28, జూన్ 2023, బుధవారం

భీం ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై హత్యా ప్రయత్నాన్ని ఖండించండి ! 

హంతక ముఠా రాజకీయాలను ప్రతిఘటించండి !!


భారతదేశం లో ప్రస్తుతం ఆత్మగౌరవ దళిత రాజకీయాలకు ఒక గౌరవప్రదమైన చిరునామా ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు భీం ఆర్మీ .. దాని వ్యవస్థాపకులలో ఒకడు మరియు అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ . 

ఢిల్లీలో గత మూడు నెలలుగా అధికార పార్టీ మంత్రి బ్రిజభూషణ్ అరెస్ట్ కోరుతూ  ఒలింపిక్ విజేతలైన మహిళా మల్లయోధుల ఆందోళనకు మద్దత్తు ప్రకటించి వారితో కలిసి నడుస్తున్నందుకు ప్రభువులకు  కన్నెర్ర అయిందో ఏమో !

ఏకంగా తూపాకి తో కాల్చి చంపమని ఆదేశించారు .. 

ఒక సంవత్సరకాలం పాటు రైతు వ్యతిరేక మూడుచట్టాల రద్దు కోరుతూ దేశాన్ని ఊపేసిన రైతాంగ  ఉద్యమం లోనూ  ,ఆ తర్వాత  వచ్చిన జాతీయ పౌర సత్వం చట్టం వ్యతిరేక ఉద్యమం లోను భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ చాలా క్రియాశీలకంగా పాల్గొన్నాడు . జైలు కు  కూడా వెళ్ళాడు . 

రైతుల ,ముస్లిం మైనారిటీల హక్కు ల కోసం నిలబడటం ఇప్పుడు పెద్ద నేరమై పోయింది మరి !

అది కూడా ఏలిన వారి కోపానికి కారణం అయి ఉండొచ్చు .. ఇక రాజు తలచుకొంటే హంతక ముఠాలు కరువా ?

గత తొమ్మిది ఏండ్లుగా దొంగ కేసులు ,హంతక ముఠాలే రాజ్యం ఏలుతున్నాయి . 

అనేక మంది మేధావులు ,రచయతలు ,హక్కుల కార్య కర్తలు కుట్రకేసుల్లో ఇరికించబడి జైళ్లల్లో మగ్గుతున్నారు . గౌరి లంకేశ్ లాంటి ఎందరో జర్నలిస్టులు ,కల్బుర్గి ,పన్సారే లాంటి మేధావులు హంతక ముఠాల చేతిలో ప్రాణాలు కోల్పోయారు . 

గాంధీ హంతకుడు గాడ్సే పూజలందుకుంటున్న కాలం ఇది .. 

2018 సంవత్సరం లో జాతీయ భద్రతా  చట్టం కింద  చంద్రశేఖర్ ఆజాద్ ని అరెస్ట్ చేసి జైలు లో పెట్టింది  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం . ఈ అరెస్ట్ రాజకీయ దురుద్దేశం తో జరిగిందని భావించి అలహాబాద్ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది . ఆ తర్వాత కూడా అనేక సార్లు నిర్బంధించ బడ్డాడు . 

పేరుకు మాత్రమే  భీం ఆర్మీ కానీ పోరాటం మొత్తం గాంధీ మార్గం . ఆందోళన హింసాత్మకం అయితే  అది శత్రువుకే లాభిస్తుంది . మనల్ని శత్రువు హింసామార్గం లోకి నెట్టాలనే చూస్తాడు . అప్పుడు వాడికి మనల్ని 'ఎలిమినేట్ 'చెయ్యడం ఈజీ అవుతుంది . అందుకే మనం శాంతియుతంగా ,రాజ్యాంగ బద్దంగా ఉద్యమం చెయ్యడం అవసరం అని భీం ఆర్మీ నొక్కి చెబుతుంది . అందుకే తన మీద దాడి తర్వాత కూడా అదే విషయాన్ని ప్రజలకు విజ్ఞప్తి చేసాడు 

ఆ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ నిజాయితీగా ,నిబద్ధతగా నిలబడడం మతోన్మాద రాజకీయాలకు  కంటగింపు అయింది . 

తేదీ 28.06. 2023 న ఉత్తరప్రదేశ్ ,సహారన పూర్  లో ఆయనపై కాల్పులకు తెగబడ్డారు . నాలుగు రౌండ్లు కాల్చారని పోలీసులు తేల్చారు . ఒక బుల్లెట్టు వీపులో దిగింది . మరో బుల్లెట్టు పక్కటెముకలను గాయపరిచింది . 

ప్రాణాపాయం తప్పింది . అయితే ప్రజాస్వామ్యానికి తల్లి వంటి దేశమని ప్రపంచ దేశాల్లో చెప్పుకుంటున్న పాలకులు ఇలాంటి హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు కాస్త సిగ్గు పడాలి . ఒక విశ్వాస ప్రకటన చేయాలి .  

అన్ని ప్రజాస్వామ్య ఉద్యమాలపై జరుగుతున్న దాడుల్లో భాగమే చంద్ర శేఖర్ ఆజాద్ పై దాడి . 

ఉత్తరప్రదేశ్ లో మానవ హక్కుల్ని కాలరాస్తూ బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది . ఎన్కౌంటర్ హత్యలు ,పోలీసు కస్టడీ లో మరణాలు ,హంతక ముఠాల దాడులు చట్టబద్ధ పాలనను అపహాస్యం చేస్తున్నాయి . 

దేశం లో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే ముందు ఈ హాంతక ముఠాలను పట్టుకొని ,చట్టబద్ధంగా  శిక్షించాలనే  డిమాండ్ చేద్దాం . 

పౌర హక్కుల సంఘం ,తెలంగాణ ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి