చే   వేపచెట్టు ,పాలచెట్టు ..

నడుము చుట్టూ చేయు వేసే   పాలవాగు

 

చల్  జంబల్మర్రి ..  వెయ్యు కాళ్ళ జెర్రి  

మందమర్రి ..

 రగులుకొనే   రాక్షస బొగ్గును వెలికి తీస్తూ 

 భూగర్భంలోనూ  సంచరించే  జనాంతర్గామి 

పోరాట వారసత్వాన్ని భద్రంగా ఎత్తిపట్టే  జమ్మిచెట్టు ..

 తల్లికడుపులోకి వెళ్లి మళ్ళీ తిరిగొచ్చినట్లు ..

 మసి మొహాల్లో    మెరిసే   తెల్లని  నవ్వులు ..

చల్  జంబల్మర్రి ..  వెయ్యు కాళ్ళ జెర్రి

మందమర్రి  .. 


 " దొరా బాంచెన్"... ఊర్లల్ల వెట్టి బతుకులు 

 "బాయి దొరా  బాంచెన్".. బండ కింద సచ్చి  బతుకుడు 

" ఎందాక చూద్దామురో ,ఎల్లన్నారో,మల్లానారో 

ఇక ఎగబడదామురో .. 

  ఊరు మనదిరా ,ఈ వాడ మనదిరా 

దొర ఏందిరో ,వాని పీకుడు ఏందిరో ! " 

 పోరాట తూటాలై న పల్లె పాటల చరణాలు 

చల్  జంబల్మర్రి ..  వెయ్యు కాళ్ళ జెర్రి

మందమర్రి .. 

చీకటి మూసిన జీవితాల్లో కొత్త వెలుగులు...

 మొగ్గ తొడిగిన కొత్త విలువలు

కులం లేదు, మతం లేదు 

కాలేరు మీదికి బతకొచ్చిన కష్టజీవులం  మేము.. 

గని కార్మికులం మేము 

చల్  జంబల్మర్రి ..  వెయ్యు కాళ్ళ జెర్రి. 


(  కాజీపేట -డిల్లి  రైల్  మార్గంలో, గోదావరి నదీ ప్రవాహం  దాటిన తర్వాత మంచిర్యాల్  అనే ఊరు. దాని కి పక్కనే మందమర్రి .చిన్న ఊరే కావచ్చు , కాని కడుపు లో ఎన్నిదాచుకుందో ! రాక్షసబొగ్గే కాదు రగులుకున్న విప్లవాల ఊసులు ఎన్నో  ఉన్నాయ్!)



"పాలా గు"  అని నా బ్లాగు. అదొక మాటల  ప్రవాహం.నన్ను  మీలో ఒక్కడిని చేసే గవాక్షం .పాలవాగు; ఎంత అందమైన పేరు కదా !నను పెంచిన ఊరు పొలిమేరల్లో మెలికలు  తిరుగుతూ పారే నీటి అందమే ఇది.దీన్ని దాటితేనే అడవిలోకి వెళ్ళగలిగే  వాళ్ళం .జానపద కథలే తోడుగా గడిచిన జీవితంలో వాగులు , వంకలు, వనాలే అద్బుతాలు . ఎంత గమ్మత్తుగా తోచేదో !ఇప్పుడు తలచు కుంటేనే   నవ్వొస్తుంది .ఒకవైపు దయ్యాలు అంటే అమిత భయ్యం.మరోవైపు అడవిలో అందమైన వనకన్యలువుంటారని ఎన్ని రొమాంటిక్ ఊహలో !అమాయకత్వం  లో ఉండే అపరిమితమైన ఆనందం  అదేనేమో!

నా కలల నడకల సవ్వడి పాలవాగు.శ్రీ మహా విష్ణువు శయనించే పాల సముద్రం కాదిది.పాల చెట్టుమీలో ఎంతమందికి తెలుసో? పాలపిట్ట,పాలచెట్టు తెలంగాణ గట్టు మీది చందమామలు . 

పాలపిట్ట చాల శుభప్రదమైన పక్షి అని అంటారు..దసరా పండుగ రోజు దాన్ని చూడడం; అదో వేడుక .

ఇక పాలచెట్టు, ప్రసస్తమైనదే !పెళ్లిపందిరి ఫై పాలచెట్టు రెమ్మలే వేస్తారు .పాల పొరక నీడలో పెళ్లి జరుగుతుంది .అలాంటి పాలచెట్లకు ప్రాణం పోసిన జలదేవత ఈ  పాలవాగు.

 

     


కవితే

కవితే 

ఈ చీకటి గదిలోనే  లోకం
మూసిన తలుపుల్లోనే   తన్లాట
మనసు కిటికీ తెరిచి
అనoతమైన ఆకాశాన్ని
ఎప్పుడు చూసినా  అబ్బురమే
ఆ అద్బుతాలను తాకి చూడాలనే
మనుసు పడే ఆరాటాన్ని  ఆపుకోలేని
పరుగు లో జీవితం ఎన్ని వర్ణాల్ని కలబెట్టిందో !
కలత చెందినా కవితే
కల చెదిరినా కవితే 
బ్రతుకు పండినా  కవిత్వమే 

25, మే 2020, సోమవారం

ఆకలి

ఆకలి 
గంజి మెతుకు పెదవుల్ని విడదీసుకుంటూ

తన సారాన్ని ఒంపుకుని కడుపు నిండా మాట్లాడింది 

దూరం

దూరం

ఈ దూరం
నీకైనా ,నాకైనా ఒకటేలే
నేను నీలో వుంటాను
నువ్వు నాలో ..
మనసు గది నీ చుట్టే అల్లుకొని ఉంటుంది
నీ భుజం మీద చెయ్యి వేసి
నీ మనుసులోన ముఖం దాచి
నిన్నే చూస్తాను


ధైర్యం

ధైర్యం 

నువ్వు వెళ్ళిపోయినందుకు
పితూరీ ఏమీ లేదు
అలాగే  నిలబడి పోవటానికి
నా నీడ కైనా కాస్త ధైర్యం
చెప్పి ఉంటే బాగుండేది



8, మే 2020, శుక్రవారం

భయ్యం

భయ్యం 

అద్భుతాల జడి   బాల్యం
అబ్బురపడటం ఆలస్యం

భయాలు పీడకలల్లోకి లాక్కెళ్ళేవి

భయం జీవితపు క్రీడ అయిపోయింది

అందరు నన్ను ఆడుకుంటున్నట్టే తోచేది

అలవాటైన ఆటగా భయం
నాలో చోటు చేసుకుంది

అమ్మా దయ్యం..  అంటూ
అమ్మనే ఆట పట్టించేవాడిని

భయాన్ని జయించటానికి
కళ్ళు మూసుకొని ఎందరి దేవుళ్ళని ఆశ్రయించానో
ఎందరి జాతీయ  నాయకుల్ని నిలబెట్టుకున్నానో
కాని ఫలితం శూన్యం
ఆ సంఘర్షణ  లో
నిస్పృహ లాంటి నా కోట లోకి
పాట ఒకటి వచ్చింది

కొంగు నడుము కు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మా.. 

అమ్మ దుః ఖానికి
అక్క కష్టానికి
పోరాటం ఒక్కటే మార్గమని తోచింది

దొర ఏందిరో వాడి పీకుడేందిరో .. 
ఊరు మనదిరా వాడ మనదిరా..

పాటలు ..
నాకు కర్ణ కుండలాలు అయినాయి

కత్తుల  కోలాటమే
కలల సాకారానికి
కొండంత ధైర్యాన్ని ఇచ్చింది

ఈ లోగా  పగబట్టినట్టుగా ప్రపంచీకరణ
దేశాల్ని ప్రజల్ని వలస కూలీలను  చేసింది

ప్రతి ప్రకృతి వనరు
ఒక యుద్ధక్షేత్రమయింది

ప్రతి మనిషి బ్రతుకు
కరోనా భయంతో లాక్ డౌన్  అయింది

భయ్యం ఇప్పుడు  అంతర్జాతీయ క్రీడ ..





3, మే 2020, ఆదివారం

నగరం మీద వలసకూలీ ప్రేమగీతం

నగరం మీద వలసకూలీ ప్రేమగీతం
("అమృతం కురిసిన రాత్రి" తిలక్ కి క్షమాపణలతో)

కాలే కడుపే కాదు
తరతరాల మోహం నీపైన

అందుకే నా కండలు
నా గుండెలు నీ పాదాల చెంత పెట్టాను

నువ్వు ఆడుకొనే రైలు బొమ్మలు
చక్రాల కారు బొమ్మలు
మా ఊరి పక్క నుండే వెళ్ళేవి
నువ్వు ఎగరేసే రెక్కల విమానాలు
మా చెరువు ను దాటుకుంటూ వెళ్ళేవి

నీ వింతలు గురుంచి ఎన్ని కథలో
అందుకే మరి ఒక్కసారైనా
నిన్ను దగ్గరగా..
దూరం  నుంచి ఐనా చూసి
తరించాలని అనిపించేది
కానీ నీ మాయా లోకం లోకి  వచ్చాక
తిరిగి  వెళ్లడం నా వల్ల  కాలేదు
ఇక నీ సేవ కే  ఈ జన్మ అనుకొంటూ
అలా  నిలబడిపోయాను

ఇప్పుడు ఈ కరోనా భయం వచ్చి పడింది
ఎన్నో విద్యలొచ్చిన నువ్వే అలా వణికి పోతే
నీ వెనక లోకాలు గెలవాలనుకునే
ఫాగల్ గాన్ని,..  నేనేం అయిపోవాలా
నీ నవ్వు ముఖం చూసుకుంటూ
కడుపు నింపుకునే నేను
కరోనా చావుకళ  తో బెదిరిపోయిన
నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నాను

అందుకే నిన్ను విడిచి వెళుతున్నా

ప్రియా..
నిన్నిలా పిలిచి కూడా
ఎన్ని రోజులయ్యిందో !
అప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుంది
అందరం చచ్చిపోతాం అంటే
లాస్ట్ సప్పర్ లా నువ్వు ఇచ్చిన విందు లో
చీకట్లో ప్రేమగా
ప్రియా..  అని పిలిచి నట్టు గుర్తు

మళ్లీ  ఇన్నాళ్ళకి నీ మీద
అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొస్తుంది
కానీ ఏమి చేయను
నీ  ప్రేమ బలం తో నేను
ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాను

నిన్ను కాపాడుకోవటానికే
ఇప్పుడు ఇలా నిన్ను  విడిచి వెళుతున్నా
నా తల్లి పల్లె ను  కలిసి తిరిగొస్తా

ఏ కష్టానికైనా నా తల్లి దగ్గర
అద్భుతమైన తాయెత్తులు  వుండేవి
ఒక్క ఆకలికి తప్ప

నన్ను అలాగే నిన్ను చేరేలా  పెంచింది
అందుకేనేమో నీ ప్రేమ మత్తు  లో పడ్డాను

నువ్వూ  ఒక అద్భుతమైన అల్లాఉద్దీన్ దీపానివే  కదా
అద్భుతాల వెంట పడటం
మా పేదరాశి పెద్దమ్మ కథలు కథలు గా నేర్పింది

ఒకసారి నువ్వే చూ పించినట్టు గుర్తు
మున్నాభాయ్ ఎం బి బి ఎస్
తెలుగు లో శంకర్ దాదా ఎం బి బి యెస్

ఎంత హాయిగా నవ్వుకున్నాం అప్పుడు
కానీ దానికి అసలు కాపీ మా అమ్మే తెలుసా!
కడుపులో తలకాయ పెట్టి
నా గుండె లో ఏమి బాధ  దాగి ఉందో  ఇట్టే  చెప్పేది
ఎంత పెద్ద కష్టాన్ని అయినా
చిన్న చిట్కా తో దాని పని పట్టేది

కరోనా ని కూడా
తన కంటిచూపు తోనే  చంపెసేదే!

కానీ కరోనా
కంటికి కనిపించకుండా కదా
నిన్ను భయ పెడుతుంది
అమ్మో !
అది నీ లాగే గడుసరి మరి..














28, ఏప్రిల్ 2020, మంగళవారం

వలస కూలీ

వలస కూలీ
పెద్దల మాట అంటే అంత అలుసా ?

బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు .. అంటే
భరోసా లేదా?

ఆ ఆకు అలములు ఏవో
నీ ఊర్లోనే తిని చస్తానంటావా !

అలా , ఎలా కుదురుతుంది చెప్పు ?
స్వతంత్ర భారతం లో
చావు కూడా పెళ్లి  లాంటిదే కదా !

ఇప్పుడసలే గరీబ్ కళ్యాణ్  పథకం కూడా అమలు
కరోనా మరీ  కరుణించిన కల్యాణ ఘడియలు ఇవి!

21, ఏప్రిల్ 2020, మంగళవారం

బతుకు పద్దు

బతుకు పద్దు 
బహుశా నిన్నటికే
లెక్క సరిపోయినట్లుంది
ఈ రాత్రి నిద్ర పట్టి చావట్లేదు
కొత్త పుస్తకమేదైనా కొనుక్కోవాలి రేపు
పాత లెక్కల పుస్తకం తప్ప .. 

27, మార్చి 2020, శుక్రవారం

నువ్వు నేను

నువ్వు నేను 

నన్ను మనిషే అంటావు
అయ్యో ఏదైనా కష్టమొస్తే
కానీ నాకే..  ఎప్పుడూ ఒక సందేహం 

పుట్టక లో నీతో సమానం కాదు 

నీ తెలివి లోను ,నీ అభివృద్ధి లోను 
నేను మట్టి బుర్ర నే 

నా చావూ నాదే ..  నా ఖర్మే !

నువ్వు చావు ఊబి లో కూరుకుపోయి కూడా 
నా మీదే  అరుస్తావు 

నేనెప్పుడూ
నీలా మాటలు మార్చే మనిషి ని కాను 

నా మీద అరుస్తూనే ,కరుస్తూనో 
కర్రతో చావ బాదుతోనో 
చివరికి 
కనిపిస్తే కాల్చివేతతోనో  తప్ప 
మనుగడ లేని బక్క పల్చని మూగ మనిషిని  నేను  ! 

నువ్వే ..అవును నువ్వే 
నీలా ..  కరుణ  లేని కరోనా లకి 
ప్రాణం పొసే మనిషివి నువ్వు 

నీ  అనేకానేక అరాచకాల వైరస్ లకు 
బలయ్యే మొదటి మనిషిని  నేనే !