తెలిసిరావాలి
అవునూ...,ఏది అయినా తెలిసి రావాలి
రుచి ..
చటుక్కున నాలుక కరుచుకోవాలి
వాసన..
ముక్కుపుటాల్ని తట్టి లేపాలి
రంగు..
గంగవెర్రులెత్తి గింగిరాలు తిరగాలి
అప్పుడు కదా!
గుండెల నిండుగా ఆనందాల ప్రవాహ జడి
కన్నుల పండుగగా సౌందర్యాత్మక తడి
ఎప్పుడూ ...
ఎదో మిగిలిపోయిన జ్ఞాపకం
ఏమిటో ...
నన్ను నేను
కోల్పోతున్న నిష్క్రియాపరత్వం
ఎలాగో ..
తీసివేస్తున్న ప్రతిఅడుగు వెనక
ఒక సముద్రమంత నిరాశ ముద్ర
అయ్యో..
విరిగిపడుతున్న జీవన శకలాలను
కూర్చుకునే ప్రహేళిక
చూశారా !
అంతా అర్థమైనట్టే ఉంటుంది
కానీ.. ఏదీ నిలబడి చావదు
ఏదీ ..ఒక ముగింపుకు లొంగదు
అనంతంగా ..
తెగిపడ్తూ
పడిలేస్తూ
ప్రేమసాగర మథనం ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి