2, డిసెంబర్ 2017, శనివారం

గమ్మత్తు

గమ్మత్తు 

నన్ను  నేను
నిలబెట్టుకోవడానికి
ఎన్ని సర్ది చెప్పుకోవాలో !

అసలు ఎలా పడిపోయానో ఏమో !

భావ కవిత్వాన్ని
తప్పు పట్టలేను

దిగమింగిన బాధ ల్ని
ఇప్పుడు ఏకరువు పెట్టలేను

అయినా
అనాలోచితంగా ఏదీ  చేసినట్టు తోచడం లేదు

అవును
ఒక మత్తు లో మునిగిపోయాను
హాయిగానే ఉండింది

ఒకే  ఒక మత్తు
ఎన్ని గమ్మత్తు ల్లోకి దించిందో తెలుసా ?
సర్వోన్నతుడైనట్లు
ఎంతగా ఎగిరి నడిచానో తెలుసా ?

ఆ నడక బాగుంది 
ఆ వెదకడం నచ్చింది 


మట్టి వాసన కమ్మదనం 
నీటి బిందువుల చిందే అందం 
పసితనం కమ్మేసిన ప్రకృతి సింగారం 


Mumbai airport .. 3. 12. 17

25, అక్టోబర్ 2017, బుధవారం

వానపాము

వానపాము 


ఈ  జీవితమింకా
నేను గెలవాల్సిన విజయమే 
సరిహద్దులు గా గీసి నిలిసిన  యుద్ధం లో 
ప్రత్యక్షం గా ఎప్పుడూ  లేను 
కాని
అంతకు మించి
తలదాచు కున్న 
చిరునవ్వుల ముఖాన్ని తగిలించుకున్న 
నన్ను
మీరెవ్వరూ  గుర్తు పట్టలేరు
నేను 
శవాల గుట్ట కింద కదులుతున్న వానపామును


తెలిసిరావాలి

తెలిసిరావాలి 

అవునూ...,

ఏది అయినా  తెలిసి రావాలి
రుచి ..
చటుక్కున నాలుక కరుచుకోవాలి
వాసన..
ముక్కుపుటాల్ని  తట్టి లేపాలి
రంగు..
గంగవెర్రులెత్తి గింగిరాలు తిరగాలి
అప్పుడు కదా!
గుండెల నిండుగా ఆనందాల ప్రవాహ జడి
కన్నుల పండుగగా సౌందర్యాత్మక  తడి

ఎప్పుడూ ...
ఎదో మిగిలిపోయిన  జ్ఞాపకం

ఏమిటో ...
నన్ను నేను
కోల్పోతున్న నిష్క్రియాపరత్వం

ఎలాగో ..
తీసివేస్తున్న ప్రతిఅడుగు వెనక
ఒక  సముద్రమంత నిరాశ  ముద్ర

అయ్యో..
విరిగిపడుతున్న జీవన శకలాలను
కూర్చుకునే ప్రహేళిక
చూశారా !
అంతా  అర్థమైనట్టే ఉంటుంది
కానీ..  ఏదీ నిలబడి చావదు
ఏదీ ..ఒక ముగింపుకు లొంగదు
అనంతంగా ..
తెగిపడ్తూ
పడిలేస్తూ
ప్రేమసాగర మథనం ..



అమ్మ

అమ్మ కంటి బాస 

అమ్మ...
అవును అమ్మే
పెద్ద ఆరిందాలా
నన్ను కని .. 
పెంచీ ..
 పెద్ద చేసింది

కానీ
నేనేమి
అమ్మ కి కొనసాగింపు కాదు

అప్పుడే ఒక సంవత్సర కాలం
అమ్మ ఊసుల్లేకుండా బోసిపోయింది

మీ అనుభవం లో ఉందో  లేదో తెలీదు

మనకి చాలా  ప్రియమైన వాళ్ళు
మరణం తర్వాత కూడా
చావుని గేలి చేస్తూ
నవ్వుతూ
మన చెంత చేరి
కబుర్లు చెబుతూ
మనల్ని ఆశ్చర్యం లో ముంచెత్తుతారు

కాని  అమ్మ ఎందుకో
కలలో కూడా మాట్లాడేది కాదు

అమ్మది "కంటి బాస "
గుండెల్ని పిండేసే ప్రేమ
అమ్మ ప్రాణాలు
ఈ గాలిలోనే
ఇంకా తిరుగాడుతున్నట్లు

నా గాలిమేడల్లో
ఒక నిరంతర గుండె సవ్వడి ..

08.03.1 7,బచావ్ ,గుజరాత్

వారసత్వం

వారసత్వం 

పెద్ద ఆరిందాలా
అమ్మ నన్ను కనీ, పెంచి
"పెద్ద "ని చేసింది
అదే పెద్ద కొడుకును లెండి
తన స్థానాన్ని
నేను తీసుకుంటానని
తలపొసే ఉంటుంది

అన్నిటికీ
తన ప్రాణాన్ని ఎంత కష్ట పెట్టుకుందో
తన కన్నీటి భాష కే తెలుసు

తన కోసం  యుద్ధం చేసేది
మా కోసం కన్నీటి సంద్రమయ్యేది

కలలు కనలేని వాడు విప్లవ కారుడు
కాలేడని కదా అంటారు

కానీ
అమ్మ
కనే కోటాను కోట్ల కలలకి
విప్లవమే "పెద్ద " వారసత్వం

08.03. 7,
బచావ్ ,గు జరాత్ 

గమ్యం

గమ్యం 

ప్రతి మూలమలుపు
ఒక ముగింపులా
ఎలా తోస్తుంది నీకు ?

మన చేతుల్లో మొదలుగాని  ప్రయాణం
ఈ నడక తో అంతమవుతుందని అనుకోను

గమనానికి ,గమ్యానికి అరలు లేవు
అరమరికలు లేవు కదా !

పదును

పదును

మరింతగా రాటుదేలాలని
ఒక చివర నుంచి చెక్కడం
మొదలెట్టాను

ఇంకో చివరికైతే
చేరుకున్నాను
కానీ
చివరికి
ముక్కలు చెక్కలే వెక్కిరించాయి .

09/05/2015

23, అక్టోబర్ 2017, సోమవారం

కెనడీ

అధ్యక్షా !కెనడీ ఉత్త పనికిమాలిన మనిషి  

ప్రకాశం జిల్లా ,గిద్దలూరు తాలూకా  ... కొమరోలు మండలం ..అల్లీనగరం గ్రామం ...
 మనిషి పేరు ..  జాన్ కెనెడీ ... పేరుకు మాత్రమే అమెరికా అధ్యక్షుడు ... వాస్తవం లో అల్లీనగరం మచ్చర్ పహిల్వాన్ ..ఊరవతల దళితవాడ తనది..   జానెడు ..అంటే జానెడె పొట్ట చేత్తో పట్టుకొని హైదరాబాద్  పట్నం వచ్చాడు 1989 లో .చిన్న చిన్న పనులు చేస్తూ దేశం అంతా తిరిగాడు . ఈ సమాజం ఆతనికి ఏమి నేర్పించ లేకపోయింది . అతనే అందరికి ఎదో చెప్పాలనే తాపత్రయం లో ఉండే వాడు . భయపడకూడదని చెప్పేవాడు .. అలానే జీవించాడు . మరణాన్ని ఎప్పుడూ  కోరుకోలేదు . మృత్యువే అతన్ని వరించి వచ్చింది,రోగాల ఉరి తాడు పేనుకొని .

కెనెడీ గురుంచి ఏమి రాస్తాం .. ఉత్త పనికి మాలిన మనిషి .
పని కోసం పాపం  దేశాలు తిరిగేవాడు ..కాని  అవీ  ఉత్త పనికి మాలిన దేశాలని  అతని అర్థాంతరపు చావు..  డప్పు కొట్టి  మరీ  చెప్పింది .

కెనడీ కి ఎంత బాధ వున్నా హాయిగా నవ్వడం ఒకటే బాగా  తెలుసు . ఈ స్పీడ్ యుగం లో ఏ పనైనా ఫటా ఫట్ చేసే వాడు . అప్పుడే కెనెడీ ఈ కాలం మనిషి అనిపించే వాడు . కానీ ఎవ్వరు అతన్ని తన మనిషిగా చూడలేకపోయారు .
తల్లితండ్రులు మోసిన సిలువను మెడలో వేసుకొన్నాడు.కాని పెద్దవాళ్ళ దగ్గర పనికోసం ఆ సిలువను మాసిన చొక్కా చాటున దాచేవాడు. దేవుడ్ని ఎప్పుడు ఏదీ అడిగినట్టు కనిపించేవాడు కాదు . దేవుడి బిడ్డల్ని కాపాడాలని తనే మాటి మాటికీ ఒక సిలువు ను మోసేవాడు . 

20, సెప్టెంబర్ 2017, బుధవారం

మోహనా .. ఓ మోహనా

సంతాపం


ఎన్నిటి లోనైనా మోహన్ బొమ్మ ఇట్టే తెలిసిపోతుంది .
ఎన్నో ప్రజాపోరాటాలకి ఆకృతినే కాదు ఆవేశాన్ని నింపిన

మోహనా .. ఓ మోహనా ..

(శివారెడ్డి కవితా  శీర్షిక కాబోలు .. )
కార్టూనిస్ట్ మోహన్ ని ఓ ఐదు రోజుల క్రిందటే అతని తెలిసిన వాళ్ళే  కొందరు ముందే  చంపేశారు ..సంతాపాలు ప్రకటించేసారు .. కానీ మోహన్ చివరి దాకా పోరాడాడు.

మోహన్ ని నేను ఎరుగుదును. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొన్నాం .. కరచాలనం చేసుకొన్నాము. పని ని బట్టి మనుషుల్ని గుర్తు పట్టేవాడు మోహన్  .
  శ్రీ శ్రీ కవితలకి ,మోహన్ బొమ్మలకి  పరవశించని హృదయం హృదయమే కాదు .. బహుశా మోహన్ కి బొమ్మలొక కవిత్వం .. మనకి అతని బొమ్మలే జీవితం . 

18, సెప్టెంబర్ 2017, సోమవారం

గౌరి ..మై లవ్

గౌరి ..మై లవ్ 


"ట్రిగ్గర్ హాపీ క్రిమినల్స్" ఎంత హ్యాపీ గా మర్డర్ చేసేసారో ..అయినా  మిమ్మల్ని హంతకులు అని ప్రకటించాలని   అనిపించటం లేదు. ఎందుకంటే అసలు  హంతకులు ఎవరో మాకు తెలుసు .తన యుద్ధము మీతో కాదని  మీకు   తెలుసో లేదో !

కనీసం ఆమెతో మాట్లాడాల్సి వుండింది   . . మీ కోపతాపాలు గురించే.. తుపాకీ గురిపెట్టే మీ సందేహాలు తీర్చుకోవాల్సింది  ..మీరన్నట్టే ఆమె మేధావే  కదా !నిజంగా ఆ హత్యకి ముందు ఆ దృశ్యాన్ని మీరొక్కరే  ఆస్వాదించే అవకాశం వుండింది ..మీకు నచ్చితే ఆ వీడియోని మాకు వీక్షించే భాగ్యం దక్కేది.. చరిత్రలో ఒక గొప్ప సన్నివేశాన్ని మీరు మిస్ అయ్యారు.. మేము కూడా !
గౌరి లంకేశ్ ... గౌరి లంకేశ్ .. అయ్యో !
అంత ధైర్యంగా బ్రతికిన మనిషి ..కాస్త జాగ్రత్త గా ఒక ఆయుధం పెట్టుకుని ఉంటే బ్రతికి బట్ట కట్టేదెమేననే ఆశ తొలుస్తూనే వుంది .. కనీసం ఒక మృగాన్నైనా మట్టు పెట్టగలిగి ఉండేదేమో!

నూతన మానవుడికి కూడా ఆయుధం ఆశయమే కాదు అవసరం కూడానేమో !
గౌరి లంకేశ్ ...
చిద్విలాసంగా నువ్వు నవ్వే నవ్వు ..నీ ముఖం నిండా తొణికిసలాడే విశ్వాసం ..

నీ ధిక్కారం సరేసరి ..

రక్తం మడుగులో నిన్ను చూస్తే హృదయమంతా కకావికలం అయిపోయింది కన్నీళ్లు కుండపోతే అయ్యాయి .కానీ కన్నీటి తో పాటు కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ చిన్న 'సెగ' మంట ఎగదోస్తూనే వుంది ..

खामोश थोड़ वक्त आगये। .. మౌనాన్ని బద్దలు గొట్టాల్సిన సమయం వచ్చేసింది మిత్రమా ....