20, మార్చి 2013, బుధవారం

మూగ రాత్రి


ఏమో !
ఎడాపెడా ఫోన్ నిండా మాట్లాడేదానివి 
మనసు పొంగిపోర్లేది 
ఆకాశం చేతి కందేది 
అంత హాయ్ గా వుండేది మరి !

మాట్లాడుతూ ,మాట్లాడుతూ 
మాయం అయి పోయావు 
 రేయంతా  ఎదురు చూపులు 
ఫోన్ నే ఎన్నిసార్లు 
గట్టిగా తట్టిలేపానో !

కంగారు కాదా మరి 
కంటి మీద కునుకు 
ఏ కనుమల్లోకో ఎగిరి పోయింది 
మనసు 
 ఏదో జలపాత హోరులో 
తడిసి ముద్దయుపో యింది 

ఏదో కీడు శంకిస్తుంది 
నీ వెంట తోడుగా లేనందుకు 
గుండె దిగాలుపడుతుంది 
నువ్వు దేన్నయనా జయంచ గలవన్న 
విశ్వాసమేదో నన్నెప్పుడూ నిశ్చింతగా నిద్రబుచ్చేది 
(ఇక్కడ నీకో రహస్యం చెప్పాలి 
ఆమె అతడిని జయంచింది,అందుకే ఆ నమ్మకం  )

అలాంటిది -
ఈ రాత్రి పిచ్చి పట్టినట్టు వుంది 
భయమేదీ లేదు 
ఏదో బాధ పట్టి పీడీస్తుంది

ఈ చీకటిలోంచే 
ఒక వెలుగు కోసం ఎదురుచూపు 
నీ కమ్మటి పిలుపు 
కోసం పడిగాపులు *
  
 


కవిత్వమే



ఆవేశాల్ని దిగమ్రింగి 
అక్షారాలనే కక్కాలి 

నా కళ్ళు మూస్తున్న కాలాన్ని 
రెక్కలు విరిచి 
కట్టీ మరీ .. 

అక్షరాల్ని పేరుపేరునా 
పేరుస్తూ,కూరుస్తూ 
కునికిపాట్లు పడుతూనే 
 లేస్తూనే ...
అక్షరాల పంట పండిస్తాను 
మనసులోని భావాల్ని ,భయాల్ని 
బరిలోకి దించి 
తెరపై తోలుబొమ్మలాట ఆడిస్తాను 

ఏమీ అడగొద్దు 
ఏమిటి రాసావని 

నాకు అర్థం కాని దాన్నే రాసాను 
మీకై నా అర్థం అవుతుందేమోనని !
నా బాధ ... 


తగవు



గొంతు పెంచి మాట్లాడానా ?
గుండె బద్దలై బయటపడ్డానా ?
థిమాక్ ఖరాబ్ అయ్యు  తిరగబడ్డానా ?
ఏది ఏమైనా .. 
నీ హక్కు నేదో కాలరాచాను 
నన్ను నేనే ఎక్కడో కోల్పోయాను 

తెగని సమస్యల కొలిమి 
చల్లారే దెన్నడో ?
 కంటి నిండా నిద్ర కరవైన మమతావేశం 

          ***

ప్రేమకు ,మనకు 
ఒక వైరుధ్యం 
మన ప్రేమ నిజం కావచ్చు !
మనం .... ?
నా అంచనా తప్పు కూడా కావచ్చు 
ఎందుకంటే ప్రేమ గుడ్డిది కదా !

 

నాన్న

నాన్న
నాకు ఇంకో పార్శ్వం
నా కోసం ఒక జీవితాన్ని ఇచ్చాడు
ఆ మేరకు ఒక జీవితాన్ని కోల్పోయాడు

నా న్న గురించే ఇంత జ్ఞాపకం ఎందుకంటే
ప్రతి రోజూ రాత్రనక ,పగలనక
యంత్ర భూతముల కోరలు తోమే లోకంలోకి
వెళ్లి వచ్చేవాడు
భూగర్భం లోంచి
నల్లబంగారాన్ని వెలికి తీసే పనిలో
నాన్నొక కీలకం

ఆ గనిలో మనుషులు తమ
మనసుల గురుంచి మర్చిపోయే కాలం
జీవన్మరణ పోరాటం మృత్యు గుహ లో
బ్రతుకు గురుంచి ఆశ ఏముంటుంది

19, మార్చి 2013, మంగళవారం

ఊహా

నీ ఊహా లో

ఎప్పుడూ కాలానికి స్థానం లేదు

కాలం కాళ్ళ న్ని గడ్డ కట్టుకుపోయాయు

నిన్నెప్పుడు తడిమి చూడాల్సిన పనే లేదు

పచ్చ పచ్చ గా ,పచ్చి పచ్చిగా 

నా మనసును చుట్టేస్తూ

నాలో ఉండే

ప్రేమ భావన .. నువ్వే కదా

మన ఇద్దరి మధ్య దూరానికి స్థానం లేదు

వేల మైళ్ళు ,కోట్ల మైళ్ళు 

కనులు మూసి చూస్తే ..

నా మనసంత నువ్వే కదా


ఇక భారానికి స్థానం లేదు మరి

నీ ఊహా లో

నా గుండె ఎంత తేలికో

నీకు తెలుసుగా ...

తేలి పోయి న ఈ కవిత సాక్షిగా ... 

ఇదీ ప్రేమే

అనంత వాయువుల్లో

ఓ దుమ్ముకణం  నేను

ఈ కాయం నశించే దే

గుండె ఆగిపోయేదే

ఆ తర్వాత నా ఉనికేదీ లేదు ...


నీ ప్రేమలో పరవశం

ప్రణ యాత్మక   జీవితం

ఎంతో బాగుందనిపించే

ఎల్లలు లేని ఆకాశం

నీ వశం లోనే అన్నీ వున్నా యనిపించే

అమృత సమానమైన ఆత్మీయత ..

దేన్నీ ఒదు లుకోవడానికి

ఇష్టపడని మనసు

నిన్నే వెతుకుంటూ వెతుకుంటూ

నీలో ఐక్యమౌతూ , ఐక్యమౌతూ

నా ఆత్మ

నీ ప్రేమలోకి

పరకాయ ప్రవేశం చేసింది .

ఇప్పుడు ఇక నేనంటూ లేను


ప్రేమ

నేనే  
ఆకాశం తలవంచి

తన మెత్తటి మేఘాల బుగ్గలపై

ముద్దు పెట్టి

మొట్టికాయ వేస్తాను

నా ప్రేమకు చలించి పోయు

అది భళ్ళున వర్షిస్తుంది

తన ప్రేమలో నేనూ  తడిసి ముద్దవుతాను

మేమెప్పుడూ -ఇంతే  !


15, మార్చి 2013, శుక్రవారం

ప్రేమ పిచ్చి

కవిత 

ఒంటరి తనం శాపం కాదు 

కాని ఇబ్బందే ...

అందులోకి ఇమిడిపోవడం

అంత ఈజీ కాదు

కనీసం, మన అంత లోతు గొయ్యు తవ్వి 

అందులో మన మనసుని నిలువునా పాతేయ్యాలి

అప్పుడు కూడా అది

నిలబడి పోయే అవకాశం లేదు

అవును

మనసు అప్పటికీ నిలబడదు

అది లోకాలు చుట్టి వస్తుంది

ఆకాశాన్ని చిన్నపిల్లాడిని చేసి  ఆడుకుంటుంది

అయితే విచిత్రంగా పాతాళానికి మనసెప్పుడు పోదు

మనసు స్వేచ్చా పిపాసి కదా!

*******

మనం , అంటే 

అందరం కాదు 

మీరు ,నేను అంతే 

మనం ఎవ్వరికి తెలిసి అపకారం చెయ్యం 

అయినా కొందరు దూరం జరిగి పోతారు 

'పోతే పోనీ 'అని కదా శ్రీ శ్రీ అన్నాడు 

కొన్ని సందర్బాలలో మనకు మనమే 

ఏకాంత వలయాలలో గిరికీలు కొడతాం 

అదొక స్థితి 

ఎందుకంటే ఎలా చెప్పేది ?

మనసు పాడే మౌన గీతం అది 

 ******

ఏంటి ?ఈ మనసు ఏంటి ?

వివరించలేను నేస్తం 

దాన్ని నువ్వు ఫీల్ కావాల్సిందే 

ఒక్కసారి గట్టిగా గిల్లుకో 

నొప్పి అనిపించిందా .. ?

నొప్పి తెలియనప్పుడు 

నీ మనసు కలలు కంటుందని  అర్థం 

మనసే అర్థం కాలేదు,

దానికి తోడు కలలు  కూడానా ... 

అందుకేనోయు ప్రజలు పిచ్చోళ్ళు కాదు 

దీన్నే పిచ్చి అని పిలిచారు 

అవును ,

పిచ్చి ,ప్రేమా ఒక్కటే !

ఏమిటో కదా ఈ ప్రేమపిచ్చి  !

   

అమ్మ తో కలిసే పోరాటం

కవిత 

కవిత్వాన్ని చూసారా ?

డబుల్ యాక్షన్

అదే బాధ పడుతుంది

మరోచేత్తో ఓదారుస్తుంది

అందుకే కవిత్వం ఒడి

కన్నతల్లి హృదయం అంటాను

చిన్నపిల్లాడినై

ఎప్పుడూ

అమ్మ ఒడిలో నిదురోయే

పసి మనసు నాది

కాని

నిన్న విడిచిన పోరాటం వుంది కదా !

తెలుసు నేస్తం!

అమ్మతో కలిసే

కదనరంగంలోకి అడుగెడ తాను . 

14, మార్చి 2013, గురువారం

ఓ ఫైవ్ వుంటే ఇవ్వు గురూ..

కథ 


   ఒక అవసరం వుంటుంది . మొహమాటము అడ్డొస్తుంది .ఎదుటి వ్యక్తి మనల్ని చిన్నచూపు చూస్తాడేమో ననే భయం కూడా పట్టి పీడిస్తుంది . డబ్బులు ఉన్నప్పుడు ఎంత దర్జాగా బ్రతికేస్తామో ,జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు అంతగా అల్లల్లాడి పోతాము . కాని మొహం మీద దాన్ని కప్పిపెట్ట డానికి శతవిధాలా ప్రయత్నిస్తాం . ఏదో పర్స్  మరిచిపోయి నట్టు ,రావలసిన డబ్బులు రాలేదనో చెప్పి ,పక్కవాడిని 'ఓ ఫైవ్ వుందా గురూ ? అని చాలా స్ట యులు గా అడుగుతాం . పాతవాల్లయ తే  మనలను కనిపెట్టి తప్పుకు పోతారు . కొత్త వాల్లయ తే  బుట్టలో పడతారు .
అవసరాలు తీరేందుకు మనిషి పడే తాపత్రయాలు ఎన్నోకదా  !
పాపం !పీత కష్టాలు పీతవి లాగా మనిషి కష్టాలు మనిషివి మరి  !

   నా పరిచయం కూడా మీకు అవసరమే . ఎందుకంటే ఇదంతా నా కళ్ళు చూసి ,నా బుర్ర అర్థం చేసుకొన్నవిషయాలే . నాపేరు ఓ సుబ్బారావు లాగ వెంకట్రావు . వయసు యా బై  ముంచుకు వస్తున్నాయి .ఊరు హైదరాబాద్ .  ప్రస్తుతం నిరుద్యోగినే . దిగులు మామూలే . మరీ ,ఓ ఫైవ్ కోసం ఏమీ ఎదురు చూట్టం లేదు కాని జీవితం సాదా సీదాగా గడిచి పోతుంది .
మొన్నొక సాయంకాలం అలసిపోయు కొంత ,అలవాటుగా కొంత మార్కెట్ వేపు వెళ్లాను , టీ కోసమే .

టీ కొట్టు గురుంచి చెప్పాలంటే ,రావిశాస్త్రి గారి రత్తాలు ,రాంబాబు నవలలోని కిల్లి కొట్టు వర్ణనలు  గుర్తుకొస్తున్నై . కోస్తా ఆంధ్రలో వుండే కిల్లి కొట్టు అంత ఇదిగా లేకున్నా తెలంగాణ లో టీ కొట్టు కూడా అదే ఇది లో వుంటుంది . ప్రజలు తమను వ్యక్త పరుచుకునేది ఇక్కడే . ఈ లోకం తీరు గురుంచి ఒక అంచనా కి వచ్చేది కూడా ఇక్కడే . 

హైదరాబాద్ లో ప్రతి గల్లి చివరన ఒక ఇరాని టీ హోటల్ వుంటుంది . ఆ టీ  రుచే వేరు . అయితే నగరం ఆ ప్రాభవాన్ని కోల్పోతుంది . ఇప్పుడు హైదరాబాద్ చుట్టుతా రకరకాల వలసవాదుల ప్రభావాలు .  అవి  టీ దుకాణాల్లోకి కూడా చొచ్చుకు వచ్చాయు .

ఈ టీ షాప్ చాల షోగ్గా వుంటుంది . టీ చేసే అతను మాట కారి. గురజాడ అప్పారావు గారి నాటకం 'కన్యాశుల్కం 'లో గిరీశమే గుర్తుకు వస్తాడు . గిరీశం చాల పెద్దమనిషి . మాటలతో కోట లు కట్టించి ,లౌక్యం తో (ఆ నాటకంలోనే మధురవాణి అన్నట్లు లౌక్యం అంటే మోసమే )బ్రతికేయగల గొప్ప జీవి .

ఇవ్వాళా చాల గొప్పగా చెప్పబడుతున్న సేవారంగం ,వ్యాపారరంగంలో అందరికి గిరీశ మే ఆదర్శం . ఆదర్శాలని సైతం ఎలా తమకనుకూలంగా ,వ్యాపారంగా మార్చుకోవచ్చో గిరీశం ఆనాడే చాల అలవోకగా చెప్పేశాడు .

సేవారంగంలో ఉండే గొప్ప మనుషులకి (వాళ్ళని కార్మికవర్గం అందామా అంటే భయమేస్తోంది ),ఉత్పత్తి రంగంలో  వుండే కార్మికులకి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే తేడా ఏంటో తెలుసా ?
లౌక్యమే !ఈ సత్యం నాకు ఈ రోజే బోధ పడింది . ఈ జ్ఞానాన్ని మీకు పంచటానికి కూడా విచిత్రంగా గిరీశ మే ఆదర్శం  . మరి ,అలాంటిది గిరీశం ప్రభావం . గిరీశానికి తెలియని విషయాలు వుండవు . తెలియని విషయాన్ని  కూడా తెలిసినట్టు చెప్పగలగడమే గిరీశం ప్రత్యేకత . జీవితసత్యాలు అతనికి అర్థమయినంత ఈజీగా మనకెవ్వరికీ అంతు చిక్కవు .

మనం ఇప్పుడే అసలు కథ లోకి ప్రవేశo చేస్తున్నాం .

నేను ఒక టీ కి ఆర్డర్ ఇచ్చాను . టీ కలిపే పనిలో ఉన్నాడు మన గిరీశం . ఇంతలో అక్కడికి ఒక ముసలతను వచ్చాడు . నవ్వు మొఖం తోనే కొంచెం దీనంగా ఓ ఐదు రూపాలు ఇయ్యవానె  అని గిరీశాన్నే అడుగుతాడు . టీ కలుపుతూనే ,మా అందరి వేపు చూస్తూ గిరీశం స్పందిస్తాడు .

"పైసలడ గొద్దు  నన్ను"

నీకు నాగుండె కావాలా ? కోసి ఇచ్చేస్తాను ,అంటూ అభినయం తో చెప్పాడు . తన అభినయం తనకే నచ్చినట్టుగా ఉంది . మరో రెండు సార్లు రిపీట్ చేసి అదే విషయాన్నీ మళ్ళీ   వివరించాడు .
పాపం !ముసలతను బిక్కచచ్చి పోయాడు .
గిరీశంకి మాంచి వినోదం లాగుంది .అతను మళ్లీ  విజ్రుభించాడు .

"నా జీవితంలో నాకు నచ్చని ఒకే ఒక విషయం , అప్పు ఇవ్వడం " అని పైపైకి నవ్వేశాడు .
ఆ ముసలతని ఐయుదు రూపాయల అవసరం గిరీశానికి తన పునాది నే కదిలిస్తున్నట్లు అలా  మాట్లాడుతూ నే వున్నాడు .నిజo గా అయుదు రూపాయల అప్పు వల్ల అంత ఇబ్బంది వుందా అని గిరీశాన్ని అమాయకంగా అడిగాను నేను .
 గిరీశం మరింత ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు ..
"ఈ రోజు ఐదు ఇస్తే రేపు పది రూపాయలు అడుగుతారు . పది ఇస్తే ఇరవై రూపాయలు అడుగుతారు "అంటూ అడుక్కోవడం గురుంచి ఎయిడ్స్ వ్యాది గురుంచి చెప్పినట్టు చెప్పాడు .

నేనింకా అమాయకంగా అడిగాను గిరీశాన్ని ;అయుదు రూపాయలు ఇవ్వడం కంటే గుండె కోసి ఇవ్వడమే ఈజీ అంటావా ?
అయితే అతను అద్బుతమైన సమాధానం ఇచ్చాడు .

"అయుదు రూపాయలు అవసరం ఉన్నోడు మన గుండే నేమి చేసుకుంటాడు సార్ ?
ఐనా మనం ఏదీ ఇవ్వం ,తీసుకోవడం తప్ప . ఇచ్చేస్తూ పోతే చివరికి మనమూ అడుక్కోవలసి వస్తుంది .

నిజంగా నా గుండెనే ఎవరో కోసేస్తున్నట్లు ఫీల్ అయ్యాను . అప్పటికే ముసలతను గిరీశం బాధ చూడలేక ఎటో వెళ్ళిపోయాడు .

కాని నా మనస్సు ఆలోచనలో పడింది . ఎంత వేదాంతం చెప్పాడు టీ కొట్టు గిరీశం !అయుదు రూపాయల కోసం గుండె కోసేసుకుంటా ననే అబద్దం ఆడగల 'లౌక్యాన్ని'ఎలా దిగామింగుకోవాలో అర్థం కాలేదు నాకు .
 మమత కోసం ,మంచి కోసం ,మనిషి కోసం ,మొత్తంగా ఒక మంచి సమాజం కోసం ప్రాణాలు సైతం అర్పిస్తున్న వారిని మనమెరుగుదుo . కాని గిరీశం వాటిని పట్టించుకోడు .పైగా తనే ,తన స్వార్థం కోసం ,లౌక్యంగా "ఓ ఫైవ్ వుంటే ఇవ్వు గురూ " అంటూ లోకం మీద పడతాడు .      *

12, మార్చి 2013, మంగళవారం

పిడికెడంత ప్రేమ

 నడి రాతిరి ,

ఆకాశం ఆదమరిచి నిదురోయే వేళ

సైకిల్ తొక్కుకుంటూ ,గని పని నుంచి వచ్చి

ఒరే పెద్దా !అని కుదిపి ,కుదిపి

నిదుర లేపేవాడు నాన్న  నన్ను

నాన్న స్పర్శ కంటే , ' పెద్దా' అనే పిలుపు లోని

మాధుర్యమేదో ,నా నిద్రమత్తు ని వదిలించేది

                      *****

అమ్మకి తెలుసు నాన్న గారాబం

రెండు కోడి గుడ్ల కూర వండితే

తను సగం తినేది ,రెండో సగం నాన్నకి

నాకోసం ప్రత్యేకం ఒక్కటి !

                       *****

గనిలో ,పనిలో అలసిన నాన్న

తన కష్టమంతా మర్చిపోయు

నాన్ను లేపి ,కూర్చో బెట్టి

తన ప్రేమను దాచుకోలేని తనా న్ని

మొత్తంగా పిసికి  కలిపి  

గోరుముద్దలు  తినిపించేవాడు

               *****

మళ్లి  ఈ నాటికీ

నడిరాతిరి వేళ

ప్రియా ! నీ పిలుపులు

చందమామ కబుర్లు

పిడికెడు ప్రేమను దాచుకోవడం లో విపల్మయ్యే

విరహ హృదయాలు 

*****

పుట్టెడు దుక్కాన్ని దిగమింగుతాం 

పిడికెడు ప్రేమను దాచుకోవడంలో 

విఫలమౌతున్నాం ;అప్పుడు,ఇప్పుడూ 

నాన్న,అమ్మ;నువ్వు,నేను .  
























ఆకాశ దేశాన ..

నే నెప్పుడూ  నీకు దూరంగా లేను 

నా కాళ్ళ క్రింది భూమి నిరంతరం 

తిరుగుతూనే వుంటుంది 

ఇది ఒక భౌతిక వాస్తవం 

ఇక దూరం సాపేక్షికమే కదా!

నేనెంత దూరం వెళ్ళినా 

దారి తప్పి పోయినా 

విశాలమైన ఆకాశం 

ఆకాశం - నా నేస్తం 

నా వెన్నంటే వుంటుంది 

అది - 

ఒక రొమాంటిక్ ఊహే కావచ్చు !

కాని -

నా ప్రేమ నిజం కదా !

ఆచరణ


ఆచరణ -మొదట 

నా చిటికెన వేలు పట్టుకొని

 బుడి బుడి అడుగులు వేస్తుంది 

నా నుంచే నడక నేర్చుకుంటుంది 

పడుతూ ,లేస్తూ 

జ్ఞానాన్ని  పెంచుకుంటూ ,పేర్చుకుంటూ 

నాతో నడిచే నేస్తమౌతుంది 

నాకు వివరిస్తుంది ,విశదపరుస్తుంది 

ఆచరణ -మరింతగా విస్తరిస్తుంది 

అప్పుడు - 

అది నాలో వలపౌతుంది 

ఒకరి కోసం ఒకరం జీవిస్తూ వుంటాం 

ఒకరిని విడిచి ఒకరం ఉండలేని 

ప్రేమ అవుతుంది -ఆచరణ 

ఆ ఆచరణే ఆకాశమంత విశాలమౌతుంది 

ఆచరణ -నాకు దారి చూపే చుక్కాని అవుతుంది 

చివరాఖరికి -నా ఆచరణే  నాకు గురువు అవుతుంది .