3, మే 2020, ఆదివారం

నగరం మీద వలసకూలీ ప్రేమగీతం

నగరం మీద వలసకూలీ ప్రేమగీతం
("అమృతం కురిసిన రాత్రి" తిలక్ కి క్షమాపణలతో)

కాలే కడుపే కాదు
తరతరాల మోహం నీపైన

అందుకే నా కండలు
నా గుండెలు నీ పాదాల చెంత పెట్టాను

నువ్వు ఆడుకొనే రైలు బొమ్మలు
చక్రాల కారు బొమ్మలు
మా ఊరి పక్క నుండే వెళ్ళేవి
నువ్వు ఎగరేసే రెక్కల విమానాలు
మా చెరువు ను దాటుకుంటూ వెళ్ళేవి

నీ వింతలు గురుంచి ఎన్ని కథలో
అందుకే మరి ఒక్కసారైనా
నిన్ను దగ్గరగా..
దూరం  నుంచి ఐనా చూసి
తరించాలని అనిపించేది
కానీ నీ మాయా లోకం లోకి  వచ్చాక
తిరిగి  వెళ్లడం నా వల్ల  కాలేదు
ఇక నీ సేవ కే  ఈ జన్మ అనుకొంటూ
అలా  నిలబడిపోయాను

ఇప్పుడు ఈ కరోనా భయం వచ్చి పడింది
ఎన్నో విద్యలొచ్చిన నువ్వే అలా వణికి పోతే
నీ వెనక లోకాలు గెలవాలనుకునే
ఫాగల్ గాన్ని,..  నేనేం అయిపోవాలా
నీ నవ్వు ముఖం చూసుకుంటూ
కడుపు నింపుకునే నేను
కరోనా చావుకళ  తో బెదిరిపోయిన
నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నాను

అందుకే నిన్ను విడిచి వెళుతున్నా

ప్రియా..
నిన్నిలా పిలిచి కూడా
ఎన్ని రోజులయ్యిందో !
అప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుంది
అందరం చచ్చిపోతాం అంటే
లాస్ట్ సప్పర్ లా నువ్వు ఇచ్చిన విందు లో
చీకట్లో ప్రేమగా
ప్రియా..  అని పిలిచి నట్టు గుర్తు

మళ్లీ  ఇన్నాళ్ళకి నీ మీద
అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొస్తుంది
కానీ ఏమి చేయను
నీ  ప్రేమ బలం తో నేను
ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తాను

నిన్ను కాపాడుకోవటానికే
ఇప్పుడు ఇలా నిన్ను  విడిచి వెళుతున్నా
నా తల్లి పల్లె ను  కలిసి తిరిగొస్తా

ఏ కష్టానికైనా నా తల్లి దగ్గర
అద్భుతమైన తాయెత్తులు  వుండేవి
ఒక్క ఆకలికి తప్ప

నన్ను అలాగే నిన్ను చేరేలా  పెంచింది
అందుకేనేమో నీ ప్రేమ మత్తు  లో పడ్డాను

నువ్వూ  ఒక అద్భుతమైన అల్లాఉద్దీన్ దీపానివే  కదా
అద్భుతాల వెంట పడటం
మా పేదరాశి పెద్దమ్మ కథలు కథలు గా నేర్పింది

ఒకసారి నువ్వే చూ పించినట్టు గుర్తు
మున్నాభాయ్ ఎం బి బి ఎస్
తెలుగు లో శంకర్ దాదా ఎం బి బి యెస్

ఎంత హాయిగా నవ్వుకున్నాం అప్పుడు
కానీ దానికి అసలు కాపీ మా అమ్మే తెలుసా!
కడుపులో తలకాయ పెట్టి
నా గుండె లో ఏమి బాధ  దాగి ఉందో  ఇట్టే  చెప్పేది
ఎంత పెద్ద కష్టాన్ని అయినా
చిన్న చిట్కా తో దాని పని పట్టేది

కరోనా ని కూడా
తన కంటిచూపు తోనే  చంపెసేదే!

కానీ కరోనా
కంటికి కనిపించకుండా కదా
నిన్ను భయ పెడుతుంది
అమ్మో !
అది నీ లాగే గడుసరి మరి..














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి