అపవిత్ర ఆపద్ధర్మమ్
రిపబ్లిక్ అఫ్ హిందుత్వ .. ఇంగ్లీష్ పుస్తకమే ..రచయిత బద్రి నారాయణ . పెంగ్విన్ ప్రచురణ . ప్రధమ ముద్రణ 2021 .
మొత్తంగా బీజేపీ ని ఇప్పుడు నడిపిస్తున్న RSS గురుంచి లోతైన అవగాహన కల్పించే రచన ఇది
అయితే రచయిత ముగింపులో ఒక చివరిమాట రాశాడు . అది కరోనా సమయంలో లొక్డౌన్ వల్ల వలస కార్మికులు గురుంచి . కంపెనీలు మూసివేయటం వల్ల కాలినడకన వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్కచేయకుండా పుట్టిన గడ్డకు చేరుకోవాలనే ఎన్నో విషాద యాత్రలు జరిగాయి
అప్పటివరకు వెర్రితలలు వేసిన హిందుత్వం మౌన ముద్రలోకి జారిపోయింది . సర్వ సత్తాక రాజ్యం చేతులు ఎత్తివేసింది .
కష్టజీవులు అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కులేని చావుకి బలి కాకుండా తమ కుటుంబ సభ్యుల మధ్య కు చేరుకోవాలని విశ్వప్రయత్నమే చేశారు .
మరి భారతదేశ సమాజానికి వెన్నెముక లాంటి కులం .. బ్రతికి బట్ట కట్టడమే ప్రధాన మైన కరోనా కాలంలో ఎలాంటి పాత్ర నిర్వహించింది -అనే విషయం పై రచయిత కొంత పరిశోధన చేసాడు .
కులమతాలకు అతీతంగా ప్రజలు మానవత్వానికి పెద్ద పీట వెయ్యడం గురుంచి మనం అందరం మీడియాలో చూసాం .
కానీ కులం అంత ఈజీ గా రూపు మాసిపోయే వ్యవహారం కాదని మనకందరికీ తెలిసిన వ్యవహారమే కదా !
ఆపద్ధర్మమ్ గా వచ్చే మార్పులు మామూలు పరిస్థితులు నెలకొన్నాక కొనసాగవు .
దాని గురుంచి ఉపనిషత్ ల్లోంచి ఒక కథ ని పట్టుకొస్తాడు రచయిత .
ఛాందోగ్య ఉపనిషత్తు లో చక్రాయన ఉసష్టి అనే వ్యక్తి .. ఈయన ఉండే ఊరిలో కరువు విలయ తాండవం చేస్తుంటుంది . వరుసగా రెండురోజులు అతడు ఆకలితో అలమటిస్తూ ఉంటాడు . దాంతో ఇంకో ఊరికి వెళదామని నిర్ణయిచుకుంటాడు . అయితే ఆ ఊరిలో కూడా అదే పరిస్థితి ఉంటుంది . అక్కడి నుండి ముందుకు సాగిపోతాడు . దారిలో ఒక చెట్టు కింద ఒక మనిషిని చూస్తాడు . ఆ మనిషి దేన్నో నాకుతూ తింటూ ఉంటాడు .
ఉసష్టి అతని దగ్గరికి వెళ్లి ఏమి తింటున్నావని అడుగుతాడు .
నేను పప్పు తింటున్నాను --అని సమాధానం చెబుతాడు
గత రెండు రోజులుగా ఆకలి తో అల్లాడిపోతున్న ఉసష్టి తనకు కొంచెం పెట్టమని అడుగుతాడు .
అయ్యో !నీకు తప్పక ఇచ్చే వాడినే . కాని ఇప్పుడు అది అపవిత్రం అయిపోయింది .
అపవిత్రం అయితే అయ్యిందిలే .. నాక్కొంచెం ఇమ్మని పాపం ఉసష్టి ప్రాధేయ పడతాడు .
అతడు ఉసష్టి కి తను తింటున్న పప్పులోంచి కొంచెం తీసి పెడతాడు.
అతడి దగ్గర మట్టి కుండ నిండా మంచినీళ్లు కూడా ఉంటాయి .
అతడు కుండకి మూతి పెట్టి కొన్ని నీళ్లు తాగి ,ఉసష్టి కోసం కొన్ని మిగుల్చుతాడు .
పప్పు తినేసి ఉసష్టి వెళ్లి పోవటానికి సిద్దమవుతాడు .
కొన్ని నీళ్లు తాగి వెళ్ళు ! అంటాడు అతను .
దానికి సమాధానంగా -
నేను అపవిత్రమైన నీళ్లు తాగను - అంటాడు ఉసష్టి .
నువ్వు అపవిత్రమైన పప్పు తినగలిగావు . అపవిత్రమైన నీళ్లు ఎందుకు తాగలేవు ? అని అడుగుతాడు అతను .
ఉసష్టి భలే సమాధానం ఇస్తాడు
నేను ఆ అపవిత్రమైన పప్పు తిని ఉండక పోతే ఈ పాటికి చచ్చి ఉండేవాడిని.
ఇప్పుడు నాకు కొంచెం శక్తి వచ్చింది . నడవగలుగుతాను . దగ్గర్లోని ఏదైనా జలపాతం వద్ద నీళ్లు తాగుతాను *