26, ఫిబ్రవరి 2022, శనివారం

వెలుతురు కిటికీ

 

వెలుతురు కిటికీ 


ఈ కాస్త ఓపిక ఉన్నప్పుడే 

నా మాటలు నాలుగు రాయాలి 

ఒక్క మాటైనా నీ చెంప 

చెళ్లుమనిపించాలనేదే నా ఆశ 


గుండె గది నిండిపోయిన భావాలు 

నువ్వు మూసి ఉంచిన చీకటి  తలుపుల్లోంచి 

దూక లేక పోయినా 

నేను తెరుచుకున్న వెలుతురు కిటికీ ల నుంచి 

నా మాటల ప్రయాణం ఖాయం .. 




గతం గతః

గతం గతః  


 గుండె చెరువైనప్పుడు 

చప్పుడు చేయ కుండా 

ఒక నదీ  మార్గాన్నివెతికి  పట్టుకోవాలి 

సముద్రాన్ని చేరుకోవటానికి 

అంత కంటే  

దగ్గర  దారి   లేదు మరి .. 


సముద్రం నిండా చెరువుల్లాంటి అలలే 

అల్లకల్లోల పడుతుంటాయి 

తీరం వేపే వస్తాయి కానీ 

కార్యం నెరవేరదు 

కట్ట తెగిన చెరువు కి 

తన పుట్టిల్లు మాయం అయినట్టు .. 


24, ఫిబ్రవరి 2022, గురువారం

 ఆధార్ కారటు ఉంది..  కాని నిలువ నీడ లేకపాయె !

 

కొండ గుహలు ,చెట్టు నీడలు దాటుకుంటూ నదీ తీరాల వెంట గొప్ప  నాగరికతలు నిర్మించిన   మానవుడికి గూడు అనేది  ఒక ప్రత్యేకమైన గుర్తింపు నిచ్చింది . ఈ ఆధునిక యుగం లో వాటన్నిటిని కొల్లగొట్టి ఒక్క ఆధార్ కార్డు నెంబర్  ఇచ్చి మనల్ని రోడ్డు మీద నిలబెట్టారు . 

అభివృద్ధి జపం చేస్తున్న బంగారు తెలంగాణ లో  ఇళ్ల పట్టాల కోసం వేలాదిగా ప్రజలు ఉద్యమించడం  అంటే ఛిద్రమైన జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకొనే ఒక ఆదిమ ప్రయత్నం మాత్రమే !

  రాజ్యాంగం మన హక్కుల ప్రకటన .  ఆర్టికల్ 21  జీవించే హక్కును ఇచ్చింది. ఆర్టికల్ 14,15 స్త్రీ పురుష, కుల మత భేదాలు లేని  సమానత్వాన్ని ప్రకటించింది. ఆర్టికల్ 19E దేశంలో ఎక్కడైనా సరే  నివాసముండే  హక్కును కల్పించింది. 

ఏ  గూడూ లేని కార్మికవర్గమే ఎక్కువగా  కరోనా వైరస్  కు బలి అయ్యారు . పొట్టచేత పట్టుకొని నగరాలకు  వలస వచ్చిన పల్లె జనులే  నిలువ  నీడ  లేక తిరిగి వెళ్లి పోవాల్సి వచ్చింది . అందులో కొన్ని వందల మంది గర్భిణి స్త్రీలు  , ముసలివారు మృత్యువాత పడ్డారు . సొంత ఇళ్ళు వున్నమధ్య తరగతి, ఉన్నత వర్గాలు  క్వారెంటైన్(అంటరానితనం ) లో ఉండి బతికి పోయారు  .మురికివాడల్లో   పేదలు  కరోనా నుండి తప్పించుకోలేక పోయారు . పేద ప్రజల జీవించే హక్కు ఒక  ప్రశ్నగా మిగిలింది. 

          ఇల్లు  అనేది సగటు మనిషి  కల  మాత్రమే కాదు, పెండ్లి నుంచి చావు వరకు వారి జీవితాలు ఇంటితో ముడిపడి వుంటాయి.  డెబ్భై  శాతం గా ఉన్న  దళితులు, ఒంటరి స్త్రీలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్ మెదలగు వారికి సొంత ఇండ్లు లేకుండానే  వున్నారు.

 ప్రతి  పౌరుడి కి  ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసారు  కాని వారికి  సొంతం గా ఒక ఇల్లు  కూడా వుండాలన్న కనీస స్పృహ లేకపోవడం ఫామ్ హౌస్ ల్లో , బంగ్లాల్లో  కొలువు దీరే  పాలకులకే చెల్లింది .

 ఇళ్ల పట్టాల  హక్కుల సాధనకై హైదరాబాద్ ,శామీర్ పేట మండలం లోని   దేవర యాంజల్ గ్రామం లోని సర్వే నెంబర్ 640, 641 ప్రభుత్వ భూమి 15 ఎకరాల లో   తమ గూడు ఏర్పరుచుకోవడానికి ప్రజలు సుమారు 3000 మంది ఉప్పెనగా  కదిలారు. వారు కోరింది పెద్ద పెద్ద కంపెనీల వలె వందల  ఎకరాల భూమినో,లక్షల రూపాయల   టాక్స్  ఎగవేతో లేదా అభివ్రధ్ధి పేరిట  విధ్వంసం చేయడం  కోసం కాదు. ఒకే కుటుంబంలో వున్న నలుగురికి కాసింత భూమి దానిపై ఒక పై కప్పు కావాలని,దానికి  ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని గుడిసెలను వేసుకొనుటకు రెవెన్యూ అధికారులను 2009 నుంచి కోరినప్పటికి అది  సాధ్యపడలేదు.  గుడిసెలు  వేసుకున్నప్రతిసారి  వాటిని తొలిగించటం మరల మరల ప్రభుత్వానికి విన్నవించుకోవడం , ప్రభుత్వ  అణిచివేతే సమాధానమయ్యేది .   చివరాఖరిగా కొన్ని  రోజుల క్రిందటే  3.2.2022 న సొంత గూడు లేని  సుమారు 3000 మంది   తెగింపుతో  దండుగా కదిలి  640 సర్వే నెంబర్ లోని 9 ఎకరాలలో తాత్కాలిక నీడను ఏర్పరుచుకున్నారు.ప్రభుత్వ ,పోలీస్ బెదిరింపులకు తల వంచలేదు   

ఇదే సర్వే నెంబర్ లో సేవాలాల్ సంస్థ సభ్యులు సుమారు 300 కుటుంబాలు గత నాలుగు సంవత్సరాలుగా తాత్కాలిక నీడను ఏర్పరుచుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.  వారి వెంట  పోరాటంలోకి కదిలి రమ్మని ఆసరాగా నిలబడమని మనకో సందేశాన్ని ఇస్తున్నారు.

           5.2.2022 న రెవెన్యూ డెవలప్ మెంట్ ఆఫీసర్ గారు తమ సిబ్బందితో వచ్చి ప్రజలను ఇండ్ల స్థలాలను ఖాళీ చేయవలసిందిగా హెచ్చరిక జారీ చేసారు. వారి హెచ్చరికను ఖాతరు చేయని 3000 మంది ప్రజలు ఎదురు తిరగటం వల్ల  వారికి డబుల్ బెడ్ రూములు  ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకు వారు తమకి లిఖిత పూర్వక హామి ఇవ్వవలసిందిగా కోరడంతో  మారు మాట్లాడకుండా ఆర్.డి.ఓ గారు వెను తిరిగారు. ఈనాటి వరకు ఆర్.డి.ఓ గారు తమ సమ్మతాన్ని తెలియజేయలేదు. ప్రజల కోరిక మన్నించగపోగా అదే రోజు సాయంకాలం నుండి 9 ఎకరాల భూమిలో రోడ్డు వైపు నందు ఇనుప తీగలను పెట్టి రాకపోకలను నిషేదించి వారిని నిర్భందించారు. తాత్కాలిక గుడిసెలను ఏర్పరుచుకున్న వారిని బలవంతంగా భూమి నుంచి వెళ్ళగొట్టడానికి ఆహార పానియాలు నిలిపి వేసినారు.  కొందరు  వృద్దులు , పిల్లలు, స్త్రీలు  డిహైడ్రేషన్ తో  సొమ్మసిల్లి అపస్మారక స్థితిలోకి  వెళ్ళగా మరికొందరు అనారోగ్యానికి గురయ్యారు.   8.2.2022 వారి జీవించే హక్కును నిలబెట్టుకోవడానికి రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించినారు. మానవ హక్కుల కమీషన్ ఆర్.డి.ఓ, తాహసీల్దార్, ఏ.సి.పి గారులను పిలిపించి వారి నుంచి  రిపోర్ట్ తీసుకున్నారు . అందుకు ప్రజల పక్షాన  న్యాయవాదులు ప్రభుత్వం  రిపోర్ట్ లు అసంబధ్ధంగా వున్నాయని  ప్రజా రిపోర్ట్ ను తీసుకోవలసిందిగా  కమీషన్ న్యాయవాదులను  కోరింది . 13.2.2022 న న్యాయవాదులు సంఘ సభ్యులతో కలిసి  ఇండ్ల స్థలాల వద్దకు వెళ్లారు . ఈ క్రమంలోనే సేవాలాల్ గుడిసె వాసుల వారు వేసుకున్న గుడిసెల దగ్గర రోడ్డు నుండి వస్తూ వుండగా అడ్డుకొని అడ్వకేట్లను, సంఘం నాయకులను నానా దుర్భాషలాడుతూ తీవ్ర పదజాలంలో దూషించారు. అందుకు ప్రతి గా అడ్వకేట్  తమ రాక లోని ఆంతర్యాన్ని   వివరించారు . అవసరమనుకుంటే కొంత మంది స్త్రీలను కూడా తనతో రమ్మనమని చెప్పారు . కాని  కమీషన్ యెక్క అడ్వకేట్ ల రాకను ముందస్తుగానే తెలుసుకున్న భూ కబ్జాదారులు , వారి గూండాలు కర్రలతో, రాళ్ళతో దాడి చేయటానికి సిద్ధంగానే వున్నారని వారి చర్యలను బట్టి తెలుసుకోవటం జరిగింది. ఇందులో పూల్ సింగ్, దండోరా  అశోక్, రవి నాయక్ మెదలగువారు కర్రలను, రాళ్ళను తీసుకొని కొట్టడానికి సిద్దపడగా అడ్వకేట్లు తమపై  దాడిని నిలువరించమని కోరి ముందుకు వెళ్ళినారు. వారు 15,20 అడుగుల దూరం నడవగా సంఘ నాయకులైనటువంటి జె.బాలన్నను పట్టుకొని వీపుమీద, ఛాతి మీద, దవడ మీద పిడి గుద్దులు గుద్దారు . అందుకు సంఘం సభ్యులు కొంతమంది అడ్డుపడగా వారిని దుర్భాషలాడుతూ కింద పడేసినారు. జె.బాలన్న ను కిందకు పడేసి, మెడమీద కాలుపెట్టి మీరు గుడిసెలను ఖాళీ చేయకపోతే మీ ప్రాణాలను, మీ సంఘం నాయకుల ప్రాణాలు తీస్తామని బెదిరించారు . అక్కడే వున్నటువంటి శ్రీమతి జె.రజని కుమారి, ఎస్.రేణుక గారులను మిగతా వారిని కొట్టవద్దు అని బ్రతిమిలాడినా  వినలేదు. స్త్రీలు అయివుండి మీరు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. గనుక మీ మాన ప్రాణాలను తీస్తామని బెదిరిస్తూ వారి వెనుక నుండి వారి శరీర భాగాలను తాకడానికి ప్రయత్నం చేసారు. మరి కొంతమంది వారి వెనుక భాగములో వచ్చి కొట్టినారు. వారు బెదిరిస్తూ మీరు ఈ పోరాటం కొనసాగిస్తే మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వివిధ రూపాలలో హింసి స్తామని , మూకుమ్మడి రేపులు చేస్తామని చెప్పి భయబ్రాంతులకు గురిచేసినారు. వారి కుటుంబాలకు  ముప్పు పొంచి వుంటుందని బెదిరించారు. ఈ విషయంలో పోలీసులు  పరోక్షంగా భూ కబ్జాదారి గూండాలకు సహకరించారు. ఈ విషయాన్ని  జాజుల బాలన్న, శ్రీమతి జె.రజని కుమారి, ఎస్.రేణుక  సంఘం సభ్యులకు తెలియపర్చారు.

 ఇండ్ల స్థలాల సాధన సంఘం వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలని తీర్మాణించి, అదే రోజు 13.2.2022 న   పేట్ బషీర్ బాద్  కి వెళ్లి తమ కంప్లైంట్  తీసుకోమని ఎంత వేడుకున్నా   వినలేదు. కాని , ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలపై దాడికి పాల్పడ్డ భూ కబ్జాదారుల   కంప్లైంట్  తీసుకున్నారు .

          ప్రజల అభిష్ఠానికి విరుద్ధంగా కొంతమంది స్థానిక నాయకులు, పోలీసులు  రెవెన్యూ శాఖ ఆసరాతో 640, 641 లోని భూమిని కబ్జా చేయుటానికి ప్రయత్నిస్తున్నారు . ప్రజలతోనే వుంటూ  ఉద్యమాల పేరిట భూమిని ఆక్రమించి తమ స్వార్థానికి  భూమిని ముక్కలు ముక్కలుగా మోసపూరితంగా కొంతమందికి అమ్ముతున్నారు. ఇందులో పూల్ సింగ్, దండోరా  అశోక్, కటకం అశోక్ మెదలగువారు వున్నారు. ప్రజలని, గుడిసెలు వేసుకున్నవారిని సంఘటితం కాకుండా అడ్డుకుంటూ తమకు మద్దతునిచ్చే వారితో న్యాయస్థానాల ముందు వివిధ సంఘాల పేరుతో కేసులు వేస్తున్నారు . ప్రజల ద్వారా ఏర్పడిన ఇండ్ల స్థలాల సాధన సంఘం సభ్యులకు  అడ్డుగా నిలిచి వారిని అవమానపరిచి భయపెట్టి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించడమే  గా కుండా న్యాయ స్థానాలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. భూముల పేరిట, ఉద్యమం పేరిట ప్రజల వద్ద నుండి విపరీతంగా డబ్బులు  వసూలు చేస్తున్నారు. అబద్ధపు సాక్ష్యాలతో ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అయినా సరే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏర్పడిన ఇంటి స్థలాల సాధన సమితి నాయకత్వం అనేక అడ్డంకులని అధిగమిస్తూ, రాత్రనక పగలనక పేద ప్రజలను మీటింగ్ ల ద్వారా చైతన్య పరుస్తూ కలిసి కట్టుగా వారి వెంట ప్రజాస్వామిక పోరాట రూపాలతోటి హక్కుల సాధనకై ఉద్యమిస్తున్నారు. ఇండ్ల స్థలాల సాధనకై 3000 మంది జనంతో కలిసి నివసించటమే కాక సంఘ విద్రోహ చర్యలు, పోలీసుల బెదిరింపుల మధ్య మెక్కవోని ధైర్యంతోటి అవిశ్రాంతంగా గస్తీ కాస్తున్నారు. తమని తాము ప్రజా వాలంటీర్ సైన్యంగా సమాయాత్తమై వారికి కావలిసిన తక్షణ  అవసరాలు , తాత్కాలిక సదుపాయాలు కలుగజేస్తున్నారు. 

          ఇప్పటికే  ప్రభుత్వము భూమిని ఒక సరుకుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి సిద్ధమైంది. లాభాల వేటలో భాగంగా తెరపైకి వస్తున్న అనేక ప్రణాళికలపై, అభివృద్ధి పథకాలపై ప్రజలు చేస్తున్న  పోరాటాలు ఇంకా గెలవవలసే  వుంది. అయితే అప్పుడప్పుడు పాలకులు తమ ఓటుబ్యాంక్ కోసం అధికారాన్ని చేజిక్కుంచుకోవటం  కోసం ప్రజలకు కొన్ని హామీలు ఇస్తూ  వుంటారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పాలక వర్గాల కుట్రలో భాగంగా G.O:M S నెంబర్ 14 ను 14.2.2022 న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రజలు ఎటువంటి ప్రభుత్వ భూములనైనా ఆక్రమించుకుని నివసిస్తున్న యెడల వారిని 21.2.2022 నుండి 31.3.2022 వరకు మీ సేవలో తమ పట్టాల రెగ్యులరైజ్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశించింది. 640 సర్వే నెంబర్ లను గుడిసె వాసులకు ఇది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వారే ప్రతి రోజు అర్హులైన వారినే గుర్తించి తమ సంఘ నాయకులకు ఇవ్వటంతో పాటు అనర్హులైన వారిని అనగా అంతకు ముందే సొంత ఇంట్లో వున్నవారిని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నారు.

          ప్రజలు గత పది సంవత్సరాల  నుంచి ఇండ్ల పట్టాల కోసం పోరాడుతూనే వున్నారు. కాని  ప్రభుత్వ అధికారులు   వారికి న్యాయం చేయటంలేదు.

 మానవ హక్కుల కమీషన్లోను , హై కోర్ట్ లోను  కేస్ లు వేసాము . 

దుర్మార్గమైన విధ్వంసకరమైన అభివ్రధ్ధి పేరిట భూమిని ధనిక శక్తులకు ధారపోసి,  పేద ప్రజలకు నిలువ నీద లేకుండా చేసే కుట్రలో  వివిధ శక్తులు, ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. 

అన్ని వర్గాల  ఉద్యమ  శక్తులు కలిసి   మద్ధతు తెలియజేయవలసిందిగాను , న్యాయంగా రావలసిన నివాస హక్కు కోసం జరుగుతున్న ప్రజాపోరాటాలతో  కలిసి రావాలని  కోరుతున్నాం .

 ప్రభుత్వ భూమి అంటే రాజ్యాంగం చెప్పినట్టుగా అందరికి సమాన హక్కు వుంటుంది. కాబట్టి  పట్టణ పేదలమైన మేము  మా వంతు  హక్కుకై , మా  గూటికై పోరాడుతున్నాము.

          ఈ న్యాయ బద్ధమైన పోరాటంలో  మీ వంతుగా  స్పందిచమని  అడుగుతున్నాం 

మన  డిమాండ్స్:

1. సర్వే నెంబర్ 640, 641 లో భూమిలో అర్హులైన వారికి ఇళ్ళపట్టాలను ప్రభుత్వం ఇవ్వాలి.

2. ప్రభుత్వ ఖర్చుతో పేదలకు పక్కా ఇళ్ళను నిర్మించి ఇవ్వాలి.

3. పేదల హక్కులను హరిస్తున్న భూ కబ్జాదారులు, స్థానిక గూండాలపై చర్యలను తీసుకోవాలి.

4. రాజ్యాంగం ప్రకటించిన విధంగా నివాస హక్కును జీవించే హక్కులో భాగంగా గుర్తించాలి.

5. ఇదే సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో ఆక్రమించుకొని నివసిస్తున్న సేవాలాల్ సంస్థ సభ్యులకు కూడా ఇళ్ళ పట్టాలను జారీ చేసి వారికి సైతం పక్కా ఇళ్ళను నిర్మించి ఇవ్వాలి.

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

మనువు

మనువు 


 మీ టూత్  పేస్ట్ లో ఉప్పుందా ?

లాగా .. 

మీ ఇంట్లో .. "మనువు " ఉన్నా.. డా ?

అని అడగాల్సిన రోజులు ఇవి .. 

మాటల కోట

 


మాటల కోట 


కాసేపు  ఆలకిస్తే నువ్వు 

ఎన్నిటినో పూసగుచ్చినట్టు 

నీకే చెప్పాలని ఉంటుంది 


పూసల్లో దారం లా 

నా ఊసుల్లో  నిన్ను మరి  

ముడివేసుకోవాలని  ఉంటుంది 

అంతే .. అంతే  సరి  !


నీడ తో యుద్ధం

 నీడ తో యుద్ధం 

వెదికి వెదికి 

వేసారి పోయి  

నాకు .. పోటీగా 

మరి ..  నిన్నే నిలబెట్టాను 

నాతో నేనే అన్నట్టుగా .. 

ఇక తగ్గేదే .. లా .. 


నీ మాట


నీ మాట 

ఈ మాటలన్నీ కట్టిపెట్టీ 


నీ మౌనం లోకే  


జారిపోవాలని ఉంటుంది 


జాగ్రత్త మరి .. అని నువ్వు అంటుంటే 


మాటనే మరింతగా హత్తుకుపోయాను 



ఉదయం మీది ప్రేమ


ఉదయం మీది ప్రేమ 

 కన్నీటి తడిఆరకుండానే 

ఒంటరి తీరం 

నిదురలోకి జారిపోతుంది 

అలసట ఉంటుంది 

అలవాటైన ఆటు పోట్లు ఉంటాయి 


కాలం దారాల మీద 

కాగితం పడవల్లా 

అందరం వేలాడుతుంటాం 

ఆశా నిరాశ కోసల మధ్య ప్రయాణానికి 

నిద్ర కాసేపు విరామం 


*          *             *


ఇంకొంచెం సేపు పడుకుందామనే 

రెండో ఆలోచనే రాని 

సంపూర్ణమైన నిద్ర లోంచి 

మెల్ల మెల్లగా కనులు తెరిచే .. 

ఈ ఉదయం ఉంది చూశావూ .. 

నీ ప్రేమంత స్వఛ్ఛమైనది 


అది నా హృదయం లోంచి 

కాగితం మీదకు దూకే వేగం 

నీ ఒక్క దానికే తెలుసు .. 


ఈ ఉదయమే .. 

ఒక ముగిసిన ప్రయాణం లోంచి 

మళ్ళీ మొదలయ్యే  నీ ప్రణయం .. 

అని .. నేనంటే 

అచ్చంగా నువ్వు నవ్వినట్టే 

కవిత్వమూ ..ఇక చాల్లే ! ..అంది