మందమర్రి భూస్వామి హత్య.
మందమర్రి దోరగా రాష్ట్రంలోనే ఖ్యాతి పొందిన, భూస్వామి శ్రీపతిరావుకు వందల ఎకరాల భూములు, ఆస్తులు,పశువులు కలిగి ఉన్నాడు. పాలేర్లు జీతగాళ్లు పెద్ద సంఖ్యలో ఆయన వద్ద పనిచేసేవారు. సమీప ప్రాంతంలోని సారా దుకాణాలు ఆయన ఆధ్వర్యంలోనే నడిచేవి.అన్ని దొర గడీల లాగానే ఈయన గడి ముందు నుంచి కూడా ప్రజలెవరు తలపాగా చుట్టుకొని, చెప్పులు తొడుక్కొని, తలెత్తి నడవడానికి వీలులేని కాలం అది.
కచ్చీరు గద్దెపై ఎవరు కూర్చుని ఉన్న, లేకున్నా అటువైపు నుంచి నడిచే ప్రజలు తలపాగా తీసి, చెప్పులు చేతిలో పట్టుకొని, కచ్చీరు గద్దెకు నమస్కరిస్తూ,వంగి,వంగి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి తిట్లు, దేహశుద్ధి యధావిధిగా జరిగేది. దొర ప్రయాణించే సవారి కచ్చురం ఊరు మందమర్రి నుంచి బయలుదేరిందంటే ఆ రోడ్డు వెంట ఎవరు ఎదురుగా రాకూడదు.
దొర ప్రయాణించే బండికి కట్టిన ఎద్దు మెడలోని గంట శబ్దం విని ప్రజలు దారి నుంచి తప్పుకొని, తలవంచుకొని రోడ్డు పక్కన నిలుచునేవారు. ప్రభుత్వ అధికారులు, శాసనాలు చేసే ప్రజాప్రతినిధులు కూడా ఈయన మాటను దిక్కరించేవారు కాదు.
మందమర్రి పట్టణ నడిబొడ్డున ఆయనకు శ్రీకృష్ణ సినిమా టాకీస్ ఉండేది. సినిమా టాకీస్ కేంద్రంగా ఆయన కార్యకలాపాలు కొనసాగేవి. మందమర్రితో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా దొర అనుచరులు, మిత్రులు, గూండాల స్వైర విహారం అడ్డు, అదుపు లేకుండా కొనసాగేది.
మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పనిచేస్తున్నది. వీరి మాతృ సంస్థ అయిన కమ్యూనిస్టు పార్టీ మందమర్రి,బెల్లంపల్లి, మంచిర్యాల, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్, చెన్నూరు, నెన్నెల ప్రాంతాలలో అప్పుడప్పుడే బలపడుతున్నది.
కమ్యూనిస్టు పార్టీ శాఖలను గ్రామ, గ్రామాన బలోపేతం చేస్తూ, మందమర్రి, రామకృష్ణాపూర్ బెల్లంపల్లి ఏరియాలలో పనిచేసే బొగ్గు గని కార్మికులకు అండగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాడుతున్నారు. కార్మికుల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేయడం వలన వీరికి కార్మికుల్లో మంచి పట్టు లభించింది.
సింగరేణి అధికారులకు, కాంట్రాక్టర్లకు, చుట్టుపక్కల చిన్న చిన్న పరిశ్రమల యజమానులకు *దొర*, కాంగ్రెస్ నాయకుడు శ్రీపతిరావు అండదండలు పుష్కలంగా ఉండేవి. కాంట్రాక్టర్ల దోపిడీ, గుండాయిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నాయి. వీరి పోరాటాలు,దొర ఆదిపత్యానికి సవాలుగా మారాయి. ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
ఈ పరంపరలో 1980 సంవత్సరంలో **""తేదీ రాయాలి**""" నాడు రాత్రిపూట మందమర్రి సినిమా హాల్ సమీపంలోనే శ్రీపతిరావు దొరను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శ్రీపతిరావు హత్య కోల్ బెల్ట్ ఏరియా లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యను పోలీసు యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా భావించి, దర్యాప్తును ముమ్మరం చేసింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా ఉన్న వజీర్ సుల్తాన్ మరికొందరి ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. వారు ఇంటిలోనే ఉండడంతో వారిని విచారించి వెళ్లారు. కార్మిక నాయకుడు వి టి అబ్రహం, యువజన నాయకుడు మునీర్ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వీరి ఆచూకీ తెలియ రాలేదు. భార్యా పిల్లలను, కుటుంబ సభ్యులను కూడా వేరే ప్రాంతాలకు తరలించినట్టు పోలీసులకు సమాచారం అందింది. దొర హత్యతో ఆయన అనుచరులు ఆగ్రహంతో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తల ఇండ్లపై దాడులు చేశారు. దొరికిన వారిని చితకబాదారు. ఆస్తులను ధ్వంసం చేశారు. కార్మిక వాడలు, బొగ్గు గనులపై స్వైర విహారం చేస్తూ ఎర్ర జెండాకు అండగా ఉన్న వారిని కూడా వదిలిపెట్టకుండా చితకబాదరు.. వీరికే పోలీసులు రక్షణగా ఉన్నారని కార్మిక లోకం కోడై కోసింది.
సిపిఐ కార్యాలయానికి నిప్పు
మందమర్రి భూస్వామి శ్రీపతిరావును సిపిఐ శ్రేణులు హత్య చేశారనే బలమైన అనుమానంతో పట్టణంలోని సిపిఐ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను తగలబెట్టారు. ఎర్రజెండా గద్దెను కూల్చివేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుల, సానుభూతిపరుల ఇళ్లపై దాడులు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసుల గాలింపు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. వీరు ఇండ్లపై దాడి చేసి మగవాళ్ళు లేకుంటే మహిళలను బండబూతులు తిడుతూ, ఇంట్లోని తినుబండారాలను, నిత్యావసర వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. తినే వాటిలో కిరోసిన్ కలిపి నాశనం చేస్తున్నారు. మగవాళ్ళను వ్యాన్లలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. చిత్రహింసలకు గురి చేశారు మహిళలు పిల్లలను రాయడానికి వీలులేని భాషలో తిట్టేవారు.
పట్టణంలో యదేచ్ఛగా కొనసాగుతున్న భౌతిక దాడులు, విధ్వంసంతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం గడిపారు. ఎప్పుడు ఏ వైపు నుంచి గుండాలు దాడి చేస్తారో, ఏ దుర్వార్త వినవలసి వస్తుందోనని ప్రజలు భయాందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించారు.
ఆచూకీ తెలియకుండా తప్పించుకుని తిరుగుతున్న కార్మిక నేత వి టి అబ్రహం, యువజన నాయకుడు మహమ్మద్ మునీర్ కోసం పోలీసులు విస్తృతమైన గాలింపు చేస్తున్నారు. హత్య కేసును దర్యాప్తు చేయడానికి డిఎస్పి విజయేందర్ రెడ్డి,సిఐ రాజు, ఎస్సై చిత్తరంజన్, హెడ్ కానిస్టేబుల్ నాయుడు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృతంగా గాలింపు, దర్యాప్తు కొనసాగించారు.
అజ్ఞాతంలోకి మునీర్
శ్రీపతిరావు హత్య విషయం తెలిసిన తర్వాత మునీర్ ఆత్మ రక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్లాడు. మొదట చండ్ర పహాడ్ గ్రామంలోని సిపిఐ సానుభూతిపరుడి ఇంట్లో తలదాచుకున్నాడు. మందమర్రి మార్కెట్ సమీపంలో యునాని వైద్యుడిగా పేరు గడించిన మునీర్ తాత ఇంటిలో రెండు రోజులు ఉన్నాడు.ఆ సమయంలో మల,మూత్రాల విసర్జనకు కూడా బయటకు వెళ్ళనివ్వలేదు. ఆయన తాతనే మల,మూత్రాలను పట్టి బయట వేశాడు. ఆయన చిన్నాన్న ఇంట్లో మరో రెండు రోజులు ఉన్నాడు. అనంతరం ఆ ఇల్లు ఖాళీ చేసి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని అయ్యప్పగుట్టపై తలదాచుకున్నాడు. కొరియర్ మూడు రోజులపాటు గుట్టపైకి భోజనం తీసుకువచ్చాడు. పట్టణంలో జరుగుతున్న విషయాలను చేరవేశాడు. నాలుగవ రోజు కొరియర్ రాలేదు. ఆయన రాకపోవడాన్ని మునీర్ అనుమానించాడు. గుట్ట పైకి వచ్చే మార్గాన్ని అనుక్షణం, అప్రమత్తతతో గమనిస్తున్నాడు. 24 గంటలు గడిచినా కొరియర్ రాలేదు. ఆయన వద్ద ఉన్న తిండి,మంచినీరు కూడా అయిపోయాయి. ఈ ప్రాంతం సురక్షితం కాదని, అక్కడనుండి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాడు. చీకటి పడుతుండగా గుట్ట దిగటం ప్రారంభించాడు. ఒకవైపు ఆకలి బాధ, మరోవైపు వెల్తురు సరిగా లేకపోవడంతో నడక తడబడుతున్నది. ఎండాకాలం వేడిగాల్పులతో నోరు ఎండిపోతున్నది.విపరీతమైన దప్పికతో తల్లడిల్లుతున్నాడు. గుట్టదిగే మార్గంలో ఒక దగ్గర బురదమడుగు కనిపించింది.
ఆ మడుగులోని నీళ్లు ముడ్డి కడగడానికి కూడా పనికిరాని విధంగా ఉన్నాయి. గొంతు తడారి పోతుండడంతో గత్యంతరం లేక మోకాళ్లపై వంగి ఆ నీటినే నోటిలోకి పీల్చు కోవడం జరిగింది. నీటితోపాటు బురద కూడా మునీర్ కడుపులోకి వెళ్ళింది. ఆ సమయంలో అదే వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చినట్లయ్యింది. మెల్లగా గుట్ట దిగి చీకటిలోనే పరిసరాలను గమనిస్తూ, అలికిడి వింటూ బెల్లంపల్లిలోని సిపిఐ నాయకుడు గుండా మల్లేషన్న ఇంటికి చేరుకున్నాడు.
మల్లేషన్నతో పాటు ఆయన భార్యతో కూడా మునీర్ కు పరిచయాలు ఉన్నాయి. రాత్రిపూట ఇంటికి చేరిన మునీర్ అడుగు తీసి అడుగు వేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. ముఖము పీక్కుపోయింది. ఒళ్లంతా చెమట వాసన. దీనిని మల్లేషన్న గమనించాడు.వెంటనే స్నానానికి, భోజనానికి చక చకా ఏర్పాట్లు చేయించాడు.
మునీర్ స్నానం చేసి, భోజనం చేసిన తర్వాత, ఆయనను వేరే షెల్టర్ లో పడుకోవడానికి ఏర్పాటు చేశాడు.అక్కడి నుండి బెల్లంపల్లి ఏఐటీయుసీ నాయకుడు కుమారస్వామి అత్తగారింట్లో రెండు రోజులు ఉన్నాడు. ఈ విషయం కుమారస్వామికి తెలియదు.
మునీర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సమాచారం మల్లేష్ అన్నకు ఉన్నది. ఇక్కడ మునీర్ ఉండడం శ్రేయస్కరం కాదని, మల్లేషన్న భావించాడు. ఆయన తల్లిదండ్రులు పనిచేసే మహారాష్ట్రలోని బల్హార్ష ప్రాంతంలో మునీరు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాడు. మల్లేషన్న తమ్ముడిని వెంటబెట్టుకుని మునీర్ బల్హార్షా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాడు.
కార్మిక నాయకుడు కుమారస్వామి అత్తగారి ఇంటికి రాత్రిపూట మల్లేష్ అన్న తమ్ముడు గుండా వెంకటి చేరుకున్నాడు.
మహారాష్ట్ర పయనం...
గుండా వెంకటి వెంట రాగా మునీర్ బెల్లంపల్లి శాంతిఖని వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. బొగ్గు రవాణా చేసే లారీలు శాంతిఖని నుంచి మహారాష్ట్రకు వెళ్తాయి. లారీ క్లీనర్లుగా అవతారమెత్తిన ఇరువురు,పోలీసుల కళ్ళుగప్పి బొగ్గు లారీలో మహారాష్ట్రలోని బల్హర్షకు పయనం కట్టారు.
గుండ మల్లేషన్న తల్లిదండ్రులు ఇరువురు బొగ్గు గని కార్మికులే. మునీర్ బల్హర్ష లోని మల్లేషన్న తల్లిదండ్రుల నివసించే ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వి టి అబ్రహం ఉండడంతో మునీరుకు కొండంత బలం వచ్చినట్లయ్యింది.
తల్లిదండ్రులకు మునీర్ ను అప్పగించి, ఆయనను మంచిగా చూసుకోవాలని, అన్ని జాగ్రత్తలు చెప్పి మునిరన్న నుంచి తల్లిదండ్రుల నుంచి సెలవు తీసుకొని వెంకటి బెల్లంపల్లికి తిరిగి వచ్చాడు.
కొద్ది రోజులు అక్కడ వున్నారు. మందమర్రిలో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. పోలీసుల దాడులు, గుండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
దీంతో అబ్రహం కేరళకు పయనమయ్యాడు.
మునీర్ కు పరిచయం ఉన్న విద్యార్థి హైదరాబాదులో ఉంటున్నాడు. ఆయనతో సంప్రదించి ఆయన ఉండే హాస్టల్ చేరుకున్నాడు. హైదరాబాదుకు చేరుకున్న మునీర్ ను ప్రపంచ కార్మిక నేత కేఎల్ మహేంద్ర కలుసుకొని పరామర్శించారు. ఆనాటి సిపిఐ హైదరాబాద్ నగర నాయకుడు ప్రభాకర్ ఎంతో అభిమానం, ఆప్యాయతతో మునీర్ కు అండగా నిలబడినాడు.
పోలీస్ అధికారులతో కమ్యూనిస్టు నాయకుడు మల్లేషన్న సంప్రదించి, బెల్లంపల్లిలో పోలీసులకు మునీర్ ను అప్పగించాడు.
మునీర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగం...
తీవ్రమైన చిత్రహింసలు
పోలీసుల అదుపులోకి వచ్చిన మునీర్ ను కసితీరా కొట్టారు. రోజుల తరబడి రామకృష్ణాపూర్, మంచిర్యాల, లక్షెట్టిపేట, మందమర్రి పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ విచారించారు. చిత్రహింసలు పెట్టారు. హత్య ఎలా చేశారు. హంతకులు ఎవరు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు. హత్యకు వాడిన ఆయుధాలు ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయి అంటూ విచారణ చేశారు. విచారణలో భాగంగా రోకలిబండ ఎక్కించడం, రాకెట్ వేయడం జరిగింది. తలకాయను గోడకు కోట్టడంతో నుదురు పగిలిపోయి, తీవ్ర రక్తస్రావం అయింది. కటింగ్ ప్లేయర్ తో కాళ్ళ గోర్లను పీకారు. చాతి మధ్యలో సిగరెట్ తో కాల్చిన గాయం మరకగా మారింది.అది ఇప్పటికీ కనబడుతుంది. చేతులపైన సిగరెట్లతో కాల్చారు. బూటు కాళ్లతో ఎక్కడపడితే అక్కడ తన్నారు. ఒంటిపై విరిగిన లాటీలకు లెక్కలేదు.
పోలీసులు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా హత్యతో మాకు సంబంధం లేదు. మేము చేయలేదు. అనే మాట తప్ప,మరో మాట మునీర్ నోటి నుండి రాబట్ట లేకపోయారు. లాఠీ దెబ్బలకు మునీర్ ఎడమ చేయి చిటికన వేలు నరం తెగిపోయింది. ఇప్పటికి ఆ వేలు వంకరగానే ఉంది.
సి.ఎస్.పి కాంటా వద్ద గూండాలు జరిపిన గాడిలో మునీర్ తల పగిలి కుట్లు పడ్డాయి. ఒంటిపై గాయాలు పూర్తిగా మానలేదు.
మునీర్ నుంచి సమాచారం రాబట్టాలని మందమర్రి పోలీస్ స్టేషన్లో పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆయన తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. మందమర్రిలో పోలీస్ డాక్టర్ గా పేరున్న రామారావును పోలీస్ స్టేషన్ రప్పించారు. మునీర్ ను ఆయనకు చూపించి, చికిత్స చేయమన్నారు. మునీర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఇంకా కొడితే చనిపోతాడని చెప్పాడు. ఇక్కడ చికిత్స చేయలేనని, ఆసుపత్రికి తీసుకురావాలని చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను హాస్పటల్ తరలించి చికిత్స చేయించారు.
శాంతి భద్రతల పరిరక్షకుడిగా, గుండాల పాలిట సింహ స్వప్నంగా పేరు గడించిన ఎస్సై రామస్వామిని ఖమ్మం జిల్లా నుంచి బదిలీ చేసి మందమర్రి ఎస్సైగా నియమించారు.
ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామస్వామి, భూస్వామి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న మునీర్ ను విచారించాడు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి చేతులకు బేడీలు వేసి మునీర్ ను సాయంత్రం సమయంలో మందమర్రి మార్కెట్ కు తీసుకువచ్చారు.
పోలీస్ వ్యాన్ నుంచి మునీర్ ను కిందకు దింపి బహిరంగంగా లాఠీలతో కొట్టడం ప్రారంభించారు. ఈ విషయం పట్టణంలో గుప్పుమంది. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మందమర్రి మార్కెట్ వద్దకు తరలివచ్చారు.
పోలీసుల దెబ్బలకు భయపడకుండా
మేం ఉద్యమకారులం... గూండాలం కాదు...
ఏం కొడుతున్నావు... దమ్ముంటే చేతులకు ఉన్న బేడీలు తీయండి అంటూ మునీర్ పోలీసులకు సవాల్ విసిరుతున్నాడు. మార్కెట్లో ఉన్న ప్రజలు మునీర్ కు మద్దతుగా పోలీసు జులుం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు.. ప్రజల సంఖ్య, నినాదాల జోరు పెరగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మునీర్ ను మళ్లీ పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.
పోలీస్ అదుపులో మునీర్ ఉన్న విషయం స్థానిక పార్టీ నాయకులు, ప్రజలకు తెలియదు.మార్కెట్ సంఘటనతో మునీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని, చిత్రహింసలకు పాల్పడుతున్నారనే విషయం తెలిసింది.పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడినట్లు పోలీసులు గమనించారు. మునీర్ అరెస్టుకు నిరసనగా బొగ్గు గనుల్లో సమ్మె జరిగే పరిస్థితి నెలకొన్నదని పోలీస్ అధికారులకు సమాచారం అందింది.తాజాగా నెలకొన్న పరిస్థితిపై పోలీసు అధికారులు సమీక్ష చేసి, అదే రోజు రాత్రి లక్షెట్టిపేట మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట మునిర్ ను హాజరు పరిచారు.ఆయన రిమాండ్ రిపోర్టు రాయడంతో నిజామాబాద్ జైలుకు తరలించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి