8, నవంబర్ 2020, ఆదివారం

వర్గ సంబంధం /రక్త సంబంధం

 వర్గ సంబంధం /రక్త సంబంధం 


కామ్రేడ్  కొండపల్లి సీతారామయ్యని విడుదల  చేయాలి  .. అని గోడల మీద తాటికాయంత అక్షరాలతో రాడికల్స్ వాల్ రైటింగ్ చేస్తున్న రోజులు అవి. బహుశా అది 1985 కావచ్చు .. 

యువతరం శిరమెత్తితే ..  చదువు కొన్న వారు ,చదువు లేని వారు..అందరూ  సముద్రపు అలల్లా ఊగిపోతున్న కాలం అది .. 

నక్సలైట్ ,రాడికల్ ..  పదాలు విప్లవ ప్రవాహం లో పడి ఎంతగా  నలిగిపోయాయి అంటే .. అవి తెలుగు పదాలేనోయి ..అనేంతగా 

ఎటు చూసినా  "అలజడి మా జీవితం ..ఆందోళన మా ఊపిరి "అంటూ ఊరేగింపులా ఉరకలు వేస్తున్న తరం .. 

ఏ పిలుపిచ్చినా జాతరలా కదులుతున్న జనం .. 

నూనూగు మీసాల పిల్లలు భగత్ సింగ్ లాగా అన్యాయాలపై అగ్గిపిడుగుల్లాగా విరుచుకు పడుతున్న విప్లవాల వెల్లువ .. 

అది బొగ్గు గనుల కాలేరు ..రష్యన్  చలికాలం ..అంటే డిసెంబర్ మాసం .. మందమర్రి పోలీస్ స్టేషన్ కి  కొంచెం దూరంలో సందులో .. ఒక తండ్రి (ఒక తల్లి కథ  ..అనే విప్లవ నవల వచ్చింది. అది సినిమా కూడా తీశారు.ఒక తండ్రి కథ కూడా తీయాలి )..నా మిత్రుడు ఒకరు చాలా సీరియస్ గా మాట్లాడు కుంటున్నారు.. నేను దగ్గరగా వెళ్ళాను. 

ఆ తండ్రి  దాదాపు ఏడుస్తున్నట్టే చెపుతున్నాడు. 

"మావోడు ఏండ్ల లేడే "

మావోడు అమాయకుడే ... 

ఎవరైనా సరే  తను  చెప్పింది నమ్మి తీరాయాల్సిందే  .. ఇందులో ఇక అబద్దాన్ని కి ఎంతమాత్రం తావు లేదు. కావాలంటే మీరు ఏ పరీక్షలైనా చేసుకొండి.  బస్తీ  మే సవాల్.. కొడుకు ప్రాణాల్ని తన కండ్లల్ల పెట్టుకొని దీనంగాను  మాట్లాడుతున్నాడు. అయ్యో అనిపించింది నాకు.నా మిత్రుడు అంతే ఇదిగా ఉన్నాడు . వాతావరణం వేదనా భరితంగానే ఉంది 

మళ్ళీ  ఆ తండ్రే కళ్ళల్లో నీళ్లు తీసుకొని .. 

నిజంగనే మావోడు ఏండ్ల లేడే..   

ఎవ్వని సోపతి లేదే ... 
మళ్ళీ అంతే నమ్మకంగా ఏడుస్తూ వున్నాడు. 
నాకైతే ఆ తండ్రి భాధ చూస్తే  కండ్లలోకి నీళ్లు  వచ్చేశాయి 

నా మిత్రుడు బాధ లోంచి కాస్త కోపం లోకి దిగిపోయాడు 
ఒక చేత్తో ఆ తండ్రి భుజం పట్టుకొని మరో చేతిని మడిచి నుదిటి మీద పెట్టుకొని .. అయ్యో !ఏండ్ల 
లేడని అనద్దే .. ఏండ్ల లేడని అంటే అండ్ల ఉన్నట్టేనే  ... 

ఈ మాటలు గత ముప్పై ఐదు ఏండ్లుగా నా మనసుకు కి దగ్గరగా అలానే ఉండి  పోయాయి . అప్పుడప్పుడు అవే  గుర్తొచ్చి ప్రజల తాత్వికత పట్ల మరింత గౌరవం పెరిగేది . 
ఎందుకో ఎప్పుడు రాద్దామని కూడా అనిపించలేదు. ఐనా అది రాతలో ఒదుగుతుంతా అనే అనుమానం కూడా ఉండేది. అందుకే  ఎందరో మిత్రులకి ఎన్ని సార్లు చెప్పానో .. చెప్పి ఎంత ఆనందం పొందానో!అదొక నోస్తాల్జిక్ .. 
మరి ఇప్పుడు ఎందుకు ఈ సొద..అంటే  
కొన్నిటికి ఎలా సంబంధం కుదురుతుందో చెప్పలేం 
నిన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ .. రక్త సంభందం ఎంతైనా ఉంటుంది .. అన్నాడు 
అదే ప్రాబ్లెమ్ కదా అన్నాను నేను .. బంధాల అనుబంధాల ఆధిపత్యాలే అసలు సమస్య .. 

ఇలా అన్నాక వెంటనే "ఏండ్ల లేడు అంటే అండ్ల ఉన్నట్టే నే .. అనే మాటలు గుర్తొచ్చాయి . 
మళ్ళీ అదే నవ్వు .. నా ముఖం వెలిగిపోయింది