17, అక్టోబర్ 2018, బుధవారం

పరుసవేది

పరుసవేది

ప్రియా ! క్షమించు ..

నీ మీద కోపం కూడా వచ్చినందుకు..
నీ ముందు తల వాల్చి
నిలబడ లేక పోయినందుకు..
అయితే..
నన్ను చాలా వాటికి క్షమించావన్న సంగతి
నీకంటే  నాకే బాగా తెలుసు
అందుకేనేమో  కూడా ఈ అలుసు
ఐనా వీలైతే మళ్ళీ క్షమించు!

కవిత్వమే కాదు
 ప్రేమ కూడా ఒక ఆల్కెమీ
అందుకేనేమో .
నన్ను నిన్నుగా ..
 నిన్ను నన్నుగా మార్చగలిగే
'పరుసవేది' కి నా ప్రాణమిచ్చా

మృతప్రాయుడనని కాదు కానీ
ఇక ఇప్పుడు
నా ప్రాణాలు నా చేతుల్లో లేవు ..





మాటల కోట

మాటల కోట 

కాలాన్ని 
నిన్నూ  
అలా నిలబె ట్టేసి

నా మనసు లోని మాటల్ని 
చెప్పాలని ప్రయత్నిస్తే

నోరు పెగులుతుందే కానీ
పెదాలు పలకవే !

కళ్ళు అలా నిలబడిపోతాయే!

అద్భుతం ..  అనలేను కానీ
అప్పటి ఆనందాన్ని 
ఇలా మనుసు మారాము చేసినప్పుడల్లా 
రాయకుండా ఉండలేను

అసూర్యంపశ్య .. ఎండ కన్నెరగని అందం
నా ప్రేమా .. అంతే
నాకే అంతుపట్టని అయోమయం             
                                 

నీ మీద కోపం తోనే కదా
మూతి ముడుచుకొని కూర్చుండి పోయాను

కానీ మనసు 
మాట విన్నదెప్పుడు
నీ మాటల కోట ని దాచుకొంది  కాబోలు!
మౌనమన్నదే లేదు                                 

నిన్ను మర్చిపోవాలని కదా  
ఒంటరి ఒంటి స్థంభం మేడ మీద
 చిన్న గూడు పేర్చుకొని
నా మనసు మార్చుకుంటున్నా కానీ

నిన్ను జ్ఞప్తి కి తెస్తూ ఎన్ని మరీచికలో!
అయినా.. ఈ దాహం తీరనిది
కారని కన్నీళ్లు నాకు 
వరమో, శాపమో కూడా తెలియకుంది                             
                               

నీకు దూరంగా ఉన్నా
నువ్వు దయ చేసిన జీవితమేదో 
ఉదయమే నా పెదవులపై  గారాలు పోతుంది
జస్ట్  కాఫీ తాగాను  
అంతే !