5, డిసెంబర్ 2024, గురువారం

yuvajana nayakudigaa..

యువజన నాయకుడిగా...

అఖిలభారత యువజన సమాఖ్య (AIYF )నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల కార్యకర్తగా ప్రజల పక్షాన నిలబడి మునీర్ తన నేతృత్వంలో అనేక  ఉద్యమాలను కొనసాగించాడు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  గిరిజనుల సంఖ్య ఎక్కువ . వారు  ఆధునిక సౌకర్యాలైన   రవాణాకి , వసతికి దూరంగా  కొండ కోనల్లో ఉండి  పోతారు. నిరుపేదలైన గిరిజన, ఆదివాసి, షెడ్యూల్డ్ కులాలు, ఇతర పేద వర్గాలకు  ప్రభుత్వ భూములు పంచాలని అనేక పోరాటాలు జరిగాయి . 

 స్కూల్స్,హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు నిర్మించారు.

పేదల అభివృద్ధికి ప్రయత్నించని ప్రభుత్వ అలసత్వాన్ని  ప్రశ్నిచే  ప్రజలపై పోలీసుల దాస్టికాలను ,దొరల  ఆగడాలను ఎదిరిస్తూ  అనేక ప్రజా ఉద్యమాలు  జరిగాయి . 


మందమర్రి పట్టణంలో ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాల కోసం    కాలినడకన ఇంటింటికి, గల్లీ గల్లీకి తిరిగే   వారు  .

 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా  అనేక గ్రామాలలో  సైకిల్ పై తిరుగుతూ జన సమీకరణకు,పార్టీ విస్తరణకు విశేష కృషి చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, లక్షేట్టిపేట నేన్నెల తదితర మండలాల్లో కష్టజీవులు, నిరుపేదలకు మెరుగైన జీవనం, కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాధికారులతో పలుమార్లు చర్చల్లో పాల్గొన్నారు . కొన్ని సమస్యలను పరిష్కరించ గలిగారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల పోలీసులు, వారిని కండ్లల్ల పెట్టుకున్నరు.   వారిని  అనేక తప్పుడు కేసుల్లో ఇరికించారు. అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేశారు. కోర్టుల చుట్టూ తింపారు.

హమాలి అంజయ్య

1980 సంవత్సరం లో  హైదరాబాద్ గౌలిగూడ బస్ స్టేషన్ లో అంటే ఇప్పటి ఎం జి బి ఎస్  ప్రాంతం లో  హమాలీ పనిచేసే అంజయ్యను పోలీసులు కొట్టి చంపారు . దానికి  రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. పోలీస్ దుర్మార్గానికి నిరసనగా సిపిఐ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చింది.  మందమర్రిలో వి టి అబ్రహం, మునీర్ నేతృత్వంలో ఆ బందును  విజయవంతం అయింది . పట్టణంలో సంపూర్ణంగా బందు జరిగింది .  బందు విజయవంతంగా జరిగినందుకు అదే రోజు సాయంత్రం  ఒక పెద్ద  ఊరేగింపు జరిగింది  .ఆ ఊరేగింపును   అడ్డుకోవడానికి డిఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు  .పోలీస్ చర్యలను కమ్యూనిస్టు పార్టీ  శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి . పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తీవ్ర  వాగ్వివాదం, తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజల్ని చెదరగొట్టారు. ముఖ్య నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి చిత్రహింసలు పెట్టారు. పోలీస్ దుర్మార్గం పట్టణంలో ప్రచారం అయ్యింది.సిపిఐ నాయకులను పోలీసులు కొడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న గని కార్మికులు, మహిళలు,యువకులు కుటుంబాలతో సహా కదిలి వచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట వందలాది మందితో భారీ ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు నుంచి ప్రజలు వెళ్లిపోవాలని పోలీసులు చేస్తున్న విజ్ఞప్తిని ప్రజలు ఖాతరు చేయలేదు. ప్రజల సంఖ్య గంట  గంటకు   పెరుగుతున్నది.ఉద్రిక్తత మరింతగా పెరిగింది.పోలీస్ స్టేషన్ గేట్లు బద్దలు కొట్టుకొని ప్రజలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా సమాచారం అందుకున్న  పోలీసు ఉన్నతాధికారులు మునీర్ తో పాటు ఇతర నాయకులందరిని  విడిచిపెట్టారు.

పోలీసుల తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఉద్యమకారులపైనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని తప్పుడు కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి సమీపం లోని సోమగూడెం వద్ద రెండు బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు . బస్సు దగ్ధం కేసులో కూడా మునీర్ బృందాన్ని ఇరికించారు.

సారా వ్యతిరేక పోరాటం

సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నెల రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక భాగం సారా,బ్రాందీ తాగటానికి ఖర్చు అయిపోయేది . గనులపై ఇచ్చే జీతం అందుకున్న అనేకమంది కార్మికులు ఇళ్లకు వెళ్లేవారు కాదు. జేబులో ఉన్న డబ్బులు ఖర్చయ్యే వరకు సారా కొట్టు, బ్రాందీ షాపే వీరికి ఆవాసాలుగా మారి పోయేవి.
కార్మికులకు ఆహ్లాదాన్ని ఇవ్వాలనే పేరుమీద సింగరేణి యాజమాన్యం ఏర్పాటుచేసిన రిక్రియేషన్ క్లబ్బు పేకాట కేంద్రాలుగా వర్ధిల్లేవి. జీతాలు తీసుకున్న తర్వాత కొంతమంది కార్మికులు పేకాట ఆడడానికి ఇక్కడికి చేరుకునేవారు.రోజుల తరబడి ఇక్కడే భోజనాలు. ఇక్కడే  నిద్ర పోయేవారు  కూడా . ఇలాంటి మహానుభావులను ఇంటికి తీసుకు వెళ్లడానికి భార్యా పిల్లలు బజారుకు వచ్చి, వీరి జాడ కోసం వెతికేవారు. క్లబ్ లో పేకాడుతున్న  వారిని   మరియు మద్యం సేవించి మత్తులో ఎక్కడపడితే అక్కడ పడిపోయి ఉన్న కార్మికులను ఇళ్లకు తీసుకు వెళ్లడానికి కుటుంబీకులు తీవ్రంగా శ్రమించేవారు. కుటుంబ సభ్యులు చేసే పనిని  తప్పుగా పేర్కొంటూ భార్య పిల్లలను విపరీతంగా కొట్టేవారు.
మత్తులో సోయి తప్పిన కార్మికుల జేబులో నుంచి మందమర్రి దొర గుండాలు డబ్బులు దొంగి లించేవారు. ప్రతిఘటించిన వారిని తన్నిమరీ  బలవంతంగా లాక్కునేవారు
ప్రతినెలా  జరుగుతున్న ఈ తతంగాన్ని  కమ్యూనిస్టు పార్టీ నిశితంగా గమనించింది. మందమర్రి పట్టణంలోని కార్మిక వాడలలో సారా కొట్టు, బ్రాందీ షాపులు ఎత్తివేయాలని దూబగుంటలో జరిగిన సారా వ్యతిరేక పోరాటానికి కంటే ముందుగానే ఇక్కడ జరిగింది. మహిళా నాయకురాళ్ళు మహా లక్ష్మమ్మ, మనెమ్మల నేతృత్వంలో మద్యం వ్యతిరేక పోరాటాలు కొనసాగాయి. సారాకొట్లను కూల్చివేసి, బ్రాందీ షాపుల పై భౌతిక దాడులకు పాల్పడ్డారు. మహిళలు భారీ సంఖ్యలో ముందు వరుసలో నిలబడి పోరాడారు. అబ్రహం,మునీర్ మార్గదర్శకతన మద్యం వ్యతిరేక పోరాటాలు నడుపుతున్నారని అక్రమ కేసులను నమోదు చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా మహిళలు చేసిన పోరాటం వలన కార్మిక వాడల నుంచి సారాకొట్లు,, బ్రాందీ షాపులు తరలిపోయాయి. ఫలితంగా కార్మిక వాడల్లో  ప్రశాంతత తిరిగి  నెలకొన్నది.

మరో జూదం *తంబోలా* ఆట

కార్మికుల సొమ్మును దోచుకోవడానికి అలవాటు పడిన అసాంఘిక ముఠాలు వినోదాత్మక ఆట పేరిట తంబోలా అనే జూదానికి తెర లేపారు. సర్కస్ నిర్వాహకులు వేసే పెద్ద టెంటు లాంటిదే 

వీరు కూడా ఏర్పాటు చేశారు. తంబోలా కేంద్రంలోకి వెళ్లాలంటే ప్రవేశ రుసుము (టికెట్) కొనాలని నిబంధన విధించారు.ఈ జూద గృహానికి పోలీసులు కాపలాగా ఉండేవారు అనేది బహిరంగ రహస్యమే. హాల్ లోనికి ప్రవేశించిన ఆటగాళ్లు డబ్బులు చెల్లించి నెంబర్ ఆట ఆడేవారు. ఇక్కడ అనేక అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి రాత్రిపూట జరిగే ఈ తాంబోలా ఆటలో స్టేజి కూడా ఉండేది. స్టేజి పైన మహిళలతో అర్థనగ్న,అసభ్య, అశ్లీల నృత్యాలను ప్రదర్శించేవారు. ఈ నృత్యాలు చూస్తూ జనం ఊగిపోయి, తమ జేబులు ఖాళీ అవుతున్న విషయాన్నికూడా  గుర్తించేవారు కాదు.
డ్యూటీలు మాని ఇక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకునేవారు. కార్మికుల కుటుంబాలలో చిచ్చు రేపుతున్న ఈ సంఘటన యూనియన్ దృష్టికి వచ్చింది.

తంబోలా కేంద్రంపై దాడి

తంబోలా ఆట పేరిట జరిగే దోపిడి కేంద్రంపై మునీర్ నేతృత్వంలో యువకులు దాడి చేశారు. అడ్డువచ్చిన గుండాలను చితక బాదారు. పెద్ద సంఖ్యలో యువకులు రావడంతో గుండాలు భయంతో పరిగెత్తి తప్పించుకున్నారు. ప్రజలు తాంబోలా టెంట్ ను తగలబెట్టి, ఆటను పూర్తిగా రద్దు చేయించారు. ఈ పరిణామం కార్మిక కుటుంబాలకు సంతోషం నింపింది. దొర కంట్లో నిప్పులు కురిపించింది. తంబోలా కేంద్రంపై జరిగిన దాడి వలన ఆర్థిక నష్టం  కలుగుతుందని భావించిన పెట్టుబడిదారులు మునీర్ బృందంపై తప్పుడు కేసు నమోదు చేయించారు.
మునీర్ తో పాటు యువకులందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ వార్త కార్మిక వాడల్లో ప్రచారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొన్నారు. వీరి విడుదల కోసం ఆందోళనకు దిగారు. గత్యంతరం లేక కేసు నమోదు చేసి యువకులను విడిచిపెట్టారు.

సినిమా టాకీస్
మందమర్రి పట్టణంలో జరిగే అరాచకాలకు సినిమా హాలు అడ్డా! మందమర్రిలో చట్టం, న్యాయం, ధర్మం అన్ని *దొర* కనుసన్నులలోనే నడిచేవి. దొర  రూపొందించిన నియమ, నిబంధనలు మాత్రమే సినిమా హాల్లో అమలు అయ్యేవి. వాటిని ధిక్కరించిన ప్రేక్షకులకు దొర గుండాలు శిక్ష విధించేవారు. సినిమా చూసే ప్రేక్షకులు హీరో, హీరోయిన్ల పై వచ్చే పాటలకు ఈలవేసినా, చప్పట్లు కొట్టినా తప్పే! హీరో, విలన్ మధ్య జరిగే కొట్లాట సన్నివేశాలకు స్పందించి చప్పట్లు కొట్టినా, అరిచినా,గంతులు వేసినా, పేపర్లు చింపి విసిరినా క్షమించరాని నేరమే! ఇందుకు శిక్షగా గుండాల దెబ్బలకు గురికావాల్సిందే.తాగిన మత్తులో సంచరించే గుండాలు రక్తం కారి సొమ్మసిల్లిపోయిన ప్రేక్షకులను కనికరం లేకుండా చిత్తం వచ్చినట్లు కొట్టేవారు .
వినోదం కోసం సినిమా టాకీస్ కు వెళ్లే అందమైన స్త్రీలు ఇంటికి తిరిగి వస్తారని నమ్మకం ఉండేది కాదు. సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ సినిమాకు వెళ్లిన మహిళలు శవాలుగా మారి సినిమా టాకీస్ సమీపంలోని బావిలో కనబడేవి. అవన్నీ మిస్టరీ హత్యలు కానీ మిగిలిపోయాయి. సినిమాకు వెళ్లిన ఆడవారిపై అత్యాచారానికి పాల్పడి, చంపి శవాలను బావిలో వేస్తున్నారని, సినిమా టాకీస్ యాజమాన్యమే వీటికి కారణమని ప్రచారం ఉండేది.
ఒకరోజు పట్టణ మహిళా సమాఖ్య నాయకురాలు మనెమ్మ కుమారుడు రాజు, మరో విద్యార్థి రవి
*పొట్టేలు పున్నమ్మ* సినిమాకు వెళ్లారు . పిల్లలు ఇరువురు సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏఐఎస్ఎఫ్ లో చురుకుగా పనిచేసేవారు. సినిమా హాలు నిబంధనలకు విరుద్ధంగా పిల్లలు ఈల వేశారని, అల్లరి చేశారని గుండాలు వీరిని చితకబాదారు. పిల్లలపై జరిగిన దాడి వార్త పట్టణమంతా వ్యాపించింది.
ప్రజలపై గుండాల అరాచకాలు నిలువరించాలని సిపిఐ శ్రేణులు అప్పటికే నిర్ణయించుకున్నాయి. పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద ఉన్నటువంటి పార్టీ క్యాడర్
కు విద్యార్థులపై జరిగిన దాడి తెలిసింది. పిల్లలపై జరిగిన దాడితో నాయకులు, కార్యకర్తలు కోపంతో రగిలిపోయారు. గుండాలకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు.
అందుబాటులో ఉన్న కర్రలు, రాళ్లు,చేతికి ఏది దొరికితే అది పట్టుకొని  గుండాలకు బుద్ధి చెప్పాలని ప్రజా సమూహం సినిమా హాల్ వైపు బయలు దేరింది. వీరి వెంట మహిళలు కూడా కారంపొడి, చీపుర్లు పట్టుకొని నడిచారు.
గూండాలు టాకీస్ సమీపంలోనే ఉన్నారు. మునీర్ నేతృత్వంలో ప్రజా సమూహం ఒక్కసారిగా గుండాలపై దాడి చేశారు. ఊహించని దాడికి కంగుతిన్న గుండాలు, తేరుకొని కొద్దిసేపు ప్రతిఘటించారు. భారీ సంఖ్యలో ఉన్న జనం ముందు వీరి కండ బలం పనిచేయలేదు. ప్రజల దాడి నుండి తప్పించుకోవడానికి సినిమా హాల్ లోనికి పరుగు తీశారు. పారిపోతున్న గుండాలను ప్రజలు వెంటపడి తరిమారు.
సినిమా హాల్ లోపలకి ప్రవేశించిన గుండాల అరుపులు, కేకలతో భయభ్రాంతులకు గురైన ప్రొజెక్టర్ రూమ్ లోని సిబ్బంది ప్రదర్శనను నిలిపివేశారు.హాలులో లైట్లను వేశారు. ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ప్రేక్షకులకు ధైర్యం చెబుతూ, వారిని ఇళ్లకు పంపుతూ గుండాలను వెంబడించారు.
గుండాలకు బుద్ధి చెప్పండి...
గుండాయిజం నశించాలి...
గుండాలరా ఖబర్దార్ అంటూ ప్రజలు నినాదాలు చేస్తూ గుండాలపై దాడి చేస్తున్నారు.

అదే రోజు సినిమా చూడడానికి మునీర్ తల్లి, చెల్లెలు కూడా వచ్చారు. ఈ విషయం మునీర్ కు తెలియదు.
విద్యార్థులపై జరిగిన దాడితో చెల్లించి చలించి పోయిన మునీర్ చేతిలో లాఠీతో గుండాయిజం *బంద్ కరో* అంటూ గూండాల పైకి దూకుతున్నాడు.
మునీర్ చేతిలో లాఠీని చూసి మునీర్ తల్లి, చెల్లి ఖిన్నులయ్యారు.
ఏడుస్తూ క్యా కర్ రా, హాత్ మే లాఠీ కైకు, అంటూ బిగ్గరగా అరుస్తున్నారు.
ఆప్ ఘర్ జావో, హం ఆయంగే, ఫికర్ మత్ కీజియే, జల్ది జాయియే అంటూ గుండాలను తరుముకుంటూ మునీరు వెళ్లాడు.
గతంలో సినిమా హాలుకు వచ్చిన ప్రేక్షకులతో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటూ ప్రజలు దాడికి దిగారు. దాడిలో బుకింగ్ కౌంటర్లు, ప్రొజెక్టర్ రూమ్, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ ధ్వంసం అయ్యింది. ప్రజల దాడి నుంచి తప్పించుకోవడానికి గుండాలు తలో దిక్కు పారిపోయారు. దొరికిన వారిని ప్రజలు చితక భాదారు. సినిమా హాల్ పై జరిగిన దాడిని ప్రజలు స్వాగతించారు. కొందరైతే సంబరాలు చేసుకున్నారు.

మునీర్ తల్లి,చెల్లెలు కన్నీరు పెడుతూనే భయం భయంగా ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి మునీర్ కూడా ఇంటికి చేరుకొని, ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. టాకీస్ లో చూసిన గొడవను ఎవరు కూడా మునీర్ తండ్రితో చెప్పలేదు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి తలుపులను  గట్టిగా కొడుతూ, మేం పోలీసులం తలుపు తీయండి అంటూ పిలుస్తున్నారు.
భయపడుతూనే కౌన్ హై అంటూ  వెళ్లి మునీర్ తల్లి తలుపు తీసింది.
ఇత్ని రాత్ క్యా కామ్, క్యో ఆయి హో అంటూ ప్రశ్నించింది.
మునీర్ ఉన్నాడా అంటూ పోలీసులు ప్రశ్నించారు.
ఇంకా ఇంటికి రాలేదు అని సమాధానం ఇచ్చింది.
మేం ఇంటిని సోదా చేస్తాం అంటూ పోలీసులు ముందుకు కదిలారు. ఇంట్లోకి రావద్దంటూ మునీర్ తల్లీ గట్టిగా వాదిస్తోంది.
గొడవకు మేల్కొన్న మునీర్ తండ్రి క్యా హోరా అంటూ బెడ్ రూమ్ నుంచి హాల్ లోకి వచ్చాడు.
ఎదురుగా పోలీసులు కనబడడంతో వారికి నమస్కరించి క్యా హై సాబ్ ఇత్ నీ రాత్ ఆయే అంటూ ప్రశ్నించాడు.
ఈరోజు రాత్రి మందమర్రి సినిమా హాలుపై మునీర్ నాయకత్వంలో దాడి జరిగింది. ఆయనను పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి విచారిస్తాం. అందుకోసమే వచ్చామని పోలీసులు చెప్పారు. మునీర్ ఇంకా ఇంటికి రాలేదని తల్లి చెబుతుండగానే మునీర్ బాహర్ ఆవో అంటూ గట్టిగా కేక వేసి పిలిచాడు. తండ్రి పిలుపుతో బయటకు వచ్చిన మునీర్ ను పోలీసులకు అప్పగించాడు. అదేవిధంగా సంధానిని కూడా పోలీసులు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు.
బచ్చా హై సాబ్, సుభా మైహి, లేయాఖే ఆప్ కీ హవాలా కర్ దుంగా అని బ్రతిమాలడంతో సంధానిని వదిలిపెట్టి వెళ్లారు.
మునీర్ తండ్రి గౌస్ మియా కే కే 5 గనిలో పి.ఎగా (పెద్ద రైటేరు) పనిచేయటం ఆయన సత్ప్రవర్తన, అవినీతి రహితుడు, క్రమశిక్షణతో పనిచేయడం వలన అధికారులు, కార్మికులలో ఆయనకు మంచి పేరుంది.
పోలీసుల వెంట, సినిమా హాల్ యజమాని కొడుకు సురేందర్ రావు కూడా ఉండటం విశేషం. మునీర్ ను చూసిన వెంటనే ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది. ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికాడు. వీడికి బుద్ధి చెప్పండి అంటూ పోలీసులను ఆజ్ఞాపించాడు. అప్పటికే పోలీసు వ్యాన్ లో మునీర్ మిత్రులు కూడా ఉన్నారు. వీరందరికీ ఆరోజు రాత్రి పూట పోలీసులు గట్టిగానే అరుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

మునీర్ తో పాటు ఇతర యువకులను పోలీసులు అరెస్టు చేసి, చిత్రహింసలకు గురి చేస్తున్నారని కార్మిక వాడల్లో ప్రచారమైంది. మందమర్రి భూస్వామి కొడుకు సురేందర్రావు స్వయంగా పోలీస్ స్టేషన్లో అడ్డావేసి వీరిని చిత్రహింసలు పెట్టిస్తున్నాడని వార్త ప్రజలను కోపోద్రికుల్ని చేసింది.
మునీర్ తో పాటు అరెస్ట్ అయిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి. దొర గుండాయిజం నశించాలి. గుండాల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. గంట, గంటకు ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం షిఫ్టు ముగించుకొని ఇళ్లకు వెళ్లే కార్మికులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఆగుతున్నారు.జన ప్రవాహం, నినాదాల హోరు పెరిగిపోతున్నది. పోలీస్ స్టేషన్ ఎదుట చేస్తున్న ధర్నాను విరమించాలని, శాంతి భద్రతలకు విఘాతo కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మైకులలో హెచ్చరిస్తున్నారు. అయినా జనం వెనక్కి తగ్గటం లేదు. రాత్రి కావస్తుండడంతో పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి వీరిని విడుదల చేశారు.

చీర చింపి కట్టు కట్టిన వీరవనిత
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, సినిమా టాకీస్ పై దాడి నిర్వహించారనే కోపంతో  పోలీసులు ఊగిపోయారు. మునీర్  ను ఇష్టం వచ్చినట్టు లాఠీలతో చితక బాదారు. తలకు తగిలిన లాఠీ దెబ్బకు తల పగిలి, రక్తం కారుతున్నది.ప్రజా ఆందోళనతో సిపిఐ నాయకులను పోలీసులు విడిచిపెట్టినప్పుడు బయటకు వస్తున్న మునీర్ తల నుండి రక్తం కారుతూనే ఉంది.మునర్ చేతితో దెబ్బ తగిలిన చోట ఒత్తి పట్టుకున్నప్పటికీ రక్తం కారటం ఆగటం లేదు. దీన్ని గమనించిన ఓ ఆడబిడ్డ తన చీర కొంగు చింపి కట్టు కట్టింది. అది ఆనాడు ప్రజా చైతన్యానికి, ఉద్యమకారుల ఎడల ఉన్న ప్రేమకు నిదర్శనం.
పోలీసులు విడుదల చేసిన నాయకులను ప్రజలు గుండెలకు హత్తుకున్నారు.వారికి జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. మునీర్ ను ప్రజలు భుజాలపై ఎక్కించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
అవమాన భారంతో దొర రగిలిపోతున్నాడు.మునీర్, సిపిఐ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం బయటకు పొక్కింది. ఎప్పుడైనా వీరిపై దాడి జరగవచ్చునని పుకార్లు బయలుదేరాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి