5, సెప్టెంబర్ 2021, ఆదివారం

భలే వాన ..


భలే వాన .. 


పగ బట్టినట్టే దబ్బున  కురిసి వెళ్ళింది వాన 

పడగ విప్పినట్టు వరద నడక సాగింది 

అంత వానకి కొసరులా తుంపర్ల వెంపర్లాట 

అయినా కురిసి కురిసీ  వెలిసిన వాన అందం 

 అబ్బో ! వేరేనబ్బా !


అంతా శుభ్రంగా కడిగి బోర్లేసినట్టు 

వరద కాలువ బోసినవ్వులు మెలికలు తిరిగి పోతుంటాయి 

#

అప్పటిదాకా నేలను అంటిపెట్టుకున్న రోడ్డు 

జల వాహనం గా  మారి పోతుంది 

అసలు ఉందొ లేదో తెలియని గాలి 

వాన చినుకుల చెవి రంగులతో 

కాసేపు హడావిడి చేస్తుంది 

#

చిన్న వాన కైనా 

గొడుగు పెద్దగుండాలి 

సొల్లువాన కి దొరక్కుండా .. 


#


తమాషాకి నేను

 గొడుగు ను తిరగేసి పట్టుకుంటా 

రాజా వారి కిరీట మల్లే .. 

అప్పుడు నా నడక మారిపోతుంది 

నా పాదాలు నీళ్ళల్లో చేప పిల్లల్లా 

ఈదుకుంటూ వెళతాయి 

నీల్లేమో  నా కాళ్ళ చుట్టూ చేరి 

మహా ప్రభో ! అని మొరపెట్టుకుంటాయి 

#

వానలో పూర్తిగా తడిచి చూస్తే తెలుస్తుంది 

అది  ప్రత్యేకముగా చిన్నపిల్లల పండగ  అని .. 


యధావిధిగా ఈ పెద్దలు ఉన్నారు చూసారూ !

వాళ్ళు హాయిగా ఆడుకోరు 

మమ్మల్ని  వదిలి  పెట్టరు 

ఈ వానా గొడుగు ఆటలో 

ఎప్పటిలాగే నేనే ఓడిపోతాను 

కాసేపటికి ఏమీ ఎరగనట్టు 

నీళ్లూ  జారుకుంటాయి .. 



 



 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి