8, జులై 2023, శనివారం

 మనిషి బ్రతుక్కి అర్థం చెప్పిన కామ్రేడ్ ఆనంద్ మరణం 

-ఎన్ . వీరయ్య 


మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ  దేవుడ్ని నమ్ముకున్నాఆ  బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితం లోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే  ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి .

మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్నబెల్లంపల్లి  యువకులు కొందరు విప్లవా చరణ  లోకి వెళ్లారు . అందులో ఒక్కరు కామ్రేడ్ ఆనంద్ @ కటకం  సుదర్శన్ . 

రాష్ట్రం లో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది . సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్ ,హైదరాబాద్ పట్టణాలలో ఇంజనీరింగ్ ,పాలిటెక్నిక్ కోర్సుల కోసం వెళ్లేవారు . అప్పటికే నగరాల్లో విస్తరించి వున్న విప్లవ రాజకీయాలు వీరికి అబ్బి ,  వాటిని బెల్లంపల్లి పట్టణం లో  ప్రచారం చేసేవారు . వరంగల్ రీజినల్  ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ఐన కామ్రేడ్ గజ్జెల గంగారాం ప్రథముడు . మంచిర్యాల డిగ్రీ  చదువుకుంటున్న కటకం సుదర్శన్ కూడా ఈ విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడైనాడు. 
 
ఎమర్జెన్సీ (1975)కాలం లోనే కార్మికుల్ని  ఆర్గనైజ్  చేయడం  కోసం కామ్రేడ్ ఆనంద్  కార్మికుడిగా  ఉద్యోగం లో చేరాడు . యువకులను రహస్యంగా ఆర్గనైజ్ చేసాడు. ఆ కాలం లో మూడు నాలుగు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు కాబడ్డాయి . 
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత  1977 లో బెల్లంపల్లి పట్టాన కమిటీ లో సభ్యుడిగా పని చేసాడు . 1978 లో కామ్రేడ్ ఆనంద్  రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి ఆదిలాబాద్ జిల్లా లక్షట్ పేట్ తాలూకా కి వెళ్ళాడు . ఆ తర్వాత అతడు భారత్ విప్లవోద్యమానికి  ముఖ్య నాయకుడు అయ్యాడు . 

వాళ్ళు ఆయుధం పట్టుకున్నారనే సాకు తో విప్లవకారుల మరణాలను దోపిడీ ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి..
అప్పుడప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు చర్చలు జరుపుతున్నా ఫలితాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు . 

 ఇల్లు విడిచి, ఊరు విడిచి ఆదివాసుల  కోసం, మొత్తంగా పీడితప్రజల విముక్తి కోసం ఒక స్పష్టమైన  అవగాహనతో  రాజకీయ పోరాటం చేయటం పెద్ద నేరం అయిపోయింది . ప్రభుత్వం  వారి తలలకు వెలలు  కట్టి  వేట మొదలు పెట్టింది..
 వాటిలో కోటి రూపాయల తల .కామ్రేడ్ .ఆనంద్@ కటకం సుదర్శన్ ది...

పెద్ద తల కాయే  . గత 45 ఏండ్లుగా శత్రువు కన్ను గప్పి ,తన ఫోటో  కూడా దొరకనీయకుండా ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నాడు ప్రభుత్వ దాడుల్ని తిప్పికొట్టే వ్యూహాం లో తాను తలమునకలై ఉన్నాడు . ప్రజల్ని ఒక యుద్దానికి సన్నద్ధం చేసే సన్నాహాల్లో సిద్దహస్తుడై ఉన్నాడు . ఒక లెనిన్ లా ,ఒక స్టాలిన్ లా ,ఒక మావో లా సామ్రాజ్యవాద  పెట్టుబడికి గోరి కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు . ఈ యుగానికి అవసరమైన పనిని అతను తల కెత్తుకున్నాడు . 
ప్రభుత్వం, మీడియా పనిగట్టుకుని కొన్ని మాటల్ని, భావాల్ని భలే ప్రచారం చేస్తాయి.. ఉగ్రవాది.. తీవ్రవాది..

నక్సలైట్లు అనే పదం కూడా  మొదట్లో  మీడియా లోనే వచ్చింది.. నక్సలైటు అంటే ప్రజలు ఎక్కడ మంచివాళ్లు అనుకుంటారో అని కాబోలు  తీవ్ర వాదులు, ఉగ్రవాదులు అని రాస్తున్నారు ఈ మధ్య.అంత లోనే వారితో చర్చలు జరుపుతారు.. అంత లోనే అన్నీ చట్ట విరుద్ధం అయిపోతాయి..
అణచివేత ను బట్టి తిరుగుబాటు ఉంటుంది.. చరిత్రలో ఏ తిరుగుబాటుని వెంటనే  ఒప్పుకున్న దాఖలాలు లేవు.. కాని , చరిత్ర నిర్మాత లైన ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలు . 


*****

కామ్రేడ్ఆనంద్ జీవితం పూర్తిగా  అజ్ఞాతం లోనే గడిచింది . అరవై తొమ్మిది ఏండ్ల వయసులో గుండె పోటు  వల్ల చనిపోయాడు . అతని మరణవార్త టీవీ లో స్క్రోలింగ్ ద్వారా తెలిసి మనసు ఉండలు చుట్టుకొనిపోయింది.. అతడి భౌతిక కాయం ఎక్కడో దండకారణ్యం లో... అతడు పుట్టి పెరిగి విప్లవ ఓనమాలు నేర్చుకున్నది బెల్లంపల్లి లో.. అతని చివరి చూపుకి ఎలాగూ అవకాశం లేదు..మరి ఇప్పుడు ఏం చేయాలి...
"అన్ని దారులు రోమ్ వైపే" అని ఇంగ్లీష్ లో ఒక సామెత.
వెంటనే బెల్లంపల్లి కి బయలు దేరాం.. ప్రపంచమంతా వ్యాపించిన అతని స్ఫూర్తి అక్కడా నిండిపోయింది.. కన్నాల బస్తీ లోని చిన్న ఇంటి ముందు కళ్ళు మూసుకొని ఉన్న అతని చివరి ఫోటో పెట్టి వున్నారు.. అందరం ఆ ఇంటిని  'ముట్టుకొని' వచ్చేసాం..ఎవ్వరి కళ్లల్లో కన్నీళ్లు రాలేదు.. అందరం  ఏదో కర్తవ్యబోధ  లోకి వెళ్ళినట్టు స్ఫూర్తిమంత మయ్యాము . 
ఈ నల్లనేల అతన్ని కని పెంచింది..  పురిటి  నొప్పుల తల్లి  బాధ తనది..తనకింతటి పేరు తెచ్చిపెట్టిన  కొడుకు కడసారి చూపుకి నోచుకోలేని దుఃఖం ఘనీభవించింది.
నాలోనూ బాధ కవిత్వమై నిలిచింది 

ఈ మరణానికి నా ఆమోదం లేదు 
...ఎందుకంటే ఎలా బ్రతకాలో
ఆచరణ లో చూపిస్తావు

మరణం గురుంచిన భీతావహ భయాలను
గొప్ప దైన జీవితంతో నింపేస్తావు

నీ పేరు తప్ప నిన్ను ఎవ్వరమూ
ఎప్పుడూ చూడలేక పోవచ్చు... కానీ..
నీ గురుంచి తెలుసుకోవడం
మా అందరికి ఒక గర్వకారణం

అన్ని యుద్దాలు గెలిచినట్టు అవలీలగా
అనారోగ్యాన్ని జయించి తీరాలి

ఈ భూమి ఎప్పుడో నిన్ను
తన వారసుడిగా ప్రకటించింది..

ఈ మరణం... నీకు ఒక విశ్రాంతే..
నీ అధ్యయనం, అధ్యాపకత్వం
అవిశ్రాంత అజరామరం..

విప్లవమే శ్వాసగా బ్రతికే  
ఏ మరణం ఇప్పుడు 
ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు

******
 

కామ్రేడ్ ఆనంద్ కి మాత్రం లేదా ఈ నల్లనేల మీద ప్రేమ?
మట్టి మీద కంటే తన చుట్టూ వున్న సహచరుల ప్రేమ గొప్పది ..అని చాటాలనుకున్నాడో ఏమో!
అడవి తల్లిని మించిన ఒడి  మరి లేదనుకున్నాడో ఏమో!
ప్రముఖ రచయిత అల్లం రాజయ్య ఒక దగ్గర ఇలా రాశారు . " సింగరేణి బిడ్డలు భారత్ దేశ నూతన ప్రజాస్వామిక విప్లవం లో ఒక గుణాత్మకమైన పురోగమనానికి బాటలు వేశారు. ఆదివాసీ పోరాటాలను అధ్యయనం చేశారు . వారితో మమేకమయ్యారు . వారికి నాయకత్వం వహించారు . వారి విముక్తి కొరకు అమరులై వారితో తోటే ఆకాశం లో అరుణతారలయ్యారు . ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆలోచిస్తే వారు ఉద్యమం లో అసువులు బాసి , అక్కడే ఖననం చేయబడతారు . (వారు బతికుండగానే వారు కోరుకున్న విషయాలలో ముఖ్యమైనది )"
ఇంత ముఖ్యమైన విషయం మనిషి కమిట్మెంట్ ని సూచిస్తుంది . కామ్రేడ్ ర్ ఆర్కే మరణం తర్వాత అంతగా అందరిపై ప్రభావం వేసినది కామ్రేడ్ ఆనంద్  అమరత్వమే !

**********


ఒక వారం రోజులు తర్వాత ఆనంద్ సంస్మరణ సభ బెల్లంపల్లి లోనే  జరిగింది .  నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడికి   ప్రజలు  నిర్భయంగా జోహార్లు చెప్పారు.. అతని స్ఫూర్తి ముందు  'భయం' తోక ముడిచింది.మేమూ  ఈ  భూమి పుత్రులమే అని ప్రకటించారు కొందరు..ఆనంద్ ఆశయాలను కొనసాగిస్తామని నివాళి అర్పించారు  అందరూ ... కామ్రేడ్ ఆనంద్ అమరత్వం  తెలంగాణ అంతటా అద్భుతమైన ప్రకంపనలు సృష్టించింది.ఒక సుదీర్ఘ కాలం విప్లవోద్యమం లో  అంచెలంచెలుగా ఎదిగి అగ్రనాయకుడిగా ఎదిగొచ్చినందు కేమో!


అమరత్వం విప్లవానికి ఒక నమూనా

దోపిడీ వర్గాల గుండెల్లో దానిది శాశ్వత నిద్ర 

అమరత్వానికి నిలువుటద్దం మనం
 మనలో అన్నీ దాని ప్రతిఫలనాలే..

బతుక్కి అర్ధం కోరుకునే వారందరూ
ఒక జాతరలా కదులుతారు

పండుగ వాతావరణం ఒక
నిండు కుండలా కమ్ముకుంటుంది

దండగమారి  జీవితంలో
కొత్త వెలుగుల్ని ప్రసరిస్తూ
అమరత్వం నివాళులు అందుకుంటుంది

విప్లవం కథ ముగిసిపోయింది.. అనే గోబెల్స్
ప్రచారాన్ని ఎండగడుతూ  అమరత్వం
ఊరేగింపై కదులుతుంది..

అవును ...అతను ఇప్పుడూ మారలేదు
అమరత్వానికి ముందూ అంతే..
ఆ తర్వాతా దూకుడు తగ్గలేదు

అమరుడైనా పట్టుదలను విడిచి పెట్టలేదు
జమ్మి చెట్టు మీద దాచి ఉంచిన ఆయుధం లాంటి
తన యవ్వన తేజాన్ని వదిలి పెట్టలేదు

తన ఆచరణ లో ఆరితేరిన విప్లవం
నిముషం కూడా అతన్ని కూర్చోనివ్వదు
మనల్ని బలవంతంగా నిద్ర మత్తు లోంచి
లేపేస్తాడు..

రచయిత అన్న వాడ్ని అస్సలు వదిలి పెట్టడు
రాయి ..రాయి... రాయి..
ఆశల గురుంచి.. కలలు గురుంచి
ఆశలు తీరని కన్నీటి గురుంచి
ప్రతిఘటన లో రక్తం గురుంచి
పోలీసు లాకప్ లో చావు గురుంచి... 

నా గురుంచి రాయి ఇప్పుడు
ప్రజా వీరులకు మరణం లేదని  చెప్పు..
విప్లవం జయించి తీరుతుందని
ఈ సారి నీ  మాటగా ప్రకటించు..


 *************


నల్ల బంగారం అని బొగ్గు పెల్లను దొరలు కళ్ళకు అద్దు కోవచ్చు . బొగ్గు గనులున్న ప్రాంతంలోని మనుషులకి దాని ఉపయోగవిలువ   బొగ్గే ! పొయ్యు లో మంటకి పనికొచ్చే పదార్థమే .. కఠిన తరమైన కార్మికుడి శ్రమ తోడైన తర్వాత ,దాన్ని అమ్ముకుని లాభాలు సంపాదించుకునే పెట్టుబడిదారులకు అది బంగారం లా తోస్తుంది . ఇక్కడి మామూలు మనుషులకి అది బంగారమనే ఊహే రాదు . 
బొగ్గు తవ్వకం వల్ల అంతకు మునుపు వున్న భూస్వామ్య సంబంధాలు వెనక్కి పోయి కొత్త ఉత్పత్తి సంబంధాలు ముందుకు వచ్చాయి నల్ల బంగారాన్ని వెలికి తీయడంలో మనిషి విలువ పెరిగింది . కొన్ని సౌకర్యాలు పెరిగాయి . కష్టపడి పని చేసే మనుషులందరి ఉత్పత్తి క్షేత్రం ఒక్కటి కావటమం  వల్ల  వాళ్ళ మధ్య  పాత సంబంధాలు పోయి కొత్త ఉత్పత్తి సంబంధాలు వచ్చాయి .ఓ మేరకు  కార్మికవర్గ సంబంధాలు నెలకొన్నాయి . 
అంతకు మునుపు గ్రామాల్లో తాండవించే కరువు కాటకాల సమస్య ఇప్పుడు తీరింది . భరోసా కలిగిన జీవితం వచ్చింది . మెరుగైన వైద్య సౌకర్యాలు పెరిగాయి . పిల్లలకి కాస్త మంచి చదువు అందుబాటులోకి వచ్చింది . 
ఈ నేపథ్యమంతా కామ్రేడ్ ఆనంద్ పుట్టి పెరిగిన బెల్లంపల్లి అనే విప్లవ ప్రాంతం గురించే ..తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ,గిరిజన గోండు విప్లవ వీరుడు కొమురం భీం తిరుగుబాటు సంప్రదాయం ఇక్కడి గాలిలో కలగలిసి ఉన్నాయని అనిపించడం లో అతిశయోక్తి ఏమీ  లేదు . అంత గొప్ప చరిత్ర వాటికి వుంది . 
ఆత్మగౌరవం  ,ఆత్మ విశ్వాసం గల్ల మనుషులుగా అందరూ  ఉత్సాహ భరితంగా ఉండేవారు . కులమతాలకతీతంగా కలిసి మెలిసి సహజీవనం చేసే కార్మిక వర్గంలో పుట్టిన కామ్రేడ్ ఆనంద్ ,అప్పటికే తన చుట్టూ నెలకొని వున్న విప్లవ భావాలకు వెంటనే ఆకర్షితుడయ్యాడు . నూతన ప్రపంచం కోసం కలలు కన్నాడు . కార్యాయాచరణ లోకి దూకాడు . 


నిరంతరాయంగా శ్రమించి
ఒక గుండె నిలిచిపోతుంది

అతని మరణ వార్త 
విప్లవం మరణించదనే
సందేశాన్ని ప్రకటిస్తుంది

భూమి నిన్ను కన్నందుకు
నలుదిక్కులా చప్పట్లు పిక్కటిల్లుతాయి

మా పాదాల క్రింది మట్టి పొరలు
నీ కలల తరంగాలను ప్రసారం చేస్తుంటాయి

మరణం ఇప్పుడు ఒక స్మృతుల వనం


చరిత్రలో మనిషి విధ్వంసం జరిగినప్పుడల్లా
నిర్మాణం... ఒక విప్లవం
ఆ నిర్మాణం నేల కొరిగినప్పుడు
పునర్నిర్మాణం ..తక్షణ కర్తవ్యం

ప్రాణం కోసం కొట్టుకోవడమే కాదు.. గుండె
పిడికిలి బిగించి వాగ్దానం  చేస్తుంది
ఆశయాలకు చావు లేదని..


అగ్గికి పుట్టిల్లు బొగ్గు గని
విప్లవాల తల్లి సింగరేణి
అమర వీరుల సాక్షిగా ఇక్కడ
విప్లవం తప్ప మరేదీ
బతికి బట్ట కట్టలేదు.




ఏంటీ ఈ విప్లవం..?
అంతలా  అతన్ని ఇంటి ముఖం
చూడకుండా చేసింది?

అడవి అతడికి ఇల్లై పోయిందా ?
లేదా..
అతడు అడవికి తల్లై పోయాడా?
అవును ..
తనను కడుపులో పెట్టుకు సాదుకున్న
అడవికి  అమ్మలా మిగిలిపోయాడు ..

అవును కదా..ఈ లోకాన ఏ తల్లి
కొడుకును విడిచి  ఉండగలిగింది?