7, ఏప్రిల్ 2022, గురువారం

నిద్రానిద్రల మధ్య


నిద్రానిద్రల మధ్య 

1

 అప్పటి దాకా నిద్ర పట్టకే 

కవిత్వాన్ని పక్కలో వేసుకుంటాను 


కొంచెం సేపు విరామం .. అని 

కాలం చెవిలో చెప్తాను 

కాలం తల ఆడిస్తుంది 

హమ్మయ్య .. అని కళ్ళు మూసుకుంటాను 

అప్పుడే  కుట్ర జరిగిపోతుంది 


నేను నిద్రలోకి జారిపోకుండా .. 

మొదట  కొన్ని బుజ్జగింపులు 

మెల్ల మెల్లగా చీవాట్లు లోకి 

దిగుతుంది వ్యవహారం

అప్పటికే ..  

నా చేతి వేళ్ళు అప్రయత్నంగా 

చేయు తిరిగిన కవిలా మారిపోతాయి 


2

నిద్రకి కవిత్వానికి పోటీయేమో ! 

కనురెప్పలు మూతపడుతున్నప్పుడల్లా 

కాలు అడ్డం పెట్టి 

కవితా పాదాలు ముందుకు  తోసుకు వస్తాయి 


బ్రెయిలీ లిపిలా చేతి చివర్లతోనే  

భావ చిత్రాలు  రూపు  దిద్దుకుంటాయి 

మధ్యమధ్యలో నా మనసింకా 

జోగుతూ కునికిపాట్ల తో  కుస్తీ  పడ్తూనే ఉంటుంది 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి