4, ఏప్రిల్ 2022, సోమవారం

ఆశయమే దారి

  ఆశయమే దారి 


1


మనిషి రోడ్డున పడ్డాడు..

 తన కాళ్ళ మధ్య  మనిషిని కోడిపిల్లలా ఇరికించుకుని

 గద్దలా  రోడ్డు ఎగిరిపోతుంది

కసుక్కున దిగిపోయే

 కాలి గోర్ల మధ్య ప్రయాణం

బలి పశువు అలంకారం


2


ఏ దారి  ఎక్కడ ముగిసి పోతుందో

ఎప్పటికి తెలిసే అవకాశం లేదు

వలయాలు వలయాలుగా

విస్తరించే మార్గాలు

ఎక్కడా కలిసిపోవు

ఎన్నడూ ఆగిపోవు

జీవితమొక ప్రయాణము.. అంతే!


3


అయినా  ఈ రోడ్డు కెంత భయమో!

దారి పొడుగునా నన్ను

వెంటాడుతూనే ఉంటుంది

నా ముందు వెనకా ఎక్కడా తరగని

అనంతమైన రహదారి

మనిషి ప్రయాణం ఒక దారి

కానీ,

జీవితమే రోడ్డు కావడం విషాదం


4


ఎప్పటికప్పుడు 

అల్లంత దూరాన ఆకాశం లో కి

ఎగబాకే  కలల దారి కొసని

ఎవరు కనిపెట్టారు చెప్పు?


5


తిరగలిలా మన జీవితం

బండ బారక పోతే చాలు..

కొండంత ఆశయం ఎప్పుడూ

దారి చూపుతూనే ఉంటుంది


6


జీవిత చక్రం లో పడి కొట్టుకుపోయే

ప్రతి మనిషి  ఏదో విధంగా

రోడ్డున పడిపోతాడు

జీవన గమ్యాన్ని  గుర్తెరిగిన మానవుడే

తన మార్గాన్ని సుగమమం చేసుకుంటాడు.

[6:40 pm, 04/04/2022] Venkatrao Nakka: నల్లముఖం నగరానిది..

1

నగరం మీద ప్రేమగీతం

అది నవయవ్వన మోహం


నగరం మీద గరంగరం

"నీ రోడ్ల మీద మన్ను బొయ్య

బతుకు తెరువు  తెర్లాయే


2

కాంక్రీట్ జంగల్ లో

 కాసే ఎండల్ని మోసుకుంటూ

వాలే నీడల్ని వెతుక్కుంటూ

గుక్కెడు మంచి నీళ్ళనూ  కొనుక్కుంటూ

 నగరారణ్యం నేడు

దప్పిక దారుల కూడలి


3

పొట్ట చేత పట్టుకొని

పల్లె వలస నగరానికి  

ఆకలి తీరని కడుపు చించుకొని

పేగులు మెడలో వేసుకున్నట్టు

విశాలమైన రింగు రోడ్లకు వేలాడుతూ

 ఇసుక వేస్తే రాలని ఇరుకు  గల్లీ బతుకులు


4

నగరం ఒక తెల్ల ఏనుగు

 ఖర్చులు  మరి తడిసి మోపెడు

అంతా తల్ల కిందులు వ్యవహారం

వెల్లకిల్లా పడ్డ కాళ్ళు చేతుల్లా 

గాలిలో ఎగిరే రోడ్లు ..ఫ్లయ్ ఓవర్లు


5


బాటసారి కి

నీడ నిచ్చే వట వృక్షాలు పెరికి

కుండీల్లో నిలబెట్టబడ్డ  హైబ్రిడ్ మొక్కలు

నీరెండకే  సొమ్మసిల్లిపోతాయి


కాలుష్యాలను దగ్గుకుంటూ

వెళ్లే వాహనాల ధాటికి

చచ్చిన పాములా 

రోడ్డు పారి పోతుంది


7


నల్ల ముఖం నగరానిది

వేసిన రోడ్డు మీదే రోడ్డు

ఆ చీకటి నీడల్లో

తెల్లవారే యవ్వనాలు

మోడుబారే బాల్యాలు


అబద్దాలను మోసుకుంటూ

గాలిలో మేడలు కట్టే

 హొయలు పోయే హోర్డింగులు


అన్నిటిని

అడ్డంగా నరుక్కుంటూ పోతే 

నగరం కడుపు నిండా 

 అన్నీ   అరిగిపోయిన

బక్క పలుచని పల్లె బొక్కలే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి