23, జులై 2015, గురువారం

కంప్యూటర్ తెర

     కంప్యూటర్ తెర 


కాస్త పక్కనుంచి చూస్తే 
అదో అద్దం  లా కనిపిస్తుంది 

ప్రపంచాన్నంతా అద్దం లో 
చూపించినట్లుగా నా ముందు 
అనేక లోకాలను 'పరేడ్ ' చేయిస్తుంది 
రంగుల ప్రపంచం తో పాటు 
ఆకలి చావుల ఆక్రందనల్ని కూడా .. 

అయితే ఈ కంప్యూటర్ తెర 
నాకు తెలియని విషయాల్ని 
వివరిస్తుందని భ్రమ పడతాను కాని 
అది నన్నే వివిధ కోణాల్లో ఆవిష్కరిస్తూ 
వొట్టి అద్దం లానే పనిచేస్తుంది 

అందుకేనేమో .. దాని ముందు 
కూలబడితే .. 
నాలో నేనే మాట్లాడు కుంటూ 
గంటలు నిముషాల్లా గడిపేస్తాను 

ఒకోసారి గమ్మత్తు గా అది 
మాయా దర్పణం లా 
నన్నే మింగేస్తుంది 
బింబ ప్రతిబింబాల  సమస్య 
నన్ను పట్టి పీడిస్తుంది 

కొండ అద్దం లోన కొంచమై కనిపించు 
అనే రీతిలో ఈ కంప్యూటర్ ప్రపంచం లో 
నేనొక నలుసు నై పోతాను 
ఎవరికీ కనిపించని 
నల్ల పూస నై  పోతాను . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి