29, అక్టోబర్ 2022, శనివారం

 

నగరం మనసు పడిన  వేళ .. 



ఏ తీర్పు   మనసుని  కలిచి వేసిందో 

ఈ రాత్రి కప్పుకున్న దుప్పటే 

గుండెల మీద మండుతున్న కుంపటి  అయింది 

ఎంతసేపని మోస్తాం  దహించే నిప్పుని ?


విసిరిపడేసి .. చీకటి వాకిట్లోకి వచ్చి పడ్డాను 

ఎదురుగ్గా  నిద్ర సుఖం ఎరగని  నగరం 

తన్ను  తాను మరిచిపోయినా నన్ను   వెంటనే గుర్తు పట్టేస్తుంది 

తనని నిద్రబోనివ్వని "ఆలోచించే మెదడు" నేనే     కదా !

ఆ మాత్రం గౌరవానికి అర్హుడే మరి ..  అర్బన్ నక్సల్ .. 


ఇంకేంటి  మూర్తి .. తెచ్చుకో ఓ పెన్ను ,పేపరు 

నిదుర బోని నేను ,నిదుర  రాని  నువ్వు 

ఏముంటాయి లే   మనకి   మాటలు.. 

అన్నీ ఆశు కవిత్వాలేగా .. 

ఇక చంపు .. 

అయితే ముందు దోమల్ని .. 

నన్ను నిదురబోనివ్వని నీలాంటి నేస్తాల్ని .. 


నువ్వు ఏమి రాసినా ,ఎంత రాసినా 

నింద  మాత్రం నా మీద  మోపకు 

నిదురబోనివ్వని నగరమని టైటిల్ పెట్టకు 

జస్ట్ కిడ్డింగ్ .. ఎదో సరదాకి అన్నాను 


ఇప్పుడు జీవితం లోతుల్లోకి వెళదాం 

ఒక్కసారి మనం   తవ్వుకున్న గోతుల్లోకి వెళ్లి చూద్దాం 


ఈ రాత్రి నువ్వు రేపటి కలల్లో కి  కదా వెళ్ళాలి 

జవాబు దొరకని నిన్నటి ప్రశ్నలు కొన్ని 

ఇంకా నీ మెదడుని పీక్కు తింటూనే వున్నాయి

  


కాలం దగ్గర చాలా వాటికి చక్కటి మందు వుంది.. 

అయితే  దాన్నెలా తీసుకోవాలో  తెలిసిన 

కాల జ్ఞానివి  కావాలి  నువ్వు  .. 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి