మనువాద బాహువులు
ఏడవకు బిడ్డా !
కులం నిన్ను కాపాడుతుంది
రాజ్యం నిన్ను భయపెడుతుంది
ఏ ఉద్యమానికైనా ఒక నినాదం అవసరమే మరి
అది వెన్నెముకని నిలబెట్టేదిగా ఉండడం తప్పనిసరి
కులం నాకు ఎప్పుడూ కిరీటం కాదు
పైగా రిజర్వేషన్ గాళ్లు అనే వెటకారం
కులం నా అస్థిత్వమూ కాదు
వాడి అణిచివేత కరవాలం
కులం తోకలు నా పేరు చివర
ఎప్పుడూ లేవు
అరే ,ఒరే .. అనే ముందు పేర్లు తప్ప !
మంత్రాలకు చింతకాయలు రాలనట్లే
నా కులం పేరుకు ఏ ఆకాశం వంగి
నమస్కారం చేయదు
అలాగని పరాయికరణ
నా అభిమతమూ కాదు
అయినా అది నన్ను కొండచిలువలా
నమిలి మింగేసేది
నాకో మతం రంగు పులిమేది
ఎందుకో , ఏ మతమైనా నన్నొక తీవ్రవాదినే చేసేది
అప్పుడు నిజంగానే రాజ్యం
నన్ను భయపెట్టేది
పాపం శమించు గాక !
కులం ఒక్కటే నన్ను కాపాడేది
తన మనువాద బాహువుల్లో ఇరికించుకుని ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి