నిప్పు కణిక
మందు పాతరలను తప్పించుకోగలిగే
పాద లాఘవం నీది
నల్లేరు మీద నడక
నీ పాద ముద్ర
ఇక నీ ముద్దుకు
ఒకే ఒక్క చిరునామా
రెక్క విప్పిన రెవల్యూషన్
దీ నమ్మా ..
జీవితాన్ని చాప లాగ చుట్టి
సంకన మడిసి పెట్టుకొని
వంచిన తల ఎత్తకుండా
ఏకా ఎకి సాగే
ఏకాకి నౌక ప్రయాణం .. నువ్వు
నవ్వు ఆపుకోలేను
చుక్కల దండ చుట్టుకొన్న
నీ బాహువుల్లో నే ఒదిగిపోయి
బోసిపోయిన ఆకాశాన్ని చూసినపుడు
నువ్వు
చెక్కుతాను అంటావు
కానీ అచ్చంగా కోసి
కారం బెట్టి
దండెం మీద ఎండేసిన
కబాబులు కదా
నీ అక్షరాలు
కణ కణ మండే
ఆచరణ నిప్పుల్లో
లావాలా ప్రవహించే
ఉనికే నువ్వు
నివురు చేరగలేని
నిప్పుకణికే నువ్వు
కన్నీరింకిపోయిన నవ్వుల్లో
ఎడారి ఎండమావుల్లో
నిండైన ఓయాసిస్సే
నువ్వూ.. నీ మనసూ
పంతం బట్టి
ఆకాశాన్ని పతంగం చేసి
విహంగమయ్యే నువ్వు
పువ్వుల తోటి కన్నులు కలిపి
గుండెలు తొలిచే నీ నవ్వు
అందరూ తల్లి కడుపు లోంచే
పుడతారు
నువ్వెంటో .. ఆశ్చర్యంగా
నీ దేహంలోంచే మొలకెత్తినట్టు
ఆకుపచ్చని అందానివి
ఆత్మ విశ్వాస ప్రతీకవి
నీ అణువణువూ ప్రత్యేకం
తపస్సమాధి లోంచి విడివడిన
చైతన్య ప్రవాహం ఆయేషా ..
హమేషా ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి