నల్ల నేల మనిషి ..మునీర్
...
నువ్వు పట్టుకున్న పుస్తకం పేజీలు మడతలు పడి నలిగిపోతే వెంటనే సరిచేస్తావు . చేతులు కాస్త ముఱికి అయితే శుభ్రం చేసుకునేంతవరకు కాలు నిలువదు .
అలాంటింది మొత్తంగా శరీరమే మసితో నిండిపోయి ,చెమట ,నల్లని నీళ్లు కలిసిపోయి ధారలు ధారలుగా ,తల నుండి పాదాల వరకు అట్టలు కట్టినట్టు వుండే మనిషినెక్కడైనా చూసారా?
నానా దేశాల విభిన్నమైన మనుషులని చూపించే నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ కూడా ఇలాంటి కష్ట జీవుల గురుంచి ఎక్కువగా పట్టించుకోదు .
ఈ మనిషి శ్రమకు సంబంధించిన వాడు . నల్ల బంగారాన్ని వెలికి తీసే బొగ్గు గని కార్మికుడు . ఇప్పటికి స్త్రీకి బొగ్గు గని లోకి ప్రవేశము లేదు .
ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసులు ఉన్నట్లే సింగరేణి బొగ్గు గనుల్లో ఈ నల్ల మనుషులు ఉంటారు .
తల నిండా ,నోటి నిండా ,కళ్ళ చుట్టూ మసి పేరుకుపోయిన శ్రమ జీవులు . అదొక శ్రమ సౌందర్యం .
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు .. అని కదా మహాకవి శ్రీశ్రీ అన్నది .
ఆ సౌందర్య పిపాసి ఇక్కడి బొగ్గుమనుషుల్ని కలిసాడు . మందమర్రి ,బెల్లం పల్లి బొగ్గు గని ప్రాంతాలకు 1970 దశకం లో వచ్చాడు . అప్పటికే శ్రీశ్రీ ని అందిపుచ్చుకున్న నవతరం ఇక్కడ
విప్లవ జ్వాలల భుగ భుగల్ని పుట్టిస్తుంది .. అక్కడ .. ఆ వెలుగుల్లో మనకు ఈ నల్ల నే ల మనిషి ..
మునీరు కనిపిస్తాడు.
ఏమిటి మరి ఈ బొగ్గు గొప్పతనం ?
తెల్లదొరలకు ,బాయిదొరలకు అది నల్లబంగారం . యంత్రాలను నడిపించగలిగే ఆధునిక
ఇంధనం .
దట్టమైన అడవిని నరికి ,కొన్ని వందల మీటర్ల లోతులో భూమిని తొలుచుకుంటూ సొరంగాలు తవ్వి ఈ బొగ్గును చేరుకున్నారు .
ఈ బొగ్గు కథా కమామిషు అంతా మొదట ఆ తెల్లదొరలకే తెలుసు ..
మన దేశ ఆదివాసీలు ,నిరుపేద రైతాంగం గనుల్లో బానిసల్లా పనిచేశారు .
ఇప్పటి నల్లదొరల రాజ్యం లోనూ శ్రమ దోపిడీ తగ్గలేదు .
కార్మికులకు కష్టపడటం ఒక్కటే తెలుసు .
తల్లి కడుపులోకి వెళ్లి నట్టు గని లోకి పోయి ,బొగ్గు పెళ్లలను పసిబిడ్డల్లా పైకి మోసుకొచ్చేవారు .
ఎందుకంటే అది .. తమ కష్టం .. తమ కన్నీళ్లు తుడిచి కడుపు నింపే పెద్దకొడుకు లాంటి బొగ్గు ..
ఈ బొగ్గే లేకపోతే .. అప్పుడు గ్రామాల్లో అల్లకల్లోలమైన జీవితాలు కళ్ళ ముందు కదలాడేవి . భూస్వాముల అరాచకాలను తట్టుకోలేని 'శ్రామిక కులాలు' పొట్ట చేత పట్టుకొని " కాలేరు"(కాలరీస్ )బాట పట్టారు .
బొగ్గు ది బంగారం లాంటి మిల మిలా మెరిసే నలుపు రంగు . బొగ్గు .. మంచి చమట వాసన వేస్తుంది . వందల వేల ఏండ్లు భూమి లో మగ్గిపోయిన అడవి కదా బొగ్గు అంటే ..
ఇక బొగ్గు రుచి గురుంచి .. లాభాల రుచి మరిగిన పెట్టుబడిదారుల విస్తృతి లో దాన్ని మనం కనిపెట్టాలి .
బొగ్గు లానే భూమి లోతుల్లోంచి లభించే పెట్రోల్ వాసనకి మనలో కొందరం "అడిక్ట్" అయిపోతాం .
బొగ్గు ఏమో ముతక వాసన వేస్తుంది . . అంతే !
ఇంత దూరం లో వున్న మీకు ఆ విషయం తెలీదు .. అక్కడే వున్నవాళ్లకి పెద్దగా తేడా తెలియదు. ..
ఇది ఆదిలాబాద్ జిల్లా .. ఇప్పుడు మూడో నాలుగో ముక్కలుగా విడదీశారు . అప్పట్లో ఇదే పెద్ద జిల్లా .. ఆదిలాబాద్ తలుపు ఒక వేపు మహారాష్ట్ర లోకి తెరుచుకుంటుంది . ఇంకో వేపు ఈ బొగ్గు గనులు ఉంటాయి . ఇప్పుడు ఈ ప్రాంతం మంచిర్యాల జిల్లా లోకి వస్తుంది .
పాత ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా ఆదివాసీలదే .. గోండు దాదా కొమురం భీం వారసులదే ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి