శ్రీలంక ఆర్థిక సంక్షోభం
శ్రీలంక ఆర్థిక సంక్షోభం (2019 నుండి -) | |||
---|---|---|---|
తేదీ | 2019 ఏప్రిల్ — జరుగుతోంది (3 సంవత్సరాలు, 8 నెలలు, 4 వారాలు, 2 రోజులు) | ||
స్థలం | శ్రీలంక | ||
కారణాలు |
| ||
స్థితి | జరుగుతోంది | ||
జననష్టం | |||
|
శ్రీలంకలో 2019 లో [8] ప్రారంభమై 2022 లోనూ కొనసాగుతున్న సంక్షోభమే శ్రీలంక ఆర్థిక సంక్షోభం. 1948 లో [8] స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఆ దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇది. దీనివల్ల మున్నెన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు దాదాపుగా ఖాళీ అవడం, వైద్య సామాగ్రి కొరత, ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదల వంటి పర్యవసానాలు తలెత్తాయి. [9] విపరీతంగా నోట్ల ముద్రణ, సేంద్రియ లేదా జీవ వ్యవసాయానికి మారడానికి తీసుకొచ్చిన దేశవ్యాప్త విధానం, 2019లో జరిగిన ఈస్టర్ బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి బహుళ కారణాల వల్ల ఈ సంక్షోభం ప్రారంభమైంది. ఈ ఆర్థిక కష్టాలు 2022 లో ప్రజల నిరసనలకు దారితీసాయి.
2022 మార్చి నాటికి దేశంలో మిగిలి ఉన్న 1.9 బిలియను అమెరికా డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2022 లో దేశం చెల్లించాల్సిన 4 బిలియన్ల డాలర్ల విదేశీ రుణాల చెల్లింపులకు సరిపోవు. దీంతో శ్రీలంకను సావరిన్ ఎగవేతదారుగా గుర్తించారు. [10] 2022 జూలైలో 1 బిలియను డాలర్ల అంతర్జాతీయ సావరిన్ బాండ్ ను కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2022 లో శ్రీలంక మొత్తం 8.6 బిలియను డాలర్ల ఋణ చెల్లింపులు చెయ్యాల్సి ఉందని బ్లూమ్‌బెర్గ్ చెప్పింది. ఇందులో స్థానిక రుణాలు, విదేశీ రుణాలు రెండూ కలిసి ఉన్నాయి. [11] [12] తాము అప్పులను తీర్చలేమని శ్రీలంక ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో ప్రకటించింది. దీంతో, 1948 లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత శ్రీలంక చరిత్రలోనే మొట్టమొదటి సారి సార్వభౌమ ఎగవేతదారుగా, 21వ శతాబ్దంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సార్వభౌమ ఎగవేతదారుగా మారిన మొదటి దేశంగా నిలిచింది. [13] [14]
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిత్యావసరాలకు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందనీ 2022 జూన్‌లో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పార్లమెంటులో ప్రకటించాడు. [15]
నేపథ్యం[మార్చు]
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక మాజీ డిప్యూటీ గవర్నర్ WA విజేవర్దన ప్రకారం, 2015 నాటికే దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది [17] 2015లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఇది తెలుసు. దేశం లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్, అనేక ప్రమాదాల గురించి హెచ్చరించింది. [17] 2015లో అప్పటి ప్రధాని రణిల్ విక్రమసింఘే ఈ పరిస్థితిని పరిష్కరించడానికి బలమైన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టగా, సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటులో ఈ విధానానికి ఆమోదం సాధించలేకపోయింది. అది ఆ తరువాతి నెలల్లో మరింత విధాన గందరగోళానికి దారితీసింది. [17] "రాజ్యాంగ సంస్కరణలు" వంటి ఇతర ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో మునిగిపోయిన ప్రభుత్వం, ఆర్థిక హెచ్చరికలు, ఉద్భవిస్తున్న ప్రమాదాలను తగినంతగా పట్టించుకోలేదు. [17] రవి కరుణానాయక్ నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ అవలంబించిన కొన్ని పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. [17] ఉచితాల మితిమీరిన పంపిణీ వంటి ఎన్నికల సంబంధ ఆర్థిక నిర్ణయాలకు ప్రాధాన్యత నిచ్చారు. [17] ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ వారి 2014 ఆర్థిక స్థితి నివేదికలో హాట్ మనీ, ఆందోళన కలిగించే రుణాలు తీసుకునే పద్ధతులు, తాత్కాలిక, ఉపరితల పరిష్కారాలు, ఆతిథ్య రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాల గుత్తాధిపత్యాలను హైలైట్ చేసింది. [18] 2018 లో మరింత రాజకీయ గందరగోళం ఏర్పడి ఆర్థిక దృక్పథాన్ని మరింత దిగజార్చింది. [19] [20] ఆ సమయానికి ప్రభుత్వం IMF మద్దతు కార్యక్రమం కింద ఆర్థిక ద్రవ్య ఏకీకరణకు అనేక సంస్కరణలను చేపట్టి, ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా నియంత్రించింది. ఈ సంస్కరణల్లో ఆటోమేటిక్ ఇంధన ధరల నిర్థారణ సూత్రం కూడా ఉంది. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల (SOEలు) ద్వారా వచ్చే ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గాయి. విలువ ఆధారిత పన్ను (VAT) రేటును 11 శాతం నుండి 15 శాతానికి పెంచింది. మినహాయింపులను తొలగించడం ద్వారా VAT బేస్‌ను విస్తరించింది. [21] అయితే 2019 ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం అనేక సంస్కరణలను వెనక్కి తిప్పింది. [22] [23]
ట్రెజరీ సెక్రటరీని గాని, మరే ఇతర ప్రభుత్వ సభ్యుడిని గానీ మానిటరీ బోర్డులో సభ్యులు కాకుండా నిషేధించి సెంట్రల్ బ్యాంక్‌ను రాజకీయ ప్రభావం నుండి బయట వేయడానికి 2019 సెంట్రల్ బ్యాంక్ బిల్లును కూడా గత ప్రభుత్వం రూపొందించింది. "ప్రభుత్వం జారీ చేసిన సెక్యూరిటీలను, ప్రభుత్వ యాజమాన్యంలోని ఏదైనా సంస్థ లేదా ప్రైమరీ మార్కెట్‌లోని ఏదైనా ఇతర పబ్లిక్ ఎంటిటీ ద్వారా సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు చేయదు" అని బిల్లు పేర్కొంటున్నందున నోట్ల ముద్రణను కూడా నిషేధించాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు, పెరిగిన ద్రవ్యోల్బణం, ఆస్తుల బుడగలే ఈ నిషేధానికి కారణాలుగా అప్పటి సెంట్రల్ బ్యాంక్ గవర్నరు, డాక్టర్ ఇంద్రజిత్ కుమారస్వామి చెప్పాడు. శ్రీలంక పొదుజన పెరమున పార్టీ, సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రతను వ్యతిరేకించింది. వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బిల్లును పక్కన పెట్టేసింది. [24]
చాలా మంది నిపుణులు లెబనాన్ ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చారు. శ్రీలంక కూడా దాని సార్వభౌమ బాధ్యలను ఎగవేసే మార్గంలో ఉందని హెచ్చరించారు. రెండు దేశాలకూ ఒకే విధమైన సమస్యలున్నాయి. అంతర్యుద్ధాల ముగింపు తర్వాత వరుసగా వచ్చిన నిలకడలేని ప్రభుత్వాలు, అప్పులను పోగుచేయడంతో లోతైన ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. [25]
కారణాలు[మార్చు]
పన్నుల కోతలు, నోట్ల ముద్రణ[మార్చు]
ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సే నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పెద్ద మొత్తంలో పన్నుల్లో కోత పెట్టింది. ఇది ప్రభుత్వ రాబడి పైన ఆర్థిక విధానాల పైనా ప్రభావం చూపింది. బడ్జెట్ లోటులు పెరిగాయి. [26] [27] ఆదాయం పన్ను మినహాయింపు పెంచడం (దీని ఫలితంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య 33.5% తగ్గిపోయింది), VATని 8%కి తగ్గించడం, కార్పొరేట్ పన్నును 28% నుండి 24%కి తగ్గించడం, సంపాదిస్తూ చెల్లించు అనే పన్నును రద్దు చెయ్యడం, 2% “దేశం-నిర్మాణ పన్ను”ను (ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడేది) రద్దు చెయ్యడం వంటివి ఈ పన్ను కోతల్లో ఉన్నాయి. పన్ను రాబడిలో భారీ నష్టం కారణంగా రేటింగ్ ఏజెన్సీలు సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించాయి. దాంతో కొత్త రుణాలు తీసుకోవడం మరింత కష్టమైంది. అధ్యక్షుడు రాజపక్సేకు ఈ ఆదాయ నష్టం గురించి తెలుసుననీ, అయితే దానిని అతను "పెట్టుబడి"గా పరిగణించాడనీ, మరో 5 సంవత్సరాల వరకు పన్నులు పెంచే ఆలోచన అతనికి లేదనీ 2021లో PB జయసుందర చెప్పాడు. [28] [29] [30] ప్రభుత్వ వ్యయం కోసం డబ్బు లేనందున, రికార్డు స్థాయిలో డబ్బును ముద్రించడం ప్రారంభించింది. డబ్బును ముద్రించడం ఆపివేయాలని, దానికి బదులు వడ్డీ రేట్లు పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడం, పన్నులను పెంచడం చెయ్యాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇచ్చిన సలహాను సెంట్రల్ బ్యాంక్ విస్మరించింది. [31] డబ్బు ముద్రణను కొనసాగించడం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని IMF హెచ్చరించింది. [31] పన్ను తగ్గింపులను మాజీ ఆర్థిక మంత్రి మంగళ సమరవీర కూడా వ్యతిరేకించాడు. ఇప్పటికే చాలా దేశాలతో పోలిస్తే శ్రీలంకలో చాలా తక్కువ పన్ను ఉన్నందున, ఉన్న అధిక రుణ భారానికి పన్ను తగ్గింపులు కూడా తోడైతే ప్రమాదకరమని అతను అన్నాడు. ఈ ప్రతిపాదనలను ఇలాగే అమలు చేస్తే దేశం మొత్తం దివాలా తీయడమే కాకుండా దేశం మొత్తం మరో వెనిజులా లేదా మరో గ్రీస్‌గా మారుతుందని సమరవీర జోస్యం చెప్పాడు. [32]
2022 ఏప్రిల్ 6 న ఒక్క రోజునే శ్రీలంక సెంట్రల్ బ్యాంకు 119.08 బిలియన్ రూపాయలను ముద్రించిందని ఆరోపింణలు వచ్చాయి. 2022 సంవత్సరంలో ఒక రోజులో ముద్రించిన అత్యధిక మొత్తం రికార్డు ఇది. [33] 2022 సంవత్సరంలో ఆర్థిక మార్కెట్‌ల లోకి ప్రవహించిన మొత్తం డబ్బు రూ. 432.76 బిలియన్లు. [33]
విదేశీ రుణాలు[మార్చు]
శ్రీలంక విదేశీ రుణం గణనీయంగా పెరిగింది. 2005లో USD 11.3 బిలియన్లు ఉన్న విదేశీ రుణం 2020 నాటికి [34] USD 56.3 బిలియన్లకు పెరిగింది. విదేశీ రుణం 2019లో GDPలో 42% ఉండగా, [35] [34] 2021 లో అది GDPలో 119%కి పెరిగింది. 2022 చివరి నాటికి, దేశం US$4 బిలియన్లు రుణ చెల్లింపులు చెయ్యాల్సి ఉంది. అయితే 2022 ఏప్రిల్ నాటికి విదేశీ మారక నిల్వలు US$2.3 బిలియన్లకు పడిపోయాయి. [36]
2020లో, S&P గ్లోబల్ రేటింగ్స్, శ్రీలంకలో ఉన్న నిధుల వనరులు, దాని రుణ సేవల అవసరాలకు సరిపోయేలా కనిపించడం లేదని చెప్పింది. 2021లో రుణ చెల్లింపులు $4.0 బిలియన్ల పైచిలుకు ఉంటుందని అది అంచనా వేసింది. [37] బెల్వెథర్ ఏజెన్సీ, "అప్పును తిరిగి చెల్లించడంలో శ్రీలంక యొక్క 'బడ్జెట్ సమస్యను' పరిష్కరించాలంటే, ట్రెజరీస్ వేలం విజయవంతం కావాలి. అది పూర్తయితే విదేశీ మారకపు 'బదిలీ సమస్య' ఆటోమేటిక్‌గా పరిష్కారమవుతుంది. కానీ, ట్రెజరీ బిల్లుల వేలం విఫలమవడంతో విపరీతంగా డబ్బును ముద్రించడంతో దేశం మరింతగా అప్పుల్లోకి జారిపోతోంది." అని చెప్పింది. [38] రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, శ్రీలంకకు విశ్వసనీయమైన ఆర్థిక ప్రణాళిక, ద్రవ్య విధానం అవసరమనీ, రుణాన్ని తిరిగి చెల్లించడానికి పన్నులు, వడ్డీ రేట్లు పెంచడం, దిగుమతులను పెంచడం వల్ల ఖజానాకు పన్నుల ద్వారా ఆదాయం రావడం తిరిగి మొదలౌతుందని బెల్వెథర్ చెప్పింది. విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి రేట్లు పెంచడం, దేశీయ క్రెడిట్‌ను తగ్గించడం ద్వారా డాలర్లను సమకూర్చుకోవడం సాధ్యమే అయినప్పటికీ, దీర్ఘకాలం పాటు అలా చేయడం ఆచరణాత్మకం కాదు. రుణ చెల్లింపుల తర్వాత విదేశీ నిల్వలు పెరగడాన్ని పెట్టుబడిదారులు గమనిస్తే, వారిలో తిరిగి విశ్వాసం కలగవచ్చు కానీ ఇది చాలా కష్టమైన వ్యవహారం, ప్రస్తుత భావజాలం ప్రకారం అది పని చేయవచ్చు పని చేయకపోనూవచ్చు. [39]
జాతీయ కరెన్సీ మారకం రేటు పడిపోవడం, అధిక ఆహార ధరల ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడం, కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా దేశ పర్యాటక ఆదాయం తగ్గి పరిస్థితి మరింత దిగజారడంతో 2021 సెప్టెంబరులో ప్రభుత్వం ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించింది. [40] 2022 మార్చి నాటికి విదేశీ నిల్వలు US$1.9 బిలియన్లకు పడిపోయిన కారణంగా శ్రీలంక దివాలా అంచుకు వెళ్లింది, ఇది US$4 బిలియన్ల విదేశీ రుణాన్ని, US$1 బిలియన్ల అంతర్జాతీయ సావరిన్ బాండ్‌నూ తిరిగి చెల్లించడానికి సరిపోదు. [41] జాతీయ వినియోగదారుల ధరల సూచిక ప్రకారం, ఫిబ్రవరి 2022లో జాతీయ ద్రవ్యోల్బణం రేటు 17.5%కి పెరిగింది. [42]
విదేశీ నిల్వలను కాపాడుకోవడానికి అంతర్జాతీయ సావరిన్ బాండ్ల (ISB) చెల్లింపును వాయిదా వేయమని ఆర్థిక విశ్లేషకులు, నిపుణులు సలహాలు ఇచ్చినప్పటికీ, US$500 మిలియన్ల అంతర్జాతీయ సావరిన్ బాండ్లను ప్రభుత్వం తిరిగి చెల్లించింది. [43] [44] 2022 ఏప్రిల్ 12న, శ్రీలంక తన 51 బిలియను డాలర్ల విదేశీ రుణాన్ని చెల్లించలేకపోతున్నట్లు ప్రకటించింది. [45] [46]
అప్పుల ఊబి[మార్చు]
చైనా విదేశాంగ విధానాన్ని విమర్శించే పాశ్చాత్య విమర్శకులు, హంబన్‌తోట అంతర్జాతీయ నౌకాశ్రయం, మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి చైనా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా శ్రీలంకకు అందిన రుణాలు లాభదాయకం కాని తెల్ల ఏనుగులుగా మారాయాని, చైనా అవలంబించే రుణ-ఉచ్చు దౌత్యానికి ఇది ఉదాహరణ అనీ వాదించారు. [47] [48] [49] [50] [51] [49] [52]
2007లో శ్రీలంక ప్రభుత్వం, $361 మిలియన్లతో నౌకాశ్రయాన్ని నిర్మించడానికి చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలైన చైనా హార్బర్ ఇంజినీరింగ్ కంపెనీ , సినోహైడ్రో కార్పొరేషన్ లకు కాంట్రాక్టు ఇచ్చింది. ప్రాజెక్ట్‌లో 85 శాతం నిధులను 6.3 శాతం వార్షిక వడ్డీ రేటుతో చైనా ఎగ్జిమ్ బ్యాంకు సమకూర్చింది. [53] ప్రాజెక్టులో డబ్బు కోల్పోవడం మొదలవడం, [54] శ్రీలంక రుణ-సేవల భారం పెరిగడం జరగడంతో నగదు కోసం శ్రీలంక ప్రభుత్వం, [55] ఈ ప్రాజెక్ట్‌ను చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా మర్చంట్స్ పోర్ట్ సంస్థకు 99 సంవత్సరాల లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. $1.12 బిలియన్ల లీజు మొత్తాన్ని తన చెల్లింపు సమస్యలను పరిష్కరించడానికి శ్రీలంక ఉపయోగించుకుంది. [56] [57] ఈ చర్య, చైనా యొక్క భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులను నిలువరించడానికి ఈ నౌకాశ్రయాన్ని చైనా నౌకాదళ స్థావరం [58] గా ఉపయోగించవచ్చని యునైటెడ్ స్టేట్స్, జపాన్, [59] భారతదేశాలు ఆందోళనలను లేవనెత్తాయి. అయితే అప్పు ఉచ్చు దౌత్య సిద్ధాంతాన్ని విమర్శించేవారు, హంబన్‌తోట పోర్ట్ ప్రాజెక్టు లీజును ప్రతిపాదించినది బీజింగ్ కాదనీ, శ్రీలంక అధ్యక్షుడే ప్రతిపాదించారనీ, దానిని చైనా కంపెనీకి లీజుకు ఇచ్చినప్పటికీ, చైనా నౌకాదళ నౌకలు శ్రీలంకకు చెందిన ఓడరేవును ఉపయోగించడానికి అనుమతి ఇవ్వలేదనీ, అది శ్రీలంక స్వంత నౌకాదళ కమాండ్ కే చెందుతుందనీ చెప్పారు. [60]
మహిందా రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా గణనీయమైన దౌత్య పరపతిని పొందిందని, శ్రీలంకలో తన పాదముద్రను విస్తరించిందని బ్రహ్మ చెల్లానీ పేర్కొన్నాడు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, శ్రీలంక "దివాలా అంచున" ఉంది. కొత్త ప్రభుత్వానికి "చైనాను మళ్లీ ఆలింగనం చేసుకోవడం" తప్ప వేరే మార్గం లేదు. హంబన్‌తోట ఓడరేవుకు స్వల్పకాలిక వాణిజ్య సామర్థ్యం లేకపోయినా, చైనాకు అది దీర్ఘకాలిక విలువతో కూడిన, వ్యూహాత్మకంగా-ముఖ్యమైన సహజ సంపద అని చెల్లానీ అభివర్ణించాడు. [61] రుణగ్రహీత యొక్క క్రెడిట్ యోగ్యతను చైనా అంచనా వేయదని, రుణం రుణగ్రహీతను అప్పుల బాధలో పడేసినప్పటికీ అది రుణం ఇస్తుందనీ ఆయన అన్నాడు. [62] శ్రీలంక రుణ భారం 51 బిలియన్ డాలర్లు అని తర్వాత తెలిసింది. ప్రభుత్వ ఆదాయంలో 95 శాతం రుణ సేవలకే ఖర్చవుతోంది. [63]
అప్పటి శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స, చైనాతో తమ దేశ సంబంధాన్ని సమర్థించుకున్నాడు. రుణ ఉచ్చు అనే ఆలోచనను అతను తిరస్కరించాడు. "చైనా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రాయితీ రుణాలను అందించింది." [64] హంబన్‌తోట నౌకాశ్రయానికి సంబంధించి, "హంబన్‌తోట పోర్ట్ రుణ ఉచ్చు కాదు" అని ఆయన అన్నాడు. [64] ప్రాజెక్టుకు తీసుకున్న రుణాలను చెల్లించడంలో వైఫల్యం కారణంగా శ్రీలంక చైనా కంపెనీతో 99 సంవత్సరాల లీజుకు ప్రవేశించవలసి వచ్చిందనే అభిప్రాయాన్ని రాజపక్సే తోసిపుచ్చాడు. ప్రాజెక్టు వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉందనీ, అది శ్రీలంక యొక్క మొత్తం ఓడరేవు మౌలిక సదుపాయాలనే మారుస్తోందనీ చెప్పాడు. [64]
చైనాలోని శ్రీలంక రాయబారి కరుణసేన కొడితువాక్కు మాట్లాడుతూ, ఓడరేవును అప్పగించమని చైనా ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వాన్ని అడగలేదని; శ్రీలంక ప్రభుత్వమే ఓడరేవును లీజుకు తీసుకోవాలని చైనాను కోరిందని చెప్పాడు. "ఈ నౌకాశ్రయంలో చైనా పెట్టుబడులను శ్రీలంక స్వాగతించడం సమంజసమని ఇతర శ్రీలంక ప్రతినిధులు గుర్తించారు, ఎందుకంటే దాని వాణిజ్య రవాణాలో ఎక్కువ భాగం ఆ దేశం నుండే వచ్చింది" అని అతను అన్నాడు" [65] [66]
డెబోరా బ్రూతిగం "డెట్-ట్రాప్ డిప్లమసీ" అనే పదాన్ని ఉపయోగించడాన్ని వివాదం చేసింది. [67] [68] శ్రీలంకకు సంబంధించి, ప్రస్తుతం ఉన్న రుణాల నిబంధనలను పునర్నిర్మించడానికి చైనా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని బ్రూతిగం పేర్కొంది. [67] కెనడియన్ ఇంజినీరింగ్ నిర్మాణ సంస్థ SNC-లావలిన్ ఓడరేవు కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆర్థిక సహాయం చేసిందనీ, హంబన్‌తోటలో ఓడరేవు నిర్మాణం సాధ్యమేనని 2003లో దాని అధ్యయనం నిర్ధారించిందనీ ఆమె చెప్పింది. [69] డానిష్ ఇంజినీరింగ్ సంస్థ రాంబోల్, 2006లో ముగించిన రెండవ సాధ్యాసాధ్య నివేదిక కూడా ఇదే నిర్ణయానికి చేరుకుంది. [70] బ్రూతిగామ్ ప్రకారం, హంబన్‌తోటలోని ఓడరేవు ఆర్థికంగా నిలబడాలంటే, సింగపూర్ గుండా రవాణా అయ్యే సరుకులో కొంత భాగాన్ని మాత్రమే చేజిక్కించుకుంటే చాలని చెప్పింది. [71] 2015లో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బాధ్యతలు స్వీకరించినప్పుడు, శ్రీలంక, చైనా కంటే జపాన్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు ఎక్కువ రుణపడి ఉంది. [69] 2017లో శ్రీలంక చెల్లించిన $4.5 బిలియన్ల రుణంలో, హంబన్‌టోటాకు చెల్లించినది కేవలం ఐదు శాతం మాత్రమే. [72] దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలకు హంబన్‌తోట ప్రధాన కారణం కాదని పలువురు శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు బ్రూతిగమ్‌కు చెప్పారు. శ్రీలంక చైనాకు చెల్లించాలసిన రుణాలను ఎగవేయలేదని బ్రూతిగం చెప్పింది. [69] వాస్తవానికి తొలుత కొలంబో IMF నుండి బెయిలౌట్ ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది. కానీ, కెనడియన్ సాధ్యాసాధ్యాల అధ్యయనం సిఫార్సు చేసిన విధంగా తక్కువ పనితీరు కనబరుస్తున్న హంబన్‌తోట రేవును అనుభవజ్ఞులైన కంపెనీకి లీజుకు ఇవ్వడం ద్వారా అవసరమైన నిధులను సేకరించాలని నిర్ణయించుకుంది. [73] శ్రీలంకలో చైనీస్ 'వ్యూహాత్మక ఉచ్చు' గురించి శ్రీలంక విద్యావేత్త అసంగా అబెయగూనశేఖర హెచ్చరించాడు. [74] వ్యూహాత్మక ఉచ్చు దౌత్యం (స్ట్రాటజిక్-ట్రాప్ డిప్లొమసీ) అనే పదాన్ని అసంగ అబేయగూనశేఖర కాయించాడు. వాయిస్ ఆఫ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను, శ్రీలంకలో చైనీస్ డెట్-ట్రాప్ దౌత్యాన్ని అంచనా వేస్తూ ఈ పదాన్ని వాడాడు. దీన్ని మొదటిసారిగా 2021 సెప్టెంబరు 16 న ప్రచురించారు. [75]
2020లో చాథమ్ హౌస్ ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. శ్రీలంక అప్పుల బాధకు చైనా రుణాలకు సంబంధం లేదనీ, చైనా ప్రభుత్వ విధానాల కంటే పాశ్చాత్య రుణాలు ద్రవ్య విధానం కారణంగా చేసిన "దేశీయ విధాన నిర్ణయాల" వల్ల ఇది జరిగిందనీ అందులో ప్రచురించారు. [76] అయితే 2021 ఏప్రిల్ నాటికి చైనాకు చెల్లించాల్సిన బాహ్య రుణం మొత్తం రుణంలో 10% కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, సెంట్రల్ బ్యాంక్‌కు రుణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చైనా మొత్తం రుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొందరు అధికారులు తెలిపారు. [48] [49] [77] చైనా హంబన్‌తోటను నావికా స్థావరంగా ఉపయోగించవచ్చనే వాదనపై ఆ పత్రిక సందేహం వ్యక్తం చేసింది ("స్పష్టంగా ఇది తప్పు" అని పేర్కొంది). [76] శ్రీలంక రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు ఈ అంశాన్ని బీజింగ్‌లో ఎన్నడూ తీసుకురాలేదని పదేపదే నొక్కిచెప్పారని కూడా ఆ పత్రిక చెప్పింది; ఓడరేవు లీజు ప్రారంభమైనప్పటి నుండి హంబన్‌తోట వద్ద లేదా సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు జరిగాయనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని అది పేర్కొంది. [76]
పర్యాటకం[మార్చు]
పర్యాటక రంగం శ్రీలంక GDPలో పదో వంతును చేకూరుస్తుంది. [78] 2019 ఈస్టర్ బాంబు దాడుల వల్ల ఈ రంగానికి దెబ్బ తగిలింది. కోవిడ్-19 మహమ్మారి, కోలుకోనీయకుండా చేసింది. [79] 2018లో పర్యాటక రంగం శ్రీలంకకు $4.4 బిలియన్లను సంపాదించింది. ఇది GDPకి 5.6%. అయితే ఇది 2020లో కేవలం 0.8%కి పడిపోయింది [80] 2021 ఏప్రిల్ లో వేసిన అంచనాలో ప్రపంచ బ్యాంక్, "COVID-19 మహమ్మారి శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై భారీ నష్టాన్ని కలిగించినప్పటికీ, సవాళ్లు ఉన్నప్పటికీ, 2021లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది." అని చెప్పినప్పటికీ, ఆ అంచనా వమ్మైంది. [81]
వ్యవసాయ సంక్షోభం[మార్చు]
బాస్మతి వంటి ప్రత్యేక బియ్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటూ శ్రీలంక బియ్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. 2021 ఏప్రిల్ లో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, శ్రీలంక కేవలం సేంద్రీయ వ్యవసాయాన్ని మాత్రమే అనుమతిస్తుందని, అకర్బన ఎరువులు, రసాయనాల ఆధారిత ఎరువులను నిషేధిస్తున్నట్లూ ప్రకటించాడు. కేవలం ఎరువుల నిషేధం ఫలితంగా తేయాకు ఉత్పత్తి తగ్గడం వల్ల దాదాపు $425 మిలియన్ల ఆర్థిక నష్టం సంభవించింది. మొదటి ఆరు నెలల్లోనే బియ్యం ఉత్పత్తిలో 20% తగ్గుదల ఏర్పడింది. గతంలో వరి ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన దేశం 450 మిలియన్ డాలర్ల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. [82] తేయాకు పరిశ్రమ పరిస్థితి క్లిష్టంగా ఉందని, సేంద్రియ సాగు చేయడం పది రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని, మామూలుగా వచ్చే దిగుబడిలో సగమే వస్తోందనీ రైతులు చెప్పారు. [83] [84]
ఈ కార్యక్రమానికి సలహాదారుగా ఉన్న వందనా శివ దీన్ని స్వాగతించింది. [85] అయితే వ్యవసాయం పతనమయ్యే ప్రమాదం గురించి హెచ్చరించిన శాస్త్రీయ వ్యవసాయ వర్గాల విమర్శలను విస్మరించింది. [86] [87] [88] [89] [90] టీ పరిశ్రమనే అల్లుకుని ఉండే జాతీయ కరెన్సీ విలువ తగ్గింపు కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చనే హెచ్చరికలను కూడా ఇది పట్టించుకోలేదు. [86] సేంద్రీయ వ్యవసాయానికి మారడాన్ని సమర్థించేందుకు ప్రభుత్వం చేసిన అనేక వాదనలను విమర్శకులు లైసెన్‌కోయిజంతో పోల్చారు: ఉదాహరణకు, సేంద్రీయ వ్యవసాయానికి పరివర్తనను నిర్వహించిన ప్రెసిడెన్షియల్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు అనురుద్ధ పదేనియా, "పురాతన కాలంలో శ్రీలంక ప్రజలు సుమారు 140 సంవత్సరాల పాటు జీవించారని, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ఫలితంగా అది 74 సంవత్సరాలకు తగ్గిందనీ ప్లినీ ది ఎల్డర్ రాసాడ"ని వాదించాడు. [91] పదేనియా, గోటబయ రాజపక్సే ఇద్దరూ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి CKDu కు కారణం రసాయన ఎరువుల వాడకమేనని చెప్పారు. అయితే CKDu ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా ఫ్లోరైడ్, మెగ్నీషియం లు అధిక సాంద్రతతో ఉండడం, నీటిలో ఉన్న అధిక కాఠిన్యమూ, అధిక వేడీ దానికి కారణాలని శాస్త్రీయ పరిశోధనలు సూచించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రసాయన ఎరువుల వాడకం మాత్రమే CKDu కి కారణమవుతుంద అనే సందేహం వ్యక్తం చేసింది. [92] [93]
రసాయన ఎరువులు, పురుగుమందుల వ్యాపారాన్ని నిషేధించడం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. ఎందుకంటే జనాభా ఆదాయం, ఆహారం లేకుండా ఉండాల్సి వచ్చింది. [94] [95] [96] 2021 నవంబరులో ఆహార ధరలు పెరగడం, వారాల తరబడి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రపంచంలోనే మొట్టమొదటి సేంద్రీయ వ్యవసాయ దేశంగా అవతరించాలనే తన ప్రణాళికను శ్రీలంక విరమించుకుంది. [97] యూరియాపై నిషేధాన్ని ఎత్తివేయడం, క్రెడిట్ లైన్ కింద 44,000 టన్నుల యూరియాను దిగుమతి చేసుకోవడం వంటి కొన్ని చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. [98] నిత్యావసర వస్తువుల శాంతికాల రేషన్‌ను ప్రవేశపెట్టింది. [95]
యాలా సాగు సీజనులో గరిష్ట దిగుబడిలో 50% మాత్రమే రావచ్చని, సీజన్‌ను ఆదుకోడానికి అవసరమైన ఎరువులను ప్రభుత్వం అందించలేదని 2022 మే 29 న ప్రభుత్వం పేర్కొంది. అయితే దేశంలో బియ్యం నిల్వలు సెప్టెంబరు వరకు మాత్రమే సరిపోతాయి. [99]
రష్యా ఉక్రెయిన్ యుద్ధం[మార్చు]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల పరిణామాలు అప్పటికే మందకొడిగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపాయి. [100] ఉక్రెయిన్‌పై 2022 రష్యా దండయాత్ర దేశ ఆర్థిక విపత్తును మరింత తీవ్రతరం చేసింది. ఎందుకంటే టీ ఎగుమతుల్లో శ్రీలంకకు రష్యా రెండవ అతిపెద్ద మార్కెట్. చాలా మంది పర్యాటకులు ఈ రెండు దేశాల నుండి వస్తారు కాబట్టి శ్రీలంక పర్యాటక రంగం కూడా ఈ రెండు దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. [101] ఫలితంగా, ఉక్రెయిన్ సంక్షోభం శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణ మార్గాన్ని అడ్డూకుంది. టీ పర్యాటక రంగం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. [102]
ప్రభావం[మార్చు]
2021లో, శ్రీలంక ప్రభుత్వం 73 ఏళ్లలో దేశం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని అధికారికంగా ప్రకటించింది. [103] 2021 ఆగస్టులో ఆహార అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. [104] అయితే ఆహార కొరత ఉందనడాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. [105] ఈ సంక్షోభం ఆర్థిక విపత్తుకు దారితీస్తుందని శ్రీలంక ఇంధన మంత్రి ఉదయ గమ్మన్‌పిలా అంగీకరించాడు. [106] 2022 ఏప్రిల్ ప్రారంభంలో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ స్థానంలో నందలాల్ వీరసింఘే నియమితులయ్యాడు. [107] ఏప్రిల్ 5న, పార్లమెంటులోని 41 మంది సభ్యులు పాలక కూటమిని విడిచిపెట్టడంతో ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. [108] [109]
విద్యుత్, ఇంధన కొరత[మార్చు]
ఆర్థిక సంక్షోభాల ఫలితంగా కొరతలు ఏర్పడి విద్యుత్, ఇంధనం, వంటగ్యాస్ వినియోగం తగ్గింది. విద్యుత్తును ఆదా చేసే ప్రయత్నంలో కనీసం 2022 మార్చి నెలాఖరు వరకు అన్ని వీధి లైట్లను స్విచ్ ఆఫ్ చేయాలని ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స అన్ని ప్రభుత్వ అధికారులను కోరాడు. [110] [111] వంట గ్యాస్ కొరత కారణంగా దాదాపు 1000 బేకరీలు మూతపడ్డాయి. [112] పెట్రోలు నింపే స్టేషన్ల ముందు కొన్ని నెలలుగా పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. [113] [114] అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ఇంధన కొరతను మరింత తీవ్రతరం చేసింది. [115] [116] ఇంధనాన్ని ఆదా చేయడానికి, దేశవ్యాప్తంగా అధికారులు రోజువారీ విద్యుత్ కోతలను విధించారు. [117] [118] 2022 మార్చి 22న, క్యూలలో ఉన్న వ్యక్తుల మధ్య చెలరేగుతున్న ఉద్రిక్తతలను అరికట్టడానికి, ఇంధన పంపిణీని సులభతరం చేయడానికి వివిధ గ్యాస్, ఇంధన బంకుల్లో సైనికులను నియమించాలని ప్రభుత్వం మిలటరీని ఆదేశించింది. [119] [120] అలసట, హింస కారణంగా నలుగురు మరణించారు. [121] [122] 2022 మార్చి అంతటా రోజువారీ ఏడు గంటల విద్యుత్ కోతలు విధించారు. నెలాఖరులో దాన్ని 10 గంటలకు పెంచారు. ఏప్రిల్ ప్రారంభంలో దాన్ని 15 గంటలకు పెంచారు. [123] [124] ది <i id="mwAdo">ఐలాండ్</i>, దివైనా దినపత్రికలు పేపర్ కొరత, సంబంధిత ధరల పెరుగుదల కారణంగా ముద్రణను నిలిపివేసి ఇ-పేపర్‌లకు మారాయి. [125] జలవిద్యుత్ ఉత్పాదన కూడా ప్రభావితమైంది. [126] [127] 2022 జూన్ 28 న శ్రీలంక ప్రభుత్వం, అత్యవసరం కాని వాహనాలకు ఇంధన విక్రయాలను నిలిపివేసింది. వైద్య సేవలకు, ఆహారాన్ని రవాణా చేయడానికి ఉపయోగించే వాహనాలు, బస్సులు, రైళ్లలో మాత్రమే ఇంధనాన్ని నింపవచ్చు. [128]
ద్రవ్యోల్బణం[మార్చు]
2022 ఫిబ్రవరి నాటికి ద్రవ్యోల్బణం 17.5% కు చేరింది. [129] ఏడాదిలో ఆహార ద్రవ్యోల్బణం 24.7% పెరిగింది. అయితే ఆహారేతర వస్తువుల రేట్లు 11% పెరిగాయి. [130] ఎర్ర మిరపకాయలు సంవత్సరంలో (2021 ఫిబ్రవరి నుండి 2022 ఫిబ్రవరి వరకు) 60%, బంగాళదుంపలు 74.8%, నాడు బియ్యం 64% పెరిగాయి. [131]
చదువు[మార్చు]
2022 మార్చిలో శ్రీలంకలోని అనేక పాఠశాలలు తమ టర్మ్/మిడ్-ఇయర్ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా పేపర్ కొరత కారణంగా ప్రధానంగా పేపర్‌ను దిగుమతి చేసుకోవడానికి విదేశీ నిల్వలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. [132] [133] టర్మ్ పరీక్షలు 2022 మార్చి 28 న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, ప్రింటింగ్ పేపరు, ఇంక్ రిబ్బన్‌ల కొరత కారణంగా పరీక్షలను రద్దు చేయడం లేదా తదుపరి తేదీకి వాయిదా వేయడం చేసారు. [134]
ఆరోగ్యం[మార్చు]
మార్చి 29న, మందుల కొరత కారణంగా పెరదేనియా టీచింగ్ హాస్పిటల్‌లో అన్ని శస్త్రచికిత్సలను నిలిపివేయబడ్డాయి. [135] [136]
అనేక ఇతర ఆసుపత్రులు కూడా సాధారణ శస్త్రచికిత్సలను నిలిపివేసాయి. పెద్ద సంఖ్యలో ప్రయోగశాల పరీక్షలను కూడా తగ్గించాయి. [137] ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇతర ఆసుపత్రుల్లో కూడా ప్రాణావసరమైన మందుల కొరత ఏర్పడింది. [138] ఏప్రిల్ 8న, శ్రీలంక మెడికల్ కౌన్సిల్, కొన్ని వారాలలో సరఫరాలు పునరుద్ధరించకపోతే విపత్కర సంఖ్యలో మరణాలు సంభవించవచ్చని హెచ్చరిక జారీ చేసింది. ఇది COVID-19, 2004 సునామీ, అంతర్యుద్ధ కాలంలో జరిగిన మరణాల మొత్తం సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చునని చెప్పింది. [139] శ్రీలంక వైద్య సంక్షోభాన్ని "మున్నెన్నడూ లేనంత పెద్ద మానవ సంక్షోభం"గా ప్రకటిస్తూ సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ హెచ్చరిక జారీ చేసింది.
ఏప్రిల్ 10 నాటికి, ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులు, శిశువుల వెంటిలేషన్ కోసం ఎండోట్రాషియల్ ట్యూబ్‌లు అయిపోయాయి. 4mm, 3.5mm, 3mm, 2.5mm, 2mm సైజుల నియోనాటల్ ETTలను అందించాలని వైద్యులు విదేశీ శ్రీలంక కమ్యూనిటీలను అభ్యర్థించారు. [140] ఇకపై దేశంలోని ఆసుపత్రులలో దిగుమతి చేసుకున్న వైద్య సాధనాలు, కీలకమైన మందులు అందుబాటులో ఉండవని శ్రీలంక మెడికల్ అసోసియేషన్ తెలిపింది. [141] నవజాత శిశువుల ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ను అందించే ఎండోట్రాషియల్ ట్యూబ్‌లను క్రిమిరహితం చేసి తిరిగి ఉపయోగించాల్సిన అగత్యం ఆసుపత్రులకు ఏర్పడింది.
కొత్త పరికరాల కొరత కారణంగా వైద్యులు రోగులకు చికిత్స చేయడానికి పాత, ఉపయోగించిన వైద్య పరికరాలను తిరిగి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యులు కూడా మొబైల్ ఫోన్ల కాంతిలోనే వైద్య శస్త్రచికిత్సలు చేసినట్లు సమాచారం. [142] విద్యుత్ కోతల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులు కూడా చీకట్లో గాయాలకు కుట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. గుండెపోటుకు చికిత్స చేసే అత్యవసర మందులు కూడా కొరతగా ఉన్నట్లు సమాచారం. [143]
పర్యాటకం[మార్చు]
2022 మార్చిలో యునైటెడ్ కింగ్‌డమ్, కెనడాలు తమ ప్రయాణికులను శ్రీలంకలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుని అక్కడికి వెళ్ళాలని హెచ్చరించాయి. [144]
ఎగుమతులు[మార్చు]
శ్రీలంకలో ప్రబలంగా ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా, జారా, మ్యాంగో, H&M వంటి ప్రముఖ వస్త్ర బ్రాండ్‌లు తమ ఆర్డర్‌లను శ్రీలంక నుండి భారతదేశం వైపు మళ్లించాయి. [145] శ్రీలంకలో అధ్వాన్నమైన ఆర్థిక, రాజకీయ పరిస్థితుల పర్యవసానంగా, భారతదేశపు టీ ఉత్పత్తులకు విదేశీ ఆర్డర్లు పెద్ద యెత్తున పెరిగాయి. [146]
దౌత్య సంబంధాలు[మార్చు]
విదేశీ నిల్వల కొరత కారణంగా నైజీరియాలోని శ్రీలంక హైకమిషన్, జర్మనీ, సైప్రస్‌లోని కాన్సులేట్‌లను 2022 జనవరిలో తాత్కాలికంగా మూసివేసారు. [147] 2022 మార్చిలో డాలర్ నిల్వలు లేకపోవడంతో ఇరాక్‌లోని శ్రీలంక రాయబార కార్యాలయం, నార్వేలోని శ్రీలంక రాయబార కార్యాలయం, ఆస్ట్రేలియాలోని కాన్సులేట్ లను కూడా మూసివేసారు. [148] [149] [150]
ప్రతిచర్యలు[మార్చు]
ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం కోసం, రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని శ్రీలంక ప్రైవేట్ రంగం 2022 ఏప్రిల్ 7 న సమిష్టిగా రాతపూర్వకంగా అభ్యర్థించింది. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, తయారీదారులు, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగం, పర్యాటక రంగానికి సమిష్టిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 38 సంస్థలు విపత్తును నివారించడానికి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలని పార్లమెంటుకు విజ్ఞప్తి చేశాయి. [151] 2022 ఏప్రిల్ 7 న, ఛాంబర్ ఆఫ్ యంగ్ లంకన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (COYLE) కూడా ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమస్యను తగిన శ్రద్ధతో పరిష్కరించకుంటే అది వ్యాపారాల మూసివేతకు దారితీస్తుందని హెచ్చరించింది. [152]
2022 ఏప్రిల్ 8 న మాజీ ప్రపంచ బ్యాంక్ అధికారి శాంతా దేవరాజన్, శ్రీలంక ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదం సామాజిక అశాంతి, అల్లకల్లోలం అని హెచ్చరించాడు. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని నివారించడానికి ఆహారం, ఇంధనంపై సబ్సిడీల తగ్గింపుతో పాటు పేద ప్రజలకు సహాయం చేసే లక్ష్యంతో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చని ఆయన చెప్పాడు. [153] మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కేబినెట్ మంత్రుల వరుస రాజీనామాలు విధాన అనిశ్చితిని పెంచుతాయని, ఫలితంగా బాహ్య ఫైనాన్స్ పొందడం లేదా రుణం తీసుకోవడం కష్టతరం అవుతుందనీ హెచ్చరించింది. [154]
నిరసనలు[మార్చు]
2022 మార్చిలో, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నిర్వహణ లోపాలపై రాజకీయ పార్టీలు, నిష్పాక్షిక సమూహాలు చేసిన ఆకస్మిక, వ్యవస్థీకృత నిరసనలు అనేక ప్రాంతాల్లో జరిగాయి. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలని, విస్తృత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తక్షణమే రాజీనామా చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజకీయ ప్రతిపక్షాలు అనేక నిరసనలు జరిపాయి. [155] [156]
సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్‌కు చెందిన పదివేల మంది మద్దతుదారులు మార్చి 16న అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యక్ష కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. [157] మార్చి 30న, నమల్ రాజపక్స బండారవేలా లోని క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, కోపంతో ఉన్న స్థానికులు ఇంధనం కావాలని డిమాండు చేస్తూ రహదారిని అడ్డుకున్నారు, దీని ఫలితంగా నమల్ రాజపక్సను ఆ ప్రాంతం నుండి తప్పించారు. అతని బదులు మేయరు, ఆ మైదానాన్ని ప్రారంభించాడు. [158]
మార్చి 31న, రోజుకు 12 గంటలకు పైగా ఉన్న విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా మిరిహానాలోని గోటబయ రాజపక్సే నివాసం చుట్టూ పెద్ద సమూహం గుమిగూడింది. [159] [160] శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న నిరసననిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులతో దాడి చేయడంతో, నిరసనకారులు అల్లర్ల నియంత్రణ దళాలను తీసుకువెళుతున్న బస్సును తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్ళింది. కొలంబోలో ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. [161] [162] కాండీ-కొలంబో రహదారిపై కూడా ఏకకాలంలో నిరసనలు జరిపి మార్గాన్ని నిర్బంధించారు. [163] నిరసనకారులను తీవ్రవాద గ్రూపు సభ్యులని ప్రభుత్వం ఆరోపించి, వారిని అరెస్టు చేయడం ప్రారంభించింది. [164] అనేక ప్రాంతాల్లో కొవ్వొత్తుల నిరసనలు జరగ్గా, కారు హారన్లు మోగిస్తూ కూడా నిరసనలు చేసారు. [165]
2022 మేలో రాజపక్సే కుటుంబ గృహానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. [166] నిరసనల మధ్య మహింద రాజపక్స 2022 మేలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అయితే గోటబయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించాడు. నిరసనలు కొనసాగాయి. [167]
జూలై 9న నిరసనకారులు అధ్యక్షుడి అధికారిక గృహం లోకి చొరబడి [168] కొలంబోలోని ప్రధాన మంత్రి విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టారు. [169]
విదేశీ సహాయం[మార్చు]
బాహ్య రుణ చెల్లింపులు, వ్యాపారం కోసం శ్రీలంకలో డాలర్ల కొరత కారణంగా ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి భారతదేశం, 2022 జనవరిలో మొత్తం US$2.415 బిలియన్ల సహాయాన్ని ప్రకటించింది. [170] SAARC కరెన్సీ స్వాప్ అమరిక కింద, భారతదేశం $400 మిలియన్లను అందించింది. దాదాపు $500 మిలియన్ల ఆసియా క్లియరింగ్ యూనియన్ చెల్లింపును వాయిదా వేసింది. [171] పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు కోసం భారతదేశం $500 మిలియన్ల విలువైన కొత్త రుణాన్ని మంజూరు చేసింది. [172]
2022 మార్చి 17 న ఆహారం, ఔషధం వంటి అత్యవసరంగా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి భారతదేశం నుండి శ్రీలంక US$1 బిలియన్ల రుణ సహాయాన్ని లైఫ్‌లైన్‌గా పొందింది. [173] [174] ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా భారతదేశం, శ్రీలంక అధికారికంగా ఈ క్రెడిట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత క్రెడిట్ లైన్ క్రియాశీలమైంది. [175] [176]
తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ దేశంలోని ఉత్తర, తూర్పు, మధ్య ప్రావిన్సులలో నివసించే శ్రీలంక తమిళ ప్రజలకు బియ్యం, తృణధాన్యాలు, ప్రాణాలను రక్షించే మందులు వంటి నిత్యావసర వస్తువులను అందించడానికి వ్యూహాలను ప్రతిపాదించాడు. [177] అయితే శ్రీలంకలోని తమిళ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తమిళులకు సహాయం చెయ్యడాన్ని తిరస్కరించాయి. శ్రీలంకలోని అన్ని జాతి, మత సమూహాలకు సహాయాన్ని పంపిణీ చేయాలని అభ్యర్థించాయి. [178]
2022 ఏప్రిల్ 2 న, భారతీయ వ్యాపారులు శ్రీలంకకు తక్షణ రవాణా కోసం 40,000 టన్నుల బియ్యాన్ని లోడ్ చేయడం మొదలుపెట్టారు. [179] [180] ఏప్రిల్ 6 నాటికి భారతదేశం శ్రీలంకకు 2,70,000 టన్నుల ఇంధనాన్ని పంపింది. [181] కొన్ని సరుకులకు బ్యూరోక్రాటిక్ అడ్డంకులు ఎదురయ్యాయి. [182]
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారతదేశం శ్రీలంకకు 4,00,000 టన్నుల ఇంధనాన్ని వివిధ దశల్లో సహాయంగా పంపించింది. [183]
సింగపూర్ ప్రభుత్వం శ్రీలంకలోని అత్యంత దుర్బలమైన కమ్యూనిటీల కోసం సింగపూర్ రెడ్‌క్రాస్ యొక్క మానవతా ప్రజా నిధుల సేకరణ ప్రయత్నాలకు మద్దతుగా US$1,00,000 మొత్తాన్ని ఉపశమన ప్యాకేజీగా అందించనున్నట్లు ప్రకటించింది. [184] [185]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి