5, ఫిబ్రవరి 2023, ఆదివారం

 



తరగని నిక్షేపాలు.. ఆ‘గని’ అన్వేషణ

11394 Tons Of Coal Is In Singareni Says New Study - Sakshi

గోదావరి లోయ పరిధిలో 11,395 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నల్ల బంగారం

ఆరు జిల్లాల్లో మరో వందేళ్లు తవ్వినా తరగని నిక్షేపాలు

సింగరేణి ఎక్స్‌ప్లొరేషన్‌ వింగ్‌ తాజా నివేదిక

మంచిర్యాల, కొత్తగూడెం భూగర్భంలో అత్యధికంగా బొగ్గు

మరిన్ని ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా బొగ్గు వెలికితీతకు సింగరేణి ఆలోచన

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : ఆగర్భ సిరి భూగర్భంలో దాగెను మరి.. సింగరేణిలో తర‘గని’బొగ్గు సిరి.. మరో వందేళ్లు అయినా నిక్షిప్తమే మరి. ఇంకా మూడు తరాల వరకు తోడినా వీడని బంధమే అది. తెలంగాణకు తలమానికంగా విలసిల్లుతున్న సింగరేణిలో బొగ్గు నిక్షేపాలకు ఢోకా లేదు. 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌)లో ‘ఎక్స్‌ప్లొరేషన్‌’విభాగం తాజా నివేదిక ప్రకారం 11,394.76 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు తేలింది. సింగరేణి విస్తరించి ఉన్న 6 జిల్లాల్లో 29 భూగర్భ గనులు, 19 ఓపెన్‌కాస్ట్‌ గనుల ద్వారా ఏటా 64 మిలియన్‌ టన్నుల మేరకే బొగ్గును వెలికితీస్తున్నారు.

ఈ లెక్కన 2019–20 వరకు 1,501 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గును భూగర్భం నుంచి తీసింది. మరో 150 సంవత్సరాలు నిరంతరాయంగా తవ్వకాలు జరిపినా గోదావరి లోయ పరిధిలో బొగ్గు తరగ దని తేలింది. ఇక్కడి బొగ్గు గనులకు తోడు ఒడిశా లోని నైనా బ్లాక్, ఇతర దేశాల్లో మైనింగ్‌ కాంట్రాక్టు లను సొంతం చేసుకునే పనిలో ఉంది సింగరేణి సంస్థ. అదే సమయంలో జీపీఎస్, ఇతర అధునా తన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 25 ప్రత్యేక వాహనాలతో గోదావరి కోల్‌ఫీల్డ్‌ పరిధిలో నల్ల బం గారం కోసం అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. 

300 మీటర్ల లోపే వేల టన్నులు
గోదావరి– ప్రాణహిత పరిధిలోని గోదావరి వ్యాలీ కోల్‌ఫీల్డ్‌ బొగ్గు నిక్షేపాలకు పుట్టినిల్లు. కొమరంభీం జిల్లా మొదలుకొని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని భూగర్భంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి. భూగర్భంలో 300 మీటర్ల లోతులోనే 6,760.90 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు సింగరేణి గుర్తించింది. 300 మీటర్ల నుంచి 600 మీటర్ల లోతులో 4,308.54 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉండగా, 600 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో మరో 325.76 మి. మెట్రిక్‌ టన్నుల బొగ్గును కనుగొన్నారు. నిజానికి బయోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అంచనా ప్రకారం గోదావరి వ్యాలీ కోల్‌ఫీల్డ్‌లో 1,200 మీటర్ల లోతు వరకు 22,207 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అయితే 300 మీటర్ల లోపునే నాణ్యమైన బొగ్గు లభిస్తుండడంతో 50 వేల మంది కార్మిక శక్తితో సింగరేణి బొగ్గును రిస్క్‌ లేకుండా బొగ్గు తోడుతోంది. ఓపెన్‌కాస్ట్‌ విధానం ద్వారా కార్మికశక్తి కన్నా యాంత్రిక శక్తిని నమ్ముకొని తవ్వకాలు జరుపుతోంది. 

సీ గ్రేడ్‌ నుంచి ఎఫ్‌ గ్రేడ్‌ వరకు నాణ్యమైన బొగ్గు
బొగ్గు మండే స్వభావాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ధారిస్తారు. గ్రాస్‌ క్యాలరిక్‌ వాల్యూ(జీసీవీ) విధానం ద్వారా గ్రేడ్‌లవారీగా బొగ్గు రకాలను విభజించారు. ఈ లెక్కన జీ–1 నుంచి జీ –17 వరకు వివిధ రకాల నాణ్యతలో బొగ్గు లభిస్తుంది. గ్రేడ్‌ను బట్టి మార్కెట్‌లో టన్ను విలువ ఆధారపడి ఉంటుంది. సింగరేణిలో నాణ్యమైన ఏ గ్రేడ్‌ (జీసీవి విధానంలో జీ 1 నుంచి జీ 3 వరకు) బొగ్గు కేవలం 109.27 మి.మె.టన్నులు(1 శాతం) మాత్రమే ఉన్నట్లు తాజా నివేదికలో తేలింది. బీ గ్రేడ్‌ (జీ4, జీ5) బొగ్గు 486.51 మి. మెట్రిక్‌ టన్నులు (4 శాతం) ఉంది. గోదావరి వ్యాలీలో అత్యధికంగా సీ, డీ, ఈ, ఎఫ్‌ గ్రేడ్‌ల బొగ్గు లభిస్తుంది. 

అత్యధికంగా మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో... 
గోదావరి– ప్రాణహిత నదుల మధ్య ప్రాంతంలో ఆసిఫాబాద్‌ నుంచి బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూరు, ఇందారంలలో ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం ఎక్కడ తవ్వినా బొగ్గు నిక్షేపాలే కనిపించాయి. ఈ లెక్కన మంచిర్యాల జిల్లాలోనే 3,557.67 మిలియన్‌ మె.టన్నులు, ఆసిఫాబాద్‌ పరిధిలో 630.34 మి.మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలను గుర్తించారు. మంచిర్యాల తర్వాత రెండో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెంలో 29,58.54 మి.మెట్రిక్‌ టన్నుల నిల్వలను గుర్తించారు. 

మరిన్ని ఓపెన్‌కాస్ట్‌లు 
సింగరేణిలో బొగ్గును వెలికితీసేందుకు ఇప్పటికే 19 ఓపెన్‌ కాస్ట్‌లపై ఆధారపడ్డ సింగరేణి సంస్థ వచ్చే ఐదారేళ్లలో మరో 6 ఓపెన్‌కాస్ట్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే మందమర్రిలో అండర్‌గ్రౌండ్‌ మైన్ల స్థానంలో ఓపెన్‌కాస్ట్‌లను తీసుకొచ్చిన సంస్థ ఇందారంలో కొత్తగా రెండు ఓపెన్‌కాస్ట్‌లను తవ్వుతోంది. గోదావరిఖని, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌లలో కూడా ఓపెన్‌కాస్ట్‌లను కొత్తగా నిర్మించే ఆలోచనలో ఉంది. డోర్లే ఓసీపీతోపాటు జీడీకే 7 ఎల్‌ఈపీ ఓసీ, కొత్తగూడెంలో జేవీఆర్‌ఓసీ–2, మందమర్రిలో కేకేఓసీలలో పనులు మొదలయ్యాయి కూడా. ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా అధిక మొత్తంలో బొగ్గును తవ్వేందుకు అధునాతన మిషనరీని కూడా తెప్పిస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి