సందిగ్ద సందర్భాలకు సూటియైన సమాధానం
" కార్ల్ మార్క్స్
ఆర్ధిక ,తాత్విక రాత ప్రతులు
1844"
**********
ఇది తెలుగు లో ఇటీవల మార్క్స్ రచనల మీద కొత్తగా వచ్చిన పుస్తకం.
దీన్ని స్థూలంగా మీకోసం పరిచయం చేయడమే నా పని గా భావిస్తూ ఈ నాలుగు మాటలు .
Economic and Philosophic Manuscripts (EPM) of 1844 అనే ఆంగ్ల గ్రంథానికి అనువాదం ఈ పుస్తకం . 1844 లో అంటే దాదాపు నూటా ఎనభై సంవత్సరాల క్రితం పారిస్ లో మార్క్స్ తన విస్తృత అధ్యయనాల క్రమం లో రాసుకున్న నోట్సు ఈ పుస్తకానికి ఆధారం . మార్క్స్ తొలి రచనలలో ఇది ఒకటి అయనప్పటికీ ,మార్క్ సాధించిన అసాధారణ మేధో విజయాల తొలిబీజాలు ఇందులో మనకి కనిపిస్తాయి . మార్క్సిస్టు మూల గ్రంథాలలో కమ్యూనిస్టు మేనిఫెస్టో,పెట్టుబడి తర్వాత దాదాపు అంతటి ఆసక్తిని ,చర్చని ఈ రాత ప్రతులు రేకెత్తించాయి .
పెట్టుబడి దారి సమాజం మనిషికి ,మనిషికి మధ్య సష్టించిన పరాయికరణను అధిగమించి ,మానవ విముక్తిని సాధించడం ఈ పుస్తకం లోని మౌలిక ప్రతిపాదన . మార్క్స్ యావత్ కృషిలో ఈ స్ఫూర్తి కొనసాగింది .
మార్క్స్ స్ఫూర్తిని మనం మరో సారి చర్చించుకోవడానికి ఈ పుస్తకం ఒక సందర్భం కావాలనేది
పుస్తక ప్రచురణ కర్తలు అయిన సమీక్ష మిత్రబృందం వారి కోరిక . పుస్తకము చివరి అట్ట మీద చివరన రాసిన ఈ మాటలతో నాకూ పూర్తి ఏకీభావం వుంది .
బహుశా ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది .
ఇక పుస్తక రచయిత కార్ల్ మార్క్స్ నేపథ్యం లోకి కాస్త తొంగి చూద్దాము .
18 వ శతాబ్దం లో తత్వశాస్త్రం సామాజికంగా ప్రగతిశీల పాత్ర పోషించింది .ఈ విషయం గురుంచి మరింత వివరంగా తెలుసుకోవాలంటే మనం ఫ్రాన్స్ వైపు దృష్టి సారించాలి . తమ తమ సామాజిక వర్గాలకు మార్గదర్శనం చేసిన గొప్ప మేధావులు ,దార్శనికులు కనిపిస్తారక్కడ !
ఆ తర్వాత తత్వశాస్త్రం లో వచ్చిన మలుపులు తెలుసుకోవాలంటే మనం జర్మనీకి వెళ్లాల్సిందే !
ఫ్రెంచ్ విప్లవ ప్రభావం తో జర్మన్ భూస్వామ్య ఆలోచనలలో పెద్ద మార్పు వచ్చింది . మేధావులు కాలం చెల్లిన తాత్విక ధోరణులను ప్రశ్నించారు . అప్పుడు హెగల్ అనే తత్వవేత్త రచనలు అక్కడ భూకంపం పుట్టించాయి .
హెగెల్ మరణం తర్వాత బెర్లిన్ (జర్మనీ ) యూనివర్సిటీ లో తత్వ శాస్త్రం అభ్యసించాడొక యువకుడు . అతడి పేరే కార్ల్ మార్క్స్ . కొంతకాలం సైద్ధాంతిక ఘర్షణ ద్వారా హెగిలియన్ గా మారాడు. కానీ హెగెల్ భావవాదాన్ని అంగీకరించలేకపోయాడు. జర్మనీ లో అప్పుడున్న వాస్తవ పరిస్థితులకు ,చట్టబద్దమైన రాచరిక పాలనకు పొంతన కుదరలేదు .
రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత ఆయనెప్పుడూ పీడితులు ,బాధితులు ,దోపిడీకి గురైన వాళ్ళ పక్షమే వహించాడు . ఈ కారణం వల్లనే పోలీసులాయన వెంటపడ్డారు . చివరికి దేశాంతరవాసం తప్పలేదు . ఇంగ్లాండ్ లో నివసిస్తున్న మరో జర్మనీ విద్యార్ధి ఏంగెల్స్ తో పరిచయం ఐంది . ఏంగె ల్స్ తో కలిసి మార్క్స్ ఒక నూతన విప్లవాత్మకమైన తాత్విక ధోరణిని ఆవిష్కరించాడు .
అదే గతి తార్కిక భౌతిక వాదం.
మార్క్స్ భౌతిక వాది గా మారటానికి సహాయం చేసిన తత్వవేత్త లుద్విగ్ ఫూర్బ్యాక్ . ఇతను హెగెల్ భావవాదం మీద తిరుగుబాటు చేసాడు. కానీ హెగెల్ భావవాదంతో పాటు అతని గతితార్కికతను కూడా నిరాకరించడం తప్పని మార్క్స్ గ్రహించాడు . నిజానికి హెగెల్ భావవాదాన్ని భౌతిక వాద దృక్పథం తో మార్చవలిసి వుంది . అలాగే భౌతిక వాది ఐన లుద్విగ్ ఫూర్బ్యాక్ పరిమితులను అర్థం చేసుకొని మార్క్స్ రాసుకున్న నోట్స్ .. ఈ పుస్తకం .
తత్వ శాస్త్రం అర్థవంతంగా ఉండాలంటే అది మనుషుల వాస్తవ జీవితాలకు ,అవసరాలకు సంబంధించినదై ఉండాలి . ప్రకృతి, సమాజం గురుంచి శాస్తీయ అవగాహన వల్ల మాత్రమే వాళ్ళ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అనుకున్నాడు మార్క్స్ . ఈ దిశగా పయనానికి తత్వ శాస్త్రాన్ని మార్క్స్ భూమార్గం పట్టించాడు . దానికి పునాదులు వేసినవే ఈ రాత ప్రతులు .
పెట్టుబడి దారి
విధానపు సహజ లక్షణాల గురుంచి అత్యంత సమర్థవంతంగాను ,శాస్త్రీయంగాను విశ్లేషించి ,విమర్శించిన మేధావి కార్ల్ మార్క్స్ . ఈ పుస్తకం
మార్క్స్ రాసుకున్న నోట్స్ కాబట్టి అన్ని పేజీలు మనమూ ' అండర్లైన్' చేసుకునేవిగానే
ఉంటాయి . ఆ విషయాలన్నీ పుస్తకం చదివితే మీకూ అర్థం అవుతాయి . అయితే పుస్తకం
మొత్తం చదవటం ముగించిన తర్వాత మార్క్స్ పట్ల నాకు ఇష్టమైన విషయం ఏమిటని ఒక ప్రశ్న
వేసుకున్నాను .దానికి నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే ..
ప్రశ్నకు ఒక నూతన రూపం ఇవ్వడం లోనే దాని పరిష్కారం అంతర్నిహితంగా ఇమిడి ఉందన్న .. మార్క్స్ సూత్రీకరణ .
ఆ విషయాన్ని మార్క్స్ ఎలా వివరించాడో చూడండి !
సొంత ఆస్తికి మూలం ఏమిటి .. ?అనే ప్రశ్నను మానవాళి అభివృద్ధి క్రమం లో పరాయీకరించబడిన శ్రమ
కి ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నగా మార్చడం ద్వారా ఈ సమస్య పరిష్కార దిశగా మనం చాలా
పురోగమించాము . ఎందుకంటే సొంత ఆస్తి గురుంచి మాట్లాడేటప్పుడు మనుషులకు బయట వుండే
విషయం లో వ్యవహరిస్తున్నట్లు భావిస్తాము . అదే శ్రమ గురుంచి మాట్లాడేటప్పుడు ప్రత్యక్షంగా మనిషి
తో వ్యవహరిస్తున్నట్లు భావిస్తాము . ప్రశ్నకు ఇలా నూతన రూపం ఇవ్వడం లోనే దాని
పరిష్కారం అంతర్నిహితంగా ఇమిడి ఉంది .
పరాయీకరణ గురుంచి మనకు సింపుల్ గా అర్థం కావటానికి ప్రచురణ కర్తలు మా మాట లో ఒక మంచి గేయాన్ని పరిచయం చేశారు .
గేయం పేరు.. "ది మెన్ అఫ్ ఇంగ్లాండ్ "
నువ్వు పండించిన పంటను
వేరొకడు అనుభవిస్తాడు .
నువ్వు సృష్టించిన సంపదను
మరొకడు సొంతం చేసుకుంటాడు
నువ్వు నేసిన దుస్తులు
వేరొకడు ధరిస్తాడు
నువ్వు పోత పోసిన ఆయుధాలను
మరొకడు ఉపయోగిస్తాడు
పంటను పండించు కానీ
ఏ నియంతను అనుభవించనీయకు
సంపద సృష్టించు .. కానీ
ఏ మోసగాడి సొత్తు కానివ్వకు
దుస్తుల్ని నేత నెయ్యు .. కానీ
సోమరిపోతులను ధరించనివ్వకు
ఆయుధాలను తయారు చేయు .. కానీ
నీ రక్షణకై ఉపయోగించేందుకు ..
పరాయీకరణ గురుంచి ఇంత బాగా రాసిన రచయిత పేరు.. పెర్సీ బిసహి షెల్లీ
షెల్లీ గురుంచి మహాకవి శ్రీ శ్రీ తన మహా ప్రస్థానం లో ప్రస్తావించినట్టు గుర్తు .
ఇక ప్రశ్నకి సంబంధించి మార్క్స్ దేవుడి గురుంచి కొందరు అడిగే ప్రశ్న గురుంచి భలే చెబుతాడు .
మొట్టమొదట ఈ మనుషులను ,ప్రకృతిని ఎవరు సృష్టించారు ? మనము ఎదో భౌతిక వాద సమాధానం చెబితే దాన్ని ఎవరు పుట్టించారు ..అని భక్తులు నిలదీస్తారు . అది ఇక చెట్టు ముందా లేక విత్తు ముందా అనే ప్రశ్న లా ఎటూ తేలకుండా ముగిసిపోతుంది .
"ఈ ప్రశ్న నీలో ఎలా పుట్టిందో నిన్ను నీవే ప్రశ్నించుకో . నీ ప్రశ్న నేను సమాధానం ఇవ్వలేని ఒక అసంబద్ధమైన దృక్పథం నుండి పుట్టిందేమో !నిన్ను నువ్వు ప్రశ్నించుకో!
నీవు ప్రకృతి ,మానవుని సృష్టి గురుంచి ప్రశ్నిస్తే నువ్వు ప్రకృతిని ,మానవుని అమూర్తీకరిస్తున్నావు . నువ్వు వాటిని లేని వాటివిగా భావిస్తూ నన్ను రుజువు చేయమంటున్నావు . నా జవాబు ఏమిటంటే నీ
అమూర్తీకరణను వదిలి పెట్టు ! అదే సమయం లో నీ ప్రశ్నను కూడా వదిలేయ్ ! అలా కాదు నీ అమూర్తీకరణను కొనసాగించాలనుకుంటే నిలకడగా అదే మాట పై వుండు ! నీవు.. మనిషి ,ప్రకృతి ఉనికి లో లేవనుకున్నప్పుడు ,నీవు కూడా మనిషి ,ప్రకృతే కాబట్టి నువ్వు కూడా లేనట్లే భావించుకో !ఏమీ ఆలోచించకు ! నన్నేమి ప్రశ్నించకు ! ఎందుకంటే నువ్వు ఆలోచించిన వెంటనే ,ప్రశ్నించిన వెంటనే ప్రకృతి ,మానవుల ఉనికి నుండి నువ్వు చేసిన అమూర్తీకరణ అర్థం లేనిదిగా మారిపోతుంది .
మార్క్స్ తనను చారిత్రిక ఎరుక కలిగిన చింతకునిగా చూడాలని కోరుకున్నాడు . 1843 లో ఒక ఉత్తరం లో ఆయన "ఉనికి లో ఉన్నదానినంతా నిర్దాక్షిణ్యంగా విమర్శించాలి . ఈ నిర్దాక్షిణ్య విమర్శకు రెండు అర్థాలు ఉన్నాయి . ఈ విమర్శ తన సొంత నిర్ధారణలకు ఎటువంటి పరిస్థితుల్లో భయపడకూడదు . అలాగే ఉన్న శక్తులతో తలపడకుండా ఎప్పుడూ తప్పించుకోకూడదు .
మార్క్స్ వి పిడి సూత్రాలు కావు చలన సూత్రాలు
మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే .. అని మార్క్స్ అన్నాడని బాగా ప్రచారంలో ఉన్న ఒక ఉల్లేఖన . మానవ జాతికి సర్వత్రా వర్తించే ఈ బాపతు శాశ్వత పిడి సూత్రాలను మార్క్స్ చెప్పి ఉంటాడా అన్న సందేహమే రాదు మనకు .
కానీ మార్క్స్ చెప్పింది దీనికి సరిగ్గా విరుద్ధం . సొంత ఆస్తి ప్రాబల్యంలోనే మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా దిగజారిపోతాయి . మనిషికి ఇది అసహజం .నిజానికి మనిషిని మించిన నిస్వార్థ జీవి లేదు . కానీ ఈ సొంత ఆస్తి వ్యవస్థల్లో మనిషి తనకు తాను పరాయీకరణకు లోనవుతాడు . తన సహజమైన లక్షణాలను అన్నిటిని పోగొట్టుకుంటాడు . కాబట్టి సొంత ఆస్తి రద్దుతోటే మనిషి ఈ పరాయీకరణ నుండి బయట పడతాడని మార్క్స్ వివరిస్తాడు .
సామాజిక ప్రపంచం లో ,మనిషి మాత్రమే కొత్త క్రియాశల చరిత్ర నిర్మాత కాగలడు . అటువంటి ప్రాతిపదికపై సమాజానికి సంబంధించిన మనిషిగా పని చేయడానికి మార్క్స్ జీవితాంతం ఇష్టపడి కృషి చేసాడు . అటువంటి మనిషి పట్ల ఎటువంటి మినహాయుంపులు లేని విశ్వాసాన్ని ప్రకటించాడు . ఈ విశ్వాసానికి ఎటువంటి సహేతుక నిరూపణ ,సమర్ధన అవసరం లేదు . మనిషి తనకు తానే నిరూపణ ,సమర్ధన కూడా .
ఈ పుస్తకం చదివి నేను రాసుకున్న నోట్స్ బోలుడు .అందులో కొన్నిటిని మీకూ పరిచయం చేస్తాను .అంతకు మించి మార్క్స్ ని మీకు ఎలా అర్థం చేయుంచాలో నాకూ తోచడం లేదు . దానికి మరింత సాధన చేయాల్సి ఉంటుంమో ! అయితే ఇప్పటికీ అక్షర సత్యాలు గా నిలిచే కొన్ని మార్క్స్ నోట్స్ ను ఇక్కడ మళ్లీ వల్లె వేస్తాను . అవి ..
"పెట్టుబడి దారుడు లాభించిన ప్రతి సందర్భంలోను కార్మికుడు కూడా లబ్ది పొంది తీరుతాడని లేదు . కానీ పెట్టుబడి దారుడు నష్టపోయిన ప్రతిసారి కార్మికుడు ఖాయంగా నష్టపోతాడు . (మొదటి చాప్టర్ శ్రమకు వేతనాలు )
పెట్టుబడి దారులకు లా భాలు రెండు విధాలా సంక్రమిస్తాయి మొదటగా శ్రమ విభజన వల్ల లాభిస్తాడు . ఇక ప్రకృతిసిద్ధమైన పదార్థాన్ని తయారైన ఉత్పత్తిగా పరివర్తింప చేయడం లో మానవ శ్రమ సాధించిన పురోగతి వల్ల కూడా పెట్టుబడిదారుడు లాభిస్తాడు . (చాప్టర్ 2. పెట్టుబడి పై లాభం )
ప్రకృతి లోని ఉత్పాదక శక్తులనుంచి లబ్దిని పొందినప్పుడే అది అత్యుత్తమ పెట్టుబడి అవుతుంది .
(పేజీ నెంబర్ 138. )
దేశాలు ఉత్పత్తి ఖార్ఖానాలు తప్ప మరేవీ కావు . మనిషి .. వినియోగం ,ఉత్పత్తి చేతనైన యంత్రం మాత్రమే! జీవితం కూడా ఒక రకమైన పెట్టుబడే !ఈ ప్రపంచాన్ని ఆర్ధిక నియమాలు గుడ్డిగా పాలిస్తాయి . రికార్డో దృష్టిలో మనుషులకు ఎలాంటి విలువా లేదు. ఉత్పత్తే సర్వమునూ .. (రికార్డో పుస్తకం "భూమి కౌలు")
పెట్టుబడి చలన సూత్రాల మూలంగా చితికిపోతున్నవాళ్ళు ,వృద్ధి చెందుతున్న వాళ్ళు ఇద్దరూ భూయజమానుల్లో వుంటారు .ఫలితంగా ప్రభువు లేని భూమి ఉండదు అనే మధ్య యుగాల నాటి సామెత స్థానే డబ్బుకి యజమాని లేడు .. అనే సామెత వాడుకలోకి వస్తుంది . మానవాళిపై డబ్బు అనే నిర్జీవ పదార్థం నెరపుతున్న ఆధిపత్యాన్ని ఈ సామెత వ్యక్తీకరిస్తుంది . (పేజీ నెంబర్ 157 )
గుత్త స్వామ్యం ,పోటీ అనే రెండు రూపాల్లో కూడా పారిశ్రామిక రంగం స్వీయ వినాశనానికి గురైనట్లే ,భూ ఆస్థి కూడా ఈ రెండు మార్గాలలోను అభివృద్ధి సాధించి ఈ రెండిటి లో కూడా అనివార్య పతనాన్ని చవి చూసినప్పుడు ఈ రెండూ మనిషిని నమ్మడం నేర్చుకుంటాయి (పేజీ నెంబర్ 160 )
ధనికుల కోసం శ్రమ అద్భుతమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది .కానీ ,కార్మికుల కోసం మాత్రం లేమిని ఉత్పత్తి చేస్తుంది . అది ఒక వంక రాజభవనాలు నిర్మిస్తుంది :కార్మికుల కోసం మాత్రం పూరిగుడిసెలను నిర్మిస్తుంది . అందాన్ని సృజిస్తుంది . కానీ కార్మికుడికి వికృత రూపాన్ని మిగులుస్తుంది కార్మికుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెడుతుంది . కానీ ,అదే సమయంలో,కార్మికులలో ఒక శ్రేణిని అనాగరిక పని పద్ధతులలోకి నెట్టేస్తుంది . (పేజీ నెంబర్ 165 )
మనిషి (కార్మికుడు ) జంతువుల ప్రాథమికమైన విధాలైన తినడం ,త్రాగడం , పిల్లలను కనడం ,లేక నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడం ,వస్త్ర ధారణ లాంటివి నిర్వర్తించే సందర్భంగా మాత్రమే స్వేచ్చగాను ,క్రియాశీలంగా ను ఉన్నట్లు భావిస్తాడు . కానీ మనిషిగా తన విధులు నిర్వర్తించాల్సి వచ్చే సరికి అతను తనను తాను ఒక జంతువుగానే భావించుకుంటాడు . (పేజీ నెంబర్ 167 )
కార్మికుడు పెట్టుబడిని సృష్టిస్తాడు . పెట్టుబడి కార్మికున్ని సృష్టిస్తుంది . అంటే కార్మికుడు తనను తానే సృష్టించుకుంటున్నాడు .
పెట్టుబడి అస్త్త్వమే కార్మికుడి అస్తిత్వం .అదే అతని జీవితం. ఎందుకంటే ,పెట్టుబడి అతనితో నిమిత్తం లేకుండానే అతని జీవన క్రమాన్ని నిర్ణయిస్తుంది .(పేజీ నెంబర్ 179 )
భూమి జీవితానికి మూల వనరుగా ఉన్న సందర్భాలలో భూ సంపద ఒక నిజమైన రాజకీయ శక్తి గా గుర్తించబడేది . అలాగే గుర్రం ,ఖడ్గం నిజమైన జీవన సాధనాలుగా ఉన్న సందర్భాలలో అవి జీవితాన్ని నడిపించే నిజమైన రాజకీయ శక్తులుగా గుర్తించబడ్డాయి . మధ్య యుగాల్లో ఒక సామాజిక వర్గానికి కట్టి పట్టేందుకు అనుమతి లభించడం ,దాని విమోచనకి ప్రాతిపదిక అయ్యేది . సంచార జాతుల ప్రజల్లో గుర్రమే మనిషిని స్వేచ్ఛా జీవిగా ,సామాజిక జీవనం లో భాగస్వామి ని చేసేది . (పేజీ నెంబర్: 224 )
పోటీ అంటే బలవంతుడి మోసపూరితమైన హక్కు . పెట్టుబడి పై లాభం కూడా పోటీ వల్లే నిర్ణయం అవుతుంది . (పేజీ నెంబర్ :294)
ఇలా ఇంకెన్నో వాక్యాలు ,పేరాలు ఉటంకించవచ్చు . కానీ మచ్చుకి కొన్నిటిని మాత్రమే ఇక్కడ పూదహ రించాను . నా అభిప్రాయం ప్రకారం మార్క్స్ మూలరచనలు చదవడం మన అందరికి చాలా మంచింది .
మార్క్స్ అభిప్రాయం ప్రకారం..
విద్యావేత్తలే ముందు విద్యావంతులు కావాల్సి వుంది . ఎందుకంటే సమాజం లో వారి స్థానం రీత్యా వారు పెట్టుబడిదారీ విధానం యొక్క మార్మికరించే భావజాల ప్రమాణాలనే పునరుత్పత్తి చేస్తారు . వారు నేర్పే విషయాల వల్ల పాలకవర్గాలకే గాని ప్రజలకు మేలు జరగదు .
ప్రజలు పరిస్థితులను బట్టి మారతారనే ఉన్నత వర్గాల దృక్పథాన్ని సవాలు చేస్తున్నాడు .. ఈ దృక్పథం మంచి విద్య కావాలంటుంది గాని చరిత్ర యొక్క సాధారణ నిర్మాణం జోలికి వెళ్ళదు .
మార్క్ దృష్టి లో మార్పు అనేది సైద్ధాంతిక అంశం కాదు . విప్లవాత్మక ఆచరణకు సంబంధించినది .. విప్లవాత్మక ఆచరణ అంటే పరిస్థితులను మార్చే కార్యాచరణ . అలా పరిస్థితులను మార్చుతూ మార్చే మనిషి కూడా మారడం . కీలకమంతా ఈ స్వీయ పరివర్తన లోనే ఉంది .
విప్లవం ,మార్పు ,అనేవి కొద్ధి మంది విద్యావంతులు అజ్ఞానులైన చాలా మందిని విముక్తం చేయడం , పై నుండి వారిని ఉద్ధరించడం కాదు. . ప్రజలు తమంత తాముగా చేసే వ్యవస్థీకృత పోరాటం . ఆ పోరాట ప్రక్రియలో తమ గురుంచి తాము తెలుసుకోవడం ,ఆలోచించడం ద్వారా ,సొంతంగా వారంతట వారు విద్యావంతులవుతారు . ఇది ఒక రోజులో జరిగేది కాదు . ఇది నిరంతర ప్రక్రియ. ఎన్నటికీ పూర్తి కాదు . మనిషి నిరంతరం ప్రకృతిని ,సమాజాన్ని మార్చుతూ ఆ మేరకు తాను మారుతూ సాగుతాడు . ప్రకృతిని మార్చడం అంటే నేడు జరుగుతున్న పర్యావరణ విధ్వంసం కాదు . నేడు పెట్టుబడి దారి వర్గం తన లాభాల కోసం మానవాళి మనుగడకే ముప్పు తెస్తూ ప్రకృతిని అత్యధికంగా ధ్వంసం చేస్తుంది .
మనుషులు తాము మారకుండా ప్రపంచాన్ని మార్చలేరని , అదే సమయంలో ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలోనే వారు మారగలరని మార్క్స్ చెబుతాడు .
పెట్టుబడిదారీ విధానంలో ప్రజలను విద్యావంతులను చేయడం ద్వారా సోషలిజం నిర్మించవచ్చనేది అమాయకపు ఆలోచన . అయితే వర్గపోరాటం లో నిమగ్నమై వున్న శ్రామికుల వర్గచైతన్యం ,రాజకీయ చైతన్యం పెంపొందింపచేసే వర్గ విద్య 'కేవలం విద్యకు' భిన్నమైనది . ఈ వర్గ పోరాట విద్య నిజానికి వర్గ పోరాటంలో భాగమే !
ఆచరణను మార్క్స్ మరో కోణం లో కూడా పరిశీలిస్తాడు . దాని ప్రకారం ఆచరణ అనేది స్వేచ్ఛ ,ఆవశ్యకతల ఐక్యత .
మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతి పై స్వేచ్చగా పని చేస్తాడు . అతను పని చేసిన మేరకే అతని అవసరాలు తీరుతాయి . అతని అవసరాలు తీరిన మేరకే అతనికి స్వేచ్ఛ లభిస్తుంది . పెట్టుబడి దారి వ్యవస్తలో తన అవసరాలు తీర్చుకోవడానికి స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి ఉండదు. జీవించి ఉండేందుకు కనీస అవసరాల కోసం నిర్బంధ శ్రమ చేయాల్సి ఉంటుంది .
తన అవసరాలను తీర్చుకోవడం కోసం పరిస్థితులను మార్చే మనిషే వ్యవస్థను మార్చాలి .వ్యవస్థ వల్ల లాభం పొందేవారు వ్యవస్థను మార్చే ప్రయత్నాలను ప్రతిఘటిస్తారు . వ్యవస్థలో అవసరాలు తీరనివారు , స్వేచ్ఛ లభించనివారు వ్యవస్థను మార్చేందుకు పూనుకుంటారు . ఇలా ఇరువర్గాల ప్రయోజనాల మధ్య పోరాటమే వర్గ పోరాటం .
వర్గ పోరాటం లో శ్రామికులు అనేక పాఠాలు నేర్చుకుంటారు . ఆ మేరకు మారుతారు . బుద్ధిజీవులు వీరికి సాయపడినా ,ప్రధానంగా ,శ్రామికులు తమ అనుభవాల ద్వారానే మారుతారు .బుద్ధిజీవులు వీరికి అందించే సైద్ధాంతిక జ్ఞానాన్ని తమ పోరాట అనుభవాలతో మేళవించినప్పుడే అది నిజంగా మార్పు తెచ్చే ఆచరణ అవుతుంది .
పరిస్థితులు అనుకూలించి నప్పుడే సామాజిక విప్లవం దానికదే వస్తుందనే ఆలోచన సరికాదు . మన చారిత్రక యుగానికి అనుగుణ్యమైన విప్లవానికి కావలిసినట్లుగా పరిస్థితులను మార్చడానికి మనమే పూనుకోవాలి .
ఇలా ఈ పుస్తకం నిండా మార్క్స్ మానవ చరిత్రను శోధించి రాసుకున్న ఎన్నో అద్భుతమైన వివరణలు వున్నాయి . వాటిని మరొక్క మారు చదవడం వల్ల మనకు మేలే కానీ కించిత్తు కీడు జరిగే అవకాశం లేదు .
ఒక్కోసారి మనకు తెలుసునన్న విషయాలు కూడా మనకు తెలియకుండానే అర్థం కాకుండా పోతాయి . ఎందువల్లనంటే కొన్ని సంధింగ్ద సందర్భాలు మన చుట్టు ఎప్పుడూ ఆవరించి ఉంటాయి . వాటిని ఎప్పటికప్పుడు 'క్లియర్'చేసుకోవడం ఒక అవసరం గా భావించక పోతే మనలో గందర గోళం మరింతగా పేరుకు పోతుంది .
కాబట్టి ఈ మార్క్స్ రాత ప్రతులు పుస్తకం ఆ లోటు ని పూడ్చే ఒక సాధనంగా కార్మిక వర్గానికి ఉపయోగ పడుతుందని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి