6, డిసెంబర్ 2024, శుక్రవారం

kalinagar

పాకిస్థాన్ క్యాంప్  (కాళీ నగర్) కార్యకర్త హత్య 

 మందమర్రి బొగ్గు గని ప్రాంతాన్ని కళ్యాణి  ఖని  అని పిలుస్తారు . దాన్ని ఆనుకొని దక్షిణ  దిక్కుగా  రామకృష్ణాపూర్ అనే ఊరు ఉంటుంది  . అక్కడి బొగ్గు గనుల ప్రాంతాన్ని రవీంద్ర ఖని అని పిలుస్తారు .  సింగరేణి కంపెనీ వారు  ఈ పేర్లు నఖరారు చేస్తారు . ఈ రెండు గ్రామాల  సరిహద్దుల్లో  "పాకిస్థాన్ క్యాంపు" ఉండేది  .   బంగ్లాదేశ్(తూర్పు పాకిస్థాన్ ) కాందిశీకులకు భారత్ ప్రభుత్వం ఎంతో దయతో  చూపించిన నీడ ఇది . సింగరేణి కంపెనీ కేంద్ర కార్యాలయం ఉండే కొత్తగూడెం లో కూడా  ఇలాగే ఒక  "బర్మా క్యాంపు" ఉంటుంది . 
అయితే మందమర్రి లో ఉండే ఈ పాకిస్థాన్ క్యాంపు కాలక్రమం లో కాళీ నగర్ గా పేరు మార్చుకుంది . 

 1980  సంవత్సరం లో ఈ   ప్రాంతం లో ఒక  కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తను...... పేరు రాయాలి కాంగ్రెస్ గుండాలు దారుణంగా హత్య చేశారు. కుటుంబీకులు, పార్టీ శ్రేణులు హత్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులకే సహకరిస్తూ, బాధితులకు మరింతగా  వేధింపులకు గురి చేశారు. కార్యకర్త హత్యపై పోలీసుల వైఖరిని సిపిఐ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. వి.టి అబ్రహం, మునీర్ ఇతర ముఖ్య నాయకులు  సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్త అంతిమయాత్రను ఘనంగా నిర్వహించాలని,పోలీసుల వైఖరికి నిరసనగా ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు.ప్లకార్డులు,పోస్టర్లు సిద్ధం చేసే పనిని, జన సమీకరణకు, ప్రదర్శన సజావుగా సాగడానికి బాధ్యులను  నియమించారు. పార్టీ పిలుపుతో అమరుడి యాత్ర చేపట్టడానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు తరలివచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన ప్రారంభమైంది. హంతకులను అరెస్టు చేయాలని, పోలీసుల నిర్లక్ష్యం నశించాలని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన కదిలింది. పోలీసులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రదర్శనను అడ్డుకోవాలని పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున బలగాలను దింపారు.
అమరుడికి జోహార్లు అర్పిస్తూ,"హత్యా రాజకీయాలు నశించాలి, కాంగ్రెస్ గుండాలరా ఖబర్దార్, దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి, ఎస్సై చిత్తరంజన్ ను సస్పెండ్ చేయాలి " అంటూ ప్రదర్శన కొనసాగుతున్నది. భారీగా మోహరించిన పోలీసు బలగాలు మునీర్ ను లక్ష్యం చేసుకొని లాఠీచార్జి ప్రారంభించారు. ప్రదర్శనకారులపై ఇష్టారీతిన లాఠీలు ఝులిపిస్తూ మునీర్ వైపు కదులుతున్నారు. అప్పటికే సూర్యాస్తమయం అయింది. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. వీధి  దీపాలు వెలుగుతున్నా అవి సరిపడా వెలుతురు ఇవ్వటం లేదు.
పోలీసుల ఉద్దేశాన్ని గమనించిన పార్టీ క్యాడర్, ముఖ్య నాయకులు,మునీర్ ను అక్కడినుండి తప్పించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మునీర్ కు అడ్డుగా మహిళా కార్యకర్తలతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. మునీర్ మందమర్రి వైపు వెళ్తున్నట్టుగా పోలీసులకు నమ్మకం కలిగించారు.మహిళా క్యాడర్ ధైర్యంతో, చాకచక్యంగా మునీర్ కు రక్షణగా నిలబడి, పోలీసుల బెదిరింపులకు భయపడకుండా రామకృష్ణాపూర్ వైపు ఉన్న బ్రిడ్జి కిందకు తరలించారు. అప్పటికే  మునీర్ మిత్రులు అక్కడికి చేరుకున్నారు. వారి సహకారంతో సైకిల్ పై రామకృష్ణాపూర్ లో ఒక  షెల్టర్ కు చేరుకుని, తలదాచుకున్నాడు. పోలీసుల హడావిడి తగ్గేవరకు మునీర్  అక్కడే ఉన్నాడు . పోలీసుల ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా మునీర్ దొరక లేదు . 

 
మా తుజే సలాం !

 మునీర్ పై ఆయన తల్లి ప్రభావం చిన్ననాటి నుండి మెండుగా ఉంది. పిల్లల యెడల ఆమె కనబరిచే ప్రేమ, జాలి, దయాగుణం లక్షణాలు మునీర్ కు  కూడా వొంటబట్టాయి . 
కుటుంబం పెద్దది కావడంతో  ఇంటా ,బయటా    ఎదురయ్యే ఆర్థిక కష్టాలను అర్థం చేసుకోవడం  . తేలికయ్యుంది . తండ్రి సంపాదనకు అండగా నిలవాలని మునీర్ తనతో పాటు ఇద్దరు తమ్ముళ్లు స్కూలు నుంచి వచ్చిన తర్వాత, స్కూలు సెలవు దినాలలో చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు . కష్టం విలువ చిన్నప్పటినుంచే   మునీరుకు తెలుసు. శ్రమకు , శ్రామికులకు ప్రథమ గౌరవం  ఇచ్చేవాడు . 

మందమర్రి లోని సి-55 క్వార్టర్ లో మునీర్ కుటుంబం నివసించేది. సి -  క్వార్టర్ అంటే ఆఫీసర్ క్వార్టరే !  వీరి ఇంటి వెనకాల కార్మికుల గుడిసెలు ఉండేవి. కార్మిక కుటుంబాల నీటి అవసరాలను తీర్చడానికి ప్రతి వీధిలో ఒకటి, రెండు సామూహిక నీటి పంపులు ఉండేవి. ఆనాడు ఇంటింటికి నల్లాలు లేవు. వీధి పంపులలో నీళ్లు ఎప్పుడు వస్తాయో? ఎవరికీ తెలియదు. కాని , సి క్లాస్ క్వార్టర్లకు మాత్రం నిర్ణీత సమయానుసారం, ఎక్కువ సమయము నీళ్లు వచ్చేవి. తమ అవసరానికి సరిపడా నీళ్లను నింపుకునే వారు.ఆ  తర్వాత మునీరు తల్లి హలీమా బేగం నీటి పైపును ఇంటి వెనకాల ఉండే కార్మిక కుటుంబాల వైపు వేసేది. వారిని పిలిచి నీళ్లు పట్టుకోమని చెప్పేది.నీళ్లు పట్టుకోవడానికి వచ్చే మహిళలతో క్రమేపి మునీర్ తల్లికి చనువు ఏర్పడింది. వాళ్ళ కష్టసుఖాలు, ఇంట్లోని బాధలు హలీమా బేగం ముందు వెల్లబోసుకునేవారు. మునీర్ తండ్రికి గని పై  మంచి పేరు ఉంది. మునీర్ తల్లి, చెల్లెలు అందరూ  కార్మిక కుటుంబాలతో కలిసి పోయేవారు. స్నేహపూర్వకంగా ఉండే  వారు.
కార్మిక వాడల్లో ఎక్కువమంది మహిళలు  తమ భర్తలు తాగి వచ్చి కొడుతున్నారని, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని, జల్సా తిరుగుళ్ళు, పరస్త్రీ మోజులో పడి డ్యూటీలు చేయటం లేదని  హలీమా బేగంకు ఫిర్యాదు చేసే వారు. చెడు వ్యసనాలకు లోనైన కార్మికులను పిలిచి వారితో మాట్లాడేది. జీవితంలో ఎదురయ్యే మంచి, చెడు, కష్టసుఖాలను వివరించేది. భవిష్యత్తు పైన ఆశలు కల్పించేది. ఆ రకంగా కార్మికుల కుటుంబాలలో సఖ్యతకు, సంతోషాలకు హలీమా బేగం  పాటుపడేది. 
కార్మిక వాడలలో కావాల్సిన కనీస సౌకర్యాలు; తాగునీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇంటి స్థలం, విద్య, వైద్యం లాంటివని  మునీర్ గుర్తించాడు. ప్రజల కష్టాలకు దొరల దౌర్జన్యాలు, మద్యం , మత్తు లాంటి చెడు అలవాట్లే కారణమని ఆయన మనసులో చిన్ననాటి నుండే  బలంగా నాటుకుపోయింది.
 వ్యాయామం చేయడం, బాక్సింగ్ నేర్చుకోవడం, ఆరోగ్యానికి పాలు తాగడం, మాంసం, గుడ్లు తినడం చిన్నతనం నుండి ప్రాక్టీస్ చేసేవాడు. అన్యాయాన్ని ప్రశ్నించేవాడు, దౌర్జన్యానికి వ్యతిరేకంగా తిరగబడేవాడు, ఇతరులకు సహాయం చేయాలనే తపన ఉండేది. మునీర్ బంధుమిత్రులలో అనేకమందికి సిగరెట్, మద్యం  అలవాటు వుంది . జర్నలిస్టుగా ఆయనకు  ముఖ్యమంత్రి,మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలుమార్లు విందులకు హాజరయ్యే అవకాశం ఉండేది .  కాని, ఏనాడూ  మద్యం ముట్టుకోలేదు. అది ఆయన నిగ్రహానికి ,నిబద్ధతకు నిదర్శనం. 

 
భాగ్యనగర్  రైలు ఆపాలి 


యువజన నాయకుడిగా ఎదిగే క్రమంలో ఆయన ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. అందులో భాగంగా మందమర్రి రైల్వే స్టేషన్లో భాగ్యనగర్ రైలును ప్రయాణికుల సౌకర్యార్థం రెండు నిమిషాల పాటు నిలపాలని రైల్వే అధికారులను, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కొత్తగూడెం, హైదరాబాద్ వెళ్లడానికి ఈ రైలు కార్మికులకు సౌకర్యంగా కూడా ఉండేది. వీరి విజ్ఞప్తులను రైల్వే అధికారులు పట్టించుకోలేదు. మందమర్రిలో రైలును ఆపించాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. రైల్వే అధికారులపై ఒత్తిడి పెంచే విధంగా ప్రజా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. రైల్వే స్టేషన్ లోనే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ప్రతిరోజు కొంతమంది ప్రజలు నిరాహార దీక్ష చేపట్టేవారు. వీరి ఆందోళనకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉపన్యాసాలు ఇచ్చేవారు. రిలే నిరాహార దీక్ష  24 గంటలు చేపట్టేవారు. ఒకరోజు గడిచిన తర్వాత, మరొక బ్యాచ్ వచ్చేవరకు నిరాహార దీక్ష కొనసాగేది. స్టేజి వద్ద పాటలు, మాటలతో నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతుండేది. రోజుల తరబడి రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నా ప్రభుత్వం, రైల్వే అధికారుల నుండి సానుకూల ప్రకటన రాలేదు. ఉద్యమంలో భాగంగా మందమర్రి పట్టణ బంద్ నిర్వహించారు. రైల్వే అధికారుల తీరుకు నిరసనగా ప్రజా పదర్శన నిర్వహించారు. అయినా రైల్వే అధికారుల్లో ఉలుకు పలుకు లేదు.
ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ముఖ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.మందమర్రి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లను నిలిపివేయాలని, అందుకు అనుగుణంగా ప్రజలను తరలించాలని, రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 
ప్రజల డిమాండ్ తెలిపే విధంగా బ్యానర్, ప్లేకార్డులు చేబూని,  ప్రజలు ముందుగా నిర్ణయించిన విధంగా పెద్ద సంఖ్యలో  రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ప్రజలను మందమర్రి రైల్వే స్టేషన్ లోని రైలు పట్టాల పైకి చేరుకోవాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు మైకులో ప్రకటించారు .వారి సూచన మేరకు ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు,సానుభూతిపరులు రైలు పట్టాలపై బైఠాయించారు. ఆ సమయంలో కాజీపేట నుండి న్యూఢిల్లీ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్ వస్తున్నట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. పట్టాలపై ఉన్నవారు తప్పుకోవాలని, లేకుంటే ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. రైల్వే అధికారుల హెచ్చరికలను ప్రజలు బేఖాతర్  చేశారు. రైలు పట్టాలపై బైఠాయించిన ప్రజలలో ఎలాంటి భయం కనబడలేదు. పైపెచ్చు మందమర్రిలో భాగ్యనగర్ రైలును ఆపాలనే నినాదాలు  మిన్నంటాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైలును ఔటర్ సిగ్నల్ వద్ద నిలిపివేశారు. రైలుకు హాల్టింగ్ లేకున్నా ఆగడంతో ప్రయాణికులు రైలు నుండి కిందకు దిగారు. పట్టాలపై జన సమూహం కనబడడంతో, వివరాలు తెలుసుకోవడానికి రైలు ప్రయాణికులు ఆందోళన కారుల వద్దకు వచ్చారు. ధర్నా విరమించాలని కొందరు ప్రయాణికులు బ్రతిమాలుతున్నారు. మరికొందరు దూరప్రాంతాలకు వెళ్లే వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకా కొందరు ఆందోళనకారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా తమ డిమాండ్ ను గట్టిగా నినదిస్తూనే ఉన్నారు.
 ఆ రైలులో మిలిటరీ సిబ్బంది కూడా ప్రయాణిస్తున్నారు. వారు కూడా ప్రజల వద్దకు చేరుకొని ధర్నా విరమించి పక్కకు తప్పుకోవాలని, ఇంతసేపు చేసింది చాలని బెదిరింపులకు దిగారు. స్థానిక పోలీసులు కూడా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
 ప్రజలు భారీ సంఖ్యలో ఉండడంతో పోలీసులు తమ లాటీలకు పని చెప్పకుండా, నాయకులకు నచ్చజెప్పే పనిలో నిమగ్నమయ్యారు. ధర్నా విరమించాలని సంప్రదింపులు జరిపారు. ఒకవైపు స్థానిక పోలీసులు, నాయకులకు మధ్య చర్చలు జరుగుతుండగానే మిలిటరీ సిబ్బంది రైలు పట్టాలపై ఉన్న ఆందోళనకారులను బలవంతంగా పక్కకు తప్పించడానికి బల ప్రయోగానికి దిగారు. జవాన్ల ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఒక ఆందోళనకారుడి పై మిలిటరీ జవాన్ చేయి చేసుకోవడంతో ప్రజలు తిరగబడి, గట్టిగా బుద్ధి చెప్పారు. పోలీస్ జులుం నశించాలి.... మందమర్రిలో భాగ్యనగర్ రైలును ఆపాలి అంటూ నినాదాలు హోరెత్తాయి.
మిలిటరీ సిబ్బందికి, ప్రజలకు మధ్య ఘర్షణ పెరిగిపోవడంతో రైల్లో ఉన్నటువంటి ఇతర మిలిటరీ సిబ్బంది కూడా ఆయుధాలతో రైల్వే స్టేషన్ వైపు రావడాన్ని  ప్రజలు గమనించారు. ఒక్క ఉదుటున రైలు ట్రాక్ పక్కన ఉన్న రాళ్లను మిలిటరీ సిబ్బంది పైకి విసరడం ప్రారంభించారు. రాళ్లే ఆయుధాలుగా ప్రజలు తిరగబడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. రైల్వే స్టేషన్ రణరంగంగా మారిపోయింది.ప్రజల దాడి నుండి తప్పించుకోవడానికి మిల్ట్రీ సిబ్బంది తుపాకులను ప్రజలపైకి ఎక్కుపెట్టారు. అప్పటికే ఇరు వర్గాలు శాంతించాలని పోలీస్ అధికారులు, సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జరగబోయే పరిణామాన్ని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారితో చర్చించి గొడవ సద్దుమణిగేలా చేశారు. మిలిటరీ సిబ్బంది కూడా పోలీసులకు సహకరించి వెనకకు తగ్గారు. రైల్వే ప్లాట్ ఫామ్ నుంచి వెనక్కి  వెళ్లి రైలు ఎక్కారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి పట్టాలపై నుంచి పక్కకు తప్పించారు. అనంతరం రైలు స్టేషన్ మీదుగా న్యూఢిల్లీ వైపు వెళ్ళింది. ఈ ఘటనలో అనేకమంది పై పోలీసులు కేసు నమోదు చేశారు.  స్థానిక పోలీసుల సమయస్ఫూర్తి వలన పెద్ద గొడవ తప్పిపోయిందని నాయకులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
భాగ్యనగర్ రైలును మందమర్రి స్టేషన్లో ఆపాలి అనే డిమాండ్ ముందుకు తీసుకుపోవడానికే సిపిఐ నాయకులు నిర్ణయించారు. ప్రతిరోజు యువజన సమాఖ్య నాయకులు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ చేరుకునేవారు. భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు బెల్లంపల్లిలో ఆగడంతోనే వీరు అందులో ఎక్కేవారు. టికెట్ లేకుండానే ప్రయాణించేవారు. మందమరి రైల్వే స్టేషన్ సమీపించగానే ట్రైన్ లోని చైన్ లాగి, రైలును నిలిపేవారు. అప్పటికే రైల్వేస్టేషన్లో సిద్ధంగా ఉన్న యువజన సమాఖ్య కార్యకర్తలు, ప్రజలు తమ డిమాండ్ ను పేర్కొంటూ నినాదాలు చేసేవారు.ఈ ఉద్యమం చాలా  రోజులు  కొనసాగింది. ప్రజలు తమ ఆందోళనను విరమించక పోవడంతో సింగరేణి యాజమాన్యం చొరవ చూపి, రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపింది. సంప్రదింపులు ఫలించి మందమర్రిలో భాగ్యనగర్ రైలును ఆపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కార్మికుల పిల్లలకు సింగరేణి స్కూల్లో సీట్లు ఇవ్వాలి.

సింగరేణి యాజమాన్యం  సంక్షేమ చర్యల్లో భాగంగా సింగరేణి వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సింగరేణి చైర్మన్ బి.ఎన్ రామన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు సింగరేణిలోని అన్ని ఏరియాలతో పాటు మందమర్రిలో కూడా సింగరేణి స్కూల్ ను ప్రారంభించారు. విశాలమైన పక్కా భవనం,తరగతి గదులు,విద్యార్థులు కూర్చోవడానికి అనువైన బెంచీలు, ప్రయోగశాలలు, లైబ్రరీ, క్రీడా సామాగ్రి, అనుభవం కలిగిన ఉన్నత విద్యావంతులను టీచర్లుగా నియమించారు.
యాజమాన్యం ఏర్పాటుచేసిన స్కూల్స్ పట్ల కార్మికుల్లో సంతోషం వెళ్లి విరిసింది. ఇందులో చదువుకోవడానికి అధికారులు, స్థానిక వ్యాపారుల పిల్లలకు ఎక్కువగా సీట్లు లభించేవి. కార్మికుల పిల్లలకు అతి తక్కువ సీట్లు లభించేవి. కార్మికుల బిడ్డల యెడల జరుగుతున్న వివక్షకు నిరసనగా గనులపై కార్మికులు ఆందోళనకు దిగారు. వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం నుంచి ఏ విధమైన సానుకూల ప్రకటన రాలేదు.
సింగరేణి స్కూల్లో కార్మికుల పిల్లలకు కచ్చితంగా సీట్లను కేటాయించాలని, అధికారులు, కార్మికుల పిల్లలకు సరిపడా సీట్లు ఇచ్చిన తర్వాతనే ఇతరులకు ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకున్నది. 
ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్యామ్ రావు, సంధాని మరికొందరు ముఖ్యులతో చర్చించి ఆందోళన కార్యక్రమాన్ని మునీర్ నేతృత్వంలో రూపొందించారు. బొగ్గు గనులు, కార్మిక వాడలు, పట్టణంలోని ప్రతి ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దశల వారీగా ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ యాజమాన్యం మొండిగానే వ్యవహరించింది.
ఆమరణ నిరాహారదీక్షకు *సై*
సింగరేణి స్కూల్ లో కార్మికుల పిల్లలకు ఖచ్చితంగా సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ యువజన సమాఖ్య నాయకులు మహమ్మద్ మునీర్, ఉండేటి స్వామిలు మందమర్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
దీక్షా శిబిరాన్ని ప్రజలు తండోపతండాలుగా వచ్చి సందర్శించి, తమ సంఘీభావాన్ని తెలియపరుస్తున్నారు. దీక్షకు మద్దతుగా ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీక్షా శిబిరం వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు ఆట,పాట,మాటతో  మార్మోగింది.
సింగరేణి యాజమాన్యం తీరుకు నిరసనగా పట్టణంలోని స్కూల్స్ బందుకు ఇచ్చిన పిలుపు విజయవంతం అయ్యింది. పారిశ్రామిక ప్రాంతంలో బంద్, రాస్తారోకో లాంటి నిరసన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. మరోవైపు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మునీర్,స్వామి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించ సాగింది. యాజమాన్యం ఆందోళనకారుల డిమాండ్ ను అంగీకరించ లేదు. దీక్ష చేపట్టిన వారి ఆరోగ్యం  క్షీణించడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగిస్తారని ప్రచారం జరిగింది. అప్రమత్తమైన నాయకులు, కమ్యూనిస్టు కార్యకర్తలు, విద్యార్థులు భారీ సంఖ్యలో 24 గంటలు దీక్షా శిబిరానికి రక్షణ కవచంగా నిలిచారు. బొగ్గు గనులపై కూడా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సమ్మె దిశగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రయాణాన్ని ప్రారంభించింది.ఆవరణ దీక్ష చేపట్టిన ఇరువురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారినట్లు వైద్య బృందం ప్రకటించింది. గత్యంతరం లేని స్థితిలో యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల పిల్లలు చదువుకోవడానికి వీలుగా సీట్లను కేటాయిస్తామని, వారి పిల్లలకు తగు ప్రాధాన్యతను ఇస్తామని, మిగిలిన సీట్లను మాత్రమే ఇతరులతో నింపుతామని స్పష్టమైన హామీ ఇచ్చింది. 13 రోజులు సాగిన ఆమరణ నిరాహార దీక్ష విరమించారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవ జరుపుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి