సీతమ్మ కొత్త కథ
******************
ప్రేమభావానికి నమూనా ఎవరు ?
రోమియో జూలియట్
లైలా మజ్ను , హీరా రాంజా ..
అంతేనా .. ?
పార్వతి దేవదాసు ని కలుపుకోవచ్చు కానీ
తాగుబోతు ప్రేమ ఈ ఫ్రేమ్ లో ఫిట్టు కాదు
చదువు మకిలి అంటని
మట్టిమనుషులకి మాత్రం
సీతారాములే ప్రమాణం
ముసలి తండ్రి మాట కూడా జవ దాట లేదని
సీతమ్మ తల్లి మురిసి ముక్కలై పోయింది
ఎన్ని కష్టాలు ఎదురైనా
తన మాటకి ఎంతో కొంతో గౌరవం దక్కుతుందని కాబోలు
రాముడి వెంట అడవు ల్లోకి
తలవంచుకుని వెళ్ళిపోయింది
విల్లంబులు పట్టుకుని గిరిజనుడిలా రాముడు వేటకు వెళ్ళేవాడు
సీత మంచి ఇల్లాలు లా వంట ఏర్పాట్లలో ఉండేది
ఆలుమగల శ్రమ విభజన లో
ప్రేమ లేదని చెప్పలేము
సీత కోసం రాముడు
ప్రాణం పెట్టేవాడు
బంగారు లేడి పిల్ల కావాలని అడిగితే
వెంటాడి వేటాడి మరీ
దాని ప్రాణం తీశాడు
అయోధ్య లోనే రాముడు రాజు
అడవిలో ఫక్కా సీతమొగుడు
ఇద్దరూ ఒకేరకం నారచీరలే
కట్టుకునేవారట ..!
అడవిలో ఒక జంట విహారం
ఎంత ప్రేమను పండిస్తుందో !
ముసిలి ముని వాల్మీకి
సరిగ్గా రాయలేదు కానీ ..
పోటీ పడి గెల్చుకున్న పెళ్ళాన్ని
ఎవడో ఎత్తుకెళ్తే
ఏ మగాడు మాత్రం ఊరుకుంటాడు
అందులో రాముడు మరీ మంచి మొగుడు
రాముడి ప్రేమ మీద కూడా
నాకు అనుమానం లేదు
ముగ్గురి భార్యల తండ్రి కి పెద్ద కొడుకు రాముడు
కోరి వచ్చిన శూర్పణఖను దూరం పెట్టాడు
రావణుడిని చంపి సీతను
తెచ్చుకునేవరకు కథ బాగానే నడిచింది
అడవి రాముడు రాజ్యానికి మొగుడయ్యాడు
అనుమానం జబ్బు కి బలయ్యాడు
ప్రజల మాట కోసమని
ఈసారి సీతనొక్కదాన్నే అడవికి పంపాడు
మాటకోసం నిలబడే వ్యవస్థ ప్రతినిధి రాముడు
మాటంటే పడని వారికి తప్పటం లేదు
ఇప్పుడూ సీతమ్మ కష్టాలు
చివరికి సీతమ్మని అగ్ని పునీత కమ్మని
రాముడు ఆదేశించాడు
అవని నా తల్లి అంటూ
సీత మళ్ళీ అడవి బాటే
పట్టి ఉంటుంది ..
ఈ సారి ఒక నూతన మానవి లా
బ్రతకటానికి ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి