యువజన నాయకుడిగా...మునీర్
అఖిలభారత యువజన సమాఖ్య (AIYF )నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల కార్యకర్తగా ప్రజల పక్షాన నిలబడి, మునీర్ అనేక ఉద్యమాలను నడిపించాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఆధునిక సౌకర్యాలైన రవాణా, వసతికి దూరంగా కొండ కోనల్లో జీవిస్తారు. నిరుపేదలైన గిరిజన, ఆదివాసి, షెడ్యూల్డ్ కులాలు, ఇతర పేద వర్గాలకు ప్రభుత్వ భూములు పంచాలని పోరాటం చేశాడు. స్కూల్స్,హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు నిర్మించాడు. పేదల అభివృద్ధికి ప్రయత్నించని ప్రభుత్వ అలసత్వంపై, పోలీసుల దాష్ఠికాలపై,దొరల ఆగడాలను ఎదిరిస్తూ మునీర్ ప్రస్థానం సాగింది.
కాలినడకన ఇంటింటికి, గల్లీ గల్లీకి తిరిగి మందమర్రి ప్రజల్ని చైతన్యపరిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైకిల్ పై తిరుగుతూ అనేక గ్రామాల జన సమీకరణకు,పార్టీ విస్తరణకు విశేష కృషి చేశాడు. ఆసిఫాబాద్, మంచిర్యాల, లక్షేట్టిపేట నెన్నెల తదితర మండలాల్లో కష్టజీవులు, నిరుపేదలకు మెరుగైన జీవనం, కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాధికారులతో పలుమార్లు చర్చలు చేశాడు. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి.నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేయటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల పోలీసులు అతన్ని అనేక తప్పుడు కేసుల్లో ఇరికించారు. అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు.
హమాలి అంజయ్య లాకప్ హత్య
(ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు రాయాలి.అది రాష్ట్రవ్యాప్త ఇష్యూ గా ఎలా మారిందో!)
హైదరాబాద్, గౌలిగూడ బస్ స్టేషన్ లో హమాలీ పనిచేసే(1980) అంజయ్యను పోలీసులు కొట్టి చంపారని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. పోలీస్ దుర్మార్గానికి నిరసనగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చింది. మందమర్రిలో కార్మిక నాయకులు వి. టి అబ్రహం, మునీర్ నేతృత్వంలో ఆ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది . ఆ సందర్భంగా ప్రజలు ఒక ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపును అడ్డుకోవడానికి 'డిఎస్పీ ' స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.పోలీస్ చర్యలను కమ్యూనిస్టు శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయు. పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజల్ని చెదరగొట్టారు. ముఖ్య నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి చిత్రహింసలు పెట్టారు. పోలీస్ దుర్మార్గం పట్టణంలో విస్తృతంగా ప్రచారం అయ్యింది.సిపిఐ నాయకులను పోలీసులు కొడుతున్నారనే విషయం తెలుసుకుని గని కార్మికులు, మహిళలు,యువకులు పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా కదిలి వచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట వందలాది మందితో భారీ ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు నుంచి ప్రజలు వెళ్లిపోవాలని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయలేదు. ప్రజల సంఖ్య గంట గంటకు పెరిగిపోయింది. పరిస్థితి మరింతగా ఉద్రిక్తితం గా మారింది.. గేట్లు బద్దలు కొట్టి, ప్రజలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా సమాచారం అందుకున్న ఉన్నత పోలీసు అధికారులు మునీర్ తో పాటు ఇతర నాయకులను విడిచిపెట్టేశారు.
పోలీసులు తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఉద్యమకారులపైనే తిరిగి కేసు పెట్టారు. మండమర్రికి సమీపం లోని సోమగూడెం వద్ద రెండు బస్సులను ఎవరో దగ్ధం చేశారు . ఆ బస్సు దగ్ధం కేసులో కూడా మునీర్ మిత్ర బృందాన్ని ఇరికించారు.
సారా వ్యతిరేక పోరాటం లో
దూబగుంట కంటే ముందు మందమర్రి
సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నెల రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక భాగం సారా,బ్రాందీ తాగటానికి ఖర్చు అయ్యేవి. గనులపై జీతం అందుకున్న అనేకమంది కార్మికులు ముందు ఇళ్లకు వెళ్లకుండా కల్లు దుకాణాలకు చేరేవారు. జేబులో ఉన్న డబ్బులు ఖర్చయ్యే వరకు సారా కొట్టు, బ్రాందీ షాపే వీరికి ఆవాసాలుగా మారి పోయేవి.మరి గని కష్టం వల్లో, గని అధికారుల దురుసు ప్రవర్తన వల్లో, లేదా ఊరి తాలూకూ ఏ దయనీయ పరిస్థితులూ గుర్తుకు వచ్చేవో కాని ఈ ప్రపంచానికి దూరంగా కార్మికులు తాగుడు లోకం లోకి వెళ్లిపోయేవారు.
కార్మికులకు ఆహ్లాదాన్ని అందుబాటులోకి తెస్తున్నాం... అనే పేరుమీద సింగరేణి యాజమాన్యం ఏర్పాటుచేసిన 'రిక్రియేషన్ క్లబ్బులు' పేకాట కేంద్రాలుగా విలసిల్లేవి. జీతాలు అందుకున్న తర్వాత కార్మికులు కొందరు పేకాట ఆడడానికి నేరుగా ఇక్కడికే చేరుకునేవారు.రోజుల తరబడి ఇక్కడే భోజనాలు.ఇక్కడేనిద్ర. ఇలాంటి మగ మహారాజుల జాడ కోసం భార్యా పిల్లలు బజారంతా వెతికేవారు. క్లబ్ లోనే కాపురం పెట్టిన వారిని, మద్యం మత్తులో ఎక్కడపడితే అక్కడే పడిపోయిన వారిని ఇంటికి తీసుకు వెళ్లడానికి కుటుంబీకులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
మత్తులో సోయి తప్పిన కార్మికుల జేబుల్లోంచి మందమర్రి దొర గుండాలు డబ్బులు దొంగిలించేవారు. ప్రతిఘటించిన వారిని తన్ని మరీ బలవంతంగా లాక్కునేవారు
ప్రతినెలా సాగే ఈ తతంగాన్ని కమ్యూనిస్టు పార్టీ నిశితంగా గమనించింది. మందమర్రి లోని కార్మిక వాడలలో సారా కొట్టు, బ్రాందీ షాపులు ఎత్తివేయాలనే పోరాటం ఊపు అందుకొంది. దూబగుంట (నెల్లూరు జిల్లా)లో కంటే ముందు సారా వ్యతిరేక పోరాటం ఇక్కడ జరిగింది.
మహిళా నాయకురాళ్ళు మహా లక్ష్మమ్మ, మనెమ్మల(వీరిద్దరూ గురుంచి కొంచెం వివరంగా రాయాలి) నేతృత్వంలో మద్యం వ్యతిరేక పోరాటాలు కొనసాగాయి. సారా కొట్లను కూల్చివేసి, బ్రాందీ షాపుల పై భౌతిక దాడులకు పాల్పడ్డారు. మహిళలు భారీ సంఖ్యలో కదిలారు.కార్మిక నాయకులు అబ్రహం,మునీర్ మార్గదర్శకత్వంలోనే మద్యం వ్యతిరేక పోరాటాలు నడుస్తు న్నాయని తెలిసి, డైరెక్ట్ గా వారినేమీ చేసులేక అక్రమ కేసులు పెట్టారు. అయినా భయపడకుండా మహిళలు చేసిన పోరాటం వలన కార్మిక వాడల నుంచి సారాకొట్లు,, బ్రాందీ షాపులను ఎత్తివేసారు. ఫలితంగా కార్మిక వాడల్లో ప్రశాంతత నెలకొన్నది.
మరో జూదం *తంబోలా* ఆట
కార్మికుల సొమ్మును దోచుకోవడానికి అలవాటు పడిన అసాంఘిక ముఠాలు వినోదాత్మక ఆట పేరిట తంబోలా అనే జూదానికి తెర లేపారు. సర్కస్ నిర్వాహకులు వేసే పెద్ద టెంటు లాంటిదే వీరు కూడా ఏర్పాటు చేశారు. ఈ తంబోలా కేంద్రంలోకి వెళ్లాలంటే ప్రవేశ రుసుము (టికెట్) తప్పనిసరి.ఈ జూద గృహానికి పోలీసులే కాపలా కాసేవారు. హాల్ లోనికి ప్రవేశించిన ఆటగాళ్లు డబ్బులు చెల్లించి నెంబర్ ఆట ఆడుతారు. అసాంఘిక కార్యకలాపాల అడ్డాలుగా ఇవి వుండేవి. రాత్రిపూట జరిగే ఈ తాంబోలా ఆటలో ఒక స్టేజి కూడా వుంటుంది. ఈ స్టేజి పైన మహిళలతో అర్థనగ్న,అసభ్య, అశ్లీల నృత్యాలను ప్రదర్శించేవారు. ఈ నృత్యాలు చూస్తూ జనం ఊగిపోయి, తమ జేబులు ఖాళీ అవుతున్న విషయాన్ని గుర్తించేవారు కాదు.
డ్యూటీలు మాని ఇక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకునేవారు. కార్మికుల కుటుంబాలలో చిచ్చు రేపుతున్న ఈ సంఘటన యూనియన్ దృష్టికి వచ్చింది.
తంబోలా కేంద్రంపై దాడి
తంబోలా ఆట పేరిట జరిగే దోపిడి కేంద్రంపై మునీర్ నేతృత్వంలో యువకులు దాడి చేశారు. అడ్డువచ్చిన గుండాలను చితక బాదారు. పెద్ద సంఖ్యలో యువకులు రావడంతో గుండాలు భయంతో పరిగెత్తి తప్పించుకున్నారు. ప్రజలు తాంబోలా టెంట్ ను తగలబెట్టి, ఆటను పూర్తిగా రద్దు చేయించారు. ఈ పరిణామం కార్మిక కుటుంబాలకు సంతోషం నింపింది. దొర కంట్లో నిప్పులు కురిపించింది. తంబోలా కేంద్రంపై జరిగిన దాడి వలన ఆర్థిక నష్టం కలుగుతుందని భావించిన ఆ కేంద్రం నిర్వాహకులు మునీర్ మిత్ర బృందంపై తప్పుడు కేసు నమోదు చేయించారు.
మునీర్ తో పాటు యువకులందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ వార్త కార్మిక వాడల్లో ప్రచారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొన్నారు. వీరి విడుదల కోసం ఆందోళనకు దిగారు. గత్యంతరం లేక కేసు నమోదు చేసి యువకులను విడిచిపెట్టారు.
సినిమాహాల్ శ్రీ కృష్ణా టాకీస్
మందమర్రి పట్టణంలో జరిగే అరాచకాలకు ఈ సినిమా హాలు పెద్ద అడ్డా! ఇది ఇక్కడి స్థానిక భూస్వామి శ్రీపతి రావు ది. మందమర్రిలో చట్టం, న్యాయం, ధర్మం అన్ని ఈ *దొర* కనుసన్నులలోనే నడిచేవి. దొర రూపొందించిన నియమ, నిబంధనలు మాత్రమే సినిమా హాల్లో అమలు జరగాలి. ఏమాత్రం అటు ఇటు జరిగినా దొర గుండాలు ప్రేక్షకుల పై విరుచుకు పడేవారు.
హీరో, హీరోయిన్ల పై వచ్చే పాటలకు ఈలవేసినా, చప్పట్లు కొట్టినా తప్పే! హీరో, విలన్ మధ్య జరిగే కొట్లాట సన్నివేశాలకు స్పందించి చప్పట్లు కొట్టినా, అరిచినా,గంతులు వేసినా, పేపర్లు చింపి విసిరినా క్షమించరాని నేరమే! గుండాల దెబ్బలకు గురికావాల్సిందే. ఎప్పుడూ తాగిన మత్తులో వుండే వీరు ప్రేక్షకులనే కనికరం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టేవారు .
సినిమా కి వచ్చే స్త్రీల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ సినిమాకు వెళ్లిన మహిళలు కొందరు సినిమా టాకీస్ సమీపంలో బావిలో శవాలుగా తేలిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ దొర గుండాలు చేసిన హత్యలే.కాని,అనుమానాస్పద మరణాలుగా నమోదు అయ్యేవి . సినిమాకు వచ్చిన స్త్రీల పై దొర గుండాలే అత్యాచారం చేసి ,చంపి ,ఆ శవాలను బావిలో వేసేవారు.
*******
ఒకరోజు (సంవత్సరం రాయాలి కనీసం ..టైమ్ రాయాలి. ) పట్టణ మహిళా సమాఖ్య నాయకురాలు మనెమ్మ కుమారుడు రాజు, మరో విద్యార్థి రవి *పొట్టేలు పున్నమ్మ* సినిమాకు వెళ్లారు . పిల్లలు ఇద్దరూ సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏఐఎస్ఎఫ్ లో చురుకుగా వుండేవారు. సినిమా హాలు నిబంధనలకు విరుద్ధంగా పిల్లలు ఈల వేశారని, అల్లరి చేశారని గుండాలు వీరిని విపరీతముగా కొట్టారు. పిల్లలపై జరిగిన దాడి వార్త పట్టణమంతా దావానంలా వ్యాపించింది.
ప్రజలపై గుండాల అరాచకాలను నిలువరించాలని సిపిఐ శ్రేణులు అప్పటికే నిర్ణయించుకుని ఉన్నాయి. సిపిఐ పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కు విద్యార్థులపై జరిగిన దాడి తెలిసింది. పిల్లలపై జరిగిన దాడితో నాయకులు, కార్యకర్తలు కోపంతో రగిలిపోయారు. గుండాలకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు.
అందుబాటులో ఉన్న కర్రలు, రాళ్లు,చేతికి ఏది దొరికితే అది పట్టుకొని గుండాలకు బుద్ధి చెప్పాలని ప్రజా సమూహం సినిమా హాల్ వైపు బయలు దేరింది. వీరి వెంట మహిళలు కూడా కారంపొడి, చీపుర్లు పట్టుకొని నడిచారు.
గూండాలు టాకీస్ సమీపంలోనే ఉన్నారు. మునీర్ నేతృత్వంలో ప్రజా సమూహం ఒక్కసారిగా గుండాలపై దాడికి దిగింది. ఊహించని దాడికి కంగుతిన్న గుండాలు కొద్దిసేపట్లోనే ప్రతిఘటించారు. భారీ సంఖ్యలో మూగిన జనం ముందు వీరి కండ బలం ఏమీ పనిచేయలేదు. ప్రజల దాడి నుండి తప్పించుకోవడానికి వారు సినిమా హాల్ లోనికి చొర బడ్డారు. పారిపోతున్న గుండాలను ప్రజలు వెంటపడి మరీ తరిమి కొట్టారు
సినిమా హాల్ లోపలకి ప్రవేశించిన గుండాల అరుపులు, కేకలతో భయభ్రాంతులకు గురైన ప్రొజెక్టర్ రూమ్ లోని సిబ్బంది ప్రదర్శనను నిలిపివేశారు.హాలులో లైట్లను వేశారు. ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ప్రేక్షకులకు ధైర్యం చెబుతూ, వారిని ఇళ్లకు పంపుతూ ప్రజలు గుండాలను వెంబడించారు.
గుండాలకు బుద్ధి చెప్పండి...
గుండాయిజం నశించాలి...
గుండాల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ గుండాలపై ప్రజల దాడి కొనసాగుతున్నది
అదే రోజు సినిమా చూడడానికి మునీర్ తల్లి, చెల్లెలు కూడా వచ్చారు. ఈ విషయం మునీర్ కు తెలియదు.
విద్యార్థులపై జరిగిన దాడితో చలించి పోయిన మునీర్ చేతిలో లాఠీతో గుండాయిజం *బంద్ కరో* అంటూ గూండాల పైకి దూకుతున్నాడు.
మునీర్ చేతిలో లాఠీని చూసి మునీర్ తల్లి, చెల్లి ఇద్దరూ ఆశర్యపోయారు.
ఏడుస్తూ ...
"క్యా కర్ రా",
"హాత్ మే లాఠీ కైకు", అంటూ
వారిరువురు బిగ్గరగా అరుస్తున్నారు.
"ఆప్ ఘర్ జావో,
"హం ఆయంగే"
"ఫికర్ మత్ కీజియే"
జల్ది జాయియే" అంటూ
గుండాలను తరుముకుంటూ మునీరు వెళ్లిపోయాడు.
గతంలో సినిమా హాలుకు వచ్చిన ప్రేక్షకులతో వ్యవహరించిన తీరును మళ్ళీ గుర్తు చేసుకుంటూ ప్రజలు పెద్ద ఎత్తున దాడికి దిగారు.
బుకింగ్ కౌంటర్లు, ప్రొజెక్టర్ రూమ్, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ విపరీతంగా ధ్వంసం అయ్యింది. ప్రజల దాడి నుంచి తప్పించుకోవడానికి గుండాలు తలో దిక్కు పారిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు ప్రజలు చితక బాదారు. సినిమా హాల్ పై జరిగిన దాడిని ప్రజలు స్వాగతించారు. కొందరైతే మరీ సంబరాలు చేసుకున్నారు.
మునీర్ తల్లి,చెల్లెలు కన్నీరు పెడుతూనే భయం భయంగా ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి మునీర్ కూడా ఇంటికి చేరుకొని, ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. టాకీస్ లో చూసిన గొడవను ఎవరు కూడా మునీర్ తండ్రితో చెప్పలేదు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి తలుపులను గట్టిగా కొడుతూ,ఎవరో "మేం పోలీసులం .తలుపు తీయండి " అంటూ పిలుస్తున్నారు.
భయపడుతూనే "కౌన్ హై ?"అంటూ మునీర్ తల్లి వెళ్లి తలుపు తీసింది.
" ఇత్ని రాత్ క్యా కామ్ ?"
"క్యో ఆయి హో ?" అంటూ ప్రశ్నించింది.
మేము పోలీసులం..మునీర్ ఉన్నాడా? అంటూ పోలీసులు ఎదురు ప్రశ్న వేశారు.
"ఇంకా ఇంటికి రాలేదు"... అని సమాధానం ఇచ్చింది.
"మేం ఇంటిని సోదా చేస్తాం".. అంటూ పోలీసులు ముందుకు కదిలారు.
"ఇంట్లోకి రావద్దు" అంటూ మునీర్ తల్లి గట్టి గట్టిగా అరిచింది.
ఆ గొడవకు మేల్కొన్న మునీర్ తండ్రి
"క్యా హోరా ?" అంటూ బెడ్ రూమ్ నుంచి హాల్ లోకి వచ్చాడు.
ఎదురుగా పోలీసులు కనబడడంతో వారికి నమస్కారం చేసి,
" క్యా హై సాబ్ ఇత్నీ రాత్ ఆయే?" అంటూ పలకరించాడు. సినిమా హాలుపై దాడి గురుంచి చెప్పి ,మునీర్ కోసమే వచ్చామని పోలీసులు అన్నారు.
మునీర్ ఇంకా ఇంటికే రాలేదని తల్లి చెబుతుండగానే మునీర్ బాహర్ ఆవో అంటూ గట్టిగా కేక వేసి పిలిచాడు. తండ్రి పిలుపుతో బయటకు వచ్చిన మునీర్ ను పోలీసులకు అప్పగించాడు. అదేవిధంగా సంధానిని కూడా పోలీసులు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు.
బచ్చా హై సాబ్, సుభా మైహి, లేయాఖే ఆప్ కీ హవాలా కర్ దుంగా అని బ్రతిమాలడంతో సంధానిని వదిలిపెట్టి వెళ్లారు.
మునీర్ తండ్రి గౌస్ మియా కే కే 5 గనిలో పి.ఎగా (పెద్ద రైటేరు) పనిచేయటం ఆయన సత్ప్రవర్తన, అవినీతి రహితుడు, క్రమశిక్షణతో పనిచేయడం వలన అధికారులు, కార్మికులలో ఆయనకు మంచి పేరుంది.
పోలీసుల వెంట, సినిమా హాల్ యజమాని కొడుకు సురేందర్ రావు కూడా ఉండటం విశేషం. మునీర్ ను చూసిన వెంటనే ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది. ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికాడు. వీడికి బుద్ధి చెప్పండి అంటూ పోలీసులను ఆజ్ఞాపించాడు. అప్పటికే పోలీసు వ్యాన్ లో మునీర్ మిత్రులు కూడా ఉన్నారు. వీరందరికీ ఆరోజు రాత్రి పూట పోలీసులు గట్టిగానే అరుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
మునీర్ తో పాటు ఇతర యువకులను పోలీసులు అరెస్టు చేసి, చిత్రహింసలకు గురి చేస్తున్నారని కార్మిక వాడల్లో ప్రచారమైంది. మందమర్రి భూస్వామి కొడుకు సురేందర్రావు స్వయంగా పోలీస్ స్టేషన్లో అడ్డావేసి వీరిని చిత్రహింసలు పెట్టిస్తున్నాడని వార్త ప్రజలను కోపోద్రికుల్ని చేసింది.
మునీర్ తో పాటు అరెస్ట్ అయిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి. దొర గుండాయిజం నశించాలి. గుండాల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. గంట, గంటకు ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం షిఫ్టు ముగించుకొని ఇళ్లకు వెళ్లే కార్మికులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఆగుతున్నారు.జన ప్రవాహం, నినాదాల హోరు పెరిగిపోతున్నది. పోలీస్ స్టేషన్ ఎదుట చేస్తున్న ధర్నాను విరమించాలని, శాంతి భద్రతలకు విఘాతo కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మైకులలో హెచ్చరిస్తున్నారు. అయినా జనం వెనక్కి తగ్గటం లేదు. రాత్రి కావస్తుండడంతో పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి వీరిని విడుదల చేశారు.
చీర చింపి కట్టు కట్టిన వీరవనిత
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, సినిమా టాకీస్ పై దాడి నిర్వహించారనే కోపంతో పోలీసులు ఊగిపోయారు. మునీర్ ను ఇష్టం వచ్చినట్టు లాఠీలతో చితక బాదారు. తలకు తగిలిన లాఠీ దెబ్బకు తల పగిలి, రక్తం కారుతున్నది.ప్రజా ఆందోళనతో సిపిఐ నాయకులను పోలీసులు విడిచిపెట్టినప్పుడు బయటకు వస్తున్న మునీర్ తల నుండి రక్తం కారుతూనే ఉంది.మునర్ చేతితో దెబ్బ తగిలిన చోట ఒత్తి పట్టుకున్నప్పటికీ రక్తం కారటం ఆగటం లేదు. దీన్ని గమనించిన ఓ ఆడబిడ్డ తన చీర కొంగు చింపి కట్టు కట్టింది. అది ఆనాడు ప్రజా చైతన్యానికి, ఉద్యమకారుల ఎడల ఉన్న ప్రేమకు నిదర్శనం.
పోలీసులు విడుదల చేసిన నాయకులను ప్రజలు గుండెలకు హత్తుకున్నారు.వారికి జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. మునీర్ ను ప్రజలు భుజాలపై ఎక్కించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
అవమాన భారంతో దొర రగిలిపోతున్నాడు.మునీర్, సిపిఐ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం బయటకు పొక్కింది. ఎప్పుడైనా వీరిపై దాడి జరగవచ్చునని పుకార్లు బయలుదేరాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి