13, జనవరి 2024, శనివారం

manipur24

మణి పూర్ లో ఏమి జరిగింది.. ఎందుకు జరిగింది... ఇంకా ఒక యుద్ద వాతావరణం ఎందుకు నెలకొని వుంది... ఈ విషయాల పట్ల సామాజిక స్పృహా కలిగిన వర్గాలకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి వుంటుంది...

 అయితే నేను  చెప్పబోయే విషయాలు కొన్ని కొత్తగా    వుంటాయి..ఎందుకంటే  కొందరి మిత్రుల తో కలిసి నేను మణిపూర్ వెళ్లి వచ్చాను.. బాధితులతో కలిసి మాట్లాడాను..
'గ్రౌండ్ రియాలిటీస్' అంటారు కదా !కళ్ల తో చూసిన వాస్తవాలు.
శరణార్థి శిబిరాల లో  మనలాంటి వారి సహాయ సహకారాల కోసం వారు పడే తాపత్రయం నన్ను కదిలించి వేసింది..
అది మతమో ..మత మౌఢ్యమో.. ఏదైనా అనుకోండి.. కాని దేశం నలుమూలల నుండి క్రిస్టియన్ సంస్థలు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు..
ప్రభుత్వాలు చేయవలిసిన పనిని ప్రజా సమూహాలు చేస్తున్నాయి..
 ఈ సానుభూతి,సహానుబూతి వల్ల బాధితులకు ఈ రోజు గడిచిపోతుంది.. లేదా కొన్ని నెలలు నెట్టుకు రావచ్చు..
కాని.. భవిష్యత్తు మాటేమిటి?పిల్లలకు ఏమి దారి చూపిస్తాం.. ఎన్నాళ్ళు ఇలా ఆకాశం వేపు చూస్తాం. ..నా కాళ్ళ కింద నేలకు ఎందుకు రెక్కలు వచ్చాయి...
ఈ సంఘీభావ గాలిలో ఎంత కాలం బ్రతుకుతాము..

అన్నీ ప్రశ్నలే... సమాధానం దొరకని ప్రశ్నలు..
మేము నలుగురం... యాత్రికుల్లా వెళ్ళాం.. మా దగ్గర అదనంగా ఏమీ లేదు వారికి పంచటానికి..
కాసిన్ని స్వాంతన వచనాలు.. కొన్ని కన్నీటి చుక్కలు తప్ప .. 

మేము రచయితలం..మీగురుంచి రాస్తాము.. మీ బాధల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం... మీ వెంట మేమే కాదు మొత్తం ప్రపంచాన్ని నిలబెడతాం...
మాటలేగా.. హృదయపూర్వకంగానే చెప్పాము... 
అసలు పని ఇప్పుడే మొదలవుతుంది..
మా యాత్రానుభవాలు మిమ్మల్ని ఎంతగా కదిలిస్తాయో చూడాలి.. మీ స్పందన కోసం మణిపూర్ ఎదురు చూస్తూనే వుంటుంది..
మణిపూర్ లో గొడవలు మొదలైన మూడు నెలలకు అంటే ఎండా కాలం లో అక్కడికి వెళ్ళాం.. అంత ఎండల్లోనూ మణిపూర్ చాలా పచ్చ పచ్చగా వుంది..
మణి పూర్ రాజధాని ఇంపాల్  ఉద్రిక్తంగా ఉందని  పక్క రాష్ట్రం నాగాలాండ్ ద్వారా మణి పూర్ లోని కాంగోపి జిల్లా కేంద్రానికి చేరుకున్నాం..
నాగాలాండ్ ...భారత దేశం లో ఇంగ్లీష్ లో పిలవబడే ఒకే ఒక్క  రాష్ట్రం ఇదే... నాగాల భూమి..నాగా లాండ్.
దీని రాజధాని కొహిమా... కొహిమా అంటే ఒక ప్రత్యేక మైన పువ్వు.. ఈ కొండ ప్రాంతాల్లో నే పూస్తుందంట...
కొహిమా కొండప్రాంతం కావటం వల్ల ఇక్కడ విమానాశ్రయం లేదు.. మైదాన ప్రాంతమైన దిమాపూర్ లో విమానం దిగి అక్కడ నుండి మణిపూర్ కి వెహికిల్ లో వెళ్ళాం.
దిమాపూర్ లో మా ముగ్గురికి   మరో నలుగురు మిత్రులు తోడయ్యారు..
అందులో బిషప్ ఒకరు.. ఆయనే మా టీం లీడర్.. తెలుగు వాడు.. హైదరాబాద్ వాస్తవ్యులు కూడా..
ఇంకో ముఖ్యమైన వ్యకి  'రింగ్ వార్'.ఇది మేము కంఫర్ట్ గా పిలుచుకునే పేరు..  ఆమె  అసలు పేరు మనకి పలకడానికి  కొంచెం కష్టంగానే ఉంటుంది...
కాని ఒక అద్భుతమైన మైన మనిషి ఆవిడ...
దిమపూర్ లో దిగిన రోజు సాయంత్రం ఆమె ఇంటికి 'టీ' కి వెళ్ళాం... ఎంత ఆప్యాయంగా మర్యాద చేసిందో..! 
ఇంత దూరం వచ్చినందుకు ఒక మంచి హృదయం ఉన్న మనిషి ని కలుసుకోగలిగాం ..అని అనిపించింది..
కోవిడ్ పీడిత  కాలం లో చిన్న వయసు లోనే తన భర్త ను కోల్పోయింది.. తన భర్త ఫోటో చూపించి... మై  హ్యాండ్సమ్  హస్బెండ్  ..అని భలేగా నవ్వేసింది..
మాకోసం వెహికిల్ ఆమే మాట్లాడి పెట్టింది.. మాతో పాటు కలిసి మాణిపూర్ కి వచ్చింది... ఆమె రావడం వల్ల మాకు మణిపూర్ ఏదో సొంత ఊరు లాగా అయింది..
దారిపొడుగునా మాకు తెలిసిన పాత మనిషి లా కలిసిపోయింది...
ఆమె ద్వారానే మణి పూర్ మాకు మరింత బాగా అర్థమైంది...

తను  కుకీ .. నాగాలాండ్ లోని ఈ దిమాపూర్ లో ఉంటోంది .. మే 3 ,2023 న జరిగిన దారుణాలు తర్వాత ఎంతో మంది కుకీలకు ,మరెంతో మంది మైతేలకు తన ఇంట్లోనే ఆశ్రయం  కల్పించింది.  .. తాను వొట్టి ఆశ్రయాన్నే కాదు వారికి ఒక జీవితకాలం బ్రతకగలిగే ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తుంది .. 

ఇలా దారి పొడుగునా ఇలా  ఎందరో మనుషులు మణిపూర్ గాయాలను గుండెకు హత్తుకున్నవారు .. 

మరి ఎవరు ఈ రావణ కాష్టాన్ని రగిలిస్తున్నది .. ఈ రోజుకు..  అంటే 2024 కు ఇంకా హత్యాకాండ జరుగుతూనే వుంది .. 

ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ఈ సారి మణిపూర్ నుంచే తన రెండో భారత్ జోడో  యాత్ర ని ప్రారంభించాడు .. అధికార పక్షాలు .. కేంద్రం తో సహా (డబల్ ఇంజిన్ సర్కారు) ఒక పక్షం  కొమ్ము కాస్తూ కొండ ప్రాతాల కుకీలపై దాడికి పరోక్ష మద్దత్తు ఇస్తున్నారు . 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి