10, డిసెంబర్ 2013, మంగళవారం

మార్నింగ్ వాక్

మార్నింగ్ వాక్ 


ఉదయాన్ని అచ్చంగా 
ముద్దేట్టుకోవాలనే 
బయలుదేరినట్లు 
చాలా శుభ్రంగా బయట పడతాను . 

అది నా ఊరు కాని ఊరు 
మనకెవరు తెలీదు 
తిని కూర్చుంటే ఉన్న కాస్త ఆరోగ్యం 
సంక నాకిపోతుందని  ఈ మార్నింగ్ వాక్ మరి !

ఎ మాటకి ఆమాటే చెప్పుకోవాలి 
ఈ వాక్ అంటే నాకు మిలటరీ యే గుర్తుకొస్తుంది . 
అందుకే ఆ ఫోబియా ని వదిలిన్చుకోనేందుకు 
మొదట్లోనే టీ కొట్టు దగ్గర నిలబడిపోతాను 

ఒక వితౌట్ షుగర్ టీ చెప్పేస్తాను 
మీకు తెలియక పోవచ్చు గానీ .. 
అలా ప్రత్యేకం టీ చేయున్చుకోవడం లో 
వుండే ఆనందం చాలా ప్రత్యేకం సుమీ !

చలికాలంలో మన ఇంజిన్ వేడి కోసం 
వేడివేడి టీ ని మించింది ఏముంటుంది చెప్పండి మీరే !
ఈ టీ పేరు మీద మిలటరీ జీవిత కాలంలో
 ఒక పావు గంట ఆట విడుపు 

గత వారం గా అలవాటైన 
టీ బంకు అన్నయ్య 
మనల్ని అల్లంత దూరంలోనే గుర్తు పట్టి 
గిన్నెలో ఫ్రెష్ గా ఓ చిన్ని గ్లాసెడు పాలు పోసేస్తాడు 

మన నెత్తి మీదే కుండెడు పాలు గుమ్మరించిన 
ఆనందం మనకు ఫ్రీ 
అలా మనకోసమే షుగర్ లేకుండా టీ పెట్టీ 
తనకు తెలియకుండానే మన ఆరోగ్యం లో పాలుపంచుకుంటాడు 

అరవింద్ కేజ్రివాల్ గురుంచి అతను కంగారు పడతాడు 
ఫక్కా ఆమ్ ఆద్మీ లా 
మళ్ళీ ఎలక్షన్  అంటే ఖర్చే కదా అని 
తన గల్లా పెట్టె  ను జాలిగా చూస్తాడు 

టీ ప్రత్యేకంగా పెట్టినా అదే రేట్ 
అతని మానవత్వానికి  మనుసులోనే ముచ్చట పడి 
ప్రధాని అభ్యర్థి గా ఇతన్ని ఎందుకు నిలబెట్ట కూడదోననిపించి 
నాలో నేనే నవ్వుకుంటూ నడకలోకి ప్రవహిస్తాను 

పడవ లాగ రోడ్డు నన్ను తనలోకి లాక్కుంటుంది 
మంచు తెరచాపల్ని తొలగించుకుంటూ సూర్యకిరణాలు 
నా వంటి మీదే వాలిపోతాయి ,వల్ల మాలిన  ప్రేమ తో
గీతాంజలి సినిమాలో నాగార్జున లా వెలుగు కౌగిలి లో బందీ అవుతాను... 

రోజూ ఉదయం ఇదే కథ .. 
ఇంకేముంటుంది ?
కథ కంచి కి 
మనమింటికీ ...  


 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి