పౌరహక్కుల బాల గో పాల్ కు ఒక బొగ్గు మనిషి పరిచయం -మునీర్
**************************************************
ఆంధ్ర దేశం లో పౌరహక్కుల ఉద్యమానికి ఒక చిరస్ధాయి చిరునామా బాలగోపాల్.అటువంటి మనిషి అర్ధాంతరంగా అనారోగ్యము తో మరణించినప్పటికీ అతని సేవలను సింగరేణి కార్మికులు ఎప్పటికి మర్చిపోలేరు .ఆ మహానుభావునికి కోల్ బెల్ట్ లో వెన్నుదన్నుగా నిలబడ్డ వారు ఎవరంటే మునీర్ పేరే ముందు వరుస లో ఉంటుంది .
ఒక బలమైన పౌర హక్కుల ఉద్యమం సింగరేణి ప్రాంతం లో నిలదొక్కుకోవటానికి బాలగోపాల్ కృషి ఎంతో విలువైనది . అదే సమయం లో బాలగోపాల్ వ్యక్తిత్వం ,మనుషుల పట్ల ప్రేమ మునీర్ ని కదిలించింది . దాంతో అందరు భయపడ్డా ,తనని భయపెట్టినా .. అన్నింటికీ మునీర్ సిద్ధపడ్డాడు.
మునీర్ రాసుకున్న మాటల్లోనే ...
సాదా సీదాగా ఉన్న బాలగోపాల్ ను చూసి నేను మొదట ఆశర్య పోయాను . అప్పటికే దేశ వ్యాప్తంగా ఆయన కున్న పేరుకు ,ఆయన వేష ధారణకు అస్సలు సంభందం లేదు . ఒకరికి ఒకరు పరిచయాలు అయిన తర్వాత ఆయన సూటిగా తాను వచ్చిన పని ఏమిటో చెప్పుకొచ్చిండు .
"కోల్ బెల్ట్ ప్రాంతం లో పోలీసులు కిడ్నాప్ చేసిన పాల్గుణ,కుమార్,సమ్మయ్య మరియు రవి ల విషయమై పౌర హక్కుల సంఘం తరుపున విచారణ చేయటానికి వచ్చాను . ఈ విచారణ లో మీరు మాకు సహకరిస్తారనే ఉద్దేశ్యం తో వచ్చాను .. మీరు కాదనుకుంటే స్పష్టంగా తెలియ చేయవచ్చు .. ఇందులో మొహమాటాలకు తావు లేదు . . 'అన్నాడు సూటిగా
బాలగోపాల్ మాటల్లో నాన్చుడు వ్యవహారం ఉండదు .. ఏదైనా దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం ..
నేను ఒక్క క్షణం తటపటాయించాను . కానీ అంతటి వ్యక్తి వచ్చి అణిచివేతకు , అన్యాయానికి గురయ్యే ప్రజల తరపున నేను ఉన్నాను అంటుంటే నేను నిలబడక పోవటం భావ్యం కాద నిపించింది .
ఆయనే మళ్ళీ "మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మానుకోవచ్చు . ఇందులో బలవంతం ఏమి లేదు "
"అబ్బె !అటువంటిది ఎం లేదు సార్ .. మీరు మాకోసం వచ్చినప్పుడు మీకు సహకరించకపోవడం
అన్యాయం అవుతుంది "
అట్లా మొదలైన బాలగోపాల్ పరిచయం అటు తరువాత ఈ ప్రాంతం లో చాలా ఎన్కౌంటర్ ల పై నిజనిర్ధారణ కు వచ్చినప్పుడు ఆయన నేరుగా మునీర్ ఇంటికే వచ్చేసే వాడు . అలా తరచుగా రావడ తో బాలగోపాల్ ఆ ఇంట్లో ఒకడుగా కలిసిపోయాడు .
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ (టి ) ప్రాంతం లో ఒకసారి ఎన్కౌంటర్ జరిగితే నిజనిర్ధారణ కు బాలగోపాల్ వచ్చాడు .
మునీర్ తో కలిసి మందమర్రి నుంచి కాగజ్ నగర్ వరకు బస్సు లో వెళ్లారు . అక్కడి నుండి ఎన్కౌంటర్ స్థలం బె జ్జుర్ కి దూరం దాదాపు 15 కిలోమీటర్లు . ఆ మార్గం లో వాహనాల సౌకర్యం లేదు .అక్కడికి చేరుకోవాలంటే సైకిల్ ఒక్కటే దిక్కు . చివరికి సైకిల్ మీదే బాలగోపాల్ అక్కడికి వెళ్ళాడు .
ఆ ఎన్కౌంటర్ లో చనిపోయింది కోల్ బెల్ట్ ప్రాంతం లోప్రముఖ ప్రజాగాయకుడుగా పేరున్న
సుధ (సుందిళ్ల ధర్మన్న )సొంత తమ్ముడు . ఆదిలాబాద్ రైతాంగ పోరాటం లో ఎదిగివచ్చిన అతన్ని ,ఇన్ ఫార్మర్ ఇచ్చిన సమాచారం తో పోలీసులు అతను ఉన్న ఇంటిని చుట్టుముట్టి ,లొంగ దీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎన్కౌంటర్ పేర కాల్చి చంపారు .
నిజనిర్ధారణ లో బాలగోపాల్ ది ఒక విశిష్టమైన విచారణా పద్దతి .. చాలా సాదా సీదా గా ,సూటిగా ప్రజల స్థాయి కి వెళ్లి మాట్లాడుతాడు . ఎక్కడా అతి ఉండదు . ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా మనసు విప్పి మాట్లాడవలిసిందే ..
ఆయన మనుషుల్ని చాలా ప్రేమించేవాడు ..
"ఇలా మనుషులందరినీ చంపుకుంటూ పోతే సమాజం ఏమి కావాలి ?
అందులో ప్రజలను రక్షించాల్సిన రాజ్యమే ఇట్లా అమానుషా లకు తెగబడితే ఎలా?
ఈ విధంగా మనుషులని పట్టుకొని చంపడం భారత్ రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం .. అనేవాడు
నేరం చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి తప్ప ఎన్కౌంటర్ లు ప్రజాస్వామ్యం కాదు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి