14, డిసెంబర్ 2024, శనివారం

జర్నలిస్ట్ మునీర్

జర్నలిస్టుగా కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలకు పరిచయం అక్కరలేని అక్షర సూరీడు ... మునీర్.
పెద్ద పెద్ద  కలలు కంటూ జర్నలిస్టుగా ఎదిగిన వాడు కాదు. 

కేవలం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ యంత్రాంగానికి, పౌర సమాజానికి తెలియపరచాలనే తపనతో కలం పట్టిన యోధుడతను. 

నలభై ఐదు (45) ఏళ్లుగా కలం కార్మికుడిగా ప్రజల పక్షాన నిలిచి పనిచేస్తున్న నికార్సైన జర్నలిస్ట్.
పీడితుల గొంతుకగా వినిపిస్తున్న హాక్కుల కార్యకర్త  అతను . 

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న ఒక  "విజిల్ బ్లోయర్ "(Whistle  Blower )


 సామాజిక న్యాయం  పాటించమని పాలకుల తలపై అంకుశమై నిలిచే  సామాజిక చోదకుడు అతడు . 


 ఆదివాసి  గుండె శబ్దాన్ని ,, కడుపు మంటను పౌర సమాజానికి పరిచయం చేస్తున్న జర్నలిస్టు. ప్రజల కోసం నేలకొరిగిన అమరుల జ్ఞాపకాలను మరిచి పోని మట్టి మనిషి అతను . 

ఆకలి చావులు, ఎన్ కౌంటర్ బాధితుల రోదనలు, వివక్షపూరిత బతుకులు, అభివృద్ధి మింగిన పేదల చేదు  విషాదాలను  ఎప్పటికప్పుడు  కన్నీళ్ళతో గుండె బరువెక్కినా, రాజ్యం భయపెట్టినా వెరవకుండా, వెన్నుచూపకుండా ముందుకే సాగుతున్న  నూతన మానవుడు ... మునీర్.


1978 సంవత్సరంలో విశాలాంధ్ర దినపత్రికకు వార్తలు రాయడం ద్వారా జర్నలిస్టు వృత్తిలోకి  వచ్చాడు . అక్కడి నుంచి తెలుగు రాష్ట్రంలో పేరుగాంచిన అన్ని దినపత్రికలలో జర్నలిస్టుగా, కాలమిస్టుగా తన సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఆయన  "కార్డు" జర్నలిస్టుగా  అంటే పేరుకే  జర్నలిస్ట్ గా గాకుండా  , రాసే జర్నలిస్టుగా నిలిచాడు.


మొదట మందమర్రి పట్టణంలో జరిగే వివిధ కార్యక్రమాల గురుంచి  వార్తలు రాసేవాడు. అలా  రాసిన వార్తలను ఆనాటి ఏఐవైఎఫ్ (అఖిల భారత్ యువజన సమాఖ్య ) నాయకులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు నాయుడు, గుండా మల్లేష్ ల ద్వారా విశాలాంధ్ర పత్రికకు పంపేవాడు. అవి పత్రికలో అచ్చయితే ఎంతో సంతోషపడేవాడు. విజయవాడ కేంద్రంగా విశాలాంధ్ర పత్రిక వెలువడేది. విశాలాంధ్ర యజమాన్యం  మునీర్ ను  మందమర్రి  విలేకరిగా  నియమించి, గుర్తింపు కార్డును ఇచ్చింది . 

 ఆ తర్వాత , 1985లో హైదరాబాద్ కేంద్రంగా వెలువడే ఆంధ్ర పత్రికకు *కళ్యాణి  ఖని* డేట్ లైన్ పైన వార్తలు రాశాడు . 

రైలు ప్రమాదం జర్నలిస్టుగా  పెద్ద గుర్తింపు

మందమర్రి పట్టణానికి వచ్చే అన్ని రకాల  పత్రికలకు  ఒక్కరే ఏజెంట్ గా వ్యవహరించేవారు.. మునీర్ రాసిన వార్తలను ఏజెంటు చాలా  ఇష్టపడేవాడు. ఆయనే చొరవ తీసుకొని,  కరీంనగర్ లో ప్రారంభించిన ఈనాడు ఎడిషన్ అధికారులతో సంప్రదించాడు. మునీర్ కు ఈనాడు మందమర్రి విలేకరిగా అవకాశం కల్పించాలని కోరాడు ఆయన కోరిక మేరకు మునీర్ నుంచి దరఖాస్తును ఈనాడు యాజమాన్యం తీసుకున్నది.మిగతా పద్ధతులను పూర్తి చేశారు. అనంతరం విలేకరిగా మునీర్ వార్తలు రాశాడు. ఆరు నెలలు ఈ రకంగా వార్తలు రాసిన తర్వాత ఆయన వార్తలను ప్రచురించటం నిలిపి వేశారు. ఆరా తీస్తే మునీర్ పై కేసులు ఉన్నాయని ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. కరీంనగర్, మంచిర్యాల ఈనాడు కార్యాలయానికి వచ్చి వ్యక్తిగతంగా సంప్రదింపులు జరపాలని మునీరుకు లేఖ రాశారు. అప్పటినుంచి ఈనాడుకు రాయటం మానివేశాడు.

1987 సంవత్సరంలో మంచిర్యాల వద్ద దక్షిణ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైలు ప్రమాదంపై మునీర్ ఆంధ్రజ్యోతి పత్రికకు పంపిన వార్త పత్రికలో అచ్చయింది. అది  సంచలనం సృష్టించింది. అప్పుడు మునీర్ ఆంధ్రజ్యోతి విలేఖరి కాదు. మంచిర్యాల వద్ద ప్రమాదం తప్పినా మందమర్రి ఏడు కానాల బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగేది,అనేది వార్త.
  ఏడు కానాల బ్రిడ్జిపై కొట్టుకపోయిన రైలు పట్టాలు, వేలాడుతున్న రైలు పట్టాలు ఫోటోలతో సహా ఆంధ్రజ్యోతి ఎడిషన్ కు పంపాడు. ఆ వార్త మొదటి పేజీలో ప్రచురితం అయ్యింది. అదే ఉత్సాహంతో పలు వార్తలను రాసి ఆంధ్రజ్యోతికి పంపించాడు. అవి కూడా ప్రచురితమయ్యాయి.
ఆంధ్రజ్యోతి ఏజెంట్ కు పార్సిల్ లో ఒక ఉత్తరం వచ్చింది. దానిని చింపి చదివాడు. మందమరి డేట్ లైన్ పైన వార్తలు రాయటానికి మునీర్  ఆసక్తిగా ఉంటే, హైదరాబాద్ కార్యాలయానికి వచ్చి కలవమని అందులో పేర్కొన్నారు. వెంటనే ఏజెంటు మునీర్ ఇంటికి వెళ్ళాడు. ఈ ఉత్తరం ఆయన చేతిలో పెట్టి, హైదరాబాద్ వెళ్ళమని సలహా ఇచ్చాడు.ఆ ఉత్తరం తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు.
ఎడిషన్ కార్యాలయంలో ఎడిటర్ గా పనిచేస్తున్న ఏబికే ప్రసాద్ ను, మఫీషియల్ ఇంచార్జ్ రుద్రబట్ల కిషన్ ను కలిశాడు. రుద్రబట్ల కిషన్ మంచిర్యాల కాలేజీలో చదువుకోవడం వలన మునీర్ గురించి ఆయనకు ముందే తెలుసు. అందువల్లనే మునీర్ వార్తలు జ్యోతిలో ప్రచురించబడ్డాయి. ఆయన ప్రోత్సాహంతో అధికారికంగా మందమర్రి *స్పాట్ న్యూస్* ఆంధ్రజ్యోతి విలేఖరిగా 1987లో బాధ్యతను ఎత్తుకున్నాడు. ఆ రోజు నుంచి పత్రిక మూతపడే వరకు పనిచేశాడు
వేమూరి రాధాకృష్ణ నేతృత్వంలో ఆంధ్రజ్యోతి పునః ప్రారంభించే వరకు మునీర్ వివిధ పత్రికల్లో పని చేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, రాపోలు ఆనంద భాస్కర్ నడిపిన పత్రిక తో పాటు పలు వార, పక్ష, మాస పత్రికలకు వార్తల రాస్తూ వచ్చారు. ఆంధ్రజ్యోతి  ప్రారంభించిన తర్వాత మంచిర్యాల స్టాఫ్ రిపోర్టర్ గా కొత్త బాధ్యతలతో పనిచేసే అవకాశం మునీర్ కు లభించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో నమస్తే తెలంగాణ దిన పత్రికను ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుడుగా 2010 సంవత్సరంలో నమస్తే తెలంగాణ పత్రిక సింగరేణి బ్యూరో చీఫ్ గా మునీర్ బాధ్యతలను స్వీకరించారు. పత్రిక సర్కులేషన్, ప్రకటనల సేకరణ, ఇతర ప్రధాన పత్రికలతో పోటీపడి వార్తల రాశాడు.జిల్లాలో పత్రికను నంబర్ వన్ గా నిలపడానికి కృషి చేశారు.
2013లో తిరిగి ఆంధ్రజ్యోతి పత్రికలోకి మారటం జరిగింది. అప్పటినుంచి పదవి విరమణ పొందిన 2021వ సంవత్సరం వరకు ఆయన నిరంతరాయంగా ఆంధ్రజ్యోతికి సేవలను అందించారు.
ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి పదవి విరమణ పొందిన నాటి నుండి ఈరోజు వరకు  అనేక ప్రధాన పత్రికలకు కాలమిస్టుగా పనిచేస్తున్నాడు.

ఆయన తీరే వేరు....

ఫోన్ ద్వారా, ఇతరులు అందించిన సమాచారం ద్వారా వార్త రాయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు కాదు. స్వయంగా పరిశీలించి, అధ్యయనం చేసి, బాధితులను కలిసి వివరాలు సేకరించి వార్త రాయటం ఆయన ప్రత్యేకత. ఆయన రాసిన పలు వార్తలు దేశ, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరిశోధనా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో సింగరేణి సంస్థ పై రెండు రోజులపాటు వరస కథనాలను ప్రచురించారు. ఈ ప్రక్రియ మునీర్ తోనే ప్రారంభమయ్యింది.
మట్టి పరమాన్నం...
ఇక్కడ మట్టి పరమాన్నం... పేరిట ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్త సంచలనాత్మకంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలో మట్టిని తిని ఆకలి తీసుకునే గిరిజన బతుకులపై ఫోటోలతో సహా వార్త రాశాడు. ఆ మట్టి తినడం వలన పుట్టబోయే పిల్లలు అందంగా ఉంటారని నమ్మకంతో కూడా కొందరు మహిళలు ఈ మట్టి తినడానికి ఇష్టపడేవారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రజల దీన గాధలను, గిరిజన గూడేల పేరిట వరుస కథనాలను ఆంధ్రజ్యోతిలో ప్రచురించింది. ఇందుకోసం అడవిలో కాలి బాటన పయనించి, సైకిల్ తొక్కి, గుట్టలను ఎక్కి, వాగులను దాటి, గిరిజనులను, ఆదివాసీలను కలిసి సమస్యలను, కష్టాలను తెలుసుకొని వార్తలు రాశారు. విద్య, వైద్యం తో పాటు కనీస సౌకర్యాల కోసం తన కలాన్ని కత్తిలా వాడారు. ప్రభుత్వాన్ని కదిలించ గలిగారు

దేశానికి వెన్నెముక రైతు అని రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. ఆచరణలో వారి క్షేమాన్ని విస్మరిస్తారు.ఎరువులు లభించక, వర్షాలు కురియక, పంట దిగుబడి తగ్గి, అప్పుల పాలయ్యే రైతులు అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి గురించి రాష్ట్రవ్యాప్తంగా వివరాలు సేకరించారు. ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్ వర్క్ బృందం సేకరించిన వివరాలు, ఫోటోలతో వార్తలను ప్రచురించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల దీన గాధలపై వరుస కథనాలను అందించి శభాష్ అనిపించుకున్నారు.

లాకప్ హత్య..... పోలీస్ కేసు
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జై భీమ్ సినిమాలో జరిగిన మాదిరిగానే మందమర్రిలో జరిగింది. సింగరేణి కార్మికుడు నందయ్య లాకప్ డెత్ మిస్టరీని మునీర్ చేదించాడు. సాహసోపేతంగా నందయ్య వార్తను రాసి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. నందయ్య భార్య సుశీల న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మునీర్ ఒక పాత్రగా నిలిచాడు. నందయ్యను పోలీసులు ఎలా అరెస్టు చేసారు, ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశారు, ఎలా చంపారు, ఎక్కడ పాతిపెట్టారు అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు రాశాడు. ఈ వార్తా కథనం ఆధారంగా ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేపట్టింది. వార్తలో పేర్కొన్న విధంగానే శవం పాతి పెట్టిన స్థలాన్ని గుర్తించారు. అక్కడ తవ్వకాలు జరుపగా శవం దొరికింది. సిఐడి అధికారుల నివేదిక మేరకు ప్రభుత్వం ఒక ఎస్సై తో పాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో సాక్షిగా మునీర్ మరో జర్నలిస్టును చేర్చారు. సుశీలకు భరోసానిచ్చే కథనాలను రాశారు.  కేసును విరమించుకోవాలని, కేసు నుంచి తప్పుకోవాలని పలు రకాలుగా ఒత్తిడి వచ్చింది. ప్రలోభాలు, బెదిరింపులు ఎన్ని వచ్చినా బాదిత కుటుంబానికి అండగా నడిచాడు. కానీ కేసు కోర్టులో వీగిపోయింది.
అమీష్ దేశం గురించి...
మునీర్ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా అమిష్ దేశాన్ని, ప్రజల జీవన విధానంలోని వైవిధ్యాన్ని గమనించాడు. ఆంధ్రజ్యోతి నవ్య లో వచ్చిన కథనములో అమీష్ దేశంలోని గిరిజన తెగలు, వారి ప్రాచీన నాగరికతను ఎలా కొనసాగిస్తున్నారు. ప్రకృతిని, సహజ వనరులను ఎలా కాపాడుకుంటున్నారో అందులో వివరించారు. కరెంటును వినియోగించకుండా వారు జీవించే విధానాన్ని మనకు పరిచయం చేశాడు. సెల్ ఫోన్ వినియోగం తప్పనిసరి అంటూ భావిస్తున్న నేటి రోజుల్లో ఆ ఊసు లేకుండా జీవిస్తున్న అమీష్ దేశ ప్రజల గురించి అందులో విధించిన తీరు మనం చదవాల్సిందే.

మసి బారిన బొగ్గు భాయి జీవితాలు....

సింగరేణి పరిసర గ్రామాలలో నెలకొన్న సమస్యలు, కార్మికుల కష్టాలు, అవినీతి, ప్రజల దయనీయ స్థితిగతులపై ఎన్నో మానవీయ కథనాలను వ్రాశారు. పత్రికలో వార్తలు రావడం వలన అనేక  సమస్యలు పరిష్కరించ బడినాయి. అవినీతికి పాల్పడిన, తప్పులు చేసిన అధికారులు సస్పెండ్ కు గురయ్యారు. బదిలీపై వెళ్లారు. సింగరేణిలో కార్మికులకు మెరుగైన సౌకర్యాలు, పని స్థలాలలో మంచి గాలి, నీరు సాధించుకోబడ్డాయి అంటూ కార్మికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. సింగరేణి సంస్థలో 56 రోజులపాటు సుధీర్గంగా  జరిగిన సమ్మె ముగింపుకు మునీర్ చేసిన కృషి మరుపు రానిది.

ఓ ట్రెండ్ సెట్టర్
నేను రాయపోశవ్వను మాట్లాడుతున్న....

సింగరేణి తవ్వుతున్న ఓపెన్ కాస్ట్ గనుల వలన కోల్ బెల్ట్ ఏరియా బొందల గడ్డగా మారుతున్నదని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఓ సి పి గనులకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన కార్యక్రమాలు, అభిప్రాయాలతో అనేక వార్తా కథనాలను రాశారు. ఓసిపి గనిని ప్రారంభించేముందు ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయం వేదిక నుంచి ఓ బాధితురాలు మాట్లాడిన మాటలను విధాతధంగా రిపోర్టు చేశాడు.
ఆ రకంగా ఒక నూతన ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆమె మాటల్లోనే నేను రాయ పోషవ్వను మాట్లాడుతున్న అనే హెడ్డింగ్ తో వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. అది సంచలనం సృష్టించింది. యూనిసెఫ్ సంస్థ కూడా ఈ వార్తను పరిశీలించింది. అనంతరం అనేక పేపర్లో వివిధ సంఘటనలపై ఈ రకమైన వార్తలు ప్రచురితమయ్యాయి.
బొగ్గు గనుల తవ్వకాల వలన భూ నిర్వాసితులుగా మారిన వారి కోసం, రెక్కలే ఆస్తులు అంటూ పేదల కష్టాలపై వార్తలు రాసి వారికి భరోసా ఇచ్చారు.
బొగ్గు గనుల కోసం సర్వం త్యాగం చేసిన గ్రామ ప్రజలు తమకు ఉపాధి చూపమని వేడుకుంటూ, సింగరేణి అధికారుల చుట్టూ తిరగటం, వారి సొంత స్థలాలలో కూలీలుగా మారి పనిచేయటం ఇలాంటి సంఘటనలను వార్తా కథనాలుగా మార్చి మానవత్వాన్ని తట్టి లేపారు. అధికారుల్లో కదలిక తెప్పించాడు.
గడ్చిరోలి ఎన్కౌంటర్

చత్తిస్ గడ్ రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 47 మంది మరణించారు. ఆ వార్తను కవర్ చేయడానికి ప్రత్యేక రిపోర్టర్ గా మునీర్ అక్కడికి వెళ్లారు.
తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు ఒకనాడు విస్తృతంగా కొనసాగాయి.
పోలీసులకు,విప్లవకారులకు మధ్య ఎన్నో ఎదురు కాల్పులు జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించేది. ఎదురు కాల్పులు, ఏకపక్ష కాల్పులని, మనుషుల అపహరణ,నక్సల్ కుటుంబీకులపై పోలీసు, రాజకీయ నాయకుల వేధింపులపై ఎన్నో కథనాలను అందించారు. ఎన్ కౌoటర్లపై ప్రభుత్వం  టి ఎల్ ఎన్ రెడ్డి విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఎదుట  బాధిత కుటుంబాలను హాజరు పరచడంలో పౌర హక్కుల నాయకుడు పురుషోత్తంతో కలిసి పనిచేశాడు.

బర్నింగ్ సిటీ.. జార్ఖండ్ మైన్స్
ఝార్ఖండ్ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న బొగ్గును బ్రిటిష్ కాలం నుంచి వెలికి తీశారు. తవ్వితీయటానికి అవకాశం లేని ప్రాంతంలో బొగ్గును అలాగే వదిలిపెట్టారు, గనిని మూసివేశారు. భూమిలోని బొగ్గు మండుతుండడం వల్ల అక్కడ భూమి ఎప్పుడు వేడిగానే ఉంటుంది. నెర్రబారిన నేల నుంచి పొగలు వస్తూనే ఉంటాయి. తరతరాలుగా ప్రజలు అక్కడ జీవిస్తూనే ఉన్నారు. వీరు అనారోగ్యం, ఆకలి, కన్నీళ్లతో సహజీవనం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మునిరే.

రతన్ టాటా ఆలోచన....
కేరళలో స్వర్గీయ రతన్ టాటాకు తేయాకు తోటలు ఉన్నాయి. కొంతకాలం క్రితం అవి నష్టాల బాటలో పయనించాయి. అక్కడ తేయాకు సాగు నిలిపివేయాలని ఆయన ఆర్థిక సలహాదారులు టాటాకు సూచించారు.  ఆయన అందుకు సమ్మతించలేదు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. తేయాకు తోటలో పనిచేసే కార్మికులకు ఆ సంస్థలో 66% వాటాను కల్పించారు. కార్మికుల భాగస్వామ్యంతో తేయాకు పండిస్తున్నారు. కార్మికులను భాగస్వాములుగా చేయడం వలన తేయాకు పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తున్నది. దేశంలోని ఏ ప్రైవేట్ కంపెనీ కూడా కార్మికులకు ఇంత ఎక్కువ మొత్తంలో వాటా ఇవ్వలేదు. కేరళలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ విషయాన్ని గమనించాడు. దానిని వార్తగా మలిచి ప్రజలకు అందించాడు.
తెలంగాణ ఉద్యమకారుడు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మునీర్ అత్యంత కీలకంగా పనిచేశాడు. రాజకీయ నాయకులను సమన్వయ పరిచాడు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అంటూ ఏర్పాటైన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భావం నుంచి టి యు డబ్ల్యూ జే హెచ్ -143 యూనియన్ ఏర్పాటు వరకు ఆయన అత్యంత కీలకంగా పని చేశాడు.ఉద్యమ వార్తలను, తెలంగాణలో జరిగిన వివక్షతను చూపిస్తూ అనేక వార్తా కథనాలను అందించారు. తెలంగాణ చైతన్యాన్ని మరింత విస్తృతపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కుట్రలు కేసులు... వేధింపులు
ప్రజల పక్షాన, అన్నార్తుల పక్షాన నిలబడి కలం కార్మికుడిగా పనిచేయటం నేరంగా పరిగణించారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని పలుమార్గాలలో ప్రయత్నించారు. అక్రమ కేసులు బనాయించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. కోర్టు కేసులు నమోదు చేశారు.నిజాన్ని వార్తగా మలిచి జనం గుండెచప్పుడుగా నిలబడవద్దని, ఇంటిపై దాడులకు దిగారు. పాలకులు, పోలీసుల ద్వారా మునీర్ ను కిడ్నాప్ చేయించి సంబంధం లేని ప్రశ్నలు వేస్తూ వేధించారు. పరువు నష్టం కేసులు దాఖలు చేసి కోర్టు చుట్టూ తిప్పారు. బెదిరింపులకు దిగారు. అయినా ప్రజలు, కార్మికులు, కోల్ బెల్ట్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల సహకారంతో వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న దీశాలి. ఆయన ఎవరి ముందు చేయించాచి అడగకుండా సింగరేణిలో ఉద్యోగం చేశారు. వార్తలు రాయటం ప్రవృత్తిగా జీవితం కొనసాగించారు. పత్రికలో ఉద్యోగం చేయకుండా కేవలం తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే తెలియపరిచే వారు. దీనిని నేరంగా చూపుతూ ఆయనను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పేరిట బదిలీ చేయించారు. మునీరే చొరవ చూపి తన బదిలీతో పాటు ఇతరుల బదిలీలను కూడా నిలిపివేయించాడు.

భయాన్ని జయించాడు

ఉద్యోగికి బదిలీ ఒక శిక్ష.అది సింగరేణిలో ఇంకా పెద్ద
శిక్ష.సింగరేణి ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తారు. బంధుమిత్రులు అంతా  సమీప గ్రామాలలో ఉంటారు. ఉద్యోగులను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం వలన ఇబ్బంది పడతారు. మునీర్ పోలీస్ కేసులకు, బెదిరింపులకు లొంగడం లేదు. దీంతో ఈ ప్రాంతంలోనే ఉండకుండా చేయాలని ఓ కార్మిక నాయకుడు కుట్ర చేసి, అవినీతి అధికారుల అండతో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బదిలీ చేయించాడు
ప్రశ్నించడమే నేరమైతే, నేను మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తాను..
ఆ దారిలోనే బతకంతా ప్రయాణిస్తాను. అంటూ తన తొమ్మిదేళ్ల సర్వీసును వదులుకొని, ఆర్థికంగా లక్షలాది రూపాయలను నష్ట పోవడానికి సిద్ధపడి సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
పూర్తిస్థాయి ఆంధ్రజ్యోతి ఉద్యోగిగా మారిపోయాడు. మంచిర్యాల స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలను స్వీకరించారు.ఉన్నదాంట్లో సర్దుకుంటూ కుటుంబాన్ని పోషించాడు.

పలుకుబడి ప్రజల కోసమే..

సుదీర్ఘకాలం నాయకుడిగా, జర్నలిస్టుగా పనిచేయడం వలన మునీర్ కు సమాజంలో పలుకుబడి, గౌరవం ఏర్పడ్డాయి. ఆయన పలుకుబడిని వ్యక్తిగత స్వార్థానికి ఏనాడు ఉపయోగించు కోలేదు. సింగరేణి లో ఎంతోమంది కార్మికులను,  వేధించే అధికారుల నుంచి కాపాడిన చరిత్ర ఆయనది. పదోన్నతులు, బదిలీలు, షిఫ్ట్ మార్పులు, క్వార్టర్ కేటాయింపులు,  ఉద్యోగ నియామకాలలో అధికారుల వేధింపు, జాప్యం పై ఉన్నత స్థాయి అధికారులతో సంప్రదించి, సమస్యలను పరిష్కరించేవాడు. తన దగ్గరకు వచ్చిన సామాన్య ప్రజానీకానికి ఆప్తుడిగా మారాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురయ్యే కష్టాలను దూరం చేయడానికి రాజకీయ నాయకులు, పరిపాలనాధికారులతో ఉన్న స్నేహాన్ని వినియోగించేవాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి