నేల ,నింగి ఐన వేళ-3
నేను కూర్చున్న గదిలో నాకు రక్షణగా పోలీసుల సంఖ్య పెరిగింది .
నా మందుల గురుంచి అడిగారు. ఆ భయం లో వాటి పేర్లు చాల సేపటి వరకు గుర్తు రాలేదు . చాలా బలవంతంగా గుర్తుకు తెచ్చకోనే ప్రయత్నం ఓ మేరకు ఫలించింది. ఒక్క రోజు కోసం షుగర్ మందులు,ఇన్సులిన్ తీసుకొచ్చారు. అంతలోనే నాగపూర్ గెస్ట్ హౌస్ లో నేను వదిలేసిన నా బ్యాగ్ ,మందులు ,లాప్టాప్ వచ్చేసాయి .
వంట ఏర్పాట్లు అయ్యాయి. అందరం కలిసే భోజనం చేసాం. మర్యాదలు ఏమీ తక్కువ చెయ్యలేదు . మానవత్వం లో లోపం కనిపించలేదు .
ఈ ఆపరేషన్ కి అసలు బాస్ ఒక సర్దార్జీ . పొట్టిగా గట్టిగానే ఉన్నాడు . తన టీం ని అభినందించాడు. వెల్ డన్ my boys అని ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ దొర లాగ మెచ్చుకున్నాడు . మొదట నన్నూ బాగానే పలకరించాడు . నా దగ్గర సమాధానాలు లేని ప్రశ్నలు కొన్ని అడిగి భంగ పడ్డాడు . కొంచెం బెదిరించాడు .. నా దగ్గర నుంచి వారు ఆశించిన దేదీ దొరకలేదు.
ఉగ్గబట్టుకున్న కోపం కట్టలు తెంచుకుంది.
"you Mother Fucker" అని ఇంగ్లీష్ లోనే గట్టిగా అరిచాడు .. నా కంటే అతని సిబ్బంది ఎక్కువ
భయపడినట్టు నటించారు .
నా కైతే ఆ మాటకు రోషం పొడుచు కొచ్చింది . mother fucker అనే మాట నేను ఎప్పుడు వినలేదు . కానీ అది పెద్ద బూతు తిట్టు అని అర్థమైంది . అమ్మ ని తిట్టాడు అని అనిపించింది . మనసులోనే బాధ పడ్డాను .. ఆ తర్వాత సిబ్బందితో నా ఆగ్రహాన్ని పంచుకున్నాను .
అందరిదీ ఒకే ప్రయత్నం .. నేను ఎవరైనా ఒక పెద్ద నాయకుడిని పట్టివ్వాలి. లేదా వారి ఫోన్ నెంబర్ ఇవ్వాలి.
దాని కోసం అందరు నా చుట్టూ వరాలిచ్చే దేవుళ్ళలాగా మసులుకోసాగారు ..
ఓ ఇద్దరు తెలుగు వాళ్ళను వెదికి నా దగ్గర కి పంపించారు. ఆ ఇద్దరు శ్రీకాకుళం వాళ్ళు .. ఇద్దరు యువకులే .. 30 లేదా 35 సంవత్సరాల వయసు ఉంటుంది . రావడం ,రావడమే నాతో వరసలు కలిపేసి బాబాయ్ ,బాబాయ్ అని మాటల్లోకి దింపారు . కొంచెం సేపు బుజ్జగించేవారు. మరికొంత సేపు ముద్దు ముద్దుగా బెదిరించేవారు . మొదటి రాత్రి నిద్ర పోనివ్వలేదు . ఏవేవో అడగటం ,వాళ్ళు ఎదో రాసుకోవటం ..రాత్రి అంతా అలానే తెల్లారిపోయింది ..
.. పాపం వాళ్ళ మీద జాలేసింది .. వాళ్ళ కానిస్టేబుల్ లేదా హోమ్ గార్డ్ హోదాకి వాళ్ళు పడే తిప్పలు చూస్తే నవ్వొచ్చింది .కానీ ఎవ్వరితో ఏమీ మాట్లాడలో అర్థం కాక ముక్త సరిగా వాళ్ళు అడిగినదానికి సమాధానాలు చెప్పాను . కానీ వాళ్ళు ఏ అవకాశాన్ని వదలలేదు . నన్ను బాగు చెయ్యాలని, వాళ్ళు బాగుపడాలని వాళ్ళు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి .
వాళ్ళ మొబైల్స్ నిండా వాళ్ళు పట్టుకోవాల్సిన నక్సలైట్ల ఫోటోలు . నన్ను గుర్తుపట్టమని అడిగేవారు .
అప్పటికే మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతి స్థానం లో శ్రీకాకుళం జిల్లాకి చెందిన నంబాల కేశవరావు ను నియమించినట్లు ఒక పత్రికా ప్రకటన వచ్చింది .. అతని పాత ఫోటో ఒకటి కూడా మీడియా లో వచ్చింది . ఆ ఫోటో చూపిస్తూ ,అతన్ని పట్టుకుని చంపేస్తే చాలు మొత్తం ఉద్యమం సమసిపోతుందని 'బాబాయ్, బాబాయ్ 'అని పిలిచే అబ్బాయిలు మాట్లాడేవారు .
నా ఒక చేతికి ఆ అబ్బాయి(పోలీస్ ) చేతికి చెరో బేడీ వేసి కాసేపు నిద్ర పోనిచ్చారు .
జరగ బోయే దేమిటో తెలియదు .. మొత్తానికి జీవితం తల కిందులు అయింది కాబట్టి
చాలా జాగ్రత్తగా మసులుకోవాలని విన్న అనుభవాలు ,చదివిన పుస్తకాలు మెదడులో హెచ్చరిస్తున్నాయి .
డిసెంబర్ 20 రాత్రి గడిచిపోయింది అలా..
తెల్లవారింది .. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి . బాగ్ లోంచి తీసుకొని టాబ్లెట్ మింగాను . కాల కృత్యాల తో పాటు స్నానం కూడా చేశాను . టిఫిన్ ,టీ ఇచ్చారు .
రెండో రోజు ,డిసెంబర్ 21 ,2018.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి