పోలీస్ కస్టడిలో పోలీస్ స్టేషన్ లో తెల్లవారింది .
ఛత్తీస్గఢ్ ఆదివాసులు కదా .. పోలీసులైనప్పటికీ వారి సంస్కృతి ని మర్చిపోయినట్టులేదు . నా పట్ల వారి గౌరవ మర్యాదలకు ఎక్కడ లోటు జరగలేదు . నా వెనక ముగ్గురు పోలీసులు . ఒకరు హెడ్ కానిస్టేబుల్ అనుకుంటాను .. ఇద్దరు మామూలు జవ్వాన్లు . పడుకోవటానికి నాకో మంచం ..హెడ్ కో మంచం . మిగిలిన ఇద్దరు కిందే పడుకొన్నారు . నాకు ఏమి కావాలో అడిగి మరి తెచ్చి పెట్టేవారు .
హెడ్ రాత్రి చాలా సేపు చర్చించాడు . నక్షలైట్ల వల్లే ఈ కాసిని పోలీస్ ఉద్యోగాలు వచ్చాయి . వాళ్ళ వల్లే అడవి కూడా కాపాడ బడుతుంది .
రాత్రి బాగానే గడిచింది .. ఈ దినమంతా పోలీస్ ఇంటెరెగేషన్ తో ఎలా గడుస్తుందో నని మనుసులో పీకుతూనే ఉంది .
ఉదయం 9 గంటల కల్లా రెండు వాహనాలలో నన్ను డోంగర్ గఢ్ జిల్లా కేంద్రాన్ని కి తీసుకెళ్లారు .బాగ్ నది నుంచి అది 40 కిలోమీటర్ల దూరం . అక్కడి గెస్ట్ హౌస్ లో నాకోసం ఎందరో గెస్ట్ లు . మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఓ పదిమంది దాకా వచ్చారు. NIA వాళ్ళు ఉన్నారు . అందరు ఒక్కసారిగా కాకుండా ఎవరికి వారే గంటలు గంటలుగా .. వారు అడగటం , దొరికిందే అవకాశం అనుకుని ..నేను వాళ్లకు అంతకు ముందే తెలిసిన విషయాలనే కొంచెం కొంచెం గా మార్చి మార్చి చెప్పడం .
పాపం ..వాళ్ళు ఎంతసేపు నేను చెప్పింది రాసుకోవడం లో ఉన్న ధ్యాస నన్ను ఏమి అడగాలి అనే విషయం మీద పెట్టలేదనిపించింది .. ఎందుకంటే వాళ్ళ ఉద్యగ ధర్మాన్ని నిర్వర్తించారు .. అంతే . వాళ్ళ కి వాళ్ళ లోనే పోటీ .. నా నుంచి నాకే తెలియని ఏవో రహస్యాల్ని రాబట్టి ఎదో క్రెడిట్ కొట్టేయాలనే తాపత్రయం చూస్తే నవ్వొచ్చేది .. హాయిగా నవ్వేవాడిని . నాలో భయం ,తడబాటు దాదాపు గా ఉండేది కాదు .
వాళ్ళు నన్నో పది మార్కుల ప్రశ్న అడిగేవారు. నేను ఇరవై మార్కుల ప్రశ్న కి సరిపేసే జవాబు చెప్పేవాడిని ..
కానీ ఒక్కడ్ని ..ఒంటరిని .. శత్రుశిబిరం .. రాత్రి పూట గుండెలవిసే రోదన .. పగలంతా అందరితో నవ్వుతూనే ,గంభీరంగానే మాట్లాడేవాడిని .. రాత్రి పూట జీవిత ప్రస్థానం అంతా గుర్తొచ్చేది
ఆంధ్ర పోలీసులు విజయవాడ నుంచి వచ్చి నట్టు వున్నారు . వాళ్ళ వేష భాషలు అలాగే ఉన్నాయ్ .. తెలుగు లో సంభాషణ .. మనుసు మురిసిపోయింది .. వాళ్ళు ఎప్పుడో దూరమైన మిత్రుల్లా తోచారు .. వాళ్ళల్లో కాఠిన్యం లేదని కాదు . కానీ లేని కారుణ్యాన్ని ముఖంపై పులుముకోగలిగే ఆంధ్రా "గిరీషాలు "వాళ్ళు .
సినిమా నటులను ఇష్టపడగలిగే అంశం ఎదో మన అందరి మీద పనిచేసినట్టే ఆంధ్రావాళ్ల అతి మర్యాద మాటలు మనల్ని మొదట్లో మభ్య పెట్టగలుగుతాయి .
అందరి కంటే ఎక్కువగా నన్ను ప్రలోభ పెట్టారు .. కానీ వారికి అదే సమాధానం నాకేమి తెలియదని .
చివరి కి వాలు వెల్లిపోయే ఆఖ్రి క్షణం వరకు వారి పట్టు వీడలేదు .. నేను అలానే ఉన్నాను ..
కానీ వారితోనే ఒక మాట అనగలిగాను ..
"నాకైతే ఎవరి అడ్రెస్సులు తెలియవు. ఒక వేళా తెలిసినా నేను ఎలా చెబుతాను ?"
పాపం .. వాళ్ళు చిన్న స్థాయి పోలీసులు కాబోలు ..అబ్బో కమిట్మెంట్ .. అని నవ్వుకుంటూ సెలవు తీసుకున్నారు .
తెలంగాణ పోలీసులు .. అంతా యువకులు ..
అందరు నన్ను బుజ్జగిస్తూ అడుగుతుంటే ఒక తెలంగాణ పోలీస్ కి చిరాకు పుట్టిందేమో .. ఏందయ్యా బ్రతిమాలటం .. మన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇస్తే పని అయిపోతుందని నా మీద కొంచెం ఎగిరాడు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి