15, డిసెంబర్ 2024, ఆదివారం

 జైలు జీవితమూ ఒక   పోరాటమే !

 నిజామాబాద్ జైలు

నిజామాబాద్ జైలు చరిత్ర చాలా గొప్పది .  
తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహాకవి  దాశరథి, వట్టికోట ,సర్దార్ని జమలాపురం కేశవరావు లు 1948 లో ఏ జైలు లోనే బంధించబడ్డారు . నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి శిక్ష అనుభవించిన దాశరథి, వట్టికోట జైలు లోపల రచనలు చేశారు . 'నా తెలంగాణా కోటి రతనాల వీణ ' పద్యాలు దాశరథి ఈ జైలు లోనే రాశాడు . 1949 లో దాశరథి రచించిన 'అగ్నిధార కావ్యాన్ని ప్రచురించగా ఇందులో కనీసం సగం కవితలు ఈ జైలు లో రాసినవేనని ,ఆల్వారు స్వామీ 1955 లో ప్రచురించిన 'ప్రజలమనిషి ' నవలలో హీరో కంఠీరవం జైలు జీవితం గురుంచి తెలియ జెప్పిన ఒక అధ్యాయం అంతా ఇక్కడి అనుభవాలేనని చరిత్రకారులు చెపుతున్నారు . హైదరాబాద్ సంస్థానం భారత్ దేశం లో విలీనం ఐయన తర్వాత కూడా దాదాపు 2012 వరకు ఇది జైలు గానే కొనసాగింది .  
 

 మందమర్రి భూస్వామి శ్రీపతిరావు హత్య కేసులో నిందితులుగా పేర్కొన్న మునీర్ తో పాటు మరో 28 మందిని 1982 సంవత్సరం లో నిజామాబాద్ జైలులో పెట్టారు . కోర్టు ఆదేశంతో పోలీసులు  వారిని నిజామాబాద్  జైలు కు    తీసుకువచ్చారు .  జైలు అధికారులు వారిని  తనిఖీ చేసి,లోనికి అనుమతించారు. 
అప్పటికే అక్కడ విచారణ ఖైదీలుగా వివిధ నక్సలైట్ గ్రూపుల నాయకులు సాయినాథ్,  గజ్జల గంగారాం తమ్ముడు గజ్జల కమలాకర్, పోశెట్టి, సమితి ప్రెసిడెంట్ అశోక్, కాంగ్రెస్ నాయకులు ఆఫ్జల్,తోట మధుసూదన్ రావు ఉన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తపాలాపూర్ హత్య కేసు నిందితులు కూడా మునీర్ బృందానికి జైల్లో కలిశారు. వారందరితో కలిసి మాట్లాడడం, చర్చించడం వీరికి ఒక  దినచర్యగా మారింది.

సన్నబియ్యం అన్నం కోసం  నిరాహార దీక్ష

 విచారణ ఖైదీలకు జైల్లో వడ్డించే భోజనంలో పురుగులు వచ్చేవి. దొడ్డు బియ్యం వండి పెట్టేవారు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన రేషన్ కూడా సక్రమంగా ఇచ్చేవారు కాదు. మంచి భోజనం కోసం మధ్యాహ్నం సమయంలో మునీర్ నేతృత్వంలో నినాదాలు ఇస్తూ , ఆందోళన చేసేవారు . వీరి నిరసనకు జైలు అధికారులు ఏమాత్రం స్పందించలేదు.  పై  అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం ఖైదీలు  నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీనితో జైలు అధికారులు దిగివచ్చి సన్నబియ్యం వండుతామని హామీ  ఇచ్చారు.  ఆ హామీతో ఖైదీలు నిరాహార దీక్ష విరమించారు . 
మందమర్రి భూస్వామి హత్య కేసులో నిందితులుగా వచ్చిన వారి సంఖ్య(28) ఎక్కువ. కాబట్టి  ప్రతి విషయానికి అందరు కలిసి , జైలు అధికారులతో వాగ్వివాదానికి దిగేవారు .. వీరి ఐక్యత జైలు సిబ్బందికి పెద్ద తలనొప్పిగా ఉండేది . . 

మోగిన సైరన్ 

నిజామాబాద్ జైలు మధ్యలో నీటి ఫౌంటెన్ ఉంది. మునీర్ మిత్రుడు భోజాలు  మధ్యాహ్నo భోజనం చేసి ఫౌంటెన్ వద్ద కూర్చుని ఉన్నాడు. అక్కడే ఉన్న మరో ఖైదీ కూర్చుని ఉన్నాడు.ఇరువురి మధ్య మాట మాట పెరిగి  అది కొట్లాట కు దారి తీసింది .  ఖైదీలు కొట్టుకుంటున్న విషయాన్ని గమనించిన  జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. జైలులోని సైరన్ ని  మోగించారు. 
అత్యవసర పరిస్థితిలో మాత్రమే మోగించే సైరన్  శబ్దాన్ని విన్న వెంటనే ఖైదీలు చేస్తున్న పనులను  ఎక్కడివక్కడ నిలిపివేయాలి. వేగంగా వారికి కేటాయించిన బ్యారక్ లోనికి చేరుకోవాలి.అది ;  జైలు నిబంధన . 
సైరన్ విన్న వెంటనే ఖైదీలందరూ తమ తమ బ్యారక్ లకు చేరుకున్నారు.
 1969 వ  సంవత్సరంలో ఒకసారి   మోగిన సైరన్, తిరిగి 1982 లోనే మోగటం ఒక  విశేషం. 

 మునీర్, అబ్రహం, భోజాలు, బాక్సర్ దాస్ మరియు   మరికొందరిని జైలర్ వద్దకు   తీసుకుని వెళ్లారు. 
జైలర్ ముందు ఖైదీల బట్టలు విప్పించారు. అబ్రహం, బాక్సర్ దాసుల సమక్షంలో మునీర్ ను  జైలు సిబ్బంది విపరీతంగా కొట్టారు . మునీరు ఏ తప్పు చేయలేదు.. దయ చేసి  కొట్టవద్దని అబ్రహం,బాక్సర్ దాస్ ఎంత బ్రతిమాలినా , జైలు సిబ్బంది వినిపించు కోలేదు . 
 కళ్ళకు గంతలు కట్టి మరీ  కొట్టారు .  ఆ తర్వాత మునీర్ ను ఒక  చీకటి గదికి తరలించారు .దాన్ని జైలు భాష లో 'గంజి ' అంటారు 
అప్పటికే హత్య కేసు విచారణ పేరిట, పోలీసులు కొట్టిన దెబ్బలకు  మునీర్  ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది.  మల విసర్జన చేసే సమయంలో అతనికి మలంతో పాటు రక్తం  పడేది . 


చీకటి గది (గంజి ) లో నిరాహార దీక్ష 


 ఎక్కువ తప్పులు చేసిన వారిని, అత్యంత వివాదాస్పద వ్యక్తులను చీకటి గదిలో బంధించటం జైలులో ఒక సంప్రదాయం .ఈ గదిలో ఖైదీతో పాటు  ఇతరులు ఎవరూ  ఉండరు. ఒంటరిగానే ఉండాలి . గదిలోకి కొద్దిపాటి  గాలి మినహా ఎలాంటి  వెలుతురు రాదు. మలమూత్రాల విసర్జన కూడా అక్కడే చేయాలి. కూర్చోవడం మినహా  అక్కడ నిటారుగా నిలబడలేము. గది ఎత్తు నాలుగు ఫీట్ల (అడుగులు ) లోపు ఉంటుంది. 
అలాంటి చీకటి కొట్లో  బంధించడం, మునీర్  పౌరుషాన్ని మరింత రెచ్చగొట్టింది . 
నన్నెందుకు కొట్టారో చెప్పాలి అంటూ అదే  చీకటి గదిలో నిరాహార దీక్షకు దిగాడు. 
నన్ను కొట్టడానికి అసలు  కారణం చెప్పాలని భోజనం తెచ్చిన పోలీసులతో వాదనకు దిగాడు. 
అన్నం తినను, నీళ్లు తాగను..  అంటూ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మునీర్ వద్దకు పోలీసులు రావడానికి ప్రయత్నించారు. పోలీసులను గదిలోకి రాకుండా అడ్డుకోవడానికి అన్నం తెచ్చిన సత్తు ప్లేటును (అల్యూమినియం గిన్నెను) ముక్కలుగా విరిచాడు.  దగ్గరకు వస్తే కోసుకుని చచ్చిపోతాను అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం ఇతర ఖైదీలకు, వారి ద్వారా జైలు బయట ఉన్న వ్యక్తులకు తెలిసింది. 
*ద హిందూ* ఇంగ్లీష్ దినపత్రికలో నిజామాబాద్ జైలులో ఖైదీ నిరాహార దీక్ష అంటూ వార్తా వచ్చింది. దీనితో జైల్లో జరిగిన సంఘటనపై విచారణ చేయడానికి రాష్ట్ర జైలు అధికారి రెడ్డి వస్తున్నారని మునీర్ కు  ఎవరో సమాచారం చేరవేశారు. ఇప్పటికైనా దీక్ష విరమించమని జైలర్ అబ్రహం ద్వారా మునీర్ కు చెప్పించారు. అబ్రహం  మాటతో మునీర్ గది నుండి బయటకు రావడానికి అంగీకరించాడు. 'గంజి' నుంచి బయటకు స్వతహాగా నడుచుకుంటూ రాలేకపోయాడు. పోలీసుల సహాయం లేకుండా  నడవ లేక పోయాడు.
 పోలీస్ దెబ్బలకు కాలి వేళ్ళు పగిలి రక్తం గడ్డకట్టింది.  పోలీసులు కొట్టిన దెబ్బలకు వీపులో  చర్మం కందిపోయింది. ఒంటినిండా గాయాలయ్యాయి. జైలు ఆసుపత్రిలో చికిత్స చేయించి మునీర్ ను  బ్యారక్ లోకి  తరలించారు. 
నాలుగు రోజుల తర్వాత 'షేనాకత్ పరేడ్' (గుర్తింపు ప్రక్రియ) చేపడతామని ముందుగానే మునీరుకు సమాచారం ఇచ్చారు.
షేనాకత్ పరేడ్ లో కొట్టిన జైలు సిబ్బందిని గుర్తించవద్దని, మీరు గుర్తిస్తే, మా ఉద్యోగాలు పోతాయని, కుటుంబాలు ఆగమవుతాయని జైలు సిబ్బంది స్వయంగా మునీర్ ను వేడుకున్నారు.  కాని  ,మునీర్ వారికి  ఏలాంటి వాగ్దానం  చేయలేదు . మునీర్ మొండితనం  జైలు సిబ్బందిలో మరింత  భయాన్ని  పెంచింది. 
పరేడ్ జరగటానికి  ముందు  రోజు  సాయంత్రం జైలు సిబ్బంది తో పాటు  వారి  భార్యాపిల్లలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, కుటుంబీకులు అందరూ మునీర్ వద్దకు వచ్చారు. తమ దుఃఖ పూరిత ముఖాల్ని చూసి , తమ కుటుంబాలను ఆదుకోవాలని, తమ వాళ్లను గుర్తించవద్దని ప్రాధేయపడ్డారు. వీరికి కూడా మునీర్ నుంచి ఎలాంటి  స్పష్టమైన హామీ దొరక లేదు.
విచారణాధికారి రెడ్డి నిర్ణీత సమయానుసారం జైలుకు చేరుకున్నాడు.
 నిజామాబాద్ జైలులో పనిచేసే మొత్తం 
 సిబ్బందిని ఒక వరుసలో నిలబెట్టారు.
అనంతరం మునీర్ ను పిలుచుకు రావాలని ఆజ్ఞాపించాడు. ఆయన ఆదేశంతో మునీర్ ఉన్న గది వద్దకు వెళ్లి  అతన్ని విచారణ గదికి తీసుకువచ్చారు. 
 బ్యారక్ నుండి వచ్చే సమయంలో  జైలర్   అబ్రహం కూడా జైల్ పోలీసులను క్షమించమని మునీర్  ను  కోరాడు.  కాని , ఆయనకు కూడా ఎలాంటి  స్పష్టత ఇవ్వకుండా నడుచుకుంటూ మునీర్  విచారణ గదికి వచ్చేసాడు . 
జైలు సిబ్బంది వరుస క్రమంలో నిలబడి ఉన్నారు. వారి వేపు చేయి చూపిస్తూ , వారిలో మిమ్మల్ని కొట్టిన వాళ్లు ఎవరో గుర్తించాలని విచారణాధికారి మునీర్ ను కోరాడు . జైలు సిబ్బందిని మునీర్   నిశితంగా పరిశీలించాడు . అనంతరం ,  విచారణాధికారి వైపు తిరిగి ..
 "వీళ్ళు ఎవరూ  నన్ను కొట్టలేదు " అని  చెప్పాడు 
జైలులో పనిచేసేది మొత్తం  వీళ్లే  మరి ! ఇక వీళ్లే  నిన్ను కొట్టనప్పుడు, మరెవరు కొట్టి ఉంటారని  విచారణ అధికారి ఆశర్యం తో తిరిగి ప్రశ్న  వేశాడు 
" ఏమో ", అన్నాడు  మునీర్ . 
అక్కడి నుండి  మునీర్ తో పాటు అందరూ వెళ్లిపోయారు. తిరిగి విచారణ అధికారి మునీర్ ను తన  దగ్గరకు  పిలుచుకున్నాడు. మునీర్ తో విడిగా మాట్లాడాడు . 
 "నీవు కమ్యూనిస్టువు, గొప్ప మానవతా వాదివి " అంటూ ప్రశంసించాడు.
 గొప్ప నాయకుడిగా ఎదుగుతావని  చెప్పి  భుజం తట్టి వెళ్లిపోయాడు.

ఉరిశిక్ష పడేటోడికి  పెండ్లి పిల్ల 

ఒకరి పట్ల ఈర్ష్య, ద్వేషం, పగ, సాధింపు ఉండరాదని "షేనాకత్" సందర్భంగా అప్పుడెప్పుడో  అమ్మ చెప్పిన మాటలు మునీర్ కు  జ్ఞాపకం వచ్చాయి. 
 తనను అంత నిర్దాక్షిణ్యంగా   కొట్టిన జైలు సిబ్బందిని అందుకే అంత "ఈజీ' గా  క్షమించ గలిగాడు . తనను వారెవ్వరూ  కొట్టలేదని అబద్దం  చెప్పాడు .
షేనాకత్ పరేడ్ లో మునీర్ వ్యవహరించిన తీరు జైలు సిబ్బందిలో, వారి కుటుంబాలలో  ఎంతో మార్పు ని తీసుకు వచ్చింది . జైలు సిబ్బంది  అందరూ మునీర్ అభిమానులుగా మారిపోయారు. ఈ సంఘటనతో సిబ్బంది  తమ ఇంటి నుంచి  భోజనం, టిఫిన్స్ తెచ్చి మునీర్ మరియు అతని మిత్రులకు ఇవ్వడం ప్రారంభించారు.
ఖైదీగా ఉన్న మునీర్ కు జైలు సిబ్బందికి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. మునీర్ వ్యక్తిగత వివరాల ను  జైలు సిబ్బంది సేకరించారు.
  ముస్లిం మతానికి చెందిన ఒకాయన తమ  అమ్మాయిని  మునీర్  కి  ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చాడు . 
ఖైదీగా ఉన్న వ్యక్తి, అందులోనూ హత్య కేసు నమోదై ఉంది.చాలా కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అన్ని విషయాలు తెలిసి కూడా మునీర్ కు పిల్లను ఇవ్వటానికి ముందుకు రావడం అంటే  అదీ    మునీర్  వ్యక్తిత్వం. . 
అయితే ,మునీర్ సహచరులు మాత్రం  "ఉరిశిక్ష పడేటోడికి  పెండ్లి పిల్ల కావాలంట"..  అంటూ  
"బనాయుంచే" వారు . 

గ్యాంగ్ లీడర్ మునీర్ 

గాంధీ జయంతి సందర్భంగా  నిజామాబాద్ జైలులో ఖైదీలకు సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. మునీర్ బృందం ఒక  నాటకం వేయడానికి ముందుకు వచ్చారు. ప్రజానాట్యమండలి కళాకారుడుగా పనిచేస్తున్న భోజాలు వీరితోనే ఉన్నాడు.
 "భారత్ లో దొంగ" అనే నాటిక వేయటానికి సంసిద్ధులయ్యారు.ఇందుకోసం రిహార్సల్స్ చేశారు. అందులో పాత్రధారులుగా;
దొంగ-మునీర్, 
దొంగ తండ్రి - లక్ష్మణ్,
 దొంగ తమ్ముడు- అశోక్,
 భూస్వామి - గజ్జల కమలాకర్, 
గుండాలు -- బోజాలు,అఫ్జల్
 కారోబార్ - దొంతుల రాజo, 
 మరియు 
రచయిత - అబ్రహం, 
దర్శకుడు గా  తోట మధుసూదన్ పనిచేశారు.

 నాటిక కథా  సారాంశం

 బాగా చదువుకుని పట్నంలో ఉద్యోగం చేయాలనే ఆశయంతో ఒక  గ్రామీణ యువకుడు చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పట్టుదలతో చదివి పీజీ పూర్తి చేశాడు. ఉద్యోగం వేటలో పట్నం వెళ్ళాడు.పట్నంలో తెలిసిన వాళ్ళు ఎవరూ  లేరు. ఉదయం పూట వివిధ ప్రాంతాలలో తిరిగి  , తిరిగి , రాత్రి పార్కులో బెంచ్ పై పడుకుంటాడు. రాత్రిపూట పెట్రోలింగ్ చేసే పోలీసుల కంటబడతాడు ఆ  యువకుడు . పార్కులోని బెంచి పై పడుకొని ఉన్న అతన్ని   నిద్రలేపి పొలిసు ప్రశ్నలు వేస్తారు .  యువకుడి సమాధానాలు సరిగానే ఉన్నా ,అతని  వద్ద ఉన్న డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో పోలీసులు లంచం అడుగుతారు. 
"నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యోగం కోసం వచ్చాను. పేదవాడను", అని ఎంత బతిమాలినా  పోలీసులు వినిపించుకోరు. పైగా "దొంగ" అని ముద్ర వేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తారు. 

బ్యాక్ గ్రౌండ్ లో *ఊరిడిసి నే పోతునా.. ఉరి పెట్టుకుని చచ్చిపోతునా" అంటూ యువకుడి కష్టాన్ని తెలిపే పాట వస్తూ ఉంటుంది.
 గ్రామ భూస్వామికి ఈ వ్యవహారం తెలిసి, ఆయన పోలీసులతో సంప్రదించి, యువకుడిని విడిపిస్తాడు గ్రామం ఇతివృత్తంగా సాగే ఈ నాటికలో భూస్వామి, ఆయన అనుచరులు, సిబ్బంది వ్యవహారం. పట్టణంలో పేదల పరిస్థితి, పోలీసుల పనితీరు, పోలీసులతో భూస్వామి సంబంధాలు, ఈ నాటికలో  కొట్టొచ్చినట్టు కనబడతాయి. 

గాంధీ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జడ్జి   మునీర్ గ్యాంగ్ ప్రదర్శించిన నాటికకు ఉత్తమ నాటికగా బహుమతి ప్రకటించాడు . నటీనటులను జడ్జి చాలా మెచ్చుకున్నాడు.  .
" కోర్టులో కేసుల విచారణ ; సాక్షులు , కాగితాలపై ఆధారపడి మాత్రమే  నడుస్తాయని, విశ్వాసానికి  నమ్మకానికి తావు ఉండదని మరియు  వ్యక్తిగతంగా  జడ్జీలకు రాగద్వేషాలు ఉండవని " జడ్జి ఇచ్చిన సందేశాన్ని మునీర్  ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాడు.

జైలు సిబ్బంది కొట్టిన దెబ్బలకు, మునీర్ ఒంటిపై ఏర్పడిన గాయాలు పూర్తిగా నయం కాలేదు.ముఖ్యంగా వీపు భాగంలో మూడు నెలల తర్వాత కూడా గాయం పచ్చిగానే ఉంది.అప్పటికే వీరిపై వివిధ కోర్టులలో నమోదైన 18 కేసుల వాయిదాలకు మునీర్ గ్యాంగును హాజరు పరచడం లేదు. ఆరోగ్యం కొంత మెరుగైన తర్వాత వీరిని లక్షెట్టిపేట కోర్టులో హాజరు పరిచారు.

 " మాకొద్దు   ఈ   నిజామాబాద్ జైలు"

కేసు వాయిదా ప్రకారం మునీర్ తో పాటు మిగతా 28 మందిని లక్షెట్టిపేట కోర్టు జడ్జి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. వీరి హాజరును పరీక్షించారు. కేసు మళ్లీ వాయిదా తేదీని జడ్జి ప్రకటించే సమయంలో
 "సార్ ! నాకు ఒక్క  నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వండి " అని   జడ్జిని మునీర్ కోరాడు  అందుకు జడ్జి సమ్మతించాడు . 

"సార్ ! మేము నిజామాబాద్ జైలుకు వెల్లము. దయచేసి మమ్ములను వరంగల్ జైలుకు పంపండి."
 "ఎందుకోసం  ?" అని  జడ్జి అడిగాడు 

 సార్ !  మిమ్మల్ని మీ ఛాంబర్ లో కలిసే అవకాశం ఒక్కసారి  ఇప్పించండి ! " అని  జడ్జిని ప్రాధేయ పడ్డాడు మునీర్ . 

 జడ్జి  చాలా  సానుకూలంగా స్పందించాడు .

 కోర్టు భోజన విరామ సమయంలో జడ్జిని, వారి చాంబర్ లో మునీర్  ఒంటరిగా కలిశాడు. నిజామాబాద్ జైలులో జరిగిన గొడవ,విచారణ విషయాలు  అన్నీ పూర్తిగా వివరించి చెప్పాడు .  తన ఒంటిపై ఉన్న గాయాలు, కాలుకు తగిలిన దెబ్బలు చూపించాడు.

 " దయచేసి నిజామాబాద్ జైలుకు పంపించవద్దని   విన్నవించుకున్నాడు . 
మునీర్  వాదనతో జడ్జి ఏకీభవించాడు .

   ఈ కేసులోని  ముద్దాయిలను వరంగల్ జైలుకు తరలించాలని జడ్జి  ఆర్డర్ జారీ చేశాడు .   మునీర్ అతని మిత్రులు ఎంతో సంతోషించారు. 
వీరందరినీ లక్షిట్టిపేట కోర్టు హాల్ నుంచి నేరుగా వరంగల్ జైలుకు  తరలించారు.

కోర్టు వాయిదా లో బిర్యాని పండుగ  

కోర్టు వాయిదాలకు హాజరయ్యే ఖైదీలకు వారి బంధువులు, మిత్రులు తీసుకువచ్చిన భోజనం, పండ్లు తినడానికి అవకాశం ఉండేది.  కోర్టు వాయిదాల తేదీని  ముందుగానే తెలుసుకొని బంధుమిత్రులు, కుటుంబీకులు వీరిని కోర్టు వద్ద కలుసుకోవడానికి ఎదురు చూసేవారు. పోలీస్ ఎస్కార్ట్ తో వచ్చిన తమ ఆత్మీయులను చూసి కంటతడి పెట్టుకునేవారు. పోలీసులను బ్రతిమాలి  ఖైదీలకు దగ్గరగా కూర్చుని మాట్లాడేవారు. యోగక్షేమాలు తెలుసు కునేవారు. ఆ సందర్భంలోనే ఇంటి నుండి తెచ్చిన భోజనం, పిండి వటలు, పండ్లు, ఫలహారాలు, సిగరెట్లు, బీడీలు ఖైదీలకు ఇచ్చేవారు.
మునీర్ తల్లి     హలీమా బేగం, మునీర్ తో పాటు జైలు లో  ఉన్న 28 మందికి సరిపడా బిర్యాని వండుకుని పెద్ద గంజు (వంట పాత్ర ) లో తీసుకువచ్చేది. మిగతా ఖైదీల బంధువులు తీసుకువచ్చే భోజనాలను అందరు కలిసి పంచుకొని, తినేవారు.

కమ్యూనిస్టుల అడ్డా... వరంగల్ జైలు

వరంగల్ జైలులో మునీర్ తో పాటు మరో  తొమ్మిది మందికి బెయిల్ రాలేదు. రెండున్నర సంవత్సరాలు వరంగల్ కేంద్ర కారాగారంలో ఉండాల్సివచ్చింది . 
జైలు, వీరికి కొత్త ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగించింది. అనేక కొత్త విషయాలను నేర్పింది .సమాజం పట్ల  వారి  బాధ్యతను గుర్తు చేసింది . 

. జైలు శిక్షలకు గురయ్యేది , విచారణ ఖైదీలుగా జైల్లోనే మిగిలి  పోయేది నిజంగా   నిరుపేదలు లేదా  కింది కులాల వారు  మాత్రమే ! ఈ సత్యం జైలు జీవితం లో అనుభవం లోకి వచ్చింది . 

 వరంగల్  జైల్లో నక్సలైట్ నాయకులు, నక్సలైట్  సానుభూతిపరులుగా పోలీసులు పేర్కొన్న వారందరినీ ఒకే బ్యారెక్.లో కలిపి ఉంచుతారు. దానిని నక్సల్  బ్యారక్ గా పిలిచేవారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా  పెద్ద సంఖ్యలో జైలుకు వచ్చేవారు.
జైలులో వార్తాపత్రికలు, పుస్తకాలు చదువుకునే అవకాశం ఉండేది. ఆటలు ఆడుకోవడానికి సమయం ఇచ్చేవారు. జైల్లో ఉన్న అవకాశాన్ని మునీర్ సద్వినియోగ పరుచుకున్నాడు. జైల్లో ప్రపంచ రాజకీయాలు, వివిధ దేశాల స్థితిగతులు, సామాజిక వ్యవహారాలు వైజ్ఞానిక  విషయాలపై వాదనలు, చర్చలు విస్తృతంగా కొనసాగేవి. మిత్రులకు, బంధువులకు, ఆప్తులకు ఉత్తరాలు రాసుకునే అవకాశం ఉండేది. పాటలు పాడేవారికి అక్కడ  అడ్డే లేదు.
నక్సల్ బ్యారక్ నుండి పాటల ఊట జాలు పారేది.  ఒక వ్యాపకం ఏర్పాటు చేసుకుంటే, జైలు జీవితాన్ని ఖైదీలు ఆనందంగా గడపవచ్చు. దోస్తానా ఉంటే జైలు కూడా ఇల్లు లాంటిదే. మన ప్రవర్తనతో మిత్రులను సంపాదించుకోవాలి, కాపాడుకోవాలి, బాధ, దుఃఖం, ఆవేశం, ఒంటరితనం అసహనం, కసి, పగ రగిలిపోయే రకరకాల వ్యక్తుల మధ్య జీవనం కొనసాగించాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైన మరుపురాని, మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తుంది.

మందమర్రి లో గుండాల దాడి, హత్య కేసు విచారణ సందర్భంగా పోలీసు చిత్రహింసలు, నిజామాబాద్ జైల్లో  సిబ్బంది దాడితో మునీర్ ఒంటి మీద  గాయాలు  లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదు . .మరిన్ని దెబ్బలను తట్టుకునే స్థితి శరీరానికి లేకుండా పోయింది. 
గుండె, మనసు రెండు గట్టివి కాబట్టి ఇంకా మన మధ్య జీవించి ఉన్నాడు.కాని, ఇటీవల ఆ గుండెకూ  గాయమైయుంది . 

               జైలులోని ఖైదీలతో మాట్లాడేందుకు కాకతీయ వైద్య విద్యార్థులు, వరంగల్ న్యాయవాదులు, న్యాయవిద్యను అభ్యసించే విద్యార్థులు వచ్చేవారు. వరంగల్ సీనియర్ న్యాయవాది జంగా భద్రయ్య, న్యాయ విద్యార్థిగా ఉన్న బోయినపల్లి వినోద్ తరచుగా మునీర్ బృందాన్ని కలిసేవారు.

హైదరాబాద్ దాదా కొత్త దాస్ వివాదం 

హైదరాబాద్ సిటీలో  పెద్ద దాదాగా పేరున్న కొత్తదాసును కూడా వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. అతను  పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్నాడు . కొత్త దాసును మొదట హైదరాబాద్ లోని చంచల్ గూడా జైలులో ఉంచారు. జైలు కేంద్రంగా  అతడు తన కార్యకలాపాలను  యధేచ్ఛగా కొనసాగించే   వా డు. తరచుగా సిబ్బందితో గొడవ పడేవాడు. అతని  ప్రవర్తనతో విసుగెత్తిన జైలు సిబ్బంది అతడ్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. 
 ఒక కేసు వాయిదాకు కొత్తదాసును కోర్టులో హాజరు పరచడానికి  వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లారు. తిరిగి వరంగల్ జైలుకు వచ్చే సమయంలో , కొత్త దాసు కు, పోలీసులకుమధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు కొత్తదాసును విపరీతంగా కొట్టారు. తుపాకీ బానెట్ తో పొడిచారు. రక్తపు మడుగులో తీసుకువచ్చి, జైలు గదిలో పడేశారు. దీనిని చూసి మునీర్ తట్టుకోలేకపోయాడు. కొత్త దాస్ పై పోలీసుల దాడి కి నిరసనగా ఆందోళన చేశాడు . కొత్తదాసును కొట్టిన సంఘటనపై పిటిషన్ రాసి జైలు అధికారులకు పంపించాడు. ఈ విషయం తెలిసి పిటిషన్ రాసిన మునీర్  ని  కలవమని ప్రముఖ నక్సలైట్ నాయకుడు రవూఫ్ కబురు పంపించాడు.

రవూఫ్ తో పరిచయం

కొత్త దాస్ పై పోలీసులు జరిపిన దాడికి వ్యతిరేకంగా స్పందించిన తీరు, ఉన్నతాధికారులకు రాసిన పిటీషన్ చూసి జైలులోని ప్రముఖులు మునీర్ ని  ప్రశంస లతో ముంచెత్తారు . 
ఖైదీల నుంచి భారీగా అభినందనలు వచ్చాయి. 
సిపిఐ ఎంఎల్ నాయకుడు రవూఫ్ కు న్యాయ శాస్త్రంలో ప్రవేశం ఉంది. కొత్త దాస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ మునీర్   పిటిషన్ లో పేర్కొన్న ముఖ్యమైన పాయింట్లు   చూసి  ఆశ్చర్య చకితుడయ్యాడు..
అందుకే  మునీర్ ను కలవమని ప్రత్యేకంగా  కబురు పంపించాడు. 
ఆయన రాగానే కరచాలనం చేసి, కూర్చోమన్నాడు. మునీర్ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఏం చదువుకున్నావని అడిగాడు, న్యాయ శాస్త్రంలో ప్రవేశం ఉందా అని ఆరా తీశాడు . 
"లేదు", అని మునీర్ ముక్తసరిగా  సమాధానం ఇచ్చాడు. దీంతో ఆయన ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒక క్రమ పద్ధతిలో, ఇంగ్లీషులో  పిటిషన్ ఎలా రాయగలిగావని ప్రశ్నించాడు.

 మందమర్రి ప్రాంతంలో కార్మిక నాయకుడిగా పనిచేస్తున్న వి టి అబ్రహం తో ఉన్న సహచర్యం, ఆయనతో కలిసి పనిచేయడం ఒక కారణం . .తాను ఉద్యోగం చేసే పని స్థలంలో సహోద్యోగి ఆంగ్లో ఇండియన్ లవ్ లిన్ అనే  క్లర్క్ తో ఉన్న స్నేహం మరో కారణం . వారు మాట్లాడే భాష, రాసే పద్ధతి నచ్చి నేర్చుకున్నానని చెప్పాడు
మునీర్ నిజాయితీ కి , ధైర్యానికి ఆయన  ఎంతో ముచ్చట పడ్డాడు ఆ తర్వాత వీరి మధ్య స్నేహం జైల్లో ఉన్నంతవరకు కొనసాగింది. అనేక విషయాలపై ఇరువురు చర్చించుకునేవారు.

రాఖీల రికార్డు...

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీల పండగ ఒకటి  మునీర్ కు జీవితాంతం  మరుపురాని అనురాగాన్ని మిగిల్చింది. అతను  జైల్లో ఉన్నప్పుడు  వచ్చిన   రాఖీల పండగ   సందర్భంగా  ఒక్క కోల్ బెల్ట్ ప్రాంతం నుంచే  దాదాపు మూడు వందల యాభై మూడు  (353 )రాఖీలు  పోస్టు ద్వారా జైలుకు వచ్చాయి. 
ముస్లిం మతస్థుడికి ఇంత పెద్ద సంఖ్యలో ఆడబిడ్డలు రాఖీలు పంపడం జైల్లో సంచలనంగా మారింది. 
రాఖీ పండుగ నాడు స్వయంగా ఆశీర్వదించడానికి  పెద్ద  సంఖ్యలోఆడబిడ్డలు రాఖీలు తీసుకొని భర్త పిల్లలతో, తల్లిదండ్రులతో కలిసి  జైలుకు  రావటo మరో విశేషం.
మునీర్ కు వచ్చిన రాఖీల విషయం తెలుసుకొని, జైలు అధికారి రియాజ్ అహ్మద్ ఆయనను తన చాంబర్ కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ని రాఖీలు జైల్ లోని ఒక వ్యక్తికి రావడం, అందులోనూ ముస్లిం మతస్థుడికి రావడం జైలర్, జైలు సిబ్బందిని కూడా ఆశ్చర్య  పరిచింది. ఈ రాఖీల పరంపరను చూసిన తర్వాత జైలులోని ఖైదీల అందరికీ రాఖీలు పంచాలని జైలర్ నిర్ణయించుకున్నాడు. జైలర్ సొంత డబ్బులతో మరో 350 రాఖీలు తెప్పించి, మునీర్ పేరుమీద అందరికీ కట్టించాడు.  జైలు చరిత్రలో ఇది   ఒక మర్చిపోలేని సంఘటన.

ఆదుకున్న న్యాయవాదులు...

కేసు గెలవటం కోసం  కోర్టుకు వచ్చే  ప్రతి వాళ్లకి  న్యాయవాదులకు భారీ మొత్తం లో  ఫీజులు చెల్లించటం ఒక తప్పనిసరి పరిస్థితి . 
మునీర్ నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కిన లక్షెట్టిపేట కోర్టు న్యాయవాదుల నుండి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ క్రిమినల్ లాయర్ గా పేరుపొందిన సి.పద్మనాభరెడ్డి, ప్రముఖ పౌర హక్కుల నాయకుడు కె జి కన్నాభిరాన్, చల్లా నర్సింహా రెడ్డి లాంటి న్యాయవాదులు మునీర్ క్రమశిక్షణకు, నిజాయితీకి ముగ్దులయ్యేవారు. 
కేసు వాయిదాలకు   హాజరు కావడానికి కూడా డబ్బులు లేని స్థితి మునీర్ ది.
 ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడే మునీర్ కు న్యాయవాదులే తొవ్వ ఖర్చులు, తిండి ఖర్చులు సమకూర్చేవారు.
న్యాయవాదులకు ఫీజు ఇవ్వాలని ఒక్కరు కూడా అడగకపోవడం  ఆ న్యాయవాదుల మంచితనం, మానవత్వానికి నిదర్శనం. 
హైకోర్టులో హత్య కేసు వాదనలకు వచ్చిన సందర్భంగా కేసు పై ఇచ్చిన నోట్ చూసి క్రిమినల్ లాయర్ పద్మనాభ రెడ్డి గారు ఆశ్చర్యపోయారు. ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్. కె ప్రోగ్రాంలో ప్రముఖ న్యాయవాది కె జి కన్నబిరాన్ తనకు ఇష్టమైన క్లయింట్ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు, "ఇద్దరు ఉన్నారని, అందులో ఒకరు మునీర్" అని పేర్కొనటం చాలా పెద్ద  విశేషం.

గుండె పిండిన విషాదం అది...

చేయని తప్పుకు జైల్లో నిర్బంధించబడిన తన సహచరుడు బోజాలు కొడుకు చనిపోయాడని కబురు వచ్చింది. తనకు తల కొరివి పెట్టవలసిన కొడుకే చనిపోయాడని, కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకో లేకపోయానని గుండెలు బాదుకుంటూ, ఏడ్చిన తీరు తాను ఎన్నటికీ మర్చిపోలేన ని  అంటాడు మునీర్ . మరో మిత్రుడు కనకరాజు భార్య కూడా అనారోగ్యంతో మరణించింది. కనకరాజుకుఈ దుర్వార్త ఎలా చెప్పాలో, ఎవరితో చెప్పించాలో అనే విషయమై జైలు సహచరులందరూ చాలాసేపు చర్చించుకున్నారు.
చివరకు అందరూ చుట్టూ చేరి, ఒకరి తర్వాత ఒకరుగా ఆ మాట, ఈ మాట చెబుతూ భార్య చనిపోయిన విషయం చెప్పారు. ఆ బాధను తట్టుకోలేక కనకరాజు గావు కేక పెట్టి, బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టాడు. పెళ్లినాటి నుంచి భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటూ ఏడ్చిన తీరు, కళ్ళముందు కదలాడుతుందని ఆత్మీయుల వద్ద చెబుతూ కంటనీరు పెట్టుకుంటాడు. ఒక  ఖైదీ జీవితం ఎలా   వుంటుందో అప్పుడే  అర్థమైందని చెబుతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి