5, నవంబర్ 2018, సోమవారం

గుండె చప్పుడు

గుండె చప్పుడు

నువ్వే గుర్తొస్తావు

ఒక అపరాధ భావాన్ని ఎక్కుపెట్టుకుంటూ ..

ఏంచేయను ?

వేటగాడి బాణానికి గాయపడ్డ నోరు లేని పక్షిలా
విలవిల్లాడిపోతాను
నేనేంటి ?నేను చేసిన తప్పేంటి ?
జవాబు లేని అనాది  ప్రశ్న ఒకటి
ఆదిమానవుడిలా నిలదీస్తుంది

నీకు నువ్వుగానే పరిమళాల మాలగా
నన్ను అల్లుకుపోయావు
సముద్రపు అల వలే
అనంతమైన కలల ప్రపంచం లోకి
లాక్కెళ్లిపోయావు
చిన్న పిల్లాడిలా ఆనందపడ్డానని
చెప్పట్టానికి ఇప్పుడు మాటలు కూడా చాలవు

ఐనా మన మధ్య తుఫానులు లేవని కాదు
సునామీలు రాలేదని  కాదు
కానీ, కదల బారుతున్న భూమి పలకల వల్లే
పెనవేసుకున్న ప్రేమ
ఖండ ఖండాలుగా విస్తరించిందే  తప్ప
కలవరపడలేదు ఎప్పుడూ ఇంతగా ..

మరి కథ ఎక్కడ అడ్డం తిరిగింది ?

నేను చెప్పుకునే  సమాధానం కన్నా
మళ్లి నీ గుండె చప్పుడే వినాలని వుంది .





17, అక్టోబర్ 2018, బుధవారం

పరుసవేది

పరుసవేది

ప్రియా ! క్షమించు ..

నీ మీద కోపం కూడా వచ్చినందుకు..
నీ ముందు తల వాల్చి
నిలబడ లేక పోయినందుకు..
అయితే..
నన్ను చాలా వాటికి క్షమించావన్న సంగతి
నీకంటే  నాకే బాగా తెలుసు
అందుకేనేమో  కూడా ఈ అలుసు
ఐనా వీలైతే మళ్ళీ క్షమించు!

కవిత్వమే కాదు
 ప్రేమ కూడా ఒక ఆల్కెమీ
అందుకేనేమో .
నన్ను నిన్నుగా ..
 నిన్ను నన్నుగా మార్చగలిగే
'పరుసవేది' కి నా ప్రాణమిచ్చా

మృతప్రాయుడనని కాదు కానీ
ఇక ఇప్పుడు
నా ప్రాణాలు నా చేతుల్లో లేవు ..





మాటల కోట

మాటల కోట 

కాలాన్ని 
నిన్నూ  
అలా నిలబె ట్టేసి

నా మనసు లోని మాటల్ని 
చెప్పాలని ప్రయత్నిస్తే

నోరు పెగులుతుందే కానీ
పెదాలు పలకవే !

కళ్ళు అలా నిలబడిపోతాయే!

అద్భుతం ..  అనలేను కానీ
అప్పటి ఆనందాన్ని 
ఇలా మనుసు మారాము చేసినప్పుడల్లా 
రాయకుండా ఉండలేను

అసూర్యంపశ్య .. ఎండ కన్నెరగని అందం
నా ప్రేమా .. అంతే
నాకే అంతుపట్టని అయోమయం             
                                 

నీ మీద కోపం తోనే కదా
మూతి ముడుచుకొని కూర్చుండి పోయాను

కానీ మనసు 
మాట విన్నదెప్పుడు
నీ మాటల కోట ని దాచుకొంది  కాబోలు!
మౌనమన్నదే లేదు                                 

నిన్ను మర్చిపోవాలని కదా  
ఒంటరి ఒంటి స్థంభం మేడ మీద
 చిన్న గూడు పేర్చుకొని
నా మనసు మార్చుకుంటున్నా కానీ

నిన్ను జ్ఞప్తి కి తెస్తూ ఎన్ని మరీచికలో!
అయినా.. ఈ దాహం తీరనిది
కారని కన్నీళ్లు నాకు 
వరమో, శాపమో కూడా తెలియకుంది                             
                               

నీకు దూరంగా ఉన్నా
నువ్వు దయ చేసిన జీవితమేదో 
ఉదయమే నా పెదవులపై  గారాలు పోతుంది
జస్ట్  కాఫీ తాగాను  
అంతే !

24, జులై 2018, మంగళవారం

గాలికి వల వేస్తూ


గాలికి వల వేస్తూ 
(మిత్రుడు మాదాసి రామ మూర్తి కి ప్రేమ తో )
ఏమో ..ఏదేదో రాసేయాలని
దేన్నో భద్రంగా నిక్షిప్తం చెయ్యాలని
ఏమో .. ఏమేమో కలలాగా అనిపిస్తే
హమ్మయ్య
ఎదో గుండె గొంతుక తన్లాడితే
 కాలాన్ని మీటుతూ
ఒక అడుగు ముందుకే  వేస్తూ
కనిపించని ఈ గాలిలో దేన్నో
ప్రతి క్షణం తడుముతూ వుంటాను
నన్ను నేను సాక్షాత్కారం  చేసుకోవాలని ఉంటుందేమో !

ఒక తల్లి బాహువుల్లో ఒదిగిపోవాలని  ఉంటుంది ..

ఒక నదీ తీరాన కూలబడిపోయి ఒక కునుకు తీయాలని  ఉంటుంది
అయితే
ఒక అర్థం కాని తనం ఎప్పుడూ  ఉంటుంది
ఎదో వెదుకులాట ఇప్పుడూ  ఉంది

కొన్ని సార్లు ఆనందం అశ్రువులై పొంగి పొర్లుతుంది
కొన్నిసార్లు దుఃఖం కాలాన్ని ఘనీభవింప చేస్తుంది

అవును ..
రాలిపోయే ఆకునే . .
శిధిలమయ్యే జ్ఞాపకాన్నే ..

15, జూన్ 2018, శుక్రవారం

సార్థ్క్యం

పక్షి రెక్కల కు
మబ్బులు
గొడుగులు పట్టినప్పుడే
సార్థ్క్యం

పారే ఏటికి
పైరు గొంతులో
పాడినప్పుడే సార్థ్క్యం

ఏ లక్ష్యానికి కట్టుబడక
బ్రతుకు ఈడ్చుకు పోతే
ఏం లాభం

ఎంతటి ఓటమిలోనైనా
ఓ అంతిమ విజయం సార్థ్క్యం ...
 .. ( తన "స్వరూప"మే )  

విశ్రాంతి

విశ్రాంతి 
మనసుని అలా అలా  చేరదీసి
రాలిన పూల పక్కపై
శయనింప చేస్తాను

సువాసన ల మాటేమో కానీ
కాస్త శాంతి దొరికింది ... 

నాలో నేను

నాలో నేను

అప్పట్లో ఒకడుండే వాడు
ఒక్కడే ..ఒంటరే

సినిమా తెర మీద బొమ్మల భావావేశాలు చూసే చాటుగా కన్నీళ్లు తుడుచుకునేవాడు

సాదా సీదా గా సాగిపోయే  "బచ్ పన్ " లో హీరోలది  ఒక పవర్
ఆకాశం నుండి దిగివచ్చే దేవకన్యల గురుంచి మరెన్ని ఊహా లో !

ఏ లోకాన్ని గెలుచుకోవాలో అర్థమయ్యేది కాదు
చుట్టుముట్టే కలల ప్రపంచం లో కలవరపాటే ఎక్కువ

నాన్న సైకిల్ మీదే నాలుగు దిక్కులు వెతికే వాడిని
సన్నని కాలిబాటలు విశాలమైన గడ్డి మైదానాల మధ్య
నా వెర్రి తనాన్ని ఆకాశం ఒక్కటే గుడ్లప్పగిచ్చుకొని గమనించేది
మేఘాలు నా దిగులుని మోసుకు తిరుగాడుతుండేవి
ఆకు పచ్చని  అందమేదో ఎడతెగని ముచ్చట పెడుతూనే ఉండేది
అప్పటికే చీకటి కమ్మేసి నన్ను వెనక్కి లాక్కెళ్లేది బలవంతంగానే

అయ్యో అన్నీ చెప్పేస్తున్నావే !
 

ఓయ్ ... నీ గురుంచి ఏదీ చెప్పటానికి సరిపోను

నీ కోపాన్ని ప్రేమ లాగే దిగమ్రింగుకుంటాను

కొన్ని సరిపడవు నాకూ ... నీకు మల్లే

ఈ మాట ఇంత తొందరగానే చెప్పాలని కూడా లేదు

కానీ ఎదో హిమశిఖరం కరిగి నీరైపోయినట్టు మనసు గారాలు పోతుంది.
నీ ప్రేమ ..నీ స్వేచ్చ .. రెండు రెండే ..
చాలా విస్తృతమైనవే ..

దేని పరిధి ని కుదించలేను

నీ ఆనందాన్ని అసలే భగ్నపరచలేను