15, మార్చి 2022, మంగళవారం

ఈ రోజు (15 థ్ మార్చ్ ,2022) ముచ్చట్లు ..

 ఈ రోజు (15 థ్ మార్చ్ ,2022)    ముచ్చట్లు .. 


ప్రతి రోజు నాలోకి ఎన్నెన్ని భావాలో ,భావనలో .. ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాను .. ఇంకా నాలో వెతుకులాట వెనకడుగు వెయ్యలేదు .. అయితే కొత్తగా దేని గురుంచి అంత ఇదిగా ప్రయ్నతించను . ఎందుకంటే ముందు తెలిసినదాన్ని మరింతగా సాన పెట్టుకోవాలి .. అది గెలుస్తుంటే చూట్టం లో అదో తృప్తి .. అయితే ఈ ప్రయత్నాలలో ఎంత ఉత్సాహం ఉరకలు వేసినా ,అదే పనిగా తీరం మీదికి దాడికి వచ్చే సముద్రం అలకు మల్లె అప్పుడప్పుడు నిరాశా నిస్పృహలు 

కమ్ముకుంటాయి . దాంట్లోంచి బయట పడేసరికి ఒక రోజు మారిపోతుంది . 

ఎందుకో మరి ఇవ్వాళ ఎక్కడలేని ఓపిక వచ్చింది . పొద్దున్నే కొత్త వంట మనిషి పనిలో చేరింది . రాగి జావ చేసింది . చాలా రోజుల తర్వాత నోటికి కాస్త రుచి తగిలినట్టయింది . దాని ఫలితమేమో .. యమా ఉషారు వచ్చింది . ఇంకేముంది .. ఇల్లంతా కడిగి ,ముగ్గు వేసినంత పని చేసాను . కిచెన్ సామాను అంతా ఎక్కడికక్కడ శుభ్రంగా సర్దేశాను . 

నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టి చావలేదు దోమల బాధ తో . అయినా మధ్యాహ్నం కాసేపు పడక వేయాలన్న అలసటే  రాలేదు . స్వచ్ఛ భారత్ లో పూర్తిగా మునిగి పోయాను . 

పరిసరాల్లో వచ్చే మార్పులు నాలోనూ కొత్త శక్తి ని నింపుతాయి .. అదే..  ఈ రోజు ఈ ముచ్చట్లకి ప్రేరణ ఇచ్చింది . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి