14, సెప్టెంబర్ 2024, శనివారం



సందిగ్ద సందర్భాలకు సూటియైన  సమాధానం 

" కార్ల్ మార్క్స్ 

ఆర్ధిక ,తాత్విక రాత ప్రతులు 

1844"

**********

ఇది తెలుగు లో ఇటీవల  మార్క్స్ రచనల  మీద కొత్తగా  వచ్చిన   పుస్తకం.  

దీన్ని స్థూలంగా మీకోసం పరిచయం చేయడమే నా పని గా భావిస్తూ ఈ నాలుగు మాటలు . 

Economic and Philosophic Manuscripts (EPM) of 1844 అనే ఆంగ్ల గ్రంథానికి అనువాదం ఈ పుస్తకం . 1844 లో అంటే దాదాపు నూటా ఎనభై  సంవత్సరాల క్రితం పారిస్ లో మార్క్స్ తన విస్తృత అధ్యయనాల క్రమం లో రాసుకున్న నోట్సు  ఈ పుస్తకానికి ఆధారం . మార్క్స్ తొలి రచనలలో ఇది ఒకటి అయనప్పటికీ ,మార్క్ సాధించిన అసాధారణ మేధో విజయాల తొలిబీజాలు ఇందులో మనకి కనిపిస్తాయి . మార్క్సిస్టు మూల గ్రంథాలలో కమ్యూనిస్టు  మేనిఫెస్టో,పెట్టుబడి తర్వాత దాదాపు అంతటి  ఆసక్తిని ,చర్చని ఈ రాత ప్రతులు రేకెత్తించాయి . 

పెట్టుబడి దారి సమాజం మనిషికి ,మనిషికి మధ్య సష్టించిన పరాయికరణను అధిగమించి ,మానవ విముక్తిని సాధించడం ఈ పుస్తకం లోని మౌలిక ప్రతిపాదన . మార్క్స్ యావత్ కృషిలో ఈ స్ఫూర్తి కొనసాగింది . 

మార్క్స్ స్ఫూర్తిని మనం  మరో సారి చర్చించుకోవడానికి ఈ పుస్తకం ఒక సందర్భం కావాలనేది 

పుస్తక ప్రచురణ కర్తలు అయిన సమీక్ష మిత్రబృందం వారి కోరిక . పుస్తకము చివరి అట్ట మీద చివరన రాసిన ఈ  మాటలతో నాకూ  పూర్తి ఏకీభావం వుంది .

 బహుశా ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది .

 ఇక పుస్తక రచయిత కార్ల్ మార్క్స్ నేపథ్యం లోకి కాస్త తొంగి చూద్దాము . 


18 వ శతాబ్దం లో తత్వశాస్త్రం సామాజికంగా ప్రగతిశీల పాత్ర పోషించింది .ఈ విషయం గురుంచి మరింత వివరంగా తెలుసుకోవాలంటే  మనం ఫ్రాన్స్ వైపు దృష్టి సారించాలి . తమ తమ సామాజిక వర్గాలకు మార్గదర్శనం చేసిన గొప్ప మేధావులు ,దార్శనికులు కనిపిస్తారక్కడ ! 

ఆ తర్వాత తత్వశాస్త్రం లో వచ్చిన మలుపులు తెలుసుకోవాలంటే మనం జర్మనీకి  వెళ్లాల్సిందే !

ఫ్రెంచ్ విప్లవ ప్రభావం తో  జర్మన్ భూస్వామ్య ఆలోచనలలో పెద్ద మార్పు వచ్చింది . మేధావులు కాలం చెల్లిన తాత్విక ధోరణులను ప్రశ్నించారు . అప్పుడు హెగల్ అనే తత్వవేత్త  రచనలు అక్కడ భూకంపం పుట్టించాయి . 

హెగెల్ మరణం తర్వాత బెర్లిన్ (జర్మనీ ) యూనివర్సిటీ లో తత్వ శాస్త్రం అభ్యసించాడొక యువకుడు . అతడి పేరే కార్ల్ మార్క్స్ . కొంతకాలం సైద్ధాంతిక ఘర్షణ ద్వారా హెగిలియన్  గా  మారాడు. కానీ హెగెల్ భావవాదాన్ని అంగీకరించలేకపోయాడు.  జర్మనీ లో అప్పుడున్న వాస్తవ  పరిస్థితులకు ,చట్టబద్దమైన రాచరిక పాలనకు పొంతన కుదరలేదు . 

 రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత ఆయనెప్పుడూ పీడితులు ,బాధితులు ,దోపిడీకి గురైన వాళ్ళ పక్షమే వహించాడు . ఈ కారణం వల్లనే పోలీసులాయన వెంటపడ్డారు . చివరికి దేశాంతరవాసం తప్పలేదు . ఇంగ్లాండ్ లో నివసిస్తున్న మరో జర్మనీ విద్యార్ధి ఏంగెల్స్ తో పరిచయం ఐంది . ఏంగె ల్స్ తో కలిసి మార్క్స్ ఒక నూతన విప్లవాత్మకమైన తాత్విక ధోరణిని ఆవిష్కరించాడు . 

అదే గతి తార్కిక భౌతిక వాదం.  

మార్క్స్ భౌతిక వాది గా మారటానికి సహాయం చేసిన తత్వవేత్త లుద్విగ్  ఫూర్బ్యాక్ .  ఇతను హెగెల్ భావవాదం మీద తిరుగుబాటు చేసాడు. కానీ హెగెల్ భావవాదంతో పాటు అతని గతితార్కికతను కూడా నిరాకరించడం తప్పని మార్క్స్ గ్రహించాడు . నిజానికి హెగెల్ భావవాదాన్ని భౌతిక వాద  దృక్పథం తో మార్చవలిసి వుంది . అలాగే భౌతిక వాది  ఐన లుద్విగ్  ఫూర్బ్యాక్ పరిమితులను అర్థం చేసుకొని మార్క్స్ రాసుకున్న నోట్స్ .. ఈ పుస్తకం . 

తత్వ శాస్త్రం అర్థవంతంగా ఉండాలంటే అది మనుషుల వాస్తవ జీవితాలకు ,అవసరాలకు సంబంధించినదై ఉండాలి . ప్రకృతి, సమాజం గురుంచి శాస్తీయ  అవగాహన వల్ల మాత్రమే వాళ్ళ సమస్యలకు పరిష్కారం  లభిస్తుందని అనుకున్నాడు మార్క్స్ . ఈ దిశగా పయనానికి  తత్వ శాస్త్రాన్ని మార్క్స్ భూమార్గం పట్టించాడు . దానికి పునాదులు వేసినవే ఈ రాత ప్రతులు . 

పెట్టుబడి దారి విధానపు సహజ లక్షణాల గురుంచి అత్యంత సమర్థవంతంగాను ,శాస్త్రీయంగాను విశ్లేషించి  ,విమర్శించిన మేధావి కార్ల్ మార్క్స్ . ఈ పుస్తకం మార్క్స్ రాసుకున్న నోట్స్ కాబట్టి అన్ని పేజీలు మనమూ ' అండర్లైన్' చేసుకునేవిగానే ఉంటాయి . ఆ విషయాలన్నీ పుస్తకం చదివితే మీకూ  అర్థం అవుతాయి . అయితే పుస్తకం మొత్తం చదవటం ముగించిన తర్వాత మార్క్స్ పట్ల నాకు ఇష్టమైన విషయం ఏమిటని ఒక ప్రశ్న వేసుకున్నాను .దానికి నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే .. 

 ప్రశ్నకు ఒక నూతన రూపం ఇవ్వడం లోనే దాని పరిష్కారం అంతర్నిహితంగా ఇమిడి ఉందన్న ..  మార్క్స్   సూత్రీకరణ . 

ఆ విషయాన్ని మార్క్స్ ఎలా వివరించాడో చూడండి !

సొంత ఆస్తికి మూలం ఏమిటి .. ?అనే ప్రశ్నను  మానవాళి అభివృద్ధి క్రమం లో పరాయీకరించబడిన శ్రమ

 కి ఉన్న సంబంధం ఏమిటి  అనే ప్రశ్నగా మార్చడం ద్వారా ఈ సమస్య పరిష్కార దిశగా మనం చాలా

 పురోగమించాము . ఎందుకంటే సొంత ఆస్తి గురుంచి మాట్లాడేటప్పుడు మనుషులకు బయట వుండే

 విషయం లో వ్యవహరిస్తున్నట్లు భావిస్తాము . అదే శ్రమ  గురుంచి మాట్లాడేటప్పుడు ప్రత్యక్షంగా మనిషి

 తో వ్యవహరిస్తున్నట్లు భావిస్తాము . ప్రశ్నకు ఇలా నూతన రూపం ఇవ్వడం లోనే దాని

 పరిష్కారం అంతర్నిహితంగా ఇమిడి ఉంది . 

పరాయీకరణ గురుంచి మనకు  సింపుల్ గా అర్థం కావటానికి ప్రచురణ కర్తలు  మా మాట  లో ఒక మంచి గేయాన్ని పరిచయం చేశారు . 

గేయం పేరు..  "ది  మెన్ అఫ్ ఇంగ్లాండ్ "

నువ్వు పండించిన పంటను 

వేరొకడు అనుభవిస్తాడు . 

 నువ్వు సృష్టించిన సంపదను

మరొకడు సొంతం చేసుకుంటాడు 

నువ్వు నేసిన దుస్తులు 

వేరొకడు ధరిస్తాడు 

నువ్వు పోత పోసిన ఆయుధాలను 

మరొకడు ఉపయోగిస్తాడు 


పంటను పండించు కానీ 

ఏ నియంతను అనుభవించనీయకు 

సంపద సృష్టించు .. కానీ 

ఏ మోసగాడి సొత్తు కానివ్వకు 

దుస్తుల్ని నేత నెయ్యు .. కానీ 

సోమరిపోతులను ధరించనివ్వకు 

ఆయుధాలను తయారు చేయు .. కానీ 

నీ రక్షణకై ఉపయోగించేందుకు .. 

పరాయీకరణ గురుంచి ఇంత బాగా రాసిన రచయిత పేరు..  పెర్సీ బిసహి షెల్లీ 

షెల్లీ గురుంచి మహాకవి శ్రీ శ్రీ తన  మహా ప్రస్థానం  లో ప్రస్తావించినట్టు గుర్తు . 


ఇక ప్రశ్నకి  సంబంధించి మార్క్స్  దేవుడి గురుంచి కొందరు అడిగే   ప్రశ్న గురుంచి భలే చెబుతాడు . 

మొట్టమొదట ఈ మనుషులను ,ప్రకృతిని ఎవరు సృష్టించారు ? మనము ఎదో భౌతిక వాద  సమాధానం చెబితే దాన్ని ఎవరు పుట్టించారు ..అని భక్తులు నిలదీస్తారు . అది ఇక చెట్టు ముందా  లేక విత్తు ముందా అనే  ప్రశ్న లా ఎటూ  తేలకుండా ముగిసిపోతుంది . 

"ఈ ప్రశ్న నీలో ఎలా పుట్టిందో నిన్ను నీవే ప్రశ్నించుకో . నీ ప్రశ్న నేను సమాధానం ఇవ్వలేని ఒక అసంబద్ధమైన దృక్పథం నుండి పుట్టిందేమో  !నిన్ను నువ్వు ప్రశ్నించుకో! 

నీవు ప్రకృతి ,మానవుని సృష్టి గురుంచి ప్రశ్నిస్తే నువ్వు ప్రకృతిని ,మానవుని అమూర్తీకరిస్తున్నావు . నువ్వు వాటిని లేని వాటివిగా భావిస్తూ నన్ను రుజువు చేయమంటున్నావు . నా జవాబు ఏమిటంటే నీ 

అమూర్తీకరణను వదిలి పెట్టు ! అదే సమయం లో నీ ప్రశ్నను కూడా వదిలేయ్ ! అలా కాదు నీ అమూర్తీకరణను కొనసాగించాలనుకుంటే నిలకడగా అదే మాట పై వుండు ! నీవు..  మనిషి ,ప్రకృతి ఉనికి లో లేవనుకున్నప్పుడు ,నీవు కూడా మనిషి ,ప్రకృతే  కాబట్టి నువ్వు కూడా లేనట్లే భావించుకో !ఏమీ ఆలోచించకు ! నన్నేమి ప్రశ్నించకు  ! ఎందుకంటే నువ్వు ఆలోచించిన వెంటనే ,ప్రశ్నించిన వెంటనే ప్రకృతి ,మానవుల ఉనికి నుండి నువ్వు చేసిన అమూర్తీకరణ అర్థం లేనిదిగా మారిపోతుంది . 

మార్క్స్ తనను చారిత్రిక ఎరుక కలిగిన చింతకునిగా చూడాలని కోరుకున్నాడు . 1843 లో ఒక ఉత్తరం లో ఆయన "ఉనికి లో ఉన్నదానినంతా నిర్దాక్షిణ్యంగా  విమర్శించాలి . ఈ  నిర్దాక్షిణ్య విమర్శకు రెండు అర్థాలు ఉన్నాయి . ఈ విమర్శ తన సొంత నిర్ధారణలకు  ఎటువంటి పరిస్థితుల్లో  భయపడకూడదు . అలాగే ఉన్న శక్తులతో తలపడకుండా ఎప్పుడూ  తప్పించుకోకూడదు . 

మార్క్స్ వి పిడి సూత్రాలు కావు చలన సూత్రాలు 

మానవ సంబంధాలు  అన్నీ ఆర్ధిక సంబంధాలే  .. అని  మార్క్స్ అన్నాడని బాగా ప్రచారంలో ఉన్న ఒక  ఉల్లేఖన . మానవ జాతికి  సర్వత్రా వర్తించే ఈ బాపతు శాశ్వత పిడి సూత్రాలను మార్క్స్ చెప్పి ఉంటాడా అన్న సందేహమే రాదు మనకు . 

కానీ మార్క్స్ చెప్పింది దీనికి సరిగ్గా విరుద్ధం . సొంత ఆస్తి ప్రాబల్యంలోనే మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా దిగజారిపోతాయి . మనిషికి ఇది అసహజం .నిజానికి  మనిషిని మించిన నిస్వార్థ జీవి లేదు . కానీ ఈ సొంత ఆస్తి వ్యవస్థల్లో మనిషి తనకు తాను పరాయీకరణకు లోనవుతాడు . తన  సహజమైన లక్షణాలను అన్నిటిని  పోగొట్టుకుంటాడు . కాబట్టి సొంత ఆస్తి రద్దుతోటే మనిషి ఈ పరాయీకరణ నుండి బయట పడతాడని మార్క్స్ వివరిస్తాడు . 

సామాజిక ప్రపంచం లో ,మనిషి మాత్రమే కొత్త క్రియాశల చరిత్ర నిర్మాత కాగలడు  . అటువంటి ప్రాతిపదికపై సమాజానికి సంబంధించిన  మనిషిగా పని చేయడానికి మార్క్స్ జీవితాంతం ఇష్టపడి కృషి  చేసాడు . అటువంటి మనిషి పట్ల ఎటువంటి మినహాయుంపులు లేని విశ్వాసాన్ని ప్రకటించాడు . ఈ విశ్వాసానికి ఎటువంటి సహేతుక నిరూపణ ,సమర్ధన అవసరం లేదు . మనిషి తనకు తానే నిరూపణ ,సమర్ధన కూడా . 

ఈ పుస్తకం చదివి నేను  రాసుకున్న నోట్స్ బోలుడు .అందులో కొన్నిటిని మీకూ  పరిచయం చేస్తాను .అంతకు మించి మార్క్స్ ని మీకు ఎలా అర్థం చేయుంచాలో నాకూ తోచడం లేదు . దానికి  మరింత సాధన చేయాల్సి ఉంటుంమో !  అయితే ఇప్పటికీ అక్షర సత్యాలు గా నిలిచే కొన్ని మార్క్స్ నోట్స్ ను ఇక్కడ మళ్లీ  వల్లె  వేస్తాను . అవి .. 

"పెట్టుబడి దారుడు  లాభించిన ప్రతి సందర్భంలోను కార్మికుడు కూడా లబ్ది పొంది తీరుతాడని లేదు . కానీ పెట్టుబడి దారుడు నష్టపోయిన ప్రతిసారి కార్మికుడు ఖాయంగా నష్టపోతాడు . (మొదటి చాప్టర్ శ్రమకు వేతనాలు )

పెట్టుబడి దారులకు లా భాలు రెండు విధాలా సంక్రమిస్తాయి మొదటగా శ్రమ విభజన వల్ల లాభిస్తాడు . ఇక ప్రకృతిసిద్ధమైన పదార్థాన్ని తయారైన ఉత్పత్తిగా పరివర్తింప చేయడం లో మానవ శ్రమ  సాధించిన పురోగతి వల్ల   కూడా పెట్టుబడిదారుడు లాభిస్తాడు . (చాప్టర్ 2. పెట్టుబడి పై లాభం )

ప్రకృతి లోని ఉత్పాదక శక్తులనుంచి లబ్దిని పొందినప్పుడే అది అత్యుత్తమ పెట్టుబడి అవుతుంది . 

(పేజీ నెంబర్ 138. )

 దేశాలు ఉత్పత్తి ఖార్ఖానాలు తప్ప మరేవీ కావు . మనిషి .. వినియోగం ,ఉత్పత్తి చేతనైన యంత్రం మాత్రమే!  జీవితం కూడా ఒక రకమైన పెట్టుబడే !ఈ ప్రపంచాన్ని ఆర్ధిక నియమాలు గుడ్డిగా పాలిస్తాయి . రికార్డో దృష్టిలో మనుషులకు ఎలాంటి విలువా లేదు.  ఉత్పత్తే సర్వమునూ .. (రికార్డో  పుస్తకం "భూమి కౌలు")   

 పెట్టుబడి చలన సూత్రాల మూలంగా చితికిపోతున్నవాళ్ళు ,వృద్ధి చెందుతున్న వాళ్ళు ఇద్దరూ భూయజమానుల్లో వుంటారు .ఫలితంగా ప్రభువు లేని భూమి ఉండదు అనే మధ్య యుగాల నాటి సామెత స్థానే డబ్బుకి  యజమాని లేడు ..  అనే సామెత వాడుకలోకి వస్తుంది . మానవాళిపై డబ్బు అనే నిర్జీవ పదార్థం నెరపుతున్న ఆధిపత్యాన్ని ఈ సామెత వ్యక్తీకరిస్తుంది . (పేజీ నెంబర్ 157 )

గుత్త స్వామ్యం ,పోటీ అనే రెండు రూపాల్లో కూడా పారిశ్రామిక రంగం స్వీయ వినాశనానికి గురైనట్లే ,భూ ఆస్థి కూడా ఈ రెండు మార్గాలలోను అభివృద్ధి సాధించి ఈ రెండిటి లో కూడా అనివార్య పతనాన్ని చవి చూసినప్పుడు  ఈ రెండూ  మనిషిని నమ్మడం నేర్చుకుంటాయి (పేజీ నెంబర్ 160 )

ధనికుల కోసం శ్రమ అద్భుతమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది .కానీ ,కార్మికుల కోసం మాత్రం లేమిని ఉత్పత్తి చేస్తుంది . అది ఒక వంక రాజభవనాలు నిర్మిస్తుంది :కార్మికుల కోసం మాత్రం పూరిగుడిసెలను నిర్మిస్తుంది . అందాన్ని సృజిస్తుంది . కానీ కార్మికుడికి వికృత రూపాన్ని మిగులుస్తుంది కార్మికుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెడుతుంది . కానీ ,అదే సమయంలో,కార్మికులలో ఒక శ్రేణిని అనాగరిక పని పద్ధతులలోకి నెట్టేస్తుంది . (పేజీ నెంబర్ 165 )

మనిషి (కార్మికుడు ) జంతువుల ప్రాథమికమైన విధాలైన తినడం ,త్రాగడం , పిల్లలను కనడం ,లేక నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడం ,వస్త్ర ధారణ లాంటివి నిర్వర్తించే సందర్భంగా మాత్రమే స్వేచ్చగాను ,క్రియాశీలంగా ను ఉన్నట్లు భావిస్తాడు . కానీ మనిషిగా తన విధులు నిర్వర్తించాల్సి వచ్చే సరికి అతను తనను తాను ఒక జంతువుగానే భావించుకుంటాడు . (పేజీ నెంబర్ 167 )

కార్మికుడు పెట్టుబడిని సృష్టిస్తాడు . పెట్టుబడి కార్మికున్ని సృష్టిస్తుంది . అంటే కార్మికుడు తనను తానే సృష్టించుకుంటున్నాడు . 

పెట్టుబడి అస్త్త్వమే కార్మికుడి అస్తిత్వం .అదే అతని జీవితం. ఎందుకంటే ,పెట్టుబడి అతనితో నిమిత్తం లేకుండానే అతని జీవన క్రమాన్ని నిర్ణయిస్తుంది .(పేజీ నెంబర్ 179 ) 

భూమి జీవితానికి మూల వనరుగా ఉన్న సందర్భాలలో భూ సంపద ఒక నిజమైన రాజకీయ శక్తి గా గుర్తించబడేది  .  అలాగే గుర్రం ,ఖడ్గం నిజమైన జీవన సాధనాలుగా ఉన్న సందర్భాలలో అవి జీవితాన్ని నడిపించే నిజమైన రాజకీయ శక్తులుగా గుర్తించబడ్డాయి . మధ్య యుగాల్లో ఒక సామాజిక వర్గానికి కట్టి పట్టేందుకు అనుమతి లభించడం ,దాని విమోచనకి ప్రాతిపదిక అయ్యేది . సంచార జాతుల ప్రజల్లో గుర్రమే మనిషిని స్వేచ్ఛా జీవిగా ,సామాజిక జీవనం లో భాగస్వామి ని చేసేది . (పేజీ నెంబర్: 224 )

 పోటీ అంటే బలవంతుడి మోసపూరితమైన హక్కు . పెట్టుబడి పై  లాభం   కూడా  పోటీ వల్లే నిర్ణయం అవుతుంది . (పేజీ నెంబర్ :294)

ఇలా  ఇంకెన్నో వాక్యాలు ,పేరాలు ఉటంకించవచ్చు . కానీ మచ్చుకి కొన్నిటిని మాత్రమే  ఇక్కడ పూదహ రించాను . నా అభిప్రాయం ప్రకారం మార్క్స్ మూలరచనలు చదవడం మన అందరికి చాలా మంచింది . 

మార్క్స్ అభిప్రాయం  ప్రకారం..  

విద్యావేత్తలే ముందు విద్యావంతులు కావాల్సి వుంది . ఎందుకంటే సమాజం  లో వారి స్థానం రీత్యా వారు పెట్టుబడిదారీ విధానం యొక్క మార్మికరించే భావజాల ప్రమాణాలనే పునరుత్పత్తి చేస్తారు . వారు నేర్పే విషయాల వల్ల  పాలకవర్గాలకే  గాని ప్రజలకు మేలు జరగదు . 

ప్రజలు పరిస్థితులను బట్టి మారతారనే ఉన్నత వర్గాల  దృక్పథాన్ని సవాలు చేస్తున్నాడు .. ఈ దృక్పథం మంచి విద్య కావాలంటుంది గాని చరిత్ర  యొక్క సాధారణ నిర్మాణం జోలికి వెళ్ళదు . 

మార్క్ దృష్టి లో మార్పు అనేది సైద్ధాంతిక అంశం కాదు . విప్లవాత్మక ఆచరణకు సంబంధించినది ..  విప్లవాత్మక ఆచరణ అంటే పరిస్థితులను మార్చే కార్యాచరణ . అలా పరిస్థితులను మార్చుతూ మార్చే మనిషి కూడా మారడం . కీలకమంతా ఈ స్వీయ పరివర్తన లోనే  ఉంది . 

విప్లవం ,మార్పు ,అనేవి కొద్ధి  మంది విద్యావంతులు అజ్ఞానులైన చాలా మందిని విముక్తం చేయడం , పై నుండి వారిని ఉద్ధరించడం కాదు. . ప్రజలు తమంత తాముగా చేసే వ్యవస్థీకృత పోరాటం . ఆ పోరాట ప్రక్రియలో తమ గురుంచి తాము తెలుసుకోవడం ,ఆలోచించడం ద్వారా ,సొంతంగా వారంతట వారు  విద్యావంతులవుతారు . ఇది ఒక రోజులో జరిగేది కాదు . ఇది నిరంతర ప్రక్రియ. ఎన్నటికీ పూర్తి కాదు . మనిషి నిరంతరం ప్రకృతిని ,సమాజాన్ని మార్చుతూ ఆ మేరకు తాను మారుతూ సాగుతాడు . ప్రకృతిని మార్చడం అంటే  నేడు జరుగుతున్న పర్యావరణ విధ్వంసం కాదు . నేడు పెట్టుబడి దారి వర్గం తన లాభాల కోసం మానవాళి మనుగడకే ముప్పు తెస్తూ ప్రకృతిని అత్యధికంగా ధ్వంసం చేస్తుంది .  

మనుషులు తాము మారకుండా ప్రపంచాన్ని మార్చలేరని , అదే సమయంలో ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలోనే వారు మారగలరని మార్క్స్  చెబుతాడు . 

పెట్టుబడిదారీ విధానంలో ప్రజలను విద్యావంతులను చేయడం ద్వారా సోషలిజం నిర్మించవచ్చనేది అమాయకపు ఆలోచన . అయితే వర్గపోరాటం లో నిమగ్నమై వున్న శ్రామికుల వర్గచైతన్యం ,రాజకీయ చైతన్యం పెంపొందింపచేసే వర్గ విద్య 'కేవలం విద్యకు' భిన్నమైనది . ఈ వర్గ పోరాట విద్య నిజానికి వర్గ పోరాటంలో భాగమే !

ఆచరణను మార్క్స్ మరో కోణం లో కూడా పరిశీలిస్తాడు . దాని ప్రకారం ఆచరణ అనేది స్వేచ్ఛ ,ఆవశ్యకతల ఐక్యత . 

మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతి పై స్వేచ్చగా పని చేస్తాడు . అతను పని చేసిన మేరకే అతని అవసరాలు తీరుతాయి . అతని అవసరాలు తీరిన మేరకే అతనికి స్వేచ్ఛ లభిస్తుంది . పెట్టుబడి దారి వ్యవస్తలో తన అవసరాలు తీర్చుకోవడానికి స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి ఉండదు.  జీవించి ఉండేందుకు కనీస అవసరాల కోసం నిర్బంధ శ్రమ చేయాల్సి ఉంటుంది . 

తన అవసరాలను తీర్చుకోవడం కోసం పరిస్థితులను మార్చే మనిషే వ్యవస్థను మార్చాలి .వ్యవస్థ వల్ల  లాభం పొందేవారు వ్యవస్థను మార్చే ప్రయత్నాలను ప్రతిఘటిస్తారు . వ్యవస్థలో అవసరాలు తీరనివారు , స్వేచ్ఛ లభించనివారు వ్యవస్థను మార్చేందుకు పూనుకుంటారు . ఇలా ఇరువర్గాల ప్రయోజనాల మధ్య  పోరాటమే వర్గ పోరాటం .

 వర్గ పోరాటం లో శ్రామికులు అనేక పాఠాలు నేర్చుకుంటారు . ఆ మేరకు మారుతారు . బుద్ధిజీవులు వీరికి సాయపడినా ,ప్రధానంగా ,శ్రామికులు తమ అనుభవాల ద్వారానే మారుతారు .బుద్ధిజీవులు వీరికి అందించే సైద్ధాంతిక జ్ఞానాన్ని తమ పోరాట అనుభవాలతో మేళవించినప్పుడే అది నిజంగా మార్పు తెచ్చే ఆచరణ అవుతుంది .  

పరిస్థితులు అనుకూలించి నప్పుడే సామాజిక విప్లవం దానికదే వస్తుందనే ఆలోచన సరికాదు . మన చారిత్రక యుగానికి అనుగుణ్యమైన విప్లవానికి కావలిసినట్లుగా పరిస్థితులను మార్చడానికి మనమే పూనుకోవాలి . 

ఇలా ఈ  పుస్తకం నిండా మార్క్స్ మానవ  చరిత్రను శోధించి రాసుకున్న ఎన్నో అద్భుతమైన వివరణలు వున్నాయి . వాటిని మరొక్క మారు చదవడం వల్ల   మనకు మేలే కానీ కించిత్తు కీడు జరిగే అవకాశం లేదు .

ఒక్కోసారి మనకు తెలుసునన్న విషయాలు కూడా  మనకు తెలియకుండానే అర్థం కాకుండా పోతాయి . ఎందువల్లనంటే   కొన్ని  సంధింగ్ద సందర్భాలు మన చుట్టు  ఎప్పుడూ  ఆవరించి ఉంటాయి . వాటిని ఎప్పటికప్పుడు 'క్లియర్'చేసుకోవడం ఒక అవసరం గా భావించక పోతే మనలో గందర గోళం మరింతగా  పేరుకు పోతుంది . 

 కాబట్టి  ఈ  మార్క్స్ రాత ప్రతులు  పుస్తకం ఆ లోటు ని పూడ్చే ఒక సాధనంగా కార్మిక వర్గానికి  ఉపయోగ పడుతుందని  చెప్పడంలో   నాకెలాంటి సందేహం లేదు . 


22, జనవరి 2024, సోమవారం

మణిపూర్,

ప్రజలు నిన్ను 'అమ్మా' అని పిలుచుకుంటారు
నేను కూడా నిన్ను 'అమ్మా' అని పిలుస్తాను
 కానీ.. నేను.. నీ కోసం చనిపోలేను..

ఎవరైనా చనిపోవాల్సి వస్తే..
నీ వనరులను పీల్చి పిప్పి చేసే  వారే చావాలి

ఏడు తరాలుగా  మోసం చేస్తూ, దోపిడీ  చేస్తూ , బెదిరిస్తూ    ధనాన్ని కూడబెట్టిన  వారే  నీ  కోసం చనిపోనివ్వు !
నేనెందుకు చావాలి?

-తంగ్జామ్ ఇబోపిషాక్ సింగ్











14, జనవరి 2024, ఆదివారం

9, ఆగస్టు 2023, బుధవారం

 సియాసత్  పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్  ఆలీఖాన్ కు నివాళి .. 


గద్దర్ అంతిమ యాత్ర (07. 08.) తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ప్రాణ మిత్రుడు 

మనందరికి మిత్రుడే .. 

అప్పటికే తెలుగు నేల బరువెక్కిన గుండెతో  గద్దర్ మరణ దుః ఖాన్ని మోస్తున్నది .మిత్రుడి అంతిమ కార్యక్రమాలు ఇంకా పూర్తవనే లేదు . అంతలోనే ఆలీఖాన్ హఠాత్ మరణం   గుండెని పిండి వేసింది . 

అప్పటిదాకా మన కళ్లెదుటే కదలాడిన మనిషి కుప్పలా కూలిపోతే ఎవరిమైనా ఎలా తట్టుకుంటాం ?

అతడు మీలో చాలా మందికి పరిచయం లేకపోవచ్చు .. నాకూ  అంతే !

అయితే ముందు చాలా సార్లు అతని పేరు విని వున్నాను . అతని గొప్ప మనసు గురుంచి తెలుసు  కొన్నాను . 

మంచితనం అనేది మనకు ఎంత దూరంలో వున్నా దాని గుబాళింపు మనకు ఎలాగోలా చేరిపోతుంది.

అలీఖాన్ చనిపోక ముందు రెండురోజులు దాదాపు నా కళ్ళ ముందే   వున్నాడు . వీక్షణం వేణుగోపాల్ పుస్తకం   "విద్వేషపు విశ్వ గురు " ఆవిష్కరణ సభలో ,ఆ తర్వాత జయశంకర్ సార్  సంస్మరణ సభలోను . 

ఒక్కసారి దగ్గరగా చూస్తే మరిచిపోయే ముఖం కాదు ఆయనది . 

ప్రేమాస్పుదుడైన  మనిషి  తన శత్రువు నైనా  వెంటాడుతుంటాడు . 

సమాజ నిర్మాణానికి అవసరమైన బిడ్డల మరణాన్ని "ఒక తల్లి" హృదయాన్ని మోసుకు తిరిగే ఏ ప్రజా సమూహం తట్టుకోలేదు . 

ఆలీఖాన్ భాయ్  నువ్వు మా దోస్తువు .. మా ప్రాణానివి .. 

మీ నవ్వు ముఖాలే మా జెండాలు .. 

మీ ఆశయాలే మా 'ఎజెండాలు ".. 


8, జులై 2023, శనివారం

 మనిషి బ్రతుక్కి అర్థం చెప్పిన కామ్రేడ్ ఆనంద్ మరణం 

-ఎన్ . వీరయ్య 


మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ  దేవుడ్ని నమ్ముకున్నాఆ  బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితం లోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే  ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి .

మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్నబెల్లంపల్లి  యువకులు కొందరు విప్లవా చరణ  లోకి వెళ్లారు . అందులో ఒక్కరు కామ్రేడ్ ఆనంద్ @ కటకం  సుదర్శన్ . 

రాష్ట్రం లో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది . సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్ ,హైదరాబాద్ పట్టణాలలో ఇంజనీరింగ్ ,పాలిటెక్నిక్ కోర్సుల కోసం వెళ్లేవారు . అప్పటికే నగరాల్లో విస్తరించి వున్న విప్లవ రాజకీయాలు వీరికి అబ్బి ,  వాటిని బెల్లంపల్లి పట్టణం లో  ప్రచారం చేసేవారు . వరంగల్ రీజినల్  ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ఐన కామ్రేడ్ గజ్జెల గంగారాం ప్రథముడు . మంచిర్యాల డిగ్రీ  చదువుకుంటున్న కటకం సుదర్శన్ కూడా ఈ విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడైనాడు. 
 
ఎమర్జెన్సీ (1975)కాలం లోనే కార్మికుల్ని  ఆర్గనైజ్  చేయడం  కోసం కామ్రేడ్ ఆనంద్  కార్మికుడిగా  ఉద్యోగం లో చేరాడు . యువకులను రహస్యంగా ఆర్గనైజ్ చేసాడు. ఆ కాలం లో మూడు నాలుగు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు కాబడ్డాయి . 
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత  1977 లో బెల్లంపల్లి పట్టాన కమిటీ లో సభ్యుడిగా పని చేసాడు . 1978 లో కామ్రేడ్ ఆనంద్  రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి ఆదిలాబాద్ జిల్లా లక్షట్ పేట్ తాలూకా కి వెళ్ళాడు . ఆ తర్వాత అతడు భారత్ విప్లవోద్యమానికి  ముఖ్య నాయకుడు అయ్యాడు . 

వాళ్ళు ఆయుధం పట్టుకున్నారనే సాకు తో విప్లవకారుల మరణాలను దోపిడీ ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి..
అప్పుడప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు చర్చలు జరుపుతున్నా ఫలితాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు . 

 ఇల్లు విడిచి, ఊరు విడిచి ఆదివాసుల  కోసం, మొత్తంగా పీడితప్రజల విముక్తి కోసం ఒక స్పష్టమైన  అవగాహనతో  రాజకీయ పోరాటం చేయటం పెద్ద నేరం అయిపోయింది . ప్రభుత్వం  వారి తలలకు వెలలు  కట్టి  వేట మొదలు పెట్టింది..
 వాటిలో కోటి రూపాయల తల .కామ్రేడ్ .ఆనంద్@ కటకం సుదర్శన్ ది...

పెద్ద తల కాయే  . గత 45 ఏండ్లుగా శత్రువు కన్ను గప్పి ,తన ఫోటో  కూడా దొరకనీయకుండా ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నాడు ప్రభుత్వ దాడుల్ని తిప్పికొట్టే వ్యూహాం లో తాను తలమునకలై ఉన్నాడు . ప్రజల్ని ఒక యుద్దానికి సన్నద్ధం చేసే సన్నాహాల్లో సిద్దహస్తుడై ఉన్నాడు . ఒక లెనిన్ లా ,ఒక స్టాలిన్ లా ,ఒక మావో లా సామ్రాజ్యవాద  పెట్టుబడికి గోరి కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు . ఈ యుగానికి అవసరమైన పనిని అతను తల కెత్తుకున్నాడు . 
ప్రభుత్వం, మీడియా పనిగట్టుకుని కొన్ని మాటల్ని, భావాల్ని భలే ప్రచారం చేస్తాయి.. ఉగ్రవాది.. తీవ్రవాది..

నక్సలైట్లు అనే పదం కూడా  మొదట్లో  మీడియా లోనే వచ్చింది.. నక్సలైటు అంటే ప్రజలు ఎక్కడ మంచివాళ్లు అనుకుంటారో అని కాబోలు  తీవ్ర వాదులు, ఉగ్రవాదులు అని రాస్తున్నారు ఈ మధ్య.అంత లోనే వారితో చర్చలు జరుపుతారు.. అంత లోనే అన్నీ చట్ట విరుద్ధం అయిపోతాయి..
అణచివేత ను బట్టి తిరుగుబాటు ఉంటుంది.. చరిత్రలో ఏ తిరుగుబాటుని వెంటనే  ఒప్పుకున్న దాఖలాలు లేవు.. కాని , చరిత్ర నిర్మాత లైన ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలు . 


*****

కామ్రేడ్ఆనంద్ జీవితం పూర్తిగా  అజ్ఞాతం లోనే గడిచింది . అరవై తొమ్మిది ఏండ్ల వయసులో గుండె పోటు  వల్ల చనిపోయాడు . అతని మరణవార్త టీవీ లో స్క్రోలింగ్ ద్వారా తెలిసి మనసు ఉండలు చుట్టుకొనిపోయింది.. అతడి భౌతిక కాయం ఎక్కడో దండకారణ్యం లో... అతడు పుట్టి పెరిగి విప్లవ ఓనమాలు నేర్చుకున్నది బెల్లంపల్లి లో.. అతని చివరి చూపుకి ఎలాగూ అవకాశం లేదు..మరి ఇప్పుడు ఏం చేయాలి...
"అన్ని దారులు రోమ్ వైపే" అని ఇంగ్లీష్ లో ఒక సామెత.
వెంటనే బెల్లంపల్లి కి బయలు దేరాం.. ప్రపంచమంతా వ్యాపించిన అతని స్ఫూర్తి అక్కడా నిండిపోయింది.. కన్నాల బస్తీ లోని చిన్న ఇంటి ముందు కళ్ళు మూసుకొని ఉన్న అతని చివరి ఫోటో పెట్టి వున్నారు.. అందరం ఆ ఇంటిని  'ముట్టుకొని' వచ్చేసాం..ఎవ్వరి కళ్లల్లో కన్నీళ్లు రాలేదు.. అందరం  ఏదో కర్తవ్యబోధ  లోకి వెళ్ళినట్టు స్ఫూర్తిమంత మయ్యాము . 
ఈ నల్లనేల అతన్ని కని పెంచింది..  పురిటి  నొప్పుల తల్లి  బాధ తనది..తనకింతటి పేరు తెచ్చిపెట్టిన  కొడుకు కడసారి చూపుకి నోచుకోలేని దుఃఖం ఘనీభవించింది.
నాలోనూ బాధ కవిత్వమై నిలిచింది 

ఈ మరణానికి నా ఆమోదం లేదు 
...ఎందుకంటే ఎలా బ్రతకాలో
ఆచరణ లో చూపిస్తావు

మరణం గురుంచిన భీతావహ భయాలను
గొప్ప దైన జీవితంతో నింపేస్తావు

నీ పేరు తప్ప నిన్ను ఎవ్వరమూ
ఎప్పుడూ చూడలేక పోవచ్చు... కానీ..
నీ గురుంచి తెలుసుకోవడం
మా అందరికి ఒక గర్వకారణం

అన్ని యుద్దాలు గెలిచినట్టు అవలీలగా
అనారోగ్యాన్ని జయించి తీరాలి

ఈ భూమి ఎప్పుడో నిన్ను
తన వారసుడిగా ప్రకటించింది..

ఈ మరణం... నీకు ఒక విశ్రాంతే..
నీ అధ్యయనం, అధ్యాపకత్వం
అవిశ్రాంత అజరామరం..

విప్లవమే శ్వాసగా బ్రతికే  
ఏ మరణం ఇప్పుడు 
ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు

******
 

కామ్రేడ్ ఆనంద్ కి మాత్రం లేదా ఈ నల్లనేల మీద ప్రేమ?
మట్టి మీద కంటే తన చుట్టూ వున్న సహచరుల ప్రేమ గొప్పది ..అని చాటాలనుకున్నాడో ఏమో!
అడవి తల్లిని మించిన ఒడి  మరి లేదనుకున్నాడో ఏమో!
ప్రముఖ రచయిత అల్లం రాజయ్య ఒక దగ్గర ఇలా రాశారు . " సింగరేణి బిడ్డలు భారత్ దేశ నూతన ప్రజాస్వామిక విప్లవం లో ఒక గుణాత్మకమైన పురోగమనానికి బాటలు వేశారు. ఆదివాసీ పోరాటాలను అధ్యయనం చేశారు . వారితో మమేకమయ్యారు . వారికి నాయకత్వం వహించారు . వారి విముక్తి కొరకు అమరులై వారితో తోటే ఆకాశం లో అరుణతారలయ్యారు . ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆలోచిస్తే వారు ఉద్యమం లో అసువులు బాసి , అక్కడే ఖననం చేయబడతారు . (వారు బతికుండగానే వారు కోరుకున్న విషయాలలో ముఖ్యమైనది )"
ఇంత ముఖ్యమైన విషయం మనిషి కమిట్మెంట్ ని సూచిస్తుంది . కామ్రేడ్ ర్ ఆర్కే మరణం తర్వాత అంతగా అందరిపై ప్రభావం వేసినది కామ్రేడ్ ఆనంద్  అమరత్వమే !

**********


ఒక వారం రోజులు తర్వాత ఆనంద్ సంస్మరణ సభ బెల్లంపల్లి లోనే  జరిగింది .  నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడికి   ప్రజలు  నిర్భయంగా జోహార్లు చెప్పారు.. అతని స్ఫూర్తి ముందు  'భయం' తోక ముడిచింది.మేమూ  ఈ  భూమి పుత్రులమే అని ప్రకటించారు కొందరు..ఆనంద్ ఆశయాలను కొనసాగిస్తామని నివాళి అర్పించారు  అందరూ ... కామ్రేడ్ ఆనంద్ అమరత్వం  తెలంగాణ అంతటా అద్భుతమైన ప్రకంపనలు సృష్టించింది.ఒక సుదీర్ఘ కాలం విప్లవోద్యమం లో  అంచెలంచెలుగా ఎదిగి అగ్రనాయకుడిగా ఎదిగొచ్చినందు కేమో!


అమరత్వం విప్లవానికి ఒక నమూనా

దోపిడీ వర్గాల గుండెల్లో దానిది శాశ్వత నిద్ర 

అమరత్వానికి నిలువుటద్దం మనం
 మనలో అన్నీ దాని ప్రతిఫలనాలే..

బతుక్కి అర్ధం కోరుకునే వారందరూ
ఒక జాతరలా కదులుతారు

పండుగ వాతావరణం ఒక
నిండు కుండలా కమ్ముకుంటుంది

దండగమారి  జీవితంలో
కొత్త వెలుగుల్ని ప్రసరిస్తూ
అమరత్వం నివాళులు అందుకుంటుంది

విప్లవం కథ ముగిసిపోయింది.. అనే గోబెల్స్
ప్రచారాన్ని ఎండగడుతూ  అమరత్వం
ఊరేగింపై కదులుతుంది..

అవును ...అతను ఇప్పుడూ మారలేదు
అమరత్వానికి ముందూ అంతే..
ఆ తర్వాతా దూకుడు తగ్గలేదు

అమరుడైనా పట్టుదలను విడిచి పెట్టలేదు
జమ్మి చెట్టు మీద దాచి ఉంచిన ఆయుధం లాంటి
తన యవ్వన తేజాన్ని వదిలి పెట్టలేదు

తన ఆచరణ లో ఆరితేరిన విప్లవం
నిముషం కూడా అతన్ని కూర్చోనివ్వదు
మనల్ని బలవంతంగా నిద్ర మత్తు లోంచి
లేపేస్తాడు..

రచయిత అన్న వాడ్ని అస్సలు వదిలి పెట్టడు
రాయి ..రాయి... రాయి..
ఆశల గురుంచి.. కలలు గురుంచి
ఆశలు తీరని కన్నీటి గురుంచి
ప్రతిఘటన లో రక్తం గురుంచి
పోలీసు లాకప్ లో చావు గురుంచి... 

నా గురుంచి రాయి ఇప్పుడు
ప్రజా వీరులకు మరణం లేదని  చెప్పు..
విప్లవం జయించి తీరుతుందని
ఈ సారి నీ  మాటగా ప్రకటించు..


 *************


నల్ల బంగారం అని బొగ్గు పెల్లను దొరలు కళ్ళకు అద్దు కోవచ్చు . బొగ్గు గనులున్న ప్రాంతంలోని మనుషులకి దాని ఉపయోగవిలువ   బొగ్గే ! పొయ్యు లో మంటకి పనికొచ్చే పదార్థమే .. కఠిన తరమైన కార్మికుడి శ్రమ తోడైన తర్వాత ,దాన్ని అమ్ముకుని లాభాలు సంపాదించుకునే పెట్టుబడిదారులకు అది బంగారం లా తోస్తుంది . ఇక్కడి మామూలు మనుషులకి అది బంగారమనే ఊహే రాదు . 
బొగ్గు తవ్వకం వల్ల అంతకు మునుపు వున్న భూస్వామ్య సంబంధాలు వెనక్కి పోయి కొత్త ఉత్పత్తి సంబంధాలు ముందుకు వచ్చాయి నల్ల బంగారాన్ని వెలికి తీయడంలో మనిషి విలువ పెరిగింది . కొన్ని సౌకర్యాలు పెరిగాయి . కష్టపడి పని చేసే మనుషులందరి ఉత్పత్తి క్షేత్రం ఒక్కటి కావటమం  వల్ల  వాళ్ళ మధ్య  పాత సంబంధాలు పోయి కొత్త ఉత్పత్తి సంబంధాలు వచ్చాయి .ఓ మేరకు  కార్మికవర్గ సంబంధాలు నెలకొన్నాయి . 
అంతకు మునుపు గ్రామాల్లో తాండవించే కరువు కాటకాల సమస్య ఇప్పుడు తీరింది . భరోసా కలిగిన జీవితం వచ్చింది . మెరుగైన వైద్య సౌకర్యాలు పెరిగాయి . పిల్లలకి కాస్త మంచి చదువు అందుబాటులోకి వచ్చింది . 
ఈ నేపథ్యమంతా కామ్రేడ్ ఆనంద్ పుట్టి పెరిగిన బెల్లంపల్లి అనే విప్లవ ప్రాంతం గురించే ..తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ,గిరిజన గోండు విప్లవ వీరుడు కొమురం భీం తిరుగుబాటు సంప్రదాయం ఇక్కడి గాలిలో కలగలిసి ఉన్నాయని అనిపించడం లో అతిశయోక్తి ఏమీ  లేదు . అంత గొప్ప చరిత్ర వాటికి వుంది . 
ఆత్మగౌరవం  ,ఆత్మ విశ్వాసం గల్ల మనుషులుగా అందరూ  ఉత్సాహ భరితంగా ఉండేవారు . కులమతాలకతీతంగా కలిసి మెలిసి సహజీవనం చేసే కార్మిక వర్గంలో పుట్టిన కామ్రేడ్ ఆనంద్ ,అప్పటికే తన చుట్టూ నెలకొని వున్న విప్లవ భావాలకు వెంటనే ఆకర్షితుడయ్యాడు . నూతన ప్రపంచం కోసం కలలు కన్నాడు . కార్యాయాచరణ లోకి దూకాడు . 


నిరంతరాయంగా శ్రమించి
ఒక గుండె నిలిచిపోతుంది

అతని మరణ వార్త 
విప్లవం మరణించదనే
సందేశాన్ని ప్రకటిస్తుంది

భూమి నిన్ను కన్నందుకు
నలుదిక్కులా చప్పట్లు పిక్కటిల్లుతాయి

మా పాదాల క్రింది మట్టి పొరలు
నీ కలల తరంగాలను ప్రసారం చేస్తుంటాయి

మరణం ఇప్పుడు ఒక స్మృతుల వనం


చరిత్రలో మనిషి విధ్వంసం జరిగినప్పుడల్లా
నిర్మాణం... ఒక విప్లవం
ఆ నిర్మాణం నేల కొరిగినప్పుడు
పునర్నిర్మాణం ..తక్షణ కర్తవ్యం

ప్రాణం కోసం కొట్టుకోవడమే కాదు.. గుండె
పిడికిలి బిగించి వాగ్దానం  చేస్తుంది
ఆశయాలకు చావు లేదని..


అగ్గికి పుట్టిల్లు బొగ్గు గని
విప్లవాల తల్లి సింగరేణి
అమర వీరుల సాక్షిగా ఇక్కడ
విప్లవం తప్ప మరేదీ
బతికి బట్ట కట్టలేదు.




ఏంటీ ఈ విప్లవం..?
అంతలా  అతన్ని ఇంటి ముఖం
చూడకుండా చేసింది?

అడవి అతడికి ఇల్లై పోయిందా ?
లేదా..
అతడు అడవికి తల్లై పోయాడా?
అవును ..
తనను కడుపులో పెట్టుకు సాదుకున్న
అడవికి  అమ్మలా మిగిలిపోయాడు ..

అవును కదా..ఈ లోకాన ఏ తల్లి
కొడుకును విడిచి  ఉండగలిగింది?

28, జూన్ 2023, బుధవారం

కాలం మనతో కలిసి రావాలి

 కాలం మనతో కలిసి రావాలి

నేనేమి  కావాలని  కాలాన్ని

బలవంతంగా ముందుకు తొయ్యను

అదే బిరబిరా నడుచుకుంటూ

నన్ను చూసి చూడనట్టు *అంజాన్ గొట్టి

తోసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం

గట్టిగా దాని చెయ్యి పట్టుకొని

అరిచి మరీ కూర్చో బెట్టేస్తాను

ముఖం మీదే కడిగి పారేస్తాను

ఎందుకు నీకు అంత తొందర

నాకంటే ముందు నీకంటూ ఏముంది?

నిన్ను శిలువలా మోస్తున్న వాడ్ని   కదా!


నీదైన అస్తిత్వం నీకేమైనా ఉందా?

ఎందుకంత ఉబలాటం?

నువ్వు కంగారు పడి నన్ను 

కంగారు పెట్టడం తప్ప..


కుదురు లేని కాలం

ముదురు బెండకాయ ఎందుకు పనికి రావు


కాలం! ఎప్పుడూ నువ్వు నాకు కలిసి రావాలి..

ఇప్పటికైనా తెలిసిందా.. నాతో కలిసి నడవాలి..


భీం ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై హత్యా ప్రయత్నాన్ని ఖండించండి ! 

హంతక ముఠా రాజకీయాలను ప్రతిఘటించండి !!


భారతదేశం లో ప్రస్తుతం ఆత్మగౌరవ దళిత రాజకీయాలకు ఒక గౌరవప్రదమైన చిరునామా ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు భీం ఆర్మీ .. దాని వ్యవస్థాపకులలో ఒకడు మరియు అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ . 

ఢిల్లీలో గత మూడు నెలలుగా అధికార పార్టీ మంత్రి బ్రిజభూషణ్ అరెస్ట్ కోరుతూ  ఒలింపిక్ విజేతలైన మహిళా మల్లయోధుల ఆందోళనకు మద్దత్తు ప్రకటించి వారితో కలిసి నడుస్తున్నందుకు ప్రభువులకు  కన్నెర్ర అయిందో ఏమో !

ఏకంగా తూపాకి తో కాల్చి చంపమని ఆదేశించారు .. 

ఒక సంవత్సరకాలం పాటు రైతు వ్యతిరేక మూడుచట్టాల రద్దు కోరుతూ దేశాన్ని ఊపేసిన రైతాంగ  ఉద్యమం లోనూ  ,ఆ తర్వాత  వచ్చిన జాతీయ పౌర సత్వం చట్టం వ్యతిరేక ఉద్యమం లోను భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ చాలా క్రియాశీలకంగా పాల్గొన్నాడు . జైలు కు  కూడా వెళ్ళాడు . 

రైతుల ,ముస్లిం మైనారిటీల హక్కు ల కోసం నిలబడటం ఇప్పుడు పెద్ద నేరమై పోయింది మరి !

అది కూడా ఏలిన వారి కోపానికి కారణం అయి ఉండొచ్చు .. ఇక రాజు తలచుకొంటే హంతక ముఠాలు కరువా ?

గత తొమ్మిది ఏండ్లుగా దొంగ కేసులు ,హంతక ముఠాలే రాజ్యం ఏలుతున్నాయి . 

అనేక మంది మేధావులు ,రచయతలు ,హక్కుల కార్య కర్తలు కుట్రకేసుల్లో ఇరికించబడి జైళ్లల్లో మగ్గుతున్నారు . గౌరి లంకేశ్ లాంటి ఎందరో జర్నలిస్టులు ,కల్బుర్గి ,పన్సారే లాంటి మేధావులు హంతక ముఠాల చేతిలో ప్రాణాలు కోల్పోయారు . 

గాంధీ హంతకుడు గాడ్సే పూజలందుకుంటున్న కాలం ఇది .. 

2018 సంవత్సరం లో జాతీయ భద్రతా  చట్టం కింద  చంద్రశేఖర్ ఆజాద్ ని అరెస్ట్ చేసి జైలు లో పెట్టింది  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం . ఈ అరెస్ట్ రాజకీయ దురుద్దేశం తో జరిగిందని భావించి అలహాబాద్ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది . ఆ తర్వాత కూడా అనేక సార్లు నిర్బంధించ బడ్డాడు . 

పేరుకు మాత్రమే  భీం ఆర్మీ కానీ పోరాటం మొత్తం గాంధీ మార్గం . ఆందోళన హింసాత్మకం అయితే  అది శత్రువుకే లాభిస్తుంది . మనల్ని శత్రువు హింసామార్గం లోకి నెట్టాలనే చూస్తాడు . అప్పుడు వాడికి మనల్ని 'ఎలిమినేట్ 'చెయ్యడం ఈజీ అవుతుంది . అందుకే మనం శాంతియుతంగా ,రాజ్యాంగ బద్దంగా ఉద్యమం చెయ్యడం అవసరం అని భీం ఆర్మీ నొక్కి చెబుతుంది . అందుకే తన మీద దాడి తర్వాత కూడా అదే విషయాన్ని ప్రజలకు విజ్ఞప్తి చేసాడు 

ఆ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ నిజాయితీగా ,నిబద్ధతగా నిలబడడం మతోన్మాద రాజకీయాలకు  కంటగింపు అయింది . 

తేదీ 28.06. 2023 న ఉత్తరప్రదేశ్ ,సహారన పూర్  లో ఆయనపై కాల్పులకు తెగబడ్డారు . నాలుగు రౌండ్లు కాల్చారని పోలీసులు తేల్చారు . ఒక బుల్లెట్టు వీపులో దిగింది . మరో బుల్లెట్టు పక్కటెముకలను గాయపరిచింది . 

ప్రాణాపాయం తప్పింది . అయితే ప్రజాస్వామ్యానికి తల్లి వంటి దేశమని ప్రపంచ దేశాల్లో చెప్పుకుంటున్న పాలకులు ఇలాంటి హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు కాస్త సిగ్గు పడాలి . ఒక విశ్వాస ప్రకటన చేయాలి .  

అన్ని ప్రజాస్వామ్య ఉద్యమాలపై జరుగుతున్న దాడుల్లో భాగమే చంద్ర శేఖర్ ఆజాద్ పై దాడి . 

ఉత్తరప్రదేశ్ లో మానవ హక్కుల్ని కాలరాస్తూ బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది . ఎన్కౌంటర్ హత్యలు ,పోలీసు కస్టడీ లో మరణాలు ,హంతక ముఠాల దాడులు చట్టబద్ధ పాలనను అపహాస్యం చేస్తున్నాయి . 

దేశం లో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే ముందు ఈ హాంతక ముఠాలను పట్టుకొని ,చట్టబద్ధంగా  శిక్షించాలనే  డిమాండ్ చేద్దాం . 

పౌర హక్కుల సంఘం ,తెలంగాణ ..