సిఎస్పి కాంటా పోరాటం
మందమర్రి డివిజన్ బొగ్గు గనుల నుంచి జరిగే ఉత్పత్తిని లారీల ద్వారా సిఎస్ పి(coal screening plant )వద్దకు రవాణా చేస్తారు.సి ఎస్ పి బంకర్లలో బొగ్గు నింపి, రకరకాల సైజులుగా బొగ్గును వేరు చేస్తారు . బొగ్గు ఆధారిత పరిశ్రమల యజమానులు ,వారి వారి అవసరాల మేరకు, నిర్ణీత పరిమాణం కలిగిన దానిని కొనుగోలు చేస్తారు.
బొగ్గు కొనడానికి అర్హత కలిగిన వారు, సింగరేణి సంస్థ వారికి కేటాయించిన ప్రాంతం నుండి కొనుగోలు చేసి, లారీల ద్వారా వారి పరిశ్రమ ఉన్న ప్రాంతానికి తరలించుకుంటారు .
కొనుగోలుదారుడు కోరుకున్న నాణ్యత, బొగ్గు సైజు, చెల్లించిన డబ్బుల ఆధారంగా సి ఎస్ పి వద్ద బంకర్ల నుంచి లారీలలోకి బొగ్గును నింపుతారు. యాజమాన్యం జారీ చేసిన *వే బిల్* ఆధారంగా బొగ్గును తూకం వేస్తారు. చెల్లించిన డబ్బుకు సరిపడా బొగ్గును లారీలో నింపి, వే బ్రిడ్జిపై తూకం వేసి, సంబంధిత అధికారి అనుమతి మేరకు లారీని బయటకు పంపిస్తారు. బొగ్గుతో నిండిన లారీ లో వినియోగదారుడు చెల్లించిన డబ్బు కంటే ఎక్కువ వస్తే, దానిని లారీ నుంచి కోల్ యార్డులో వేస్తారు. తక్కువ వస్తే కోల్ యార్డులో ఉన్న బొగ్గును లారీల్లోకి మనుషుల ద్వారా నింపుతారు. ఈ పని చేయడానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సి ఎస్ పి వద్ద ఉండేవారు. వీరిని లారీ" లోడింగ్, అన్ లోడింగ్" కార్మికులుగా పిలుస్తారు.
బొగ్గు నింపిన లారీ నుంచి, బొగ్గు తొలగించిన ప్రతి లారీకి కొంత డబ్బును వీరికి కూలీగా చెల్లిస్తారు.
ఒకరోజు మొత్తంలో వచ్చిన సొమ్మును, ఆరోజు పనిచేసిన కూలీలందరూ సమానంగా పంచుకుంటారు.
కార్మికులపై పెత్తనం గుండాలదే!
బొగ్గును లారీలలో నింపినా, తొలగించినా లారీ యజమాని ఇచ్చే డబ్బులను మందమర్రి *దొర* ఏర్పాటుచేసిన ప్రైవేట్ సైన్యం (గుండాలు) వసూలు చేసేవారు. వసూలైన సొమ్మును పనిచేసిన వారికి పంచాలి. కానీ వసూలైన సొమ్ములో 80 శాతం కార్మికులకు పంచి, మిగతా 20% "మామూలు" పేరిట గుండాలు తమ జేబులో వేసుకునేవారు. రోజంతా కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్ము, కార్మికుల కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. గుండాల పెత్తనం, పైగా వారు ఏమీ పనిచేయకుండా డబ్బులు తీసుకోవడంపై కార్మికులు తీవ్రంగా మదనపడేవారు.
ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన కూలీలపై గుండాలు భౌతిక దాడులకు పాల్పడేవారు . గుండాయిజాన్ని అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఎవరైనా ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా, బాధితులపైనే కేసులయ్యేవి. గుండాలకు మర్యాద జరిగేది.
ఇక్కడ *దొర* మాటే శాసనం.
లారీ లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు 24 గంటలు ఎండకు ఎండి,వానకు తడిసి, చలికి వణుకుతూ పని చేసినా, కనీసం రెండు పూటలా ఇంటిల్లిపాది బువ్వ తినడానికి సరిపడా కూలి డబ్బులు రాకపోయేవి. దొర గుండాల అన్యాయాలు, దౌర్జన్యంపై ప్రశ్నించే వారికోసం ఎదురుచూస్తున్న సమయంలో కార్మిక నాయకులు వి. టి అబ్రహం, మునీర్ వారికి అండగా నిలిచారు.
సి ఎస్ పి కాంటా వద్ద దొర గుండాల అక్రమాలపై, దౌర్జన్యం పై వారు పలుమార్లు ప్రశ్నించడం, ఎదిరించడం, హెచ్చరించడం జరిగింది. లారీ లోడింగ్, అన్ లోడింగ్ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి కనీస హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు.
దొర సామ్రాజ్యంలోకి ఇతరులు రావటం ఒక సాహసమే. వారి అన్యాయాలను ప్రశ్నించడం, నిలదీయడం ; వారి అహానికి, ఆధిపత్యానికి దెబ్బ తగిలింది. ఎదురు తిరిగిన వారి అంతు చూడడమే గుండాల లక్ష్యం. వారిని ఏరిపారేయడమే దొర నైజం.
ఇదే పద్ధతిని అబ్రహం, మునీర్ పైన కూడా అమలు చేయాలని అనుకున్నారు .
సిఎస్పి కాంటా వద్ద గుండాలు గొడవ చేయడం సర్వసాధారణం. కానీ , ఆరోజు పథకం ప్రకారం గొడవ సృష్టించి,కార్మిక నాయకుడు అబ్రహం, మునీర్ లకు గొడవ విషయమై ఒక "ఇన్ఫార్మర్" ద్వారా వారే కబురు పంపారు. ప్రీ షిఫ్టు డ్యూటీ నుంచి వచ్చి ఇంటి వద్దనే ఉన్న మునీర్ కు సమాచారం చేరింది. వెంటనే తన సైకిల్ పై అబ్రహం ఇంటికి వెళ్ళాడు. సహజంగా స్పందించిన అబ్రహం కాంట వద్దకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అబ్రహంను సైకిల్ పై కూర్చోబెట్టుకొని, మునీర్ సైకిల్ తొక్కుతూ కాంటా వైపు బయలుదేరారు. మార్గంలోని యూనియన్ కార్యాలయం వద్ద ఉన్న సంధాని, మల్లేష్, కనుకయ్యతో పాటు మరో నలుగురైదుగురు కూడా వీరి వెంట బయలుదేరారు.
కాంటా వద్దకు చేరుకున్న వెంటనే గుండాలు ఒక్కసారిగా వీరిపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఊహించని దాడి నుంచి వెంటనే తేరుకొని కార్మిక నాయకులు ప్రతిదాడికి సిద్ధమయ్యారు. గుండాలు పెద్ద సంఖ్యలో ఉండి , మారణాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భయపడకుండా ఎదురు దాడికి దిగారు.
కార్మిక నేత అబ్రహం పై గొడ్డలితో దాడి జరగబోతున్న విషయాన్ని గమనించిన మునీర్, తన చేతిలోని సైకిల్నిఎత్తి పట్టి అమాంతం గుండాల పైకి విసిరాడు. అక్కడే ఉన్న సబ్బలితో గుండాల పై దాడికి పరిగెత్తాడు. గొడవలో అదుపుతప్పి అబ్రహం కిందపడ్డాడు. కింద పడ్డ ఆయనపై అనేకమంది కత్తులు, గొడ్డళ్లు, ఇనుపరారులతో దాడికి దిగారు .ఇది చూసి మునీర్ అతనికి రక్షణగా అబ్రహం పై పడుకుని పోయాడు . అబ్రహంకు తగలాల్సిన దెబ్బలు, మునీర్ కు తగిలాయి. ఇద్దరు చనిపోయారని గుండాలు భావించారు. సి.ఎస్.పి కాంటా వద్ద గుండాలకు, కమ్యూనిస్టులకు జరుగుతున్న గొడవపై కార్యకర్తలకు సమాచారం అందింది.భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో గుండాలు పరారయ్యారు.
అబ్రహం తల, వీపు మీద గాయాలయ్యాయి. మునీర్ తల పగిలింది, వీపులో గొడ్డలి దిగి, అలాగే ఉంది. ఒంటిమీద ఎక్కడ చూసినా కత్తి, గొడ్డలి గాయాలు.రక్తం కారతూనే ఉంది.
కార్యకర్తలు హుటాహుటిన, ఇరువురు నాయకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అబ్రహంకు తగిలిన గాయాలకు 30 కుట్లు వేశారు. మునీర్ కు 32 కుట్లు వేసి ప్రాథమిక చికిత్స అందించారు. వైద్యులు, సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల ప్రాణాపాయస్థితి తప్పింది.
కార్మిక నాయకుడు అబ్రహం,యువజన నాయకుడు మునీర్ లపై దొర గుండాలు దాడి చేసిన విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. కార్మికులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఇసుకవేస్తే రాలనంత జనంతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతమంతా ప్రజలతో కిటికిటలాడింది. ఎవరి ముఖంలో చూసినా ఆందోళనే. దొరగుండాయిజంపై యువకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు శాపనార్ధాలు పెడుతూ, బండ బూతులు తిడుతున్నారు.దొరపై ప్రతి దాడి చేయాలని యువకులు, విద్యార్థులు బహిరంగంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తొందరపాటు వద్దని, ముందు నాయకులను ప్రమాదం నుంచి రక్షించుకుందామని నాయకులు సముదాయిస్తూ వచ్చారు.
మునీర్ తల్లి ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మిక నాయకుడైన నిజాముద్దీన్ తన కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నాడు. ఈయన మునీర్ కు మామ కూడా!
ఆసుపత్రి లోపల జరుగుతున్న చికిత్స,వారి ఆరోగ్య పరిస్థితి గురించి బయట వేచి ఉన్న ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.ప్రజల నినాదాల జోరు, నాయకుల ఆందోళన మధ్య ఆసుపత్రి వైద్యులు బయటకు వచ్చి, ఇరువురికి ప్రమాదం లేదని ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మెరుగైన వైద్యం కోసం అబ్రహాoను వరంగల్ ఎంజీఎం మునీరును బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రికి తరలించారు.
గుండాల దాడికి నిరసనగా భారీ ప్రదర్శన
6,జనవరి 1979న మందమర్రి భూస్వామి గుండాయిజానికి వ్యతిరేకంగా, కార్మిక నాయకుడు అబ్రహం, మునీర్ పై జరిగిన హత్య యత్నానికి నిరసనగా ప్రదర్శన చేయాలని ఏఐటియుసి, సిపిఐ పార్టీ నిర్ణయించింది.
వీరిపై దాడికి నిరసనగా మునీర్ పనిచేసే కేకే-5 గని కార్మికులు మొదటి షిఫ్ట్ విధులను బహిష్కరించారు. వీరి బాటలోనే, కేకే-1, కే కే -2 గనులు, వివిధ డిపార్ట్ మెంట్ కార్మికులు విధులను బహిష్కరించి,పెద్ద సంఖ్యలో యూనియన్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు మహిళలు, విద్యార్థులు, యువకులు కూడా భారీ సంఖ్యలో యూనియన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
హత్యా రాజకీయాలను అంతం చేద్దాం...
మందమర్రి దొర గుండాయిజం నశించాలి... అంటూ పట్టణంలో ప్రదర్శన ప్రారంభమైంది. దోషులను కఠినంగా శిక్షించాలి!
గుండాల్లారా ఖబర్దార్ !... అంటూ ప్రదర్శన పురవీధుల్లో కొనసాగుతున్నది. దారి వెంట ఉన్న దొర సారా కొట్టు, బ్రాందీ షాపులను ప్రజలు ధ్వంసం చేశారు. ప్రజా ప్రదర్శన మందమర్రి ప్రధాన మార్కెట్ కు చేరుకున్నది. అక్కడ ఉన్న సినిమా హాల్ పై ప్రజలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తిరిగి ప్రదర్శన మార్కెట్ నుంచి యాపల్ వైపు సాగుతున్నది. ప్రదర్శనలో పాల్గొనే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. నినాదాల హోరుతో పట్టణం మార్మోగుతున్నది.
పోలీస్ కాల్పులు
ప్రజా ప్రదర్శన మందమర్రి యాపల్ ఏరియా కి చేరుకున్నది. అప్పటికే రోడ్డుపై పోలీసు బలగాలు తుపాకులు పట్టుకుని అడ్డా వేసి ఉన్నారు. ప్రదర్శన వీరికి సమీపంలోనికి రాగానే ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఏకపక్షంగా ప్రదర్శనకారులపై పోలీసులు తుపాకులు పేల్చారు.
పోలీస్ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు.
పద్దెనిమిది (18) మందికి తూటాల గాయాలయ్యాయి. ప్రదర్శనకారులు భయంతో పరుగులు తీశారు.
ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు గుండా మల్లేషన్న పక్కనున్న వ్యక్తి కాల్పుల్లో మరణించాడు.ఆయన తృటిలో తూటా నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ కాల్పుల్లో గాయపడిన వారిని, మరణించిన వారిని పోలీసులే హాస్పిటల్ కు తరలించారు.నాయకులను, ప్రజలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనేక మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి . కాల్పుల్లో గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. దీనితో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. అప్పటికే గుండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న అబ్రహం,మునీర్ పై కూడా కేసు నమోదు కావడం ఒక విచిత్రం .
రాష్ట్ర వ్యాప్త బందుకు సిపిఐ పిలుపు
మందమర్రిలో పోలీసుల ఏకపక్ష కాల్పులు, ప్రజల మరణాలకు నిరసనగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటనపై సిపిఐ ఫ్లోర్ లీడర్ సిహెచ్ రాజేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కడిగిపారేశాడు.
న్యాయంగా పోతే ఇట్లనే ఉంటది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మునీర్ ను వారి కుటుంబ సభ్యులు పరమార్శించి,కన్నీళ్లు పెట్టుకున్నారు.
మునీర్ తల్లి అతన్ని ఓదార్చుతూ ...
బిడ్డ! న్యాయంగా నడుచుకుంటే ఇట్లనే ఉంటది.
" ఆప్ కు కుచ్ నహీ హోగా...బే పీకర్ రహీయే.". అంటూ ఆసుపత్రిలో అందరికి ధైర్యాన్ని ఇచ్చింది.
అమరుల స్థూపావిష్కరణ.
కార్మిక నాయకుడు అబ్రహం, యువజన నాయకుడు మునీర్ ఇరువురు ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. వీరి ఆరోగ్యం కాస్త కుదుటపడిన వెంటనే పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం, అమరుల స్థూప నిర్మాణాన్ని చేపట్టారు. ప్రజల భాగస్వామ్యం, సిపిఐ సభ్యులు, సానుభూతిపరుల సహకారంతో పట్టణంలో భారీ స్థూపాన్ని విజయవంతంగా నిర్మించారు. ప్రజల సమక్షంలో దాన్ని ఆవిష్కరించారు.
(మృతి చెందిన వారి పేర్లను రాయాలి .స్థూపం ఫోటో రావాలి)
బెల్లంపల్లిలో హత్యాయత్నం.
మందమర్రి పట్టణంలో, బొగ్గు గనులపై తన ఆధిపత్యం తగ్గిపోతున్నదని, దీనికి ప్రధాన కారణం మునీర్ కార్యాచరణ అనే స్థిరమైన అభిప్రాయానికి *దొర*, ఆయన అనుచర గణం వచ్చింది.ఇతడిని అడ్డు తొలగించకుంటే తన ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని దొర అభిప్రాయంగా గూండాలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సారా, బ్రాందీ దుకాణాల వద్ద తాగిన మైకంలో మునీర్ అంతు చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దొరకు అనుకూలంగా పనిచేస్తే అందలం ఎక్కుతాడు.... లేదంటే పాడే ఎక్కుతాడంటూ మునీర్ మిత్రులకు కూడా హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు.
బెల్లంపల్లి "కాల్ టెక్స్" సమీపంలోని ఒక సినిమా టాకీసులో సినిమా చూడటానికి తన మిత్రుడు సారయ్యతో కలిసి (1980 సంవత్సరంలో ) మునీర్ వెళ్ళాడు. మందమర్రి నుంచి బెల్లంపల్లికి వీరు ఇరువురు సైకిల్ పై మ్యాట్నీ షో చూడడానికి వెళ్లారు. వీరు వెళ్తున్న విషయాన్ని గూండాలు గమనించారు.
బెల్లంపల్లిలోని సినిమా టాకీస్ వద్ద కాపు కాసారు.
మునీరు వెంట ఎక్కువ మది మిత్రులు కూడా లేరు, ఇది అనుకూలమైన సమయంగా గుండాలు భావించారు. సినిమా ముగిసి బయటకు వచ్చే టైంలో దాడి చేయాలని పథకం ప్రకారం సినిమా హాల్ వద్ద వేచి ఉన్నారు. సినిమా చూసి బయటకు వస్తున్న మునీర్, సినిమా హాల్ పరిసర ప్రాంతాలలో గుండాలు ఉండటాన్ని గమనించాడు. ఆలస్యం చేయకుండా తన మిత్రుడిని పారిపొమ్మని హెచ్చరిస్తూనే ప్రేక్షకుల్లో కలిసిపోయాడు. మునీర్ పరుగు, గుండాల అరుపులతో ప్రేక్షకులు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రేక్షకులను తప్పించుకుంటూ, గుండాలకు దొరకకుండా విపరీతమైన వేగంతో రైలు పట్టాల వెంట మందమర్రి వైపు పరుగు తీశాడు. ఆయనను గుండాలు వెంబడిస్తూ కత్తులు, గొడ్డళ్లు, ఇనుప రాడ్లు, రాళ్లు విసిరారు. వాటిని తప్పించుకుంటూ, వీరికి అందకుండా పరిగెత్తాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేస్తూ శరీరం దృఢంగా ఉండడంతో మునీర్ వేగాన్ని గూండాలు అందుకోలేకపోయారు.
మునీర్ వెంట ఉన్న మిత్రుడు తప్పించుకొని మందమర్రి లోని వారి సహచరులకు సమాచారం అందించాడు. దాదాపు 70 మంది యువకులు యాపల్ సమీపంలోని రైల్వే ట్రాక్ కు చేరుకొన్నారు.అదే సమయంలో మునీర్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన వచ్చిన వెంటనే, అందరు కలిసి పట్టణంలోకి వెళ్లారు. భవిష్యత్తులో అప్రమత్తంగా నడుచుకోవాలని ఈ సంఘటనతో గుర్తించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి