పుస్తక సమీక్ష
"చెరిగిపోతున్న చివరి సరిహద్దులు"
-ఆరతీ కుమార్ రావ్
పర్యావరణ ప్రేమికులకు గొప్ప యాత్రానుభవం ..ఈ పుస్తకం.
ముందుగా ఇదొక అల్లిక ..అంటూ రెండు అద్భుతమైన వాక్యాలు
మొదట్లోనే మనల్ని కట్టిపడేస్తాయి.
"ఏమి చెయ్యాలో ఇక దిక్కు తోచనప్పుడు
మన అసలు కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది."
"ఏ దిక్కుకు వెళ్ళడానికి ఇక తోచనప్పుడు
మన అసలు ప్రయాణం మొదలవుతుంది"
ఇక రచయిత్రి ఆరతీ కుమార్ రావ్ వేసుకున్న ఒకే ఒక ప్రశ్న
మనం ఎప్పుడైనా వేసుకుంటే ...మనమూ ఇలాగే పుస్తకాల కెక్కుతామెమో!
"నువ్వు చెయ్యగలిగినది మాత్రమే చేస్తుండడం ఆపి, నువ్వు నిజంగా చేయాలనుకున్నది ఎప్పుడు చేస్తావు?"
ఆరతి కుమార్ రావ్ ఈ పుస్తకం ద్వారా భారతదేశపు పర్యావరణం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకర పరిస్థితులను గురించి చర్చించడంతో పాటు సాంప్రదాయ విజ్ఞానాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ దాని సాయంతో పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న గ్రామీణ భారతం గురించి చెప్తుంది. వాళ్ళు చెప్పేది ఈమె విన్నంత శ్రద్ధగా మనం వింటే మిగిలిన కొద్ది జీవావరణ వ్యవస్థలనైనా కాపాడుకునే అవకాశం ఉంటుందని ఒక ప్రముఖ పాత్రికేయుడు పాల్ సెలో పెక్ అంటాడు.
#
ఈ పుస్తకం తెలుగు అనువాదకులు తల్లావజ్ఞుల పతంజలి శాస్త్రి గారు తన ముందు మాట లో మనిషి సాధిస్తున్న శాస్త్ర ప్రగతి ని "గెలుపు వంటి ఓటమి"అని ప్రకటించారు.
"మన పూర్వజులు జీవావరణ వ్యవస్థల్ని గమనించి, వారున్న భూ స్వభావాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా తమ జీవన విధానాల్ని నిర్మించుకుని ఈ ప్రాణికోటిలో తాము కూడా ఒక భాగమనే వినమ్ర భావంతో జీవించారు. ఇతర జీవరాశుల కంటే తాము ముఖ్యమని గానీ, ఉన్నతులమని అనుకోలేదు. ఇది మన ప్రాచీనుల నైతికత, ఇటువంటి నీతి అభివృద్ధికి ఆటంకమనుకునే ప్రబలమైన అజ్ఞానం ఇవాళ అనేక ప్రభుత్వాల్ని నడిపిస్తోంది. ప్రాచీనులు జీవించినట్టు మనం జీవించలేం. కానీ వారి నైతిక స్పృహతో జీవించినప్పుడు స్వార్ధపూరితమైన విధ్వంసం జరగదు."
ఇందులో వినమ్ర భావం, ప్రాచీనుల నైతికత..అనే మాటలు కాస్త గుచ్చుకుంటాయి.
ఈ విషయం పట్ల మన అవగాహన మరింతగా పెంచుకోవాలి అనిపిస్తుంది.
ఇది చూడండి.
"మానవ జ్ఞానపు లక్ష్యమైన ప్రకృతి మారుతూ ఉండే ప్రకృతే, మానవ జాతి, కనీసం మార్క్సిజాన్ని అర్ధంచేసుకున్న భాగం, ప్రకృతికి గల ఈ లక్షణాన్ని అర్ధం చేసుకున్నారు. ప్రకృతి. చలససూత్రాల వివరాలను అర్థం చేసుకునే క్రమంలో ఉన్నారు. ఈ అర్ధంచేసుకునే క్రమంలోనే మనిషికీ ప్రకృతికీ వైరుధ్యం తలెత్తుతుంది.
"పర్యావరణంలోని రెండవ అంశం- మనిషికీ ప్రకృతికీ మధ్య వైరుధ్యం. మార్క్సిజం అవగాహన ప్రకారం, మనిషి అవతరణ, ఈ క్రమంలో అంటే మనిషికీ ప్రకృతికీ మధ్య వైరుధ్య క్రమంలో భాగమే. ప్రకృతిలో ఒక భాగమైన మనిషి ప్రకృతితో పోరాడుతూ, ప్రకృతి వల్ల పరిమితమవుతూ ప్రకృతితో ఐక్యమవుతాడు. ఈ ఐక్యత-ఘర్షణల 'గతితర్కమే పర్యావరణ సమస్యను అర్థం చేసుకోడంలో ప్రధానమైన విషయం. ఉత్పిత్తి శక్తుల అభివృద్ధిలో ప్రతి దశా 'ప్రకృతి'ని 'మార్చిన' దశే. స్థిర వ్యవసాయం, పశువుల పెంపకం, నీటిపారుదల, చెరువుల తవ్వకం, వివిధ ఖనిజాల వాడకం ఈ క్రమంలో ప్రతి ఒక్కదానిలోనూ ప్రకృతి మార్చబడింది. అయితే ప్రకృతి విధించిన పరిమితులలోపే ఈ మార్పులు జరిగాయి. ప్రకృతి, పర్యావరణం ఆ మేరకే మారుతూ వచ్చాయి. కనుక ప్రకృతిలో మార్పులకు ఈ రెండు క్రమాలు ఉన్నాయి. ఒకటి-తన సొంత గతితర్కం, రెండు- మనిషి-ప్రకృతి పరస్పర సంబంధపు గతితర్కం. ప్రకృతి మార్పు క్రమం పెట్టుబడిదారీ దశలో విపరీతమైపోయినట్టు కనబడుతుంది. అది సహజమే కూడ. ఎందుకంటే ఈ దశలోనే ఉత్పత్తి శక్తులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రకృతిలో జరిగిన మార్పులు విస్తృత స్థాయిలో జరిగాయి. కాని ఇంతకు ముందరి యుగాలలోలాగ కాక, పెట్టుబడిదారీ యుగానికి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. మనం పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడేటప్పుడు ఈ విశిష్టతలను దృష్టిలో ఉంచుకోవాలి."
(ఆర్. ఎస్. రావు...కొత్త చూపు పుస్తకం.పేజీ 108 )
ఇంకా ముందు మాటలోనే ఒక సెటైర్ . అది..
ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నేడు దేశ ప్రేమికుల స్థానంలో అభివృద్ధి కాముకులు.. అనే కొత్త రాజకీయ నాయకుల జాతి ఒకటి పుట్టుకొచ్చింది.
అలాగే చెట్లు నాటించే కార్యక్రమం రాజయకీయ నాయకులకు ఎందు కిష్టమో భలే చెబుతాడు. అది.. తెలివిగా చేస్తన్న పర్యావరణ విద్వంసానికి బలహీన మైన పచ్చటి ప్రత్యామ్నాయం.
పుస్తకం లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రచయిత్రి ప్రయాణ అన్వేషణలో మనం కనీసం పాఠకులమైతే చాలు.
ఈ పుస్తకం.. ఛాయా సంస్థ ప్రచురణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి